"కాస్త కోపం, ఆవేశం, బాధ తగ్గాక ఏదో చిన్నతనం. అన్నీ కావాలని ముచ్చటతప్ప మరో ఉద్దేశం ఏముంటుంది? తన ఇల్లు ముచ్చటగా వుండాలని ఏ ఆడది కోరుకోదు?
అయితే జ్యోతికి కాస్త లోకజ్ఞానం తక్కువ గనక అవిలేవు ఇవి లేవు అని అసంతృప్తి వెల్లడిస్తూంది.
నాలుగురోజులుపోతే తనే అర్థంచేసుకుంటుంది. ఇంత చిన్న విషయానికి ఆమెతోపాటు తనూ తొందరపడితే ఎలా? ముందురోజునుంచీ ఇద్దరూ కొట్లాడుకుంటే ఎలా? అని నచ్చచెప్పుకున్నాడు. చిన్నపిల్ల, తనే సర్దుకోవాలి...."
జ్యోతి మంచంమీద అటుతిరిగి పడుకుంది కోపంగా. తన రహస్యం ఏదో అతనికి తెలిసిపోయినట్లు, దొరికిపోయినట్లు అవమానపడింది ఆఫీసర్ని కట్టుకోవాల్సింది అన్నాడు.
హు ఆఫీసరు! తన మొహానికి ఆ అదృష్టం ఏది? ఎన్ననుకుంది! ఆఖరికి ఏం జరిగింది?
అవీ ఇవీ లేవన్న బాధకంటే, సుబ్బారావు అలా అనడం ఉక్రోషం తెప్పించింది జ్యోతికి. ఆ కోపం, ఉక్రోషం కల్సి కన్నీళ్ళు వచ్చాయి.
"జ్యోతీ! కోపం వచ్చిందా?" వచ్చి మంచం మీద కూర్చున్నాడు సుబ్బారావు. బలవంతాన తనవైపు తిప్పుకున్నాడు. ఆమె కన్నీళ్ళు చూసి కరిగిపోయాడు.
"ఛీ! ఛీ! ఏడుస్తున్నావా? నేనేం అన్నానని? ఊరికే హాస్యంగా అన్నాను జ్యోతి! ఇదేమిటి చెప్పు. అనవసరంగా ఇలా ఏడుస్తారా? కాపురానికి వచ్చినదగ్గరినుంచి నిన్నేడిపిస్తున్నానని అందరూ అనుకోవాలా? ఛీ.... ఊరుకో, నువ్వలా ఏడిస్తే నాకు బాధగా వుంటుంది" అంటూ కన్నీళ్ళు తుడిచాడు లాలనగా.
కోపగిస్తాడు, తిడతాడేమోననుకున్న అతను అలా బతిమలాడగానే జ్యోతి కాస్త మెత్తబడింది.
"నేనేం అన్నానని మీరలా అన్నారు? నాకేనేమిటి ఇల్లు, మీకుకాదా? ఇల్లు బాగా పెట్టుకోవాలని" తప్పంతా అతనిదే అయినట్టు ఏడ్పుమధ్య ఉక్రోషంగా అంది.
"ఉంది జ్యోతీ! నాకూ కారులో తిరగాలని, దర్జాగా పెద్ద ఇంట్లో వుండాలని, సోఫాలు, ఫ్రిజ్ లు కావాలనీ ప్రతివాళ్ళకీ వుంటుంది. కానీ మన తాహతేమితో గుర్తించకుండా ఎగబడితే అందరికీ దొరుకుతాయా?"
"నేనేం కార్లు, ఫ్రిజ్ లు కావాలనలేదు. నాలుగు కుర్చీలు, రెండు మంచాలు" గయ్ మంది.
"వాటికన్నా డబ్బుండాలిగా. అయినా ముందురోజునుంచీ అవన్నీ వస్తాయా? నెమ్మదిగా సంసారానికి కావాల్సినవి ఒక్కోటి అమర్చుకోవాలి గానీ, ఒక్కసారిగా ఎలావస్తాయి? ఈ నెలనుంచీ జీతం నీకే ఇస్తాను ఎంత మిగులుస్తావో, ఎలా మిగులుస్తావో, మిగిల్చి నీకేం కావాలో అన్నీ ఒక్కోటి కొంటూండు. ఏం సరేనా?" అన్నాడు జ్యోతిని వళ్ళోకి లాక్కుని.
ఇంకేం ఆనలేక వూరుకుంది జ్యోతి.
"పదవోయ్! తగువులాడి అలసిపోయాను. ఆకలేస్తుంది అన్నం తిందాం పద" అని వంటింట్లోకి దారితీశాడు సుబ్బారావు. తనే రెండు ప్లేట్లూ, కంచాలు పెట్టి మజ్జిగ తెచ్చిపెట్టాడు. వడ్డించబోయాడు.
