రోడ్లు భీతావహంగా వున్నాయి.
కార్లు, జీపులు, రిక్షాలు... ఎవరో ఛేజ్ చేస్తున్నట్టుగా పరిగెడుతున్నాయి.
ఆదిత్య గుండెల్లో ఎవరో డెత్ డ్రమ్స్ మోగిస్తున్న చప్పుడు.
భీతావహంగా రోడ్డుమీద పరుగెడుతున్న జనం.
ఆదిత్య నరాల్లో ప్రవహిస్తున్న వుద్రిక్తత అతన్ని అగ్నిగుండంలా మార్చేసింది.
"ఏమైంది సర్? మీటింగ్ లో ఏం జరిగింది సర్?" గేరు మారుస్తూ అడిగాడు డ్రైవర్.
అదే అయోమయంగా వుంది ఆదిత్యక్కూడా.
ఈపాటికి అహోబలపతి చచ్చిపోయుంటాడా? లేకపోతే... హాస్పిటల్ కు తీసుకెళుతుంటారా? దారిలో చచ్చిపోతాడా? లేక, హాస్పిటల్లో చస్తాడా? అహోబలపతి... అసలు ఎందుకు చచ్చిపోవాలనుకున్నాడు?
ఏంటీ డ్రామా? దేనికి దారి తీస్తుంది...?
ఆదిత్య రకరకాలుగా ఆలోచిస్తున్నాడు.
అతని చేతివేళ్ళు వణుకుతున్నాయి. చెమటతో తడిసి-
లిబర్టీ దగ్గరకొచ్చింది ఆటో...
"ఎక్కడికి వెళ్ళాలి సర్"
ఎక్కడికి... ఎక్కడికి?
సమాధానంలేని ప్రశ్న.
"టాంక్ బండ్ మీదుగా పోనీ" వణుకుతూ చెప్పాడు ఆదిత్య.
సరిగ్గా-
ఆ సమయంలో-
విన్పించింది పోలీస్ జీపు హారన్.
ఆ వెనుక... రెండు అంబులెన్స్ లు వరసగా పోలీసుకార్లు.
ప్రవాహంలా పోతున్నాయి కార్లు. పోలీస్ విజిల్స్ హోరుమంటున్నాయి.
ఆటో టాంక్ బండ్ మీద గాలిని చీల్చుకుంటూ దూసుకుపోతోంది.
అదే సమయంలో-
పక్కనుంచి పోతున్న ఆటోవాడ్ని అడిగాడు. ఆదిత్యను తీసుకెళుతున్న ఆటోడ్రైవర్.
ఆ ఆటోడ్రైవర్ చెప్పిన జవాబు అస్పష్టాస్పష్టంగా విన్పించి ఉలిక్కిపడ్డాడు ఆదిత్య.
"ఏంట...ట... ఏం జరిగింది...?" గొంతు పెగుల్చుకుంటూ అడిగాడు ఆదిత్య.
రెండో ఆటోవాడు చెప్పిన సమాధానం వినగానే, మొదటి ఆటో వాడు కూడా షాక్ తిన్నాడు. ఆటో స్పీడు తగ్గింది అప్పటికే.
"సార్ సి.ఎమ్.ని ఎవరో కాల్చి చంపార్ట..." అరచినట్లుగా అన్నాడు ఆటోవాడు.
ఆ మాటకు-
ఆదిత్య నరాలు ఒక్కసారిగా పొంగాయి. కణాల్లోంచి రక్తం పైకి ఎగజిమ్మడానికి సిద్ధంగా వుంది. భయంతో - ఉద్రిక్తతతో ఆదిత్య వంటిమీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. వెయ్యి ఓల్టుల విద్యుత్ షాక్ తిన్నట్టుగా అయిపోయింది శరీరం. తను ఎలాంటి ట్రాప్ లో ఇరుక్కున్నాడో, వూహించడానికి, అతనికి రెండే రెండు ఘడియలు పట్టింది.
అతని క్రిమినల్ బ్రెయిన్ ముందు... జరిగినదంతా అద్దంలా కన్పిస్తున్న దశలో-
తనని తాను కంట్రోల్ చేసుకోలేక పోయాడు ఆదిత్య.
