Previous Page Next Page 
మొగుడే రెండో ప్రియుడు పేజి 13

    అమృత అతని ముక్కు పట్టుకుని వూపుతూ "ఇది రోజూ వుండేదేగా" అంది.

    "టిఫిను రోజూ వుండేదేగా" అతను బుంగమూతి పెట్టాడు.

    ఆమె చటుక్కున అతని నెత్తిమీద మొట్టి "నువ్వూ రోజూ ఇలా ఆఫీసు మానేస్తానంటే ఎలా! అడిగింది.

    "ఏం నేను వుంటే అంత బోరుగా వుందా?" ఆమెని క్రింద వదిలిపెడ్తూ రోషంగా అడిగాడు.

    ఆమె అతని క్రాఫ్ చెరిపేసి, దువ్వెన తీసుకుని మళ్ళీ దువ్వుతూ అంది "నువ్వు ఎదురుగా కూర్చుంటే, నీ గురించీ, నీ చేతల గురించి ఆలోచించుకుంటూ ఆనందించడం కుదరటం లేదు. అబ్బబ్బ ఎన్ని తీపి అనుభూతులు మిస్ చేసుకుంటున్నావో తెలుసా?"

    "అమృతా తప్పదా?" ఆమెని హత్తుకుపోతూ అడిగాడు.

    "తప్పదు" అతన్ని మరింత దగ్గరికి తీసుకుంటూ అంది.

    జీవితం అనుభవించగలిగితే ఒక గొప్ప అనుభూతి. సముద్రాల్నీ, చీకటినీ, లోయల్నీ, కొండల్నీ, మహా వలయాల్నీ, తుఫానుల్నీ చేధించుకుని క్షితిరేఖపైనుంచి సూర్యకిరణం ఎలా ప్రభవిస్తుందో, విషాదాల్నీ, వ్యధల్నీ చీల్చుకుని చిరునవ్వు కూడా ఉదయిస్తుంది - మంచి నేస్తం వుంటే.

    ఓ గంట తర్వాత హర్ష ఆఫీసుకి బయల్దేరాడు.

   
                                         *    *    *

    "అపరుద్డాపృషత్కుడు అంటే ఏమిటి?" తెలుగు పాఠం చెప్తూ అడిగాడు కూతుర్ని అధర్వణాచారి. భ్రమర తెలీదన్నట్టు చూసింది.

    "గురి తప్పిన బాణం కలవాడు" అన్నాడాయన. భ్రమరాంబ కళ్ళు మూసుకుంది. కళ్ళముందు ఒక దృశ్యం కనిపించసాగింది.

    విక్రమ్ పూలబాణం వర్షిణికి గురిపెట్టివేస్తున్నాడు. వర్షిణి పక్కనే తను వుంది. అతని బాణం గురి కుదిరితే వర్షిణికి తగులుతుంది. గురితప్పితే తనకి గుచ్చుకుంటుంది. "అతను అపరాధ పృషత్కుడు అయితే ఎంత బాగుండును" అని నిట్టూర్చింది.

    "ఈ రోజుకి ఈ పాఠం చాలు వెళ్ళిరండి." తండ్రి పిల్లల్ని పంపేశాడు. ఆ రోజు ఆయనకీ కాస్త జ్వరంగా వుంది.

    "నాన్న ఎలా వుందీ?" తండ్రి నుదురు తాకి చూస్తూ అడిగింది భ్రమరాంబ.

    ఆయన దుప్పటి నిండుగా కప్పుకుని కూర్చుంటూ "తలుపు చెప్పుడైతే చాలు ఆ గడ్డం వాడేమో అని దడగా వుందే తల్లీ" అన్నాడు.

    భ్రమరాంబ నవ్వేసి ఆ...అతగాడు పోస్టాఫీసు దగ్గరే ముసలాడు అయిపోకుండా వుంటేకదా రావడానికి" అంది.

