Previous Page Next Page 
వేగు చుక్క పేజి 11


    "రేయ్! రేయ్! మొత్తానికి మన షిప్పుని కాగితప్పడవలా ముంచి పారేశాం గదరా! రేయ్ ఎవడ్రా ధైర్యంగా సముద్రంలోకి దిగి షిప్పుకికంతబెట్టిందీ? తంగవేలూ! నువ్వేనా?"

    "అవును బాస్! నేనే!" అన్నాడు తంగవేలు గర్వంగా.

    "నా పేరు చెప్పి ఒక షాంపేను బాటిలు లాగించెయ్యరా! షాంపేను వుందా ఈ షిప్పులో?"

    "షిప్పు ఓనరుగాడి రూమ్ లో ఏకంగా పెద్ద బారే వుంది! రేపు దాన్ని రెయిడ్ చేద్దాం! మొత్తానికి మహత్తరమైన ప్లాను వేశావు గురువా! మన డొక్కు షిప్పుతోబాటు ఇన్సూరెన్సు డబ్బు పంచుకుంటే ఒక్కొక్కళ్ళకీ ఎంతొస్తుంది బాస్?"

    గుర్రుమన్నట్లు కోపంగా శబ్దం చేశాడు డ్రాకులా.

    "తేరగా అందరికీ ఎందుకు వస్తుందిరా వెర్రిమాలోకం! ఇక్కడ కూర్చున్న మనం ముగ్గురమే పంచుకుంటాం డబ్బంతా!"

    "మరి మిగతావాళ్ళో?" అన్నాడు మూడో సెయిలర్ అమాయకంగా.

    "మిగతావాళ్ళా? వాళ్ళెక్కువ రోజులు బతకరుకదా! ఎటూ చచ్చే వాళ్ళకి డబ్బెందుకుట?" అన్నాడు డ్రాకులా చాంగ్ భావగర్భితంగా.

    "ఎక్కువరోజులు బతకరా?" అని వెర్రిగా అడిగాడు మూడో సెయిలర్. అతని గొంతులో కొద్దిగా భయం ధ్వనిస్తోంది.

    వింటున్న అనూహ్యకి ముచ్చెమటలు పోస్తున్నాయి.

    అయితే ఆ షిప్పు ప్రమాదవశాత్తు మునిగిపోలేదా? ఇన్యూరెన్సు డబ్బుకోసం వీళ్ళే ముంచేశారా? ఎంతకైనా తెగించిన మనుషులన్న మాట వీళ్ళు!

    డ్రాకులా చెబుతున్నాడు.

    "తిమ్మిని బమ్మిచేసి, బమ్మిని తిమ్మిచేసి, ఎలాగై తేనేం మన డొక్కు షిప్పుని మిలియన్ డాలర్లకి ఇన్స్యూర్ చేయించాం సరుకుని రెండు మిలియన్ డాలర్లకి ఇన్స్యూర్ చేయించి, దాన్ని రహస్యంగా ఒక ఆఫ్రికన్ పోర్టులో అమ్మిపారేశాం. మనకివచ్చే ఇన్స్యూరెన్సు డబ్బు మూడు మిలియన్లలో నాకు రెండు మిలియన్లు కావాలి. మిగిలిన మిలియన్ ని మీ రిద్దరూ చెరో అయిదు లక్షల డాలర్ల చొప్పున పంచుకోండి. ఏమంటారు!"

    "అయిదు లక్షలే!" అన్నాడు మూడో సెయిలర్ ఆశగా "అది తీసుకుని నేను హవాయ్ కి చెక్కేసి హాయిగా రాత్రనక పగలనక ఆగకుండా తాగుతూ, మెళ్ళో పూలదండ వేసుకుని ఆడుతూ పాడుతూ జీవితాన్ని జుర్రేసుకుంటాను."

    "నేను సింగపూరెళ్ళిపోతాను" అన్నాడు తంగవేలు. "సింగపూరెళ్ళిపోయి పెద్ద హొటలొకటి కట్టేసి, పెళ్ళి చేసుకుని సెటిలయి పోతాను సముద్రానికీ, సముద్రపు దొంగతనాలకీ ఇంక గుడ్ బై! గుడ్ బాయ్ లాగా బుద్దిగా బతకడం నేర్చుకుంటాను" అన్నాడు.

