Previous Page Next Page 
డా|| వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం పేజి 13


    "కాలవగట్టున అడుగు పెట్టగానే నువ్వు గుర్తొచ్చావు" అని రాజారావు అప్రయత్నంగానే అరుంధతిణి చూశాడు. సీతాపతి అది గమనించాడు కాని, దానిలో అర్ధాన్ని వెతకటానికి ప్రయత్నించలేదు. అరుంధతి కళ్ళు వాల్చుకున్న తీరుకుమాత్రం సీతాపతికి చిర్రెత్తుకొచ్చింది.

 

    "ఆ తర్వాత?" శాంతమ్మ కుతూహలంగా ప్రశ్నించింది.

 

    "ఆ తరవాత ఈ ఊరివైపు నడిచాను. ఆ మామిడితోట దగ్గరకు వచ్చేటప్పటికి సాయంత్రం అయింది. ఆ సమయంలో రక్తసిక్తమయిన బట్టలతో ఊళ్ళో ప్రవేశించటం అంత మంచిది కాదు. కనుక చీకటయ్యాక వెళదామనుకున్నాను. అందుకే మామిడితోపు చివర గచ్చపొద చాటుగా కూచుని వున్నాను. అది మీ తోటని నాకు తెలియదు. అంతలో మీ జీతగాడు మాధవిని తీసుకొచ్చి ఒక చెట్టుకింద కూచోపెట్టాడు. వాడు చెట్లకు నీళ్ళుపోసే పనిలో వుండిపోయాడు. ఆ పిల్ల తనలో తను నవ్వుకుంటూ మట్టితో ఆడుకుంటూ ఉంటే చూస్తూ కూచున్నాను. అంతలో ఎద్దు ఒకటి పరుగెత్తుకొస్తూండటం, దూరంగా కేకలు వినిపించాయి. ఆ ఎద్దు పిల్లవైపుకే వస్తున్నట్లనిపించింది. మరో నిముషం, మరో ఆలోచన రాకుండానే లేచి ఎద్దుకు ఎదురు పరుగెత్తాను. ఆ తరువాత నీకు తెలిసిందే!" అన్నాడు రాజారావు.

 

    శాంతమ్మ కళ్ళు ఒత్తుకుంది.

 

    "ఎందుకు నాయనా ఈ బాధలన్నీ? సలక్షణంగా ఇంటిపట్టున ఉండక! ఏ నిమిషంలో నీ గురించిన వార్త వింటామో ననిపిస్తుంది" అంది శాంతమ్మ.

 

    రాజారావు నిండుగా నవ్వాడు.

 

    "మళ్ళీ నీ ధోరణి మొదలుపెట్టావు! నీళ్ళు తోడు" అన్నాడు చొక్కా గుండీలు విప్పుకుంటూ సీతాపతి.

 

    కొడుకుకు అంత చిరాకు ఎందుక్కలిగిందో అర్ధం కాలేదు శాంతమ్మకు. లేచి వెళ్ళింది.

 

    "ఆమె వెళ్ళాలా? నువ్వు నీళ్ళు తోడలేవా?" అన్నాడు చురచురా అరుంధతికేసి చూస్తూ. అరుంధతి మాట్లాడకుండా లోపలకు పోయింది. రాజారావు సీతాపతి ముఖంలోకి సాలోచనగా చూశాడు.

 

    "ఏరా రాజా! నువ్వు కూడా స్నానం చేస్తావా!" అన్నాడు సీతాపతి. ఆ సమయంలో అప్పుడు రాజారావు స్నానం చెయ్యడని తెలిసికూడా, ఏదో మాట్లాడాలనీ, ఏం మాట్లాడాలో తోచకనే ఆ మాట అన్నాడనీ రాజారావు గ్రహించకపోలేదు. సీతాపతి స్నానం చెయ్యటానికి వెళ్ళాడు. భోజనాలు చేస్తున్నంతసేపూ అందరూ ముభావంగానే వున్నారు. సీతాపతి ఎందుకో చిరాగ్గా వున్నాడని ఎవరూ పలకరించలేదు.

