ఆ పక్కన ఓ డాక్టర్... దూరంగా ఓ ముగ్గురు పోలీసాఫీసర్స్.
"ఎట్ లాస్ట్... హి కేమ్ ఇన్ టూ... టచ్..." డాక్టర్, పోలీసాఫీసర్స్ వేపు చూసి చెప్పాడు.
ఆ మాట వినగానే... పోలీసాఫీసర్లు ముందు కొచ్చారు.
తనెక్కడున్నాడో అర్థమైంది ఆదిత్యకు.
ముగ్గురు పోలీసాఫీసర్లలో ఒక పోలీసాఫీసర్ ముందుకొచ్చి... ఆదిత్య కళ్ళకెదురుగా తన అయిదు వేళ్ళను పెట్టి చూపిస్తూ-
"ఈ వేళ్ళెన్ని..." అడిగాడు. ఆయన సిటీకమీషనర్ ఆఫ్ పోలీస్.
ఆదిత్యకు తల దిమ్ముగా వుంది.
మళ్ళీ అడిగాడాయన.
తనకు, స్పష్టంగా స్పృహ వచ్చిందో, లేదో టెస్ట్ చెయ్యడానికే ఆ పోలీసాఫీసర్ అలా అడుగుతున్నాడని తెల్సు ఆదిత్యకు.
"ఫైవ్..." నెమ్మదిగా గొణిగాడు ఆదిత్య.
ఆ మాటకు డాక్టర్ వేపు, మిగతా ఇద్దరు ఆఫీసర్లవేపు చూశాడు పోలీస్ కమీషనర్.
రెండు నిమిషాల తర్వాత, పోలీస్ కమీషనర్ ఆ రూమ్ లోంచి బయటికెళ్ళిపోయాడు. అతని వెనక మిగతా ఆఫీసర్లు... డాక్టరు నడిచారు.
అతని వేపే ఆశ్చర్యంగా చూస్తూంది నర్స్. ఖాళీ అయిన సెలైన్ బాటిల్ ను పక్కన పెడుతూ-
"మీరు లా స్టూడెంటట గదా... చీఫ్ మినిస్టర్ని... ఎలా... హత్య చేశారు?" చాలా నెమ్మదిగా అడిగింది ఆ నర్స్.
ఆ ప్రశ్న వింటూనే షాక్ తో బెడ్ మీద ఎగిరిపడ్డాడు ఆదిత్య.
అహోబలపతికి బదులు సి.ఎమ్.ని చంపేశాడా తను?
నో... అలా జరిగుండకూడదు. కాని జరిగింది, ఎలా?
అయినా క్షణాల్లో... నిమిషాల్లో తననెలా గుర్తించారు? ఎలా వేటాడారు?
"చీఫ్... చీఫ్... మినిస్టర్ చచ్చిపోయాడా?" భాయోద్వేగంతో వచ్చింది ఆదిత్య గొంతులోంచి ఆ మాట.
"రెండ్రోజులు ప్రజల సందర్శనం తర్వాత, ఒక గంట క్రితమో అంత్యక్రియలు జరిగాయి" చెప్పిందా నర్స్ తడారిపోయిన కంఠంతో.
"చీఫ్ మినిస్టర్ని ఎందుకు చంపారు?" తిరిగి అడిగింది ఆ నర్సు.
ఆ నర్సుకి ఇరవై ఏళ్ళుంటాయి. చక్కగా షోకేస్ లోంచి తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టినట్టుగా వుంది.
"నీ పేరు"
"ట్రెస్సా."
"అంటే థెరిస్సా అనా?"
ఔనన్నట్టుగా తలూపింది ట్రెస్సా.
లేవబోయాడు ఆదిత్య.
"ఇంకో రెండ్రోజులు వరకూ మీరు కదలకూడదు-కాలికి బలంగా దెబ్బ తగిలింది నొప్పిగా లేదా?"
అప్పుడు చూశాడు కాలివేపు ఆదిత్య. పెద్ద బ్యాండేజ్, పై పెదవి మీద ప్లాస్టర్.
ఆకలి... నీరసం... నొప్పి... హాస్టల్... తల్లి దండ్రులు... చెల్లి... ఫ్రెండ్స్ గుర్తుకొచ్చారు.
ఆకలి, నీరసం పోయినట్టుగా వుంది. మనసులో నొప్పి మాత్రమే మిగిలింది.
