Previous Page Next Page 
ఆ ఒక్కటీ అడిగేసెయ్ పేజి 11

    "కనీసం యీ పూటకి నోర్మూసుకుని వుంటుంది" ఉక్రోషంగా అని వెళ్ళిపోయాడు రిషి.

    అతను వెళ్ళగానే శ్రీజ నవ్వుతూ అంది. "నిన్న తీయించిన నీ ఫోటోలన్నీ పాడయిపోయాయట పాపం! ఫోటోగ్రాఫర్ ని అడిగి వస్తున్నా."

    ఆశ్రిత కొద్దిగా నవ్వి తల ఊపింది.

                                                           ****
   
    రిషి ఆ మధ్యాహ్నం ఇంటికొచ్చి ఆ ఊళ్ళోవున్న ఫోటోగ్రాఫర్ని నానా తిట్లు తిట్టాడు. ఆశ్రితవైపు చూసి "పదండి! పోలీస్ స్టేషన్ కి వెళ్ళి విషయం తెలియజేద్దాం!" అన్నాడు.

    ఆశ్రిత బిక్కమొహంతో "పోలీసుల దాకా వెళ్ళక తప్పదా?" అంది.

    రిషి విసుగ్గా "మరేం చేద్దాం? ఈరోజు దినపత్రికలో కూడా మీ తాలూకు ప్రకటనేం ఇవ్వలేదు. ఒక్క చీరతో వుంటున్నారని అప్పుచేసి రెండు చీరలు కొన్నాను. బియ్యంతో సహా అన్నీ రెట్టింపు ఖర్చవుతున్నాయి. ఇవన్నీ నాకెందుకొచ్చిన ఖర్మ?" అన్నాడు.

    ఆశ్రిత కోపంగా "అదా మీ బాధ? ఇదిగో ఈ గాజు తీసుకోండి. అమ్మి మీరు ఖర్చు పెట్టిన డబ్బు మీరే తీసేసుకోండి" అంది.

    "భలే మంచి చౌకబేరమా.... ఇది సమయమా.... మించినన్ దొరకదూ...." అని పాడుకుంటూ శ్రీజ తండ్రి కాళిదాసు లోపలికొచ్చాడు. అతనిదగ్గర నాటుపొగాకు వాసన గుప్పుమంది.

    రిషి చిరాగ్గా ఆయనతో "సరే ఆ సంగతి తర్వాత చూద్దాం! లోపలికి వెళ్ళండి" అన్నాడు.

    కాళిదాసు ఈలోగా ఆశ్రిత దగ్గరికి వెళ్ళి "అమ్మాయి కాంచన మాలలా వుంది! ఎవరమ్మాయి? నాకు చెప్పకుండా పెళ్ళెప్పుడు చేసుకొచ్చావోయ్?" అన్నాడు.

    "పెళ్ళీ లేదు గిళ్ళీ లేదు! మీరెందుకొచ్చినట్లు?" విసురుగా అడిగాడు రిషి.

    కాళిదాసు వెంటనే భోరున ఏడుస్తూ మూడు వేళ్ళు చూపిస్తూ "ఫుడ్ కొట్టి మూడు రోజులయింది"

    "ఆ రాక్షసి.... ఆ దెయ్యం.... ఆ.... ఎందుకులే! అనార్కలీ అనుకుని కట్టుకున్నా, చివరికి రోకలిలా నన్ను బాదేస్తోంది. అది అన్నం పెట్టదు. అడుక్కు తిననివ్వదు.... ప్లీజ్.... ఓ పది కొట్టించు.... ఫస్ట్ కల్లా యిచ్చేస్తా కావలిస్తే నీ కాంచనమాల మీదొట్టు!" అన్నాడు.

    రిషి అతని మెడదగ్గర చొక్కా పట్టుకుని "పదిస్తే ఫస్ట్ కల్లా ఇచ్చెయ్యడానికి నీకేమైనా ఉద్యోగమా.... సద్యోగమా? పద.... ముందు బయటికినడు" అన్నాడు.

    కాళిదాసు గబుక్కున రిషి కాళ్ళమీద పడిపోతూ- "ఈ పాదాలు కడిగి పిల్లనిద్దామనుకున్నా.... ఆ ఆశ అడియాశ చేసావు.... చివరికి పది రూపాయలు అప్పుకూడా ఇవ్వవా? అంతా భ్రాంతియేనా.... జీవితానా మిగులింతేనా? అని పాట అందుకున్నాడు.

