చనువుగా అతన్ని అనుకుని నిలుచుంది స్వరూప. "థాంక్యూ పార్టనర్! నువ్వూ నేనూ కలిస్తే ప్రపంచాన్నే ఏలేస్తాం! అవునా!"
"కాదా మరి!" అని పెద్దగా నవ్వుతూ వంగి, మహేంద్ర తలని అందుకున్నాడు చాంగ్, "దీన్ని ష్రింక్ చేసి దాచిపెట్టాలి!" అనుకుంటూ.
అప్పటిదాకా దిగ్ర్భమతో ఇదంతా చూస్తున్న అనూహ్య, వణుకుతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుని, నిశ్శబ్దంగా అడుగులు వేస్తూ అక్కడనుంచి వెళ్ళిపోయింది. కారిడార్ దాటగానే పరిగెత్తడంమొదలెట్టింది.
తను సాగర్ ని కలుసుకోవాలి. తక్షణం! ఈ షిప్పులో ఎలాంటి కిరాతకులు ఉన్నారో అతనికి ఇంకా తెలిసి వుండదు. వెంటనే చెప్పాలి తను!
వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతోంది అనూహ్య.
అప్పటికి తెలతెలవారుతోంది.
* * *
రాత్రి ఇంజను శబ్దంలో ఏదో తేడా ఉన్నట్లు అనిపించగానే, అనూహ్యని వదిలి ఇంజను రూంలోకి వెళ్ళిపోయాడు సాగర్. అతను అనుమానించినట్లే ఇంజను రూంలో ట్రబుల్ ఉంది.
అది ఇంజన్ రూంలో ఉన్న క్రూ కూడా ఇంకా గ్రహించనేలేదు. పైన ఉన్న సాగర్ కనిపెట్టేశాడు!
అందుకనే వాళ్ళకి సాగర్ అంటే అంత గౌరవం, భయభక్తులు!
అతను హెచ్చరించగానే వెంటనే చెకప్ చెయ్యడం మొదలెట్టి, ఫాల్ట్ ఎక్కడుందో కనుక్కునే, రిపెయిర్లు మొదలెట్టారు.
సముద్రంలో అలాంటి అత్యవసరమైన రిపెయిర్లు చేసుకోవడానికి వీలుగా ఆ షిప్పులో పెద్ద వర్క్ షాప్ ఉంది వెల్డింగు పరికరాలు మొదలుకొని చాలారకాల పనిముట్లు ఉన్నాయి.
ఆ హడావిడిలో ఉండిపోవడంవల్ల సాగర్ కి డెక్ మీద జరుగుతున్న ఘోరం తెలియకుండాపోయింది.
రిపెయిర్లు పూర్తయేసరికి తెల్లవారుఝాము అయింది.
వాష్ బేసిన్ లో చేతులూ మొహమూ కడుక్కుని, మెట్లెక్కి ఇంజన్ రూంలో నుంచి బయటకివచ్చి , గేలివైపు నడిచాడు సాగర్. వేడి వేడిగా ఒక కప్పు కాఫీ తాగితేగానీ అతనికి ఒళ్ళు స్వాధీనంలోకి వచ్చేలా లేదు.
గెలీలో హెడ్ కుక్ ఇబూకా ఒక్కడే ఉన్నాడు. అడుగుల శబ్దం విని వెనక్కి తిరిగి సాగర్ ని చూడగానే కలవరపడిపోయాడు. అతని చేతుల్లో ఏదో ఉంది. చప్పున చేతులు వెనక్కి పెట్టేసుకున్నాడు.
ఇబూకా ప్రవర్తన అనుమానాస్పదంగా తోచింది సాగర్ కి. ఎందుకలా చిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ఇబూకా? అతను దాస్తున్న వస్తు వేమిటి? ఇబూకా చాలా విశ్వాసపాత్రుడు అతని వల్ల ఒక పొరపాటు జరిగినందుకు గానూ ప్రాయశ్చిత్తంగా హరాకిరీ చేసుకుని ప్రాణ త్యాగం చేయబోయిన వ్యక్తి! అలాంటివాడు తన కళ్ళు గప్పి చేయదలుచుకున్నదేమిటి?