దుఃఖం వెల్లువలా పొంగుకొచ్చింది.
"నో...నో..." గట్టిగా గొంతు నాళాలు చిట్లిపోయేంతగా అరిచాడు.
సరిగ్గా-
అదే సమయంలో-
ఏదో పిస్టల్ కాల్పు విన్పించేసరికి, తలతిప్పి వెనక్కి చూశాడు.
సర్రున దూసుకొస్తున్నాయి రెండు పోలీస్ జీపులు.
అంటే....
పోలీసులకు తెల్సిపోయిందా?
"డ్రైవర్ స్పీడ్ గాపోనీ...."
డ్రైవర్ స్పీడ్ పెంచాడు. వెనక జీపుల స్పీడ్ కూడా ఆటోమేటిగ్గా పెరిగింది.
దానికి తోడు... కాల్పులు...
ఒక బుల్లెట్ ఆటో టైరుకి తగలడంతో అంత స్పీడులో వెళ్తున్న ఆటో-
బోల్తాపడింది. అందులోంచి ఆదిత్య ఎవరో విసిరినట్టుగా కిందపడిపోయాడు. కేక వేసుకుంటూ డ్రైవర్ ఇంకోవేపు పడిపోయాడు.
కిందపడ్డ ఆదిత్య కన్రెప్ప మూసేటంతలో లేచి, ముందుకి పరుగెత్తడం ప్రారంభించాడు.
ఇరవై అడుగుల వెనక పోలీసు జీపులు. జీపుల్లోంచి కాల్పులు....
అంత భయానక పరిస్థితిలో, తనని తాను రక్షించుకోడానికి అవసరమైన మార్గాల కోసం ఆదిత్య మెదడు తీవ్రంగా అన్వేషిస్తోంది.
ఆ సమయంలో-
అతనికి తట్టిన ఒకేఒక ఆలోచన... టాంక్ బండ్ లోంచి హుసేన్ సాగర్ లోకి దూకెయ్యడం... అంతే...
ఆ ఆలోచన రావడంతోనే, రోడ్డుమీంచి ఫుట్ పాత్ ఎక్కాడు. జేబులో చెయ్యిపెట్టి, జేబులోంచి రమేష్ చంద్ర ఐడెంటిటీ కార్డు తీసి, విసిరేశాడు.
ఆ తర్వాత, భుజానికి వేలాడుతున్న కెమేరాని, హుసేన్ సాగార్లోకి విసిరేసాడు.
ఒక్కసారి వెనక్కిచూసి, పిట్టగోడమీద చెయ్యివేసి, సాగర్లోకి దూకబోతున్న సమయంలో-
నిప్పులు చిమ్ముకుంటూ వచ్చిన ఒక బులెట్, అతని ఎడమ కాలికి తగిలింది. ఇంకో బులెట్, అతని పై పెదవిని రాసుకుంటూ వెళ్ళిపోయింది.
పెనుకేక వేసి కుప్పకూలిపోయాడు ఆదిత్య.
చీరుకుపోయిన కాలినుంచి, చిట్లిపోయిన పై పెదవినుంచి రక్తం... రక్తం...
పేవ్ మెంట్ మీద పడిపోయాడు ఆదిత్య.
ఆదిత్య స్పృహకోల్పోతున్న దశలో అతని పక్కనే కీచుమంటూ ఆగాయి రెండు పోలీసు జీపులు.
మరో అయిదు నిమిషాల్లో ఆ ప్రాంతమంతా పోలీసు వాహనాల్తో నిండిపోయింది.
అంతవరకూ మసకచీకట్లో వున్న టాంక్ బండ్, ఒక్కసారిగా విద్యుత్ కాంతితో నిండిపోయింది.
* * * * *
72 గంటలు గడిచాయి.
కళ్ళిప్పి చూశాడు ఆదిత్య. నందివర్థనం పువ్వులాంటి తెల్లటి డ్రెస్ లో నర్స్. అతనివేపే సూటిగా చూస్తోంది.