 

    అందరూ కూచుని మాట్లాడుకుంటున్నప్పుడు అరుంధతి వస్తే ఏదో పని చెప్పి పంపిస్తున్నాడు సీతాపతి. రాజారావుకు కావల్సినవన్నీ శాంతమ్మ చూసుకుంటూంది. కాఫీకూడా తనే ఇస్తూంది. అంతకు ముందు "రాజాకు కాఫీ ఇవ్వూ. రాజాకు ఏం కావాలో చూడూ" అని పురమాయించే శాంతమ్మ ఇప్పుడు అరుంధతికి అలాంటివేమీ చెప్పటంలేదు. అరుంధతికి దుఃఖమూ రోషమూ కూడా వచ్చేవి. వంటరిగా గంటలకొద్దీ ఆలోచిస్తూ దిగాలుపడి కూచునేది. అరుంధతి భర్తలోని మార్పు, అత్తగారిలోని మార్పు గ్రహించింది. దాంతో భయపడటంపోయి ఏదో మొండిధైర్యంలాంటిది వచ్చింది.

 

    మధ్యాహ్న సమయాల్లో రాజారావు దగ్గర కూచుని వాళ్ళపార్టీ ఎడ్వంచర్స్ చెప్పించుకొని వినేది. తనకూ ఏదో చెయ్యాలనీ, ఏదో కావాలనీ అనిపించసాగింది. ఉన్నదానితో సంతృప్తిగా ఆ ఇల్లూ, ఆ పొలం, ఆ సంపదా, భోజనం, అవే ప్రపంచంగా తలుస్తూ ఏ అశాంతీ, అలజడీ, కుతూహలం లేకుండా జీవిస్తున్న భర్తను చూస్తుంటే అరుంధతి "అడవిమనిషి" అని తనలో తనే అనుకునేది.

 

    శాంతమ్మ ఇప్పుడు రాజారావుమీద మొదటి ఆప్యాయత చూపించ లేదని గ్రహించిన అరుంధతి బాధపడసాగింది. సీతాపతి కూడా రాజారావుతో మొదటిలా ఉత్సాహంగా మాట్లాడటం లేదు. ముభావంగా ఉంటున్నాడు. అరుంధతిమీద మాత్రం చీటికిమాటికి విసుక్కుంటున్నాడు.

 

    ఎన్నడూ రానివాడు ఒకనాడు మధ్యాహ్నం పొలంనుంచి సీతాపతి ఇంటికి వచ్చాడు. రాజారావు మెల్లా ఇంట్లో పడక కుర్చీలో కూచుని ఉన్నాడు. అరుంధతి ఎదురుగా గోడకానుకుని కూచుని ఉంది. రాజారావు ఏదో చెబుతున్నాడు. అరుంధతి కళ్ళు పెద్దవిచేసుకొని బాహ్యప్రపంచాన్నే మరచిపోయి వింటూంది. రాజారావు గోర్కీ నవల "అమ్మ" గురించి మాట్లాడుతున్నాడు. సీతాపతి రాకను ఇద్దర్లో ఎవరూ గమనించలేదు. అంతలో నిద్రపోతున్న మాధవి కెవ్వుమంది.

 

    "పిల్ల ఏడుస్తుంటే వినిపించటంలేదూ?" త్రుళ్ళిపడి లేచి నిల్చుంది అరుంధతి.

 

    "ఏం అంత ఉలిక్కిపడుతున్నావు ఏదో పెద్ద తప్పుచేసినదానిలా?" ఆ స్వరంలో పలికిన అపశ్రుతికి అరుంధతి బిత్తరపోయింది.

 

    అరుంధతి అక్కడనుంచి పిల్లను తీసుకోవటానికి వెళ్ళిపోయింది. రాజారావువైపు అదోలా నిరసనగా చూసి లోపలకు వెళ్ళాడు సీతాపతి. గదిలో ఏదో పని ఉన్నట్లు కాసేపు అదీ ఇదీ సర్ది బయటకు వచ్చాడు. రాజారావు ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు.

 

    "అమ్మేదిరా రాజా?" అన్నాడు సీతాపతి, స్వరంలో బలవంతంగా మార్దవాన్ని తెచ్చిపెట్టుకుంటూ.

 

    "దొడ్లో కారం కొట్టిస్తున్నట్లుంది" అన్నాడు రాజారావు ఉదాసీనంగా.

 

    "తలనొప్పి వచ్చింది. అందుకే త్వరగా వచ్చేశాను పొలంనుంచి" అన్నాడు సీతాపతి, తను అలా రావటానికి సంజాయిషి ఇచ్చుకుంటున్నట్టు. రాజారావు సీతాపతి కళ్ళల్లోకి సూటిగా చూశాడు. సీతాపతి ఆ చూపుల్ని ఎదుర్కోలేకపోయాడు. ఆ చూపులు "నన్ను సందేహిస్తున్నావా?" అన్నట్లు ఉన్నాయి.

 

    "మంచిపనే చేశావు. కాఫీ తాగు. తగ్గిపోతుంది."