ఇబూకానే నమ్మకద్రోహం చేస్తే ఇంక ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మేటట్లు?
నిట్టూర్చి అతన్ని సమీపించాడు సాగర్.
"ఇబూకా!"
కళ్ళు మిటకరించి చూశాడు ఇబుకా.
"ఏమిటది ఇబూకా? ఏమిటి దాస్తున్నావ్?"
"ఏం లేదు సర్? ఏమీలేదు!" అన్నాడు ఇబూకా తడబడుతూ. కానీ నిశ్చయంగా ఏదో ఉందని అతని గొంతే చెప్పకుండా చెబుతోంది.
ఇదంతా తనకు నచ్చనట్లు నుదురు చిట్లించాడు సాగర్.
ఇంక లాభం లేదనుకున్నాడు ఇబూకా. ఇబ్బందిగా చేతులు ముందుకి జాచాడు.
"ఏమి చూడవలసి వస్తుందో" అని ఇబ్బందిగా ఫీలవుతున్నసాగర్ కి వెంటనే రిలీఫ్ కలిగింది. పెదిమలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
ఇబూకా చేతిలో తెల్లటి పింగాణి ప్లేటు ఉంది.
అందులో ఘుమఘుమ లాడుతున్న తాజా చేప కూర!
దూది పింజెల్లాగ తెల్లగా, మృదువుగా ఉన్నాయి ఆ కూర ముక్కలు. ఆ ముక్కలని ప్లేటులో కళాత్మకంగా కుందేలు ఆకారంలో పేర్చాడు ఇబూకా. ఎర్రగా ఉండవలసిన కళ్ళూ, చెవుల స్ధానంలో కేరట్ ముక్కలు ఉంచాడు.
చూడగానే నోరూరేటట్లుంది ఆ వంటకం.
నవ్వేశాడు సాగర్. "ఈ చేపకూర నీకు అంత ఇష్టమా ఇబూకా? ఎవరికీ పెట్టకుండా అంతా నువ్వే తినెయ్యాలనుకుంటున్నావ్! అవునా!"
"అవును!" అన్నాడు ఇబూకా స్ధిరంగా. "అవును సార్! ఈ కూర అంతా నా కోసమే! నేనొక్కడినే తినాలి! ఇంకెవ్వరూ తినకూడదు! తిననివ్వను!"
ఆశ్చర్యంగా చూశాడు సాగర్. ఎందుకింత పట్టుదలగా మాట్లాడుతున్నాడు ఇతను? అసలు ఇంతకీ ఇదేం చేప?
ఆ ప్రశ్నే వేశాడు
"పూగూ చేప సర్! పూగూ చేప!" అన్నాడు ఇబూకా రహస్యం చెబుతున్నట్లు.
స్దంభించిపోయాడు సాగర్.
"పూగూ చేప!" దానిని గురించి అతను భయంకరమైన కధలు ఎన్నో విన్నాడు. జపనీయులకి అత్యంత ప్రీతిపాత్రమైన వంటకాలలో అది ఒకటి. అతి ఖరీదైన వంటకాలలో కూడా అది ఒకటి. ఒక ప్లేటు కూర ఖరీదు దాదాపు రెండువేల ఆరు వందల రూపాయలు ఉంటుంది.
అంతేకాదు!
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వంటకాలలో అది మొదటి కూడా !దాని పేగుల్లో, లివర్ లో, ఒవరీలలో, మూత్రపిండాలలో, చర్మంలో, కళ్ళలో కూడా అతి తీవ్రమైన విషం ఉంటుంది! ఆ విషాన్ని పొడిగా చేస్తే ఒక చిటికెడు విషం దుక్కల్లా ఉన్న ముప్పయ్ మంది మనుషుల ప్రాణాలు తీయగలదు!!