    "ఒకవేళ ఖర్మకాలి నువ్వు తప్పు పిన్ కొద చెప్పావేమోనని అనుమానం వస్తే .... అన్నాడాయన.

    భ్రమరాంబ వెంటనే "పిన్ కోడ్ కరెక్టేగానీ, ఆ అమ్మాయికి ఆ పేరుతో ఉత్తరాలు రావు" అంది.

    "ఏ పేరుతో వస్తాయి మరి?"

    భ్రమరాంబ మాట్లాడలేదు.

    ఆయన ఏదో స్పురించినట్టు "పిన్ కోడ్ మనదే చెప్పావు కదా! ఆ అమ్మాయి ఏ ఏరియాలో వుంటుంది?" అడిగాడు.

    "ఈ ఏరియాలోనే" చెప్పింది భ్రమరాంబ.

    "ఆ! ఏ పేట?"

    "ఈ పేటే నాన్నా!"

    "ఏ వీధీ" ఆయన ఆతృత పట్టలేనట్టుగా అరిచాడు.

    "ఈ వీధే నాన్నా!"

    "ఎవరింటి దగ్గర?" లేచి దగ్గరికి వచ్చేస్తూ అడిగాడు.

    "మన ఇంటి దగ్గరే"

    "ఏమిటీ నాతో పరాచికాలా?" కోపంగా అడిగాడు.

    "లేదు నాన్నా! అన్నీ నిజమే చెప్పాను."

    "ఎవరా అమ్మాయి?" ఉద్విగ్నతతో వూగిపోతూ అడిగాడాయన.

    "ఎదురింట్లో వుంటున్న నా స్నేహితురాలు అమృతవర్షిణి- వైఫాఫ్-హర్ష"

    "ఆ! ఆయన నోరు తెరచి అలాగే వుండిపోయాడు.

    "అవును నాన్నా అమృతని కాలేజీలో వర్షిణి అని పిలిచేవాళ్ళం" అంది భ్రమరాంబ తల వంచుకుని.

    "అమ్మో! మన ఎదురింట్లో వుందని తెలిస్తే, ఆ గడ్డంవాడు వూరుకుంటాడే?" అన్నాడు అధర్వణాచారి గుండెమీద చేత్తో నిమురుకుంటూ.

    "వచ్చినప్పుడు చూద్దాం! అమృతకి ఈ విషయం ఇప్పుడే చెప్పద్దు చాలా కలత పడుతుంది" అంది తండ్రితో గొంతు తగ్గించి.

    "సరే కానీ....అసలు ఆ అబ్బాయికీ, అమృతకీ...?"

    ఆయన సందేహం అర్ధం చేసుకుని "అదంతా ఒక పెద్ద కథలే నాన్నా!" అని నిట్టూర్చింది ఆమె.

    ఆయనకి ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలని ఆరాటంగా వుంది. "అదికాదే..." అని ఏదో మాట్లాడ్తూనే వున్నాడు. అంతలో....
   
                                         *    *    *

    అమృత బోర్లాపడుకుని డైరీ రాస్తోంది. ఆమె కాళ్ళు మోకాళ్ళ దగ్గర్నించి పైకి లేచి వున్నాయి. కాళ్ళ వెండి పట్టాలు మోకాళ్ళ దగ్గిరకు జారి ఇంకా, ఇంకా ముందుకు పోవాలని వున్నా పోలేక, మోకాళ్ళ దగ్గరే ఆగి ఆమె కాళ్ళు వూపినప్పుడల్లా రుసరుసలాడుతున్నాయి. వాటికి తోడు చిరుమువ్వల మట్టెల సవ్వడి.... "లలితంబులగు మట్టియల చప్పుడింపార నంచకైవడి నడనల్ల వచ్చి..." అని ఆదికవి వర్ణించినట్లుంది.

    ఆమె వెల్లకిలా తిరిగి గుండెలమీదకి డైరీ పెట్టుకుని మళ్ళీ చదువుతోంది.

 Previous Page Next Page