హైదరాబాదు కాపురం అనగానే అన్నింట్లోనూ అదొక్కటే జ్యోతికి సంతోషం కలిగించిన విషయం.
విజయనగరంకంటె హైదరాబాదు సిటీ కనక, సిటీలో షికార్లు తిరగచ్చు.
గార్డెన్స్. నౌబత్ పహాడ్ పేర్లు విని అవన్నీ తిరగచ్చని సంబరపడింది. ఆ ఉత్సాహం సగం ఇల్లు చూడగానే తగ్గిపోయింది.
"మూడేళ్ళబట్టి ఉద్యోగం చేస్తున్నారు కాబోలు- పర్నిచర్ ఏం కొనలేదూ?" అంది అప్పుడే సాధించటం మొదలుపెట్టి.
"ఇంట్లో అసలు ఏంలేవు, ఎలా వుంటాం?" అంది.
సుబ్బారావు పళ్ళుతోముకుంటూ-
"ఫర్నచర్ అంటే సోఫాలు, డైనింగ్ టేబిల్స్ వగైరాలా మైడియర్! నీ మొగుడు కలెక్టర్ కాదు. మామూలు గుమస్తా. బ్యాంక్ లో గుమస్తా అని గుర్తుపెట్టుకో" అన్నాడు నవ్వుతూ.
"అయినా సోఫాలు, మంచాలు ఇవన్నీ మీవాళ్ళిస్తే నేను వద్దన్నానా" అంటూ నవ్వుతూనే దెబ్బకొట్టాడు.
జ్యోతి మొహం వెలవెలపోయింది.
"ఆ.... ఇస్తారు. కట్నం ఇచ్చిందికాక ఇంకా మీకు అన్నీ ఇస్తారు" దెబ్బలాటకి దిగింది.
"నేనేం కావాలని అనలేదు తల్లీ! నీవంటే నే వూరికే అన్నాను. రాగానే దెబ్బలాట పెట్టుకున్నావేమిటి? మొహం కడుక్కో, కాఫీ చేస్తాను" అన్నాడు హాస్యంగా.
చేతిలో నీళ్ళు మొహంమీద చిలకరించి, ఆమె కొంగుపట్టి మొహం తుడుచుకున్నాడు,
"ఛీ.... పనులు, అసహ్యంగా" విసురుగా పైట లాక్కుంది జ్యోతి మొహం చిటపటలాడించుకుంటూ.
"ఇదా- దీని పేరు సరసం అంటారు" కొంటెగా అన్నాడు,
"ఊఁ మంచి సరసమే- నాకిలాంటి సరసాలంటే చిరాకు" జ్యోతి విసురుగా వెళ్ళి పెట్టె తెరిచింది.
సుబ్బారావు ఒక్కక్షణం అలా నిలబడిపోయాడు. అతనికి తెలియకుండానే చిన్న నిట్టూర్పు వదిలాడు.
* * * *
ముందు రెండు రోజులు హోటల్నించి భోజనం తెప్పించాడు సుబ్బారావు.
జ్యోతిని మంచం, పరుపు కావాల్సినవి కొనుక్కోమని మూడు వందలు చేతిలో పెట్టింది జానకి.
ఆ డబ్బుతో సుబ్బారావు మరో మూడువందలు కలిపి వంట సామాను, ఓ మంచం పరుపు, ఇంటికి కావాల్సిన ముఖ్యావసర వస్తువులు కొన్నాడు.
ఆ మూడురోజులూ జ్యోతి దేనికో దానికి గొణుగుతూనే వుంది.
"అబ్బా! చిన్న ట్రాన్సిస్టర్ అన్నా లేకపోతే నాకెలా తోస్తుంది? నాలుగు ఫ్రేం కుర్చీలన్నా కొనకూడదూ? ఎవరన్నా వస్తే ఎక్కడ కూర్చుంటారు?
డైనింగ్ టేబుల్ లేకపోతే పీడాపోయింది. రెండు పీటలన్నా కొని తగలేయకపోతే భోజనం ఏలాచేస్తాం? ఈ నవారుమంచం కాకపోతే ఒక మంచమైనా కాస్త మంచిది కొనకూడదూ?"