    డ్రాకులా విరుచుకుపడ్డాడు.

    "ఓరి చవట వాజమ్మల్లారా! ఇక్కడింకా బోనస్ లా బోలెడంతలప్ప దొరికేటట్లుఉంటే, దాన్నోదిలేసి ముష్టి మూడు మిలియన్లతొ సరి పెట్టుకుంటారా? ఈ బ్లాక్ రోజ్ బంగారు గనిలాంటి ఒకణ్ణి కనిపెట్టి, కుట్టుకుంది. దాన్ని పట్టుకుని పాతరంతా తవ్వేసుకోకపోతే మన మొనగాడి తనమేముందిరా? బ్లాక్ రోజ్ ని బ్లాక్ మెయిల్ చేస్తే వీళ్ళ బ్లాక్ మనీ అంతా మనం ఊడ్చుకుని తీసుకెళ్ళోచ్చు. తొందరపడకండిరోయ్!"

    "అవునవును!" అని ఒప్పేసుకున్నాడు తంగవేలు. అంతలోనే ఏదో గుర్తుకువచ్చినట్లు సాలోచనగా అన్నాడు. "డ్రాకులా! ఇంతకీ ఆ  సెయిలర్ సింహాద్రిగాడు షిప్పుతోబాటు ఎందుకు మునిగిపోయినట్లూ? అంత వెర్రి వెంగళప్పేం కాడే వాడూ!"

    డ్రాకులా కూడా ఆలోచిస్తూ చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత నిరాసంగా చెప్పాడు. "అది మొదటి మిస్టరీ! దాన్ని మించిన రెండో మిస్టరీ మరొకటుంది. గమనించారా ఎవరైనా?"

    "ఏమిటది?" అన్నాడు మూడో సెయిలర్ ఆసక్తిగా.

    "మీరెప్పుడు బాగుపడతార్రా? వెయ్యిసార్లు చెప్పానురా మీకు అన్నిటినీ వెయ్యికళ్ళతో గమనించి చూస్తుండాలని!" అని విసుక్కుని, చెప్పాడు డ్రాకులా. "పొద్దుటి నుంచీ ఆ సెకండ్ కుక్.....వాడి పేరేమిటో....మహా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడే!"

    సన్నగా విజిలేశాడు తంగవేలు. "నిజమే బాస్! ఏదో రహస్యం దాచలేక కడుపు ఉబ్బిపోతున్నవాడిలా మహ అవస్థ పడిపోతున్నాడువాడు. వాడి పేరు మహేంద్రట"

    సరిగ్గా అదే సమయంలో అడుగుల చప్పుడయింది.

    భయంగా తలలు తిప్పి చూశారు అనూహ్య స్వరూపా.

    మృత్యుదేవత పిలుపు అందుకున్న వాడిలా నేరుగా అటేవస్తున్నాడు సెకెండ్ కుక్ మహేంద్ర.

    చిట్టెలుక మీదకు దూకబోయే గండు పిల్లిలా పొంచి కూర్చున్నాడు డ్రాకులా!


                                                                               7

    వంటవాడు మహేంద్ర కారిడార్  మలుపు తిరగగానే, అతని మీదికి ఉరికాడు డ్రాకులా చాంగ్. ఒక చేత్తో బలంగా అతని నోరు మూసేసి, రెండో చేత్తో అతన్ని భల్లూకంలా పట్టేసుకున్నాడు.

    ప్రాణాలు కడబట్టిపోతుంటే నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఉండి పోయాడు మహేంద్ర.

    "ఏం చిట్టీ తండ్రీ! ఏమిటి విశేషం?" అన్నాడు చాంగ్. మహేంద్ర అరిచి గొడవ చెయ్యడని రూఢి అయ్యాక అతని నోటి మీద నుంచి చేతిని తీసేశాడు.