"మీరలా వుండండి. ఎందుకన్నింట్లో మీరుంటారు? ఆమాత్రం నాకు రాదని మళ్ళీ దెప్పుతారు" అంది జ్యోతి చిరాకుగా.
"దెప్పానా- శ్రీమతిగారి పాకంముందు నలభీముడు ఎందుకు పనికొస్తారని పోగిడాను. అసలు ఒకే వంటకాన్ని రోజుకోరకంగా ఎవరు వండగలరు చెప్పు? కూరని ఓరోజు పచ్చడిగా, మరోరోజు పులుసులా, ఇంకోసారి చారులా! అబ్బబ్బ! ఎన్నెన్ని రుచులు చూపించేశావు రెండు రోజుల్లో? చారుని పులుసులా, పులుసుని కూరలా ఎవరు చేయగలరు చెప్పు" అన్నాడు వేళాకోళంగా.
"మరే." ఉడుక్కుంది జ్యోతి.
"రావోయ్! నీకంటే నాకే బాగా వచ్చులా వుంది వంట. ఏంచేయను? ఇటు వంట. అటు ఆఫీసు. పెళ్ళాం వచ్చాక సుఖపడవచ్చు అనుకుంటే డబుల్ పని తగిలింది" కంచాల్లో అన్నంపెట్టాడు హాస్యాలు ఆడుతూ.
"మీరలా ఆడారిపనులు చేయద్దన్నానా?" చిరాకుగా, అసహ్యంగా అంది జ్యోతి.
జ్యోతి కలల్లో హీరోలాంటివాడు వచ్చీరానట్టు జ్యోతికి ఇంటి పనుల్లో సాయంచేస్తుంటే ముచ్చటనిపించేదేమోగాని, తనకంటె బాగా, వంట వాడిలా లుంగీ ఎత్తికట్టి చకచక కూరలుతరిగి, అన్నం వండేసిన సుబ్బారావుని చూసేసరికి ఆడంగివాడిలా కనిపించి అసహ్యం వేసింది జ్యోతికి. మనిషిలో ఎక్కడా ఠీవి కనబడదు. దర్జాలేదు. రూపం సరే, అలవాట్లలో నన్నా రాజసం వుండకూడదూ, మనసులో చీదరించుకుంది.
"ఆడపని, మొగపని ఏమిటి? ఈనాడు మొగాళ్ళకి కూడా వంట రాకపోతే లాభంలేదు. సమానత్వమో అని గోలపెడుతున్నారుకదా మీ ఆడవాళ్ళు మీరు ఆఫీసుల్లో పనికి తయారవుతుంటే, మేం వంటచేస్తే తప్పా?" అన్నాడు సుబ్బారావు జ్యోతి భావం గుర్తించకుండా.
"సర్లెండి. లెండి ముందక్కడనించి" కసురుకుంది. నిజానికి జ్యోతికి వంటరాదు.
జానకి ఏపని చెప్పినా "అబ్బ- బోర్" అంటూ వంటింటి ఛాయలకి వెళ్ళేదికాదు.
"పెళ్ళికావాల్సినదానివి, కాస్తన్నా వంట అదీ రాకపోతే ఎలాగే?" అనేది జానకి అప్పుడప్పుడు.
"వెధవ్వంట. బ్రహ్మవిద్యా ఏమిటి?" చిరాకుపడేది జ్యోతి.
జానకి మరీ కసిరినప్పుడు ఏ కంచాలుపెట్టో, వంటిల్లు తుడిచో, పచ్చడి రుబ్బో మొక్కు తీర్చుకుని లేచివచ్చేది. కూతురిని పిలిచేకంటే చేసుకోడం నయం అనిపించేది జానకికి.
కాపురానికి వచ్చాక బొత్తిగా అన్నానికి ఎంతనీళ్ళు పోయాలో, చారెలా చెయ్యాలో కూడా రాలేదు జ్యోతికి.
రెండురోజులు సుబ్బారావే చేసి చూపించాడు.
ప్రాథమిక సూత్రాలన్నీ మొగుడి దగ్గరే నేర్చుకుంది జ్యోతి. వంట కూడా బ్రహ్మవిద్యేననిపించింది రెండురోజులు వండేసరికి.
కొత్త భార్య వచ్చిందన్న సంబరంలో వారంరోజులు లీవు పెట్టేశాడు సుబ్బారావు. ముందు మూడురోజులు అన్నీ కొనుక్కోవడం, సర్దుకోవడంతో సరిపోయింది.