ఆ సాయంత్రం వానొచ్చింది. పైన పెంకులమీద వాననీళ్ళు పడి టపటపా చప్పుడు చేస్తుంటే ఆశ్రితకి తమాషాగా అన్పించింది. మంచంమీద కూర్చుని కాళ్ళూపుతూ వినసాగింది.
నెత్తిమీద నుంచి ప్లాస్టిక్ గోనెసంచి కప్పుకుని లోపలికి వస్తూ రిషి "లేచి ఆ మూలనున్న బట్టలు తీయండి. ఆ కన్నంక్రింద గిన్నె పెట్టండి" అని చెపుతూనే తనూ ఆ పనిలో హడావుడిగా జారబడ్డాడు. ఇద్దరూ కలిసి వాననీళ్ళు పడుతున్న ప్రతిచోటా గిన్నెలు పెట్టారు. వంట ఇంటిలో ఇంకా నీళ్ళు పడ్తుండంతో ఇద్దరూ చెరో గిన్నె పట్టుకుని ఒకేసారి వంగారు. ఇద్దరి నుదుర్లూ ఠపీమని కొట్టుకున్నాయి.
ఆశ్రితకి చాలా సిగ్గేసింది.
రిషి వెంటనే 'సారీ' చెప్పాడు. తలెత్తి పైన పెంకులవేపు చూస్తూ- "ఈ రాత్రికి జాగారమే" అన్నాడు. అంతలోనే అబ్బా అని కన్ను నులుముకో సాగాడు.
"ఏమయిందీ?" అంటూ ఆతృతగా ఆశ్రిత దగ్గరకొచ్చింది.
అప్పటికే అతని కంట్లోంచి నీళ్ళు కారుతున్నాయి. "ఏదో పడింది" అన్నాడు నలుపుకుంటూ.
"అరె.... అలా నలుపుకోవద్దు.... నేను తీస్తానుగా తెరవండి" అంది దగ్గరకెళ్ళి అతని కన్ను తెరుస్తూ.
"ఒద్దు.... ఒద్దు.... మంట...." అన్నాడు ఆమె చేతిని తోసేస్తూ రిషి.
"ఉష్.... తియ్యకపోతే ఎలా?" అంటూ ఆమె తన జడ ముందుకు వేసుకుని నాలుకతో తడిచేసి వంపుగా మడిచి పట్టుకుని రిషి కంట్లోకి పంపించి గబుక్కున ఇవతలికి లాగింది.
"ఆ!" అని అరిచాడు రిషి. కానీ అతని కంటిలోని నలక ఇవతలికి వచ్చేసింది. ఎర్రబడిన కంటి మంట తగ్గింది. కారుతున్న నీరు తుడుచుకుంటూ- "చాలా థాంక్స్! ఎక్కడ నేర్చుకున్నారీ విద్య?" అన్నాడు.
ఆశ్రిత నవ్వింది. ఆ నవ్వులో ఎన్నో అర్ధాలున్నాయి. అదే తెలిస్తే నేను నీ ఇంటిలో ఎందుకుంటాను అన్నట్లుగా అతను అర్ధం చేసుకున్నాడు. మాట మార్చడానికన్నట్లు- "వర్షం చూద్దామా!" అంటూ బయటికి నడిచాడు.
ఆమె కూడా అతనివెంట గుమ్మంలోకొచ్చి నిలబడింది.
స్వచ్ఛంగా క్రింద పడుతున్న ప్రతి చినుకూ తన వ్యక్తిత్వాన్ని వదులుకుంటోంది. మిగతా నీటిలో కలిసి ఏ రంగూలేని శరీరానికి ఎరుపు రంగు పులుముకుని తన అందాన్ని ఎవరికో చూపించాలన్న వుబలాటంతో పరుగులు తీస్తోంది. కొండరాళ్ళను సైతం సానబెట్టి మెరుగులు దిద్దుతోంది జాణలాంటి ఏరు.
చూరుమీద నుండి పడి గలగలా ప్రవహిస్తున్న నీటిశబ్దం, గాజుల చేతులతో డోలక్ వాయిస్తున్న ధ్వనిలా గమ్మత్తుగా వుంది. నిశ్శబ్దాన్ని తన ప్రవాహంతో విరుస్తూ చకచకా పరిగెడుతోంది వాన నీరు. గుమ్మంలో నిలబడి దూరంగా వున్న పాకలు కూడా అందంగానే ఉన్నాయి. చూడగలగాలే గానీ అంతటా సౌందర్యమే!