    "విశేషమా?" అన్నాడు మహేంద్ర తడబడుతూ.

    "పొద్దుటినుంచీ మహా సంబరంగా కులుకుతున్నావే? ఏం కత?"

    "నేనా? ఏం లేదే!"

    అతని చేతిని గట్టిగా మెలిపెడుతూ వెంటనే అతని నోరు మూసేశాడు చాంగ్.

    దుర్భరమైన ఆ బాధను ఓర్చుకోలేక మహేంద్ర చేసిన ఆర్తనాదం అతని పెదిమలు దాటి బయటకు రానేలేదు.

    "వెధవ్వేషాలు వెయ్యకు! చెప్పు!"

    "నాకేం తెలియదు! అవునా! పోనీ నొప్పి అంటే ఏమిటో తెలుసా?" అన్నాడు చాంగ్. తంగవేలు వైపుకి తిరిగి సైగ చేస్తూ.

    రేచు కుక్కలా వేగంగా వచ్చాడు తంగవేలు. ఎడంకాలు ఎత్తి మోకాలుతో మహేంద్ర పొత్తి కడుపు కింద కొట్టాడు.

    దేహంలో అతి సున్నితమైన భాగం అది! అక్కడ తగిలిన ఆ దెబ్బకు విలవిల్లాడుతూ కిందికి జారిపోయాడు మహేంద్ర. అయిదు నిమిషాలవరకూ అతనికి ఊపిరి అందలేదు. ఆ తర్వాత పావుగంట వరకూ అతని నోటి వెంట మాట రాలేదు.

    "చెప్పు!" అన్నాడు చాంగ్.

    తప్పదని గ్రహించి, హీన స్వరంతో చెప్పడం మొదలెట్టాడు మహేంద్ర.

    స్వరూపరాణి మొహంలో భయం తగ్గి ఆసక్తి చోటు చేసుకోవడం మొదలెట్టింది, చెవులు రిక్కించి వినసాగింది మహేంద్ర పెదిమల కదలిక కనబడుతోంది గానీ అతను చెబుతోంది ఏమిటో వినబడటం లేదు.

    మహేంద్ర మీదికి  వంగి మొహంలో మొహం పెట్టి వింటున్న చాంగ్ మొహంలో రంగులు మారాయి. పూర్తిగా విన్న తర్వాత గాఢంగా  ఊపిరి పీల్చి "మైగాడ్! నిజంగానా?" అన్నాడు.

    అవునన్నట్లు బలహీనంగా తల ఊపాడు మహేంద్ర. జీరపోతున్నగొంతుతో, "నాకు తెలిసినదంతా చెప్పేశాను, దయచేసి నన్నేం చెయ్యకండి! ఇంక నన్ను వదిలెయ్యండి!" అన్నాడు చాంగ్ కాళ్ళు పట్టుకుంటూ.

    అసహనంగా కాలితో అతన్ని పక్కకి పోర్లించాడు చాంగ్. "వెళ్ళు! ఈ సంగతి ఇంకెవరికన్నా చెప్పావో, పరలోకానికి పాస్ పోర్టు తీసుకున్నట్లే! ఫో!" అన్నాడు కర్కశంగా.

    ఒక్క ఉదుటన లేచి నిల్చున్నాడు  మహేంద్ర. అతని మొహంలో రిలీఫ్ కనబడుతోంది. కృతజ్ఞతాపూర్వకంగా రెండుచేతులూ జోడించి చాంగ్ కి దణ్ణం పెట్టి, మొహానికి పట్టిన చెమటని మోచేత్తో తుడుచుకుంటూ గబగబ నడవటం మొదలెట్టాడు.

    అతన్ని పది అడుగులు వేయనిచ్చి, తన నెత్తిమీద సర్వకాల సర్వావస్దలలోనూ ఉండే మాసిన టోపీ తీశాడు చాంగ్. విషపునవ్వు నవ్వుతూ, గురిచూసి ఆ టోపీని విసిరాడు.