అతని గుండెను ఎవరో తూట్లు పొడుస్తున్న చప్పుడు.
మళ్ళీ డాక్టర్ల బృందం వచ్చింది. డాక్టర్ ఇన్ స్ట్రక్షన్స్ మేరకు ట్రెస్సా ఇంజక్షన్ చేసింది.
ఆదిత్య కనురెప్పల మీదకు మగతగా నొప్పిని తగ్గించే నిద్ర.
* * * * *
24 గంటలు గడిచాయి.
ఆదిత్యకు ఆ సమయంలోనే మెలుకువ వస్తుందని తెలిసినట్లుగా ఎదురుగా చాలామంది నిలుచున్నారు.
నర్స్ ట్రెస్సా, యిద్దరు డాక్టర్లు, ఒక జడ్జీం పోలీస్ కమీషనర్, ఇంకో యిద్దరు పోలీసాఫీసర్స్, యిద్దరు లాయర్లు.
డాక్టర్ చెకప్ చేశాడు. నర్స్ టెంపరేచర్ చూసింది. ఒక లాయర్ జడ్జీవేపు చూసి- ఆదిత్య దగ్గరకొచ్చాడు.
"నువ్వు కదల్లేని పరిస్థితుల్లో వున్నావు కాబట్టి కోర్టు నీ దగ్గరకి వచ్చింది. నీ కన్ ఫెషన్ కావాలి."
ఆ లాయర్ వేపు ఆదిత్య సూటిగా చూశాడు.
"చీఫ్ మినిస్టర్ని నువ్వెందుకు షూట్ చేశావో చెప్తావా?" అడిగాడు లాయర్.
ఆదిత్య మాట్లాడలేదు. అతని మనసంతా గజిబిజిగా వుంది. అతని మనసు కన్నీరు కారుస్తోంది. అది కన్నీరు కూడా కాదు. రక్తం. సుళ్ళు తిరుగుతున్న రక్తం...
దావానలంలా మండుతున్న రక్తం....
ఆ రక్తం ఒకే ఒక ప్రశ్నను అడుగుతోంది.
అహోబలపతి ఏమయ్యాడు? ఆ ప్రశ్నకు ఎవర్ని అడగాలో అర్ధం కావడంలేదు ఆదిత్యకు.
"ఎమ్మెల్యే గుర్రం పెద్దబ్బాయి పిస్టల్ ని దొంగిలించి నువ్వు చీఫ్ మినిస్టర్ని హత్య చేశావ్. ఎందుకు చేశావ్? ఎవరు చేయించారు? చెప్పు. నువ్వు ఇవాళ చెప్పకపోయినా రేపు పోలీసులు తెలకుంటారు."
ఆదిత్య మరో షాక్ కి గురయ్యాడు.
ఆ పిస్టల్ గుర్రం పెద్దబ్బాయిదా?
ఆదిత్య మెదడులో నరాలు చిట్లుతున్న చప్పుడు.
అంటే... అంటే....
"నో... నో... నో..." ఆదిత్య గొంతులోంచి భీతావహంగా వచ్చిందా శబ్దం.
ఆ అరుపుకి నర్సు ట్రెస్సా బెదిరిపోయింది.
"నో...నో... ఆ పిస్టల్ ని నేను పెద్దబ్బాయి దగ్గర్నించి దొంగిలించలేదు... అహోబలపతి నాకిచ్చాడు... తనని చంపమని నాకిచ్చాడు... అందుకు..." నెమ్మదిగా, తనలో తను గొణుక్కున్నట్టుగా అన్నాడు ఆదిత్య.
ఒకరి ముఖాలొకరు చూసుకున్నారందరూ.
"అహోబలపతిగారు నీకిచ్చారా... తనని చంపమని?" లాయర్ నవ్వాడు.
వెర్రి చూపులు చూశాడు ఆదిత్య.
"ఆయన్ని చంపమని నీకు ఆయనే ఎమ్మెల్యే పెద్దబ్బాయిగారి పిస్టల్ ని తీసిచ్చారా? పూలిష్ స్టేట్ మెంట్ సార్" జడ్జీ వేపు చూసి నవ్వాడు లాయర్.
జడ్జీగారు కూడా ఆ మాటకు నవ్వారు. ఆ నవ్వుతో పోలీసాఫీసర్లు కూడా శ్రుతి కలిపారు. డాక్టర్లు కూడా నవ్వారు.