అందుకనే జపాన్ దేశంలో దాన్ని వండే వంటవాళ్ళకి ప్రత్యేకమైన లైసెన్సు ఉంటుంది. ఆ లైసెన్సు సంపాదించడం కోసం వంట వాళ్ళు ఒక కష్టతరమైన కోర్సుని చదవాలి. అనుభవజ్ఞుల క్రింద ఆ పెంటిస్ గా పనిచెయ్యాలి. పరీక్షలు రాసి పాస్ అవ్వాలి.
ఆ చేపని వండేముందు ముప్పై పద్దతుల్లో దాన్ని శుభ్రం చేసి , విషాన్ని తొలగించాలని చట్టం కూడా చేసింది ప్రభుత్వం.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పూగూ చేపని తినడం ప్రతిసారీ ఒక చాలెంజ్ లాంటిదే! ప్రతీసారి ప్రాణాన్ని పణంగా పెట్టడమే!
పూగూ చేపకూర తిని ఏటేటా సగటున వందమంది దాకా చనిపోతూనే ఉంటారు జపాన్ లో !
అయినా దాన్ని తినడం మానరు. అది తిన్నవాడు ఒక వీరోచిత కార్యం చేసినట్టే లెక్క ! ఆ కీర్తి కోసం చాలామంది ప్రయత్నిస్తూ వుంటారు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటూ వుంటారు కూడా!
జపాన్ లో ఒక సామెత కూడా ఉంది. 'పూగూ చేపను తినేవాడు మూర్ఖుడు! తిననివాడు మహా మూర్ఖుడు !?' అని.
అంత రుచిగా వుంటుందన్నమాట ఆ చేప!
"ఇది పూగూ చేపా?" అన్నాడు సాగర్ ఆశ్చర్యంగా. దీన్ని గురించి వినడమేకానీ కళ్ళతో చూసి ఎరగను నేను. థాంక్స్ ఇబూకా ! దీన్నీ నీతోపాటు నన్ను కూడా షేర్ చేసుకోనివ్వు.!"
"నో సర్ !" అన్నాడు ఇబూకా గట్టిగా" అది తింటే చస్తామో బతుకుతామో తెలియదు సర్! మిమ్మల్ని తిననివ్వను సర్!"
అదే సమయంలో గెలీలోకి దూసుకువచ్చింది అనూహ్య. ఇబూకా మాటలు ఆమె చెవినపడ్డాయి.
"న్నో!" అంది పెద్దగా, విహ్వలంగా! "న్నో! న్నో! వద్దు సాగర్ ! అది తినకండి !ప్లీజ్!"
అప్పటికే నాలుగు ముక్కలు నోట్లో వేసుకుని నమిలి మింగేశాడు సాగర్.
కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది అనూహ్య. ఇదేనా దైర్యం అంటే? తన స్వంత ప్రాణాలంటే ఇతనికి ఏమాత్రం లక్ష్యం లేదా?
చాంగ్ క్రౌర్యానికీ ఇతని దైర్యనికీ ఎంత తేడా?
నవ్వుతూ ఇంకో ముక్క నోట్లో వేసుకున్నాడు సాగర్.
8
"ఒస్సోసి! అయితే ఖంగారు పిట్టని పట్టి బుట్టలో పెట్టావన్న మాట!" అన్నాడు డ్రాకులా చాంగ్, చేతిన్ని మొరటుగా స్వరూప భుజం మీద వేస్తూ. షిప్పు ఓనరుకే లంగారేశావా? భలే టక్కులాడివే నువ్వు!"
"నువ్వు మాత్రం తక్కువ కీలాడీవా?" అంది స్వరూప వగలు బోతూ, "షిప్పునీ, ఇన్సూరెన్సు కంపెనీనీ కట్టగట్టినట్టు నడిసముద్రంలో ముంచేసింది చాలక, ఇంకా ఏదో బంగారు పాతరనితవ్వేటట్లు ఉన్నావుగా?"
సంభాషణ చౌకబారు ఇంగ్లీషులోనే సాగుతోంది.
"విన్నావన్న మాట!" అన్నాడు చాంగ్.