    అది విష్ణు చక్రంలా గిర్రున తిరుగుతూ వెళ్ళి మహేంద్ర మెడను సర్రున కోసేసింది. మరుక్షణంలో మహేంద్ర మొండెమూ, తలా విడివిడిగా కింద పడ్డాయి.

    ఆ టోపీ అంచులో పదునైన కత్తి అమర్చి వుంది చాంగ్ తన దగ్గర ఉంచుకునే ఆయుదాలను అతి ముఖ్యమైనది అది అందుకనే టోపీని ఎప్పుడు వదలడు అతను.

    మహేంద్ర రక్తం చిమ్మి కారిడార్ లో గోడలనిండా పడింది.

    తంగవేలు త్వరత్వరగా వెళ్ళి బక్కెట్ తో నీళ్ళూ. సోపూ, బ్రష్టూ తెచ్చాడు. ఆ ప్రదేశాన్నంతా శుభ్రం చెయ్యడం మొదలుపెట్టారు వాళ్ళు.

    "ఎంత వంచన!" అంది అనూహ్య, భయంతో చలించిపోతూ, "పాపం అతన్ని వదిలేసినట్లే వదిలేసి, వెనక్కి తిరగ్గానే....ఎంత క్రౌర్యం!" అంది కలవరిస్తున్నట్లు.

    "ఇది క్రౌర్యమా! అంటే  నీకు డ్రాకులా అసలు సంగతి తెలియదన్నమాట!" అనుకుంది స్వరూప మనసులోనే. డ్రాకులాకి కోపం వచ్చిందంటే ఒక్కసారిగా చంపదు మనిషిని చిత్రవధ చేసి మరీ చంపుతాడు.

    సింగపూర్ లో కిస్సీ ని చంపినట్లు!

    కిస్సీ చావు గుర్తురాగానే స్వరూప రక్తం గడ్డకట్టేసినట్లయింది.

    కిస్సీ! స్ట్రిప్ టీజ్ డాన్సర్సులో నెంబర్ వన్! ఆ అమ్మాయి దగ్గర అద్భుతమైన గుర్రం ఒకటి ఉండేది. ఆ గుర్రంతోసహా వచ్చేది డయాస్ మీదకి.

    వాళ్ళని చనువుగా వెంటాడుతూ వచ్చేది స్పాట్ లైట్.

    అప్పుడు మొదలయ్యేది షో!

    తక్కిన స్ట్రివ్ టీజ్ డాన్సర్సు అందరూ డయాస్ మీద బట్టలు విప్పేస్తూ ప్రేక్షకులని కవ్విస్తూ డాన్సు చేసేవాళ్ళు కానీ కిస్సీ  అలా కాదు, ఆ అమ్మాయి వంటిమీద ఉన్న బట్టలని ఒక్కొక్కటిగా ఆ గుర్రమే నోటితో గుంజేసేది ఆ సమయంలో ఆ గుర్రం చూపులు ఎలా ఉండేవి? అచ్చం మొగాడే చూస్తున్నట్లు  అనిపించేది!

    అలాంటి కిస్సీ మీద పడింది డ్రాకులా చాంగ్ కన్ను. అభ్యంతర పెట్టడానికి కిస్సీ పత్తిత్తూ కాదు, పతివ్రతా కాదు. హుషారుగా అతనితో బాటు రూములో దూరింది అయిదు నిమిషాలు  గడిచీ గడవక  ముందే  వినే వాళ్ళు   జడుసుకునేటట్లు కిస్సీ  ఏడుపులూ, పెడబొబ్బలూ వినబడ్డాయి.

    డ్రాకులా చాంగ్ ఆడవాళ్ళ దగ్గర  నిజంగా రాక్షసుడే! అసహజమైన పద్దతుల్లో కిస్సీని ఆక్రమించుకోబోయాడు అతను. భరించలేక ఒడుపుగా పక్కకి జారిపోయి, అతని మొహాన ఉమ్మేసింది.

    అదే ఆమె చేసిన మహాపరాధం!

