డ్రగ్స్...డ్రగ్స్...డ్రగ్స్...
"క...య్య్..."
పెద్ద కేక!
జానకిరాం ఉలిక్కిపడి చేతిలోని కాఫీకప్పు వదిలేశాడు. కప్పు నేలమీద పడి పగలిపోయి కాఫీ అంతా వొలికిపోయింది.
జానకిరాం తలెత్తి ఎదురుగా చూశాడు.
చిట్టితల్లి నోరంతా తెరిచి ఏడుస్తుంది.
"క... హియ్..."
"అబ్బబ్బ... ఏంటే ఆ ఏడుపు? డబల్ గ్యాస్ సోడా కొట్టినట్టు...కాస్త నోరుముయీ..."అన్నాడు జానకిరాం కసురుకుంటూ.
ఇంతలోకి అతని భార్య మాణిక్యం పరిగెత్తుకుని హాల్లోకి వచ్చింది.
"ఏంటండీ...చంటిదాన్ని ఏం చేశారు అంతచేటున ఏడుస్తుంది?..." కంగారుగా అడిగింది.
"ఏమో...నాకేం తెలుసూ?...అది ఉన్నట్టుండి రాగం అందుకుంది..."
"ఏంటమ్మా...ఏమైంది?...ఎందుకేడుస్తున్నావ్?" అనునయంగా చిట్టితల్లిని అడిగింది మాణిక్యం.
తల్లి అలా ప్రేమగా అడిగేసరికి చిట్టితల్లి దుఃఖం ఇంకా పొంగుకొచ్చి మరీ గట్టిగా ఏడ్చింది.
"కహి...య్..."
ఆ దెబ్బకి మాణిక్యం కొప్పు ఊడిపోయింది. అది చూసి జానకిరాం కిసుక్కున నవ్వాడు.
"ఎందుకలా పిచ్చిపుల్లాయ్ లా నవ్వుతారు, దాన్ని ఏడ్చించింది కాకుండా?" రుసరుస చూస్తూ అంది మాణిక్యం.
"అయ్యో రాత...నేనెక్కడ ఏడ్చించనే...దానంతట అదే ఏడుస్తుంది!..." నెత్తి కొట్టుకున్నాడు జానకిరాం.
"ఎందుకమ్మా ఏడుస్తున్నావ్...నాన్నారు నిన్ను ఏడిపించారా?"
"ఊ..."అవునన్నట్టు తల ఊపింది చిట్టితల్లి.
"చూశారా చూశారా?...మీరే దాన్ని ఏడ్పించారట!..."
"అయ్యో...నేను ఏడ్పించలేదే బాబూ..."మొత్తుకున్నాడు జానకిరాం."నేను నిన్ను ఎప్పుడు ఏడ్పించానే...అయ్..."అన్నాడు చిట్టితల్లితో.
"క...య్.." ఇప్పుడు త్రిబుల్ గ్యాస్ సోడకొట్టినట్టు ఏడ్చింది.
"చిన్న పిల్లల్ని బుజ్జగిస్తూ అడగాలిగానీ అలా కసురుకుంటూ అడుగుతారా ఎక్కడైనా?...సరిగ్గా అడగండి..."బుగ్గమీద పోటు పొడుస్తూ అంది మాణిక్యం.
జానకిరాం బుగ్గ రుద్దుకున్నాడు.
"చూడు చిట్టితల్లీ ...బుజ్జికన్నా...చిన్నిముండా...చిచ్చీ. నేన్నిన్ను ఏడిపించానా?..."చిట్టి తల్లిని ఇలా ప్రశ్నించి భార్యవంక చూసి కళ్లు ఎగరేశాడు జానకిరాం ఎలా అడిగాను అని ధ్వనించేలా!
"అఘోరించారులే!..." అంది మాణిక్యం.
చిట్టితల్లి కళ్లు తుడ్చుకుని ముక్కుని చిర్రుబుర్రులాడించి" ఏడ్పించలేదా మరి?...ఇప్పుడేగా బఠానీలు నాకు పెట్టకుండా తిన్నావ్?..."అంది.
"బఠానీలా?...నేనా??...నేనెక్కడ తిన్నాను???"
"తిన్నావ్!... కాఫీ తాగేముందు బఠానీలు తిన్లేదూ?..." బుంగమూతి పెట్టింది.
జానకిరాం ఫక్కుమని నవ్వాడు.
"అయ్యోతల్లీ.. అవి బఠానీలు కాదే. మాత్రలు...మాత్రలేస్కున్నా ...హిహి..."
"ఆ...ఆ... మాత్రలెవరయినా అన్ని ఏసుకుంటారా?..ఖ..య్..."
"ఏంటీ?...ఇంతకీ మీరు బఠానీలు తిన్నారా? మాత్రలేస్కున్నారా?..." కసుర్తూ అడిగింది మాణిక్యం.