ఆశతో స్వరూప కళ్ళు మిలమిల మెరుస్తూ పాము కళ్ళకు వకళ్ళ లాగా కనబడ్డాయి. అయితే తను ఊహించింది కరెక్టే! డబ్బువిషయంలో తన అంచనాలు ఎప్పుడూ తప్పుకావు. డబ్బు ఎక్కడ వున్నా పసిగట్టేయ్యడం పసితనంనుంచే అలవడింది తనకు.
"ఇదిగో బ్లాకీ! ఈ రహస్యం మరో చిలక్కి తెలిసిందంటే జాగ్రత్త! కోపం వచ్చిందంటే నేను మనిషిని కాను!" అన్నాడు చాంగ్.
"ఇప్పటిదాకా నాతోబాటు ఇంకో చిలక కూడా వుంది. అది కూడా ఇదంతా విన్నది"
"ఎవరు? ఆ తెల్లపిల్లా?" అన్నాడు చాంగ్ నాలుకతో పెదిమలు తడి చేసుకుంటూ "షిట్! విన్నా ఫర్లేదులే! అండమాన్స్ చేరేదాకా దాన్తోఆడి, పాడి, వాడి, అది వడిపోయాక మెడకి రాయికట్టి నీళ్ళలోకి తోసెయ్యడమేగా? దాని సంగతి నేను జూసుకుంటాలే!"
"ఓరి నిన్ను తిమింగలం తినెయ్యా!" అని మనసులోనే శాసనార్ధాలు పెట్టుకుంది స్వరూప. "యాపిల్ పండులాంటి ఆ పిల్లని ఉత్తిపుణ్యానికే చంపేస్తావూ? అది నా సొంతంరా! నువ్వు నీ పాముకి ఎలా ట్రయినింగ్ ఇచ్చ్చి గమ్మత్తు సుఖాలలో మునిగి తెలుతాను! దాని మీద చెయ్యి వేశావో నీ సంగతి తెల్చేస్తాను నువ్వు డ్రాకులా చాంగ్ ని కావచ్చు! కానీ నేను బ్లాక్ రోజ్ ని! నీ సంగతి నాకు పూర్తిగా తెలుసు! నా సంగతే నీకు బొత్తిగా తెలయదు!" అనుకుంది కసిగా.
పైకి మాత్రం, "చాంగ్!" అని మృదువుగా పిలిచింది స్వరూప. తేనెలో ఊరేసి, చక్కరలో అద్దినట్లు తియ్యగా ఉంది ఆ పిలుపు. "నీ దగ్గర శక్తివుంది. నా దగ్గర ముక్తి వుంది. మనిద్దరం కలిస్తే చాలా రక్తిగా వుంటుంది. ఏమంటావ్?"
పగలబడి నవ్వాడు చాంగ్. "నీ తెలివితేటలు నాకు బాగా తెలుసు బ్లాకీ! ఓకే డన్!" అన్నాడు.
వాళ్ళిద్దరి మధ్యా, అప్పనంగా దొరకబోయే డబ్బుకోసం పార్ట్ నర్ షిప్పూ, ఆ షిప్పులోనే ఉన్న ఒక అమ్మాయికోసం విరోధం ఒకేసారి మొదలయ్యాయి.
"ఇంతకీ పూర్తి వివరాలేమిటో చెప్పలేదు పార్ట్ నర్!" అంది స్వరూప. ఆ రహస్యం ఎప్పుడెప్పుడు పూర్తిగా వింటానా అని తహ తహగా ఉంది ఆమెకు.
డ్రాకులా చాంగ్ అటూ ఇటూ చూసి "ఇక్కడ కాదు! బ్రిడ్జి మీదికి వెళదాం!" అంటూ స్వరూప జబ్బ పట్టుకుని లాక్కెళ్ళాడు.
"అబ్బ! అన్నిట్లోనూ మోటుతనమే!" అంది చిలిపిగా నవ్వుతూ.
పైకి చేరాక సిగరెట్ అంటించి చెప్పడం మొదలెట్టాడు.