సామాను కొన్నంతసేపూ, ఇల్లు సర్దుతున్నంతసేపూ గొణిగింది, విసుక్కుంది, మొహం ముడుచుకుంది. ధుమధుమలాడుతూ సామాను సర్దింది.
సుబ్బారావు పాపం ఓపిగ్గా అన్నీ భరించాడు. స్పోర్టివ్ గా తీసుకుని హాస్యంగా జవాబులు చెప్పాడు. ఒక్కోసారి ఆ గొణుగుడు విననట్టే నటించాడు. ఎంత సర్దుకుందామన్నా వచ్చినరోజునుంచీ జ్యోతి ప్రతిదానికీ సాధిస్తుంటే అతనికి మనసులో కష్టం అనిపించింది. స్వతహాగా సౌమ్యుడు కనక, అందులో కొత్తభార్య గనక కోపగించుకోలేకపోయాడు. అంత శాంత స్వభావుడికే కోపం తెప్పించింది జ్యోతి.
ఆమె మనస్తత్వం ఏమిటో ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. తనేమిటో, తన అంతస్థేమిటో ఆమె ఎరుగదా? ఆమాత్రం గ్రహించలేని చిన్నపిల్లా?
లేక తెలిసే తననిలా చిన్నపుచ్చటానికి అలా అంటుందా? పోనీ ఏదో మహా గొప్పింటిపిల్ల అయితే ఫ్రిజ్ లు, సోఫాలు, డన్ లవ్ ల మధ్య పెరిగినదయితే ఇక్కడ లేమితనాన్ని సరిపెట్టుకోలేకపోతూందనుకోవచ్చు.
కానీ వాళ్ళింట్లోనూ అవేం లేవుగా, మరెందుకు తననిలా సాధిస్తుంది? ఆఖరికి విని విని వళ్ళుమండి.....
"మహా సోఫాలు, డన్ లవ్ ల మధ్య పెరిగినట్లు ఇక్కడలేవని సాధిస్తావేం?"అన్నాడు నవ్వుతూనే-
జ్యోతి మొహం నల్లబడింది అవమానంతో. తీక్షణంగా చూసింది సుబ్బారావు కళ్ళలోకి.
"అక్కడ లేవుగనకే పోనీ పెళ్ళయ్యాకన్నా అనుభవిద్దామనుకున్నాను. అదీ అడియాసే అయింది" అంది కటువుగా.
"అలాంటప్పుడు ఏ ఆఫీసర్ నో కట్టుకోవలసింది. నీకు కావాల్సింది సోఫాలు, ఫ్రిజ్ లే అయితే ఈ గుమస్తాని కట్టుకోలేకపోవాల్సింది" అన్నాడు సుబ్బారావు సూటిగా చూసి.
జ్యోతి మొహం ఎర్రబడింది. "దెప్పక్కరలేదు. నా మొహాన ఈ రాత రాసివుండగా అలా ఎందుకు జరుగుతుంది?" తీవ్రంగా అని, చురచుర చూసి లోపలికి వెళ్ళిపోయింది.
సుబ్బారావు మ్రాన్పడిపోయాడు.
జ్యోతి సంగతి కొంతకాకపోతే కొంతన్నా అర్థంఅయింది అతనికి. ఆమె అసంతృప్తి గమనించి అతని మనసు బాధగా మూలిగింది. పెళ్ళయి కొత్తగా వచ్చిన రోజునించీ సాధించే భార్యతో కాపురం ఎంత చక్కగా వుంటుందో అన్పించి మనసులో దిగులుపడ్డాడు. ఆమె ముభావతకి, చిరాకుకి అర్థం బోధపడినట్లనిపించింది.
కానీ.... కానీ తనేం చెయ్యగలడు? ఈ పెళ్ళి చేసుకోడంలో పొరపడలేదుగదా! అన్పించి అతని మనసు కృంగిపోయింది.