"బఠానీలు నేనెందుకు తింటానే...నేను మాత్రలే వేస్కున్నా..."బిక్కమొహం వేశాడు జానకిరాం.
చిట్టితల్లి మరికాస్త స్వరం పెంచింది.
"ఖహి..య్..."
"పాడుగోల...మీరు మాత్రలు మింగేముందు కాస్త దానికి చూపించి మింగరాదూ?... ఈ గోల ఉండేది కాదు!... అయినా బఠానీల్లా అన్ని మాత్రలు ఎందుకు మింగారు?" అడిగింది మాణిక్యం.
"నాకు జలుబూ ఒళ్లు నొప్పులుగా ఉంటే ఇందాక డాక్టరు దగ్గరికెళ్లాను. డాక్టరుగారు మాత్రలు రాసిచ్చారు!"
"ఏమిటీ?... అన్ని మాత్రలా?" ఆశ్చర్యంగా అడిగింది.
"అవును...ఒకటేమో జలుబు మాత్ర,ఒహటేమో నడ్డినొప్పి మాత్ర.. ఇంకోటేమో విటిమిన్ 'సి'మాత్ర,మరొహటేమో ఏంటీబయోటిక్,ఇంకోటేమో బికాంప్లెక్స్ మాత్ర...అన్నీ మూడు పుటలూ వేస్కోమన్నాడు డాక్టరు!..."
"మీ మొహం...ప్రతి చిన్నదానికీ డాక్టరు దగ్గరికి పరుగులేస్తారు...మిగతా మాత్రలు బయటికి తీసి దానికి చూపించండి...గోలపెట్టి చంపుతుంది..."
జానకిరాం మిగతా మాత్రలు చిట్టితల్లికి చూపించి తను అవే మింగినట్టు దానికి నచ్చజెప్పి ఏడుపు ఆపించాడు.
మాణిక్యం చిట్టితల్లిని ఏడ్పించినందుకు అరడజను చీవాట్లూ,కాఫీని నేలమీద ఒంపినందుకు రెండు డజన్ల చీవాట్లు భర్తని వేసింది.
"దేభ్యం మొహం వేస్కుని అలా చూస్తారేం? ముందు నేలమీద పడేసిన కాఫీని కడిగి శుభ్రం చేయండి..." చీవాట్లు అయ్యాక కసిరింది.
జానకిరాం చచ్చినట్టు కాఫీ కడిగాడు.
రాత్రి భోజనం దగ్గర జానకిరాం వంక చూసిన మాణిక్యం ఆశ్చర్యంతో నోటిని పెద్దగా తెరిచింది.
"ఎందుకలా చూస్తావ్?...నేను కొద్దిగానే తింటూన్నానే!..." అడిగాడు జానకిరాం.
"అదికాదు... మీ బుర్రకాయ్ ఏంటి అట్టా వాచిపోయింది?" అంది మాణిక్యం.
"వాయదామరి?...ఇందాక తలవాచేలా చివాట్లు పెట్టావుగా?!" బుంగమూతిపెట్టాడు జానకిరాం.
"మీ బొంద...ఈ వాపు వేరేగా ఉంది.నేను తిడ్తే మీ డిప్పకాయ్ ఒక్కటే వాస్తుంది.ఇప్పుడేమో మొహం కూడా బూరెలాపోంగి ఉంది.ఎందుకైనా మంచిది డాక్టరుగారి దగ్గరకు వెళ్లిరండి..."అంది మాణిక్యం ఆందోళనగా.
"హమ్మా...ఆశ,దోశ,అప్పడం,వడ...నేను డాక్టరుగారి దగ్గరికెళ్తానంటే నా డిప్పవాచేలా మళ్లీ చివాట్లు పెడ్దామనా?...హమ్మా..."
"నోర్మూస్కుని డాక్టర్ దగ్గరికెళ్లండి...లేకపోతే డిప్పకాయగొడ్తా..."అరిచింది మాణిక్యం.
జానకిరాం అలాగే అన్నట్లు బుర్రూపాడు.
డాక్టర్ జానకిరాం ని చూస్తూనే ఫక్కుమని నవ్వాడు.
"అదేంటి సార్...హెల్మెట్ పెట్టుకోకపోయినా హెల్మెట్ పెట్టుకున్నంత లావుగా ఉంది మీ తలకాయ్?...హి ...?" అన్నాడు ఆనందాశ్చర్యాలతో.
"ఏమోసర్...మీర్రాసిన మందులు మింగాను...అంతే ...తలిట్టా వాచిపోయింది!" దీనంగా అన్నాడు జానకిరాం.
"అంతేనా?...మీ ఆవిడ ఝమ్ కు ఝమా అని తలవాచేలా చీవాట్లు పెట్టలేదా?..."నవ్వాపుకుంటూ అడిగాడు డాక్టర్.
"లేదు సార్...'