"బ్లాకీ! ఇది ఇప్పటి కథ కాదు! ఎప్పటి మాటో! బ్రిటిష్ వాళ్ళు ఇండియాని నిలువుదోపిడీ చేసి లెక్కలేనంత సంపదని ఎత్తుకుపోతుంటే, రంగరాజు అనే ఇండియన్ దారికాచి, షిప్పుని దారి మళ్ళించి అండమాన్స్ కి తీసుకొచ్చాడు. మనిషన్నవాడు అడుగు పెట్టని ఒక నిర్జన ద్వీపంలో ఆ నిధిని దాచిపెట్టి ఆ గుర్తులు ఒక రాగిరేకు మీద రాసి పెట్టుకున్నాడు.
తర్వాత రంగరాజునీ , అతని మనుషులనీ బ్రిటిష్ వాళ్ళు బతికి వుండగానే పూడ్చి పెట్టరనుకో!
ఈ కథ సెయిలర్స్ చాలామందికి తెలుసు. అందరూ కలిసి తాగుతున్నప్పుడు ఉబుసుపోక ఈ కధని చెబుతాడు ఎవరో ఒక సెయిలర్. ఇంకెవడో రమ్ము తాగుతూ గొంతెత్తి పాడతాడు.
"బంగారం దొచాడో హొయ్ రంగారాజూ,
దాన్ని భద్రంగా దాచాడోహొయ్ రంగరాజూ,
రేకుమీదా, మేకుతోనా, రహస్యాన్ని
రాసాడోహొయ్ రంగారాజూ!" అని
హఠాత్తుగా ఇవాళ, ఈ కధ ఉత్త పుక్కిటి పురాణం కాదనీ, పచ్చి నిజమనీ తేలిపోయింది."
"ఎలా?" అంది స్వరూప ఉత్సుకతతో.
"నిధి తాలూకా ఆచూకీ రాసివున్న ఆ రేకే ఆచూకీ లేకుండా పోయింది ఇన్ని సంవత్సరాలనుంచీ! ఎన్నెన్నో చేతులు మారి అది మా షిప్ మేట్ సింహాద్రి చేతుల్లో పడినట్లుంది చివరికీ.
దానిమీద ఏదో పెన్నిధి తాలూకు రహస్యం రాసి ఉందని గ్రహించిన మొదటివాడు సింహాద్రి. ఎక్కువ చదువుకోలేదు గానీ అమోఘమైన బుర్రలే వాడిది. కానీ 'ఇదీ సంగతి బాస్' అని నాతో చెప్పి ఏడవవచ్చు కదా? అత్యాసకుపోయి ఏం జేశాడూ, నిధి మొత్తం తనే తవ్వేసుకుందామని ప్లాన్ వేసి ఎవరికీ చెప్పకుండా గప్ చుప్ గా ఉండిపోయాడు."
"దురాశ దుఃఖానికి చేటు!" అంది స్వరూప.
"ఆ రేకుని వాడు భద్రంగా తన కేబిన్ తాలూకు కొయ్య పానెల్స్ వెనక ఎక్కడో దాచి ఉండాలి. మా షిప్పు మునిగిపోవడం మొదలెట్టి, మేమందరం దాన్ని వదిలేసి ఈ షిప్పులోకి రావడానికి రెడీ కాగానే వాడికి గంగవెర్రులెత్తి ఉండాలి. తన ప్రాణాలకంటే ఆ డబ్బుపాతరే ముఖ్యమని పించి, ,మునిగిపోతున్న షిప్పులోనే ఉండిపోయాడు వాడు ఆ రాగి రేకు కోసం!"
"ఆశకు అంతం వుండాలి!" అంది స్వరూప. "మరి ఆ రాగి రేకు సముద్రంలో పడిపోయినట్లేన?"
"నన్ను చెప్పనీ!" అని గట్టిగా విసుక్కున్నాడు చాంగ్. "షిప్పుతో పాటు సింహాద్రికూడా మునిగిపోయాడు. ఆ లోగానే రాగి రేకుని చేతజిక్కించుకుని ఉంటాడు వాడు ఇంక పైకి ఈదుకు రావటానికి ప్రయత్నిస్తూ వుండగా ఒక చిత్రం జరిగింది."