 

    "అరూ! అరూ!" సీతాపతి కేకలు పెట్టాడు. అరుంధతి వచ్చింది. నిర్లక్ష్యంగా "ఏం" అన్నట్లు చూసింది.

 

    "తలనొప్పిగా ఉంది కాఫీ పెట్టు. రాజా తాగే సమయంకూడా అయినట్లుంది" అన్నాడు. అరుంధతి లోపలికి వెళ్ళిపోయింది.

 

    ఆనాటినుంచి రాజారావు చాలా ముభావంగా ఉంటూ వీలయినంతవరకు అరుంధతిణి తప్పించుకు తిరుగుతున్నాడు. ఎక్కువగా మధ్యాహ్నసమయాల్లో నిద్రపోతున్నట్లు పడుకుంటున్నాడు. లేకపోతే శాంతమ్మ దగ్గర కూచుని కబుర్లు చెబుతున్నాడు. రాజారావు ప్రవర్తనకు అరుంధతి మనస్సు విలవిల్లాడిపోతుంది. మనిషి నలిగినట్లుకూడా కనిపిస్తూంది. అన్నం దగ్గర కూచుంటే తినబుద్ధి కావటం లేదు. ఎప్పుడూ దేన్నో పోగొట్టుకున్నదానిలా దిగాలుపడి కూచుంటూంది. సీతాపతి గమనిస్తూనే ఉన్నాడు.


                                         14


    "నిద్రపోతున్నారా?" ఒకనాటి మధ్యాహ్నం రాజారావు గదిలోకి వచ్చింది అరుంధతి.

 

    రాజారావు గబుక్కున లేచి కూచున్నాడు. ఆమెకు కనిపించకుండా కళ్ళు తుడుచుకోవటానికి ప్రయత్నించాడు.

 

    "ఏడుస్తున్నారా?" ఆ ప్రశ్న తనకు తనే వేసుకుంటున్నట్లుంది.

 

    "కూర్చో అరూ! ఇవ్వాళ నీతో మనస్సు విప్పి మాట్లాడాలని వుంది" అన్నాడు రాజారావు ఆర్ద్రకంఠంతో.

 

    అరుంధతి గుండెలు దడదడలాడాయి. ఏం మాట్లాడతాడు? తను ఏం సమాధానం ఇస్తుంది? ఎదురుగా ఉన్న స్టూలుమీద కూచుంది.

 

    "రెండు రోజుల్లో వెళ్ళిపోదామనుకుంటున్నాను" నిదానంగా అన్నాడు రాజారావు.

 

    అరుంధతి ఆదుర్దాగా రాజారావు ముఖంలోకి చూసింది.

 

    "మళ్ళీ ఈ జన్మలో నిన్ను చూస్తానో లేదో?" రాజారావు కంఠం జీరబోయింది.

 

    అరుంధతి ముఖాన్ని రెండు చేతులతో కప్పుకొని మౌనంగా రోదించసాగింది. రాజారావు గాబరాగా లేచివచ్చి అరుంధతి పక్కన నిలబడ్డాడు.

 

    "ఎందుకు అరూ, ఏడుస్తున్నావు? క్షమించు. ఇవ్వాళ్టికి నన్ను అలా పిలవనివ్వు." అన్నాడు రుద్ధకంఠంతో.

 

    అరుంధతి ఏడుపు మానలేదు. చేతుల్లోనుంచి ముఖం తియ్యకుండానే వెక్కి వెక్కి ఏడవసాగింది.

 

    "ఊరుకో! ఎవరైనా చూస్తే బాగుండదు." ఆప్యాయంగా తలమీద చెయ్యివేశాడు. ఒక్కసారిగా ఆమె అతని చేతులకు చుట్టుకుపోయింది. అతనిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆమెను గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు. క్షణకాలం ప్రకృతి స్తంభించిపోయినట్లు, అనంతకాలంగా ఈ క్షణం కోసమే వాళ్ళు జీవించి వున్నట్లు, జీవితంలో అనుభవించినది ఇంతకాలం అబద్ధం అయినట్లూ, ఆ ఒక్క క్షణమే నిజమైనట్లూ ఏదో అపూర్వమైన అనుభూతి వాళ్ళను చుట్టివేసింది.

 

    చటుక్కున రాజారావు అరుంధతిని వదలి దూరంగా జరిగాడు.

 

    "క్షమించు అరూ! ఉద్రేకంలో పిచ్చివాణ్ణి అయిపోయాను" తప్పు చేసినట్టు బాధపడుతూ అన్నాడు.