    వెంటనే ఆమెకు మరణశిక్ష ప్రకటించాడు చాంగ్. చిత్రవధ చెయ్యడం మొదలుపెట్టాడు. ఆ చీకటి సందుల్లో అతనిదే రాజ్యం. అతనికి ఎదురు తిరిగి కిస్సీని రక్షించే దమ్ములు ఎవరికీ లేకపోయాయి.

    ఆ చిత్రవధను గుర్తు తెచ్చుకుంటే కాళ్ళు వణకడం మొదలెట్టాయి స్వరూపకి.

    మొదట కిస్సీ చేతులని కట్టేశాడు చాంగ్. ఆమె పొడుగాటి జుట్టుని బిగించి పట్టుకొని కత్తితో కోసేశాడు. తల మీద విస్కీ పోసి అగ్గిపుల్లతో అంటించాడు. మిగిలిన జుట్టూ, మొహంలో సగ భాగమూ కాలిపోయాయి.

    తర్వాత చేతులు వెనక్కి విరిచి కట్టేసి ఒక తాడుతో ఆమెని దూలానికి వేలాడదీశాడు. భరించశక్యం కాని ఆ బాధతో అలా నాలుగు గంటల సేపు వేలాడింది కిస్సీ. ఈలోగా అతను వెళ్ళి సుష్టుగా భోజనం చేసి పూటుగా తాగి వచ్చాడు.

    తిరిగి వస్తూనే, దూలానికి వేలాడుతున్న కిస్సీ శరీరానికి మొయ్యలేనన్ని బరువులు తగిలించాడు. ఒక పట్టకారు తీసుకొచ్చి బొటనవేళ్ళను సాధ్యమైనంతగా వత్తాడు. వెనక్కి వించి కట్టి ఉన్న ఆమె చేతుల మధ్య నుంచీ ఒక కర్రను దూర్చి మెలి తిప్పాడు. అప్పుడే వలిచిన తోలుతో చేసిన కొరడా తీసుకొచ్చి ఆమెని చచ్చేటట్లు కొట్టాడు.

    పదిహేడో శతాబ్దపు చీకటి రోజుల్లో మాంత్రికులని అనుమానించిన వాళ్ళని చంపడానికి జర్మనులు ఉపయోగించిన పాశవికమైన పద్దతులు అవి!

    ఆ తర్వాత అతనికే ఆయాసమొచ్చింది. ఫలహారం చెయ్యడానికి రెస్టారెంటులోకి వెళ్ళాడు.

    అతను కాస్త సేదదీరి తిరిగి వచ్చేసరికి, బతికి ఉండగానే నరకయాతన అనుభవించిన కిస్సీ ప్రాణాలు వదిలేసింది.

    చాంగ్ ఎంత కిరాతకుడో బాగా  తెలుసు స్వరూపరాణికి. అతనిలో దయాదాక్షిణ్యాలు ఏ కోశానా  లేవు. తన దారికి అడ్డం వచ్చిన వాళ్ళని బుల్ డోజర్ లా అణిచేస్తూ ముందు కెళ్ళిపోగల సమర్ధుడు అతను.

    అతనితో మహేంద్ర చెప్పిన రహస్యం ఏమిటి?

    సన్నగా డబ్బువాసన తగిలింది స్వరూపరాణికి అపారమైన ధనరాశుల గలగల అస్పష్టంగా వినబడినట్లయింది.

    డబ్బు ఎక్కడుంటే అక్కడ ఉంటుంది స్వరూప.

    ఉన్నట్లుండి అనూహ్యని దూరంగా తోసేసి, "హలో పార్టనర్!" అని ధైర్యంగా చాంగ్ దగ్గరి కెళ్ళిపోయింది స్వరూప,  అతని పార్టీలోకి చేరిపోతూ.

    ఆమెని చూడగానే, ముందు విస్తుపోయాడు చాంగ్. తర్వాత అతని మొహంలో క్రమంగా చిరునవ్వు కనబడింది. "బ్లాకీ! బ్లాక్ రోజ్! అవునా? నిన్ను చూసీ చూడగానే గుర్తు పట్టేశాను బ్లాకీ, వెల్ కమ్ టూ ది గ్యాంగ్!" అన్నాడు. 

 Previous Page Next Page