శ్రద్దగా వింటూంది స్వరూప.
"అదే సమయానికి ఒక షార్క్ చేప అటు వచ్చి, సింహాద్రిగాడి చేతిని అందుకుని లటిక్కిన కొరికి గుటుక్కున మింగేసింది, ఆ బాధకు ఉక్కిరిబిక్కిరై, నీళ్ళు తాగేసి చచ్చి ఉంటాడు వాడు.
పైకి తేలిన సింహాద్రి శవానికి ఒకచేతిలో స్కూడ్రైవరు వుండగా, రెండో చెయ్యి అసలు లేకపోవడం గుర్తొచ్చింది.
అంటే షార్క్ చేప సింహాద్రి చేతితోపాటు రేకునికూడా మింగేసి ఉంటుదన్నమాట!
అంతకంటే మహా విచిత్రం ఏమిటంటే మర్నాడు మహేంద్రగాడు వల వేస్తే సరిగ్గా ఈ చేపే పడింది వాణ్ణి నీళ్ళలోకి గుంజి చంపి ఉండేదే, సరిగ్గా అదే సమయానికి నేను వెళ్ళి రక్షించకపోతే!"
"కానీ ఇరవై నాలుగు గంటలు తిరక్కముందే వాడి ప్రాణాలు తీశావు! అవునా?"
తన ఎడమ చేతిలో ఉన్న మహేంద్ర తలవైపు నవ్వుతూ చూశాడు చాంగ్.
"వాడికి పొయ్యేటైమొచ్చేసింది! మరేం జేస్తాం! సరే ఇంతకీ! జరిగింది ఏమిటంటే తనని చంపబోయిన ఆ చేపమీద వీడికి చచ్చేంతకోపం వచ్చింది. దాని కడుపుని నిలువునా చీల్చాడు."
"సరే! సరే! మిగతా కథ నాకు అర్ధమయిందిలే!" అంది స్వరూప ఉత్సాహంగా. "మన అదృష్టంచూడు! ఇప్పుడు ఈ షిప్పు కూడా నేరుగా అండమాన్స్ కే వెళ్తోంది. మన పని చులాగ్గా అయిపోయినట్లే!"
"ఇది వెళ్తోందా? వెళ్ళడం వెళ్ళకపోవడం దాని బాబుగాడి ఇష్టమేమిటి? ఇకనుంచీ నేనే ఈ షిప్పుకి ఓనర్నీ, కెప్టెన్ నీ, అన్నీకూడా!"
"ఈ సంగతి మా ఆయన విన్నాడంటే......"
"ఇకనుంచీ నేనే మీ ఆయన్ని కూడా!"
నవ్వింది స్వరూప. చాంగ్ గుణం ఆమెకి బాగా తెలుసు. అంటు రోగపు క్రిమి లాంటివాడు చాంగ్. ఆరోగ్యంగా ఉన్న శరీరంలోకి అంటువ్యాధి క్రిమి ఒకటి దూరి, శరీరాన్ని లొంగదీసుకుని, పీల్చి పిప్పి చేసినట్లు, అతను ఎక్కడ చేరితే అక్కడ వాతావరణాన్ని విషపూరితంగా, బీభత్సవంగా చేసేసి, తన చెప్పుచేతల్లోకి తెచ్చేసుకుంటాడు.
"ఒక్క నిమిషం!" అంటూ మహేంద్ర తలని కిందపెట్టి, ఎలుగ్గోడ్డు తాటిచెట్టు ఎక్కినట్లు, పొగగొట్టం పక్కనే ఉన్న స్ధంభంలాంటి దాని మీదకు బరబర ఎగబాకాడు చాంగ్.
అక్కడ ఉంది షిప్పు తాలూకా రాడార్.
దాన్ని సునాయాసంగా ఎడమచేతితో గుంజి పూచిక పుల్లలని విరిచినట్లు విరిచేసి, శక్తికొద్దీ సముద్రంలోకి విసిరేశాడు. తర్