"చిన్నప్పుడు వానలో తడుస్తూ పడవలువేసి నీటిలో వెయ్యడం చాలా సరదాగా వుండేది" అన్నాడు ఆనందంగా రిషి.
"ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అన్నాడు కీట్స్" అంది ఆశ్రిత.
రిషి ఆశ్చర్యంగా అమెవేపు చూసి "మీరేం చదివారూ?" అని అడిగాడు.
"సౌందర్యాన్ని చూసి ఆనందించడానికి చదువెందుకూ?" అని నవ్వింది ఆశ్రిత.
రిషి ఆమె ఏం చెపుతుందా అని ఆసక్తిగా చూస్తున్నాడు.
"పనికిరాని మట్టితునకా, జారిపోయే నీటిచుక్కా, ఎదురొచ్చి చెంప తట్టి పలకరించే పిల్లగాలీ, కొండశిఖరం మీద గుచ్చుకున్న ఎర్రని సూర్యకిరణం ఇవన్నీ కలిస్తే ఎంత అందం? ఎంత ఆనందాన్నిస్తాయి?" అదో రకమయిన భావుకత్వంలో అంది ఆశ్రిత.
రిషి ఆమెనే చూడసాగాడు.
కెంపు రంగు చీరలో ఆమె మంకెన పువ్వులా వుంది. అసలే పెద్దవయిన కళ్ళు ఇంకా పెద్దవయ్యాయి. కళ్ళు చివర్ల దిద్దుకున్న కాటుక కరిగి అదో రకమైన అందాన్నిస్తోంది. బిగువు సడలి, చెంపలమీదకి జారి పరుచుకున్న జుట్టులో మరీ తెల్లగా నందివర్ధనం పువ్వులా వుంది ఆమె మొహం. ఉదయ కిరణంలా మెరుస్తోంది ఆమె నుదిటిమీద తిలకంబొట్టు.
పూరేకుల మీంచి జారుతూ తెగి క్రిందపడలేక అంటిపెట్టుకున్న ముత్యపు బిందువులా వుంది ఆమె ముక్కునున్న ముక్కుపుడక.
తామరాకుల్ని కప్పుకుని అక్కడక్కడా నగ్నంగా వొదిలేసి వొంపుల్ని చూపించినప్పుడే కొలను అందం తెలిసేది! అలాగే నిండుగా వున్న చీరలోంచి కనిపిస్తున్న పొత్తి కడుపు మీద అందమైన ముడతా, మెడ క్రిందుగా క్రిందికి జారుతున్న సన్నని పాయలాంటి ఒంపు, చుబుకం మీద పుట్టు మచ్చా మరీ మరీ చూడాలనిపిస్తున్నాయి.
సరుగుడు తోటలో వీచిన చల్లని గాలి తెరలా అతని జీవితం మీదకి దిగి అతని ఆలోచనల కొసల్ని అందుకుని వాటిని గాలిపటాలు చేసి ఆకాశంలోకి ఎగరేసి అక్కడ మేఘాల మీద నిలిపి దూర తీరాలకి మోసుకెళ్ళి అందమైన రంగురంగుల పూలని చూపి గొప్ప అనుభవంతో నింపేస్తోంది. ఆమె ఎవరు? ఎక్కడినుంచి వచ్చింది? ఈ రిషి కుటీరానికి మేనకలా?
"రిషీ!" కళ్ళు అరమోడ్చి పిలిచింది ఆశ్రిత.
"ఆ కొండ శిఖరాలకి ఆచ్చాదనంగా కప్పుకున్న ఆకుపచ్చ పైటలాంటి చెట్ల గుబుర్లూ, అక్కడక్కడా కనిపిస్తున్న పసుపురంగు పూవులూ ఎంత అందంగా వున్నాయో కదా! ఇంత సౌందర్యాన్ని నాకు చూపిస్తున్న మీకు నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలి?" అంది.
రిషి ఆమె అమాయకమైన మొహాన్ని నవ్వుతూ చూడసాగాడు.
ఆశ్రిత ఒక్కసారిగా కదిలి ముందుకొచ్చింది. అతనికేమైందో అర్ధమయ్యేలోగానే ఆమె తన మునివేళ్ళ మీద నిలబడి అతని పెదవులకి తన పెదవులు హత్తి వదిలివేసింది.