    రిషి నుదురు కొట్టుకుని జేబులోంచి రెండు రూపాయలు తీసి అతని నోటిలో కుక్కి- "నోర్మూసుకుని పో! ఛీ, ఛీ అందరికీ నేనే దొరుకుతాను" అన్నాడు.

    కాళిదాసు రెండు రూపాయల నోటు తిప్పి తిప్పి చూస్తూ- "బంగారు పెట్టలాంటి అమ్మాయిని పట్టావు.... రెండు రూపాయలివ్వటానికి సిగ్గులేదూ! ఛీ, ఛీ నీ జన్మ తగలడా!" అన్నాడు.

    రిషి వెంటనే అతన్ని బలంగా బయటికి తోస్తూ "ఇంకాసేపు ఇక్కడున్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు పో!" అని అరిచాడు.

    కాళిదాసు ఆశ్రితతో- "అమ్మాయ్.... ఈసారి తులాభారంలో సత్యభామ వేషం నీదే.... ఆ గాజులూ అవీ జాగ్రత్త! మళ్ళీ వస్తా...." అని తూలుతూ వెళ్ళిపోయాడు.

    రిషి విసురుగా ఆశ్రిత వేపు తిరిగి- "ఈ పేదగుడిశెలో మీ నగలకీ మీకూ సేఫ్టీలేదు. అవన్నీ వేసుకుని వూరేగడం ఎందుకట? పోతే నేను జన్మలో చేయించి ఇవ్వలేను" అని అరిచాడు.

    ఆశ్రిత దీనంగా చూసి- "నావల్ల అంత బాధగా వుంటే వెళ్ళి పోతానులెండి" అంది.

    "ఎక్కడికి?" అడిగాడు రిషి.

    ఆశ్రిత శూన్యంలోకి చూస్తూ- "ఎక్కడికయితే మీకెందుకు?" అంది.

    రిషి వ్యంగ్యంగా- "అస్తమించే సూర్యుడివైపు వెళ్ళిపోతారా? సినిమాల్లో అయితే కెమెరామెన్ ఎవర్నీ ఎదురు రానివ్వడు! అదే నిజ జీవితంలో అయితే అలా కుదరదు. ఒంటరి ఆడపిల్ల అందులోనూ అందమైన...." అని ఆగిపోయాడు.

    ఆశ్రిత అతని కళ్ళల్లోకి చూస్తూ- "ఆగిపోయారేం? చెప్పండి" అంది.

    రిషి కాస్త సిగ్గుపడి- "నాకు టైము అవుతోంది. పదండి అన్నం తిందాం" అన్నాడు.

    మిరపపండ్ల కారంతో అన్నం కలుపుకుని నోట్లో పెట్టుకోగానే ఆశ్రితకి కళ్ళనీళ్ళు తిరిగాయి. గ్లాసు తీసుకుని మంచినీళ్ళు గటగటా త్రాగేసింది.

    రిషికి ఆమె మీద జాలేసింది- "పాపం! ఎంత గొప్పింటి అమ్మాయో ఈ పూరింట్లో నాతో ఇన్ని కష్టాలు పడుతోంది" అనుకున్నాడు.

    ఆశ్రిత గడ్డంక్రింద చేతిని వుంచుకుని రిషి చేసేపని తదేకంగా చూడసాగింది.

    అతను ఆరోజు ఖర్చులన్నీ ఒక నోట్ బుక్ లో వ్రాస్తున్నాడు. ఆశ్రిత కోసం తెచ్చిన పావలా రబ్బరు బాండ్ల ఖర్చుకూడా అతను మరిచి పోలేదు. ప్రతి పైసా అతను లెక్కగా వాడుకోవడం, గొప్పకోసం డాబుసరి మాటలు మాట్లాడకపోవటం ఆమె ఈ రెండురోజుల్లోనూ గమనించింది. అతను ఖాళీగా కూర్చోడు. ఎప్పుడూ ఏదో పని చేస్తూ వుంటాడు. అవతలి వాళ్ళు ఖాళీగా కనిపిస్తే పని చెప్పటానికి కూడా సంకోచించడు.

    ఆశ్రితని అతనిలో ఒక అంశం బలంగా ఆకర్షించింది! అతను తను ఎలా ఆలోచిస్తాడో అలాగే జీవిస్తాడు. ఎవరి కోసమూ తన పధ్ధతి మార్చుకోడు, నటించడు!

 Previous Page Next Page