 

    "మీరేం చేశారు? నేనే పాపం చేశాను. నేను పాపం చేస్తున్నానని నాకు తెలుసు. మనస్సును ఎంతో నిగ్రహించుకోవాలనే చూస్తున్నాను!" మాటలు అరుంధతి గొంతులో ఉంగడి చుట్టుకొనిపోయాయి.

 

    "లేదు అరూ! నువ్వు పాపం చెయ్యటం లేదు, నువ్వు ప్రేమిస్తున్నావు. ప్రేమించటం పాపంగాదు. ఈ సృష్టి యావత్తూ ప్రేమ సూత్రం మీదే ఆధారపడి వుంది. ప్రేమే మనిషిని అడవిమనిషినుంచి, జంతువులనుంచి వేరుచేసింది. ప్రేమే మనిషిలో మానవత్వాన్ని చావకుండా ఇంతకాలం నిలబెట్టింది. మనం తల్లిదండ్రులను ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం. అందమైన వస్తువుల్ని ప్రేమిస్తాం, స్నేహితురాల్ని ప్రేమిస్తాం. కాని కొందరు మానవులు మానవమత్రుల్నే ప్రేమిస్తారు. అంటే మానవత్వాన్నే ప్రేమిస్తారు. ప్రేమించటం పాపం కాదు. కాని ప్రేమ పేరుతో క్షణిక వ్యామోహాలకు లొంగిపోయి, కర్తవ్య భ్రష్టులం కాకూడదు." ఉద్రేకంగా మాట్లాడుతూ వుంటే కన్నార్పకుండా రాజారావునే చూస్తూ వుండిపోయింది అరుంధతి.

 

    అదే ధోరణిలో తనలో తనే మాట్లాడుకుంటున్నట్లు చెప్పుకొని పోతున్నాడు రాజారావు: "చిన్నప్పటినుంచీ అందమైన వస్తువుని చూసినప్పుడూ, మధురమైన గానం విన్నప్పుడూ నాలో ఏదో అశాంతి తలయెత్తేది. నాదైన వస్తువు నాకు దూరం అయినట్లు బాధపడేవాణ్ణి. నాకు రాజకీయ జీవితంలో ఎంతోమంది ఆడవాళ్ళతో పరిచయం వుంది. ఏనాడూ నాలో ఎలాంటి బలహీనతా ఏర్పడలేదు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి పాపచింతా నా మనస్సులోకి రాలేదు. తోడి సోదరులతో ఎలా మాట్లాడేవాణ్ణో అలాగే స్త్రీలతోనూ మాట్లాడేవాణ్ణి. నిన్ను చూసిన క్షణంలోనే నాలోని మనిషి ఉలిక్కిపడ్డాడు. ఆ క్షణంలో నాకు ఇంతకాలం ఈ విశాల ప్రపంచంలో నేను ఒంటరివాడిగానే బ్రతికాననిపించింది. నా అశాంతికి కారణం నువ్వు లేకపోవడమే ననిపించింది. ఎందుచేత? ఈ జీవితయాత్రలో ఎందరో ఎదురుపడతారు. చాలామందిని చూసీ చూడనట్లే తప్పుకుపోతాం. కొందరు తీరా దాటిపోయాక ఒక్కసారి వెనక్కుతిరిగి చూస్తాం. కొందరు కనిపిస్తే ఓ క్షణం ఆగి ముందుకు పోతాం. కాని జీవితంలో ఒకే ఒక్కసారి ఎప్పుడో, ఎక్కడో, ఒకే ఒక వ్యక్తి ఎదురుపడినప్పుడు ఉలిక్కిపడతాం. ముందుకు అడుగువెయ్యలేం. ఆగిపోతం. జీవితమంతా అలా ఆగిపోవాలనే అనిపిస్తుంది. ఎందుచేత? ఈ విజ్ఞానయుగంలో కూడా ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకడంలేదు. ఎందుకు? ఎందుకు ఇలా జరుగుతూంది?" కలలో పలవరిస్తున్నట్లు ఎక్కడో దూరతీరాలను చూస్తూ మాట్లాడుతున్నాడు రాజారావు.

 

    అలా మాట్లాడుతూంటే అరుంధతికి చిత్రంగా వుంది. నాగస్వరం విని పాములవాడి ముందు ఆడుతున్న నాగినిలా అయిపోయిందామె.

 

    "నాక్కూడా మీ ఫోటోను చూడగానే అలాగే అనిపించింది. మాటిమాటికి మీ ఫోటో చూడాలనిపించేది. మిమ్మల్ని నేను చాలా కాలంగా ఎరుగుదును అని అనిపించేది." అరుంధతి తన్మయత్వంతో అంది.

