Previous Page Next Page 
ఒక జంట కలిసిన తరుణాన పేజి 13

    "మరి అలాంటి సినిమాలకి ఆడ పిశాచాలు వెళ్ళవా?" వాసంతి అడిగింది.
    "ఎంత పిశాచం బుద్దులున్నా ఆడవికదా వెళ్ళవు. నిర్మాతలు తెలివిమీరారు. వంటరిగదిలో ఒక తియ్యని రాత్రి కొందరికోసం. బడారుస్తుంలాంటివి అబ్బాయిలకోసం. స్వీట్ లవ్ లాంటివి టీనేజ్ వాళ్ళకి. భక్త రుక్మాభాయి లాంటివి పతివ్రతలనబడే వాళ్ళకి..."
    "ఆగాగు పతివ్రతలనబడే వాళ్ళేంటి! పతివ్రతలు అనాలి" మరో ఫ్రెండ్ దేవి సరిదిద్దింది.
    "అనకూడదు. ఆ సినిమా కెళ్ళేవారంతా పతివ్రతలు కాదు. భక్తి సినిమా అనే వంకతో వెళ్ళే వాళ్ళకోసం. భక్తిరస చిత్రరాజమునకు మాత్రమే పంపించే మొగుడుముండావాడున్నాడనుకో వాడి కళ్ళు కప్పటానికి ఈ చిత్రం. భక్త రుక్మాభాయి సినిమాలో రంభ, ఊర్వశి వుంటారు. వాళ్ళు క్లబ్ డాన్స్ చేస్తారు. షరా మామూలే."
    "ఐసీ"
    "అర్ధమైందికదా? పిల్లదాని పెళ్ళిచూపులనగానే. ఆడపిల్లలంతా బారులుతీరి హాలు ముందుంటారని ఈ సినిమా తీసిన మహానుభావుడి వుద్దేశ్యం. పిక్చర్ బాగా పేలింది. అందుకే దీనికి వెళదామనేది" రాధామనోహరి అంది.
    "సినిమా పేరు ముందే చెప్పకుండా సగందూరం లాక్కొచ్చారు. ఇలాంటి చండాలపు సినిమాకి నేను రాను. కోషిష్ వచ్చింది దానికి వెళదాం పదండి. ఏకబిగిన వందసార్లు చూడవచ్చు. పెళ్ళిచూపులుట పెళ్ళిచూపులు. ఇంట్లో అప్పుడప్పుడు మనకి జరుగుతున్నాయి చాలదూ?" ధుమధుమలాడింది వాసంతి.
    రాధామనోహరి, వాసంతి, దేవి ముగ్గురూ సినిమాకి బయలుదేరారు. మంచి పిక్చరని చెప్పారుగాని పేరు చెప్పలేదు వాసంతికి.
    "కోషిష్ వందసార్లు కాకపోతే ఏకబిగిన వెయ్యిసార్లు చూసి గిన్నిస్ బుక్ లోకి ఎక్కు ఎవరం కాదనము. మా అమ్మవి కదూ! మా తల్లివికదూ! ఈ వక్కసారికీ మామాట కాదనకే. ఈ పిక్చర్ బాగుండకపోతే తిట్టిన తిట్టు తిట్టకుండా ఈ రోజంతా తిట్టు పడతాను. పెళ్ళిచూపులంటే నాకు మా చెడ్డ సరదా. మా అక్కకే యింకా పెళ్ళి కాలేదు. ఇంకా నాకెక్కడ? కనీసం పిల్లదాని పెళ్ళిచూపులకన్నా వెళ్ళి ...చూసి...జీవితంలో ముందు ముందు ఏదైనా వుపయోగపడేది అంటూ వుంటే..."
    "వస్తున్నాగాని ఇంక చాలించు. నీలాంటివాళ్ళున్నారు కాబట్టి యిలాంటి సినిమాలు వస్తున్నాయి" అంది వాసంతి.
    "మా వాసంతి మా మంచిదమ్మా. ఇది బజారు కాబట్టి వూరుకున్నాను లేకపోతే గట్టిగా ముద్దు పెట్టుకునేదానిని... అంది రాధామనోహరి.
    ముగ్గురూ సరదాగా కబుర్లు చెప్పకుంటూ నడిచి హాలు దగ్గరకు వచ్చేసరికి జనంతో కిటకిటలాడిపోతున్నది ఆ ప్రదేశం.     
    "ఇదేమిటే యింతమంది యిక్కడ తగలబడ్డారు. భారతదేశంలో సగం జనాభా యిక్కడే వున్నారు." అంది దేవి.
    డోంట్ వర్రి. టిక్కెట్స్ తెచ్చే భారం నాది" అంది రాధామనోహరి.
    "పెళ్ళికావాల్సిన అమ్మాయిలు మాత్రమే వస్తారాన్నావు. చూస్తుంటే ఆబాలగోపాలం అంతా ఈ హాలు ముందే వున్నారు?" అంది వాసంతి.
    "పెళ్ళికాని అమ్మాయిలు ఎక్కువమంది వస్తారు. అంతవరకు కరెక్టు. పిల్లదాని పెళ్ళిళ్ళు ఎలా చేయాలో అని తల్లితండ్రులు, ముచ్చట ఏమన్నా వుంటే చూద్దామని ముసలివాళ్ళు పిల్లదాని పెళ్ళిచూపులు కాబట్టి బ్యాచిలర్స్, మన పెళ్ళిచూపులు ఈ సినిమా పెళ్ళిచూపులకి ఏకాస్త పోలికన్నా వుందా అని కొత్త దంపతులు, ముందు ముందు మనకీ తప్పదన్నట్లు పిల్లలు, దానాదీనా అందరూ వచ్చిపడ్డారన్న మాట. అంటే యిది కుటుంబగాధా చిత్రం అన్నమాట" అంది దేవి.
    "అన్నమాటేంటే వున్నమాట కూడాను" అంది రాధామనోహరి.
    టిక్కెట్స్ యివ్వటం ప్రారంభించారు.
    గేటుకీపరుకి అయిదు రూపాయలు లంచంపెట్టి టిక్కట్లు సంపాదించింది రాధామనోహరి.
    "నీకు దొడ్డిదారి డొంకతిరుగుడు బాగా అలవాటు. రాజకీయాలలో చేరు బాగా పైకి వస్తావు" అంది దేవి.
    వాసంతి మాత్రం విచిత్రంగా ఆ జనాన్ని చూస్తూవుండిపోయింది.
    మరో పదినిమిషాల తర్వాత హాలులోకి వెళ్ళడం సినిమా తారలకి మాత్రమే అందాన్ని యిచ్చే చెత్త సబ్బులు సారంలేని బలవర్ధక టానిక్కులు, అమితశక్తినిచ్చే ఫలానా కూల్ డ్రింక్ వగైరాలతోపాటు న్యూస్ పెద్దగా లేని న్యూస్ రీలు యివన్నీ అరగంట టైమ్ వేస్ట్ చేసి చివరికి సినిమా మొదలైంది. 
    కట్నం పెద్దగా యివ్వలేని అందమైన అమ్మాయికి బోలెడు పెళ్ళిచూపులు బోలెడు రకాలుగా జరుగుతాయి. గంట సినిమా పూర్తయినా చూపులు తప్ప పెళ్ళికాదు. అప్పుడు హీరో వచ్చి పెళ్ళిచూపులు కానిచ్చి పిల్ల నచ్చింది. కాని మూడు నెలల తర్వాత పెళ్ళాడుతాను. ట్రైనింగ్ కి కలకత్తా వెళ్ళాలి అంటాడు. అతగాడు ట్రైనింగ్ కెళ్ళేది ఏముద్యోగమో ఏంపాడో డైరెక్టరు చెప్పడు. ఇది సినిమా కాబట్టి హీరోయిన్ హీరోతో కలిసి కాశ్మీరు వెళ్ళి కిందామీదా పడి పాట పాడుతుంది, అది పగటి కల. ఆ కలలోంచి తేరుకొనేసరికి హీరో రాసిన లెటర్ హీరోయిన్ చేతిలో వుంటుంది. మనం కాబోయే భార్యాభర్తలం కనుక ఫరవాలేదు. ఫలానా చోటకి వచ్చి నన్ను కలుసుకో. కాదంటే నీకూ నాకూ రాం రాం అని రాస్తాడు.
    భయపడుతూ భయపడుతూ కధానాయక వెళుతుంది.
    నాయికా నాయకులు కలిసి కబుర్లాడుకుంటారు.
    హీరో హీరోయిన్ వంటిమీద చేయి వేయబోతే మనకి పెళ్ళి కాలేదు. వద్దని కళ్ళనీళ్ళతో వేడుకుంటుంది హీరోయిన్. ఓ.కే, అంటాడు హీరో.
    ఆ తర్వాత చాలాసార్లు కల్సుకుంటారు. పార్క్ లోను కొండల దగ్గర. చెరువు గట్టున ద్వందార్ధం పాటలు రెండు పాడుకుంటారు.
    హీరోయిన్ మెడలో హీరో తాళి కడతాడు.
    ఇంటర్ బెల్ అయిపోయింది.
    "నా ముఖంలో వుంది ఈ కధ. అసలింతవరకూ జరిగిందేముంది?" అంది వాసంతి.
    "ఇంత జరిగితే యింకేం జరగాలమ్మా - ఫస్ట్ నైటా!" అంది దేవి.
    "నోరు మూసుకో" అంది వాసంతి.
    "మా నోరు మూయించినా డైరెక్టరు నోరు మూయించలేము కదా! ఫస్ట్ నైట్ స్త్రీ పురుషులకీ తప్పదు. సినిమాలకీ తప్పదు" అంది రాధామనోహరి.
    ఆ దెబ్బతో వాసంతి నోరు మూసుకుంది.
    మళ్ళీ తెరమీద బొమ్మలు ప్రత్యక్షమయాయి.
    తెరమీద ఫస్ట్ నైట్ జరుగుతున్నది.
    కథానాయిక తెల్లచీర మల్లెపూలు, పాలగ్లాసుతో సుందగమనంతో గదిలో ప్రవేశించింది.

 Previous Page Next Page