 

    రాజారావుకు ఆమె మాటల్లో, ముఖంలో, కళ్ళల్లో ఎంతో నిజాయితీ కనిపించింది. ఆమెను చూచిన మరుక్షణంనుంచే తనకు ఎందుకో ఏదో అనూహ్యమైన శక్తిమీద నమ్మకం కలుగుతూ వుంది.

 

    "అరూ! మనం జీవితంలో చాలా ఆలస్యంగా కలుసుకున్నాం. మనమీద కొన్ని బాధ్యత లున్నాయి ఈ మన కలయిక నీకూ, నీ కుటుంబానికీ శాపంగా పరిణమించకూడదు. నేను వెళ్ళిపోతున్నాను! ఈ జీవితానికి ఇది చాలు. ఇప్పుడు నా జీవితానికి సంపూర్ణత్వం సిద్ధించినట్లనిపిస్తూంది. ఆ తృప్తితోనే నా మిగిలిన జీవితాన్ని గడపగలను. అమ్మకూ, సీతాపతికీ మన చనువు బాధాకరంగా వుంది. నేను రేపే వెళ్ళిపోతున్నాను."

 

    "నేనూ మీతో వచ్చేస్తాను. మీరు లేని నేను లేను!" అంది అరుంధతి.

 

    రాజారావు అదిరిపడ్డాడు. అర్ధంకానట్లు చూశాడు.

 

    "ఏం భయపడుతున్నారా?"

 

    "నీ సాహసానికి ఆశ్చర్యపడుతున్నాను. నీకు భయంగా లేదూ?"

 

    "ఉహూఁ! నేను మీకోసం ఎంత సాహసాన్నయినా చెయ్యగలను."

 

    "లేదు అరూ! భయపడక తప్పదు." ఆ మాటలు తనకు తనే చెప్పుకున్నట్లున్నాయి.

 

    "మీవంటి విప్లవకారులుకూడా ఇలాంటి మిధ్యాచారాలకూ, సాంఘిక కట్టుబాట్లకూ, మూఢ నమ్మకాలకూ భయపడతారా? ఇవన్నీ మనుష్యులు కల్పించుకున్న బంధాలు కావా? సంఘం మానవ నిర్మితం కాదా?" అంది అరుంధతి.

 

    అరుంధతిలో వచ్చిన మానసిక వికాసానికి ఆశ్చర్యపోయాడు రాజారావు.

 

    "అవును. సంఘం మానవ నిర్మితమే. మనిషి భయంవల్ల సంఘజీవిగా మారాడు. కొన్ని ప్రకృతి శక్తులకూ, క్రూరమృగాలకూ, జీవితావసరాలకూ భయపడే సంఘాన్ని ఏర్పరచుకున్నాడు మానవుడు. కాని అసలు విషయాన్ని విస్మరించి, సంఘాన్ని చూసే భయపడుతున్నాడు. అది తప్పదేమో? ఈ సాంఘిక వ్యవస్థ మారేంతవరకూ దాన్నిచూసి మనం భయపడక తప్పదు. ముఖ్యంగా స్త్రీలు."

 

    "నిజం చెప్పండి. మీ భయం అదేనా? సంఘానికే మీరు భయపడుతున్నారా?"

 

    "కాదు. ఒక ప్రాణ స్నేహితుడికి ద్రోహం చెయ్యటానికి భయపడుతున్నాను. నా ఆదర్శాలకు దూరం కావల్సి వస్తుందని భయపడుతున్నాను. నా పార్టీ డిసిప్లిన్ కు వ్యతిరేకంగా నేను ప్రవర్తించలేను. నేను జీవితంలో ముందు కర్తవ్యానికే ప్రాముఖ్యాన్ని ఇస్తాను. దానికోసం నన్ను నేను హింసించుకోవాల్సివచ్చినా లెక్కచెయ్యను" అన్నాడు రాజారావు.

 

    "మీ ఇష్టం! నా కొరకు మీరు మీ ఆదర్శాలనుండి జారిపోవటం అంగీకరించను. అంతవరకూ ఆలోచించకుండా ఆవేశంలో ఏదో వాగేశాను" అంటూ తలవంచుకుంది అరుంధతి. కళ్ళలో గిర్రున నీరు తిరిగింది.

 

    "మనం జీవితంలో మళ్ళీ కలుసుకోకపోవచ్చు. అధవా కలుసుకున్నా సీతాపతికి ఎలాంటి ద్రోహం చెయ్యమని ప్రమాణాలు చేసుకుందాం."

 

    "మీకు ప్రమాణాలమీద నమ్మకం ఉందా?"

 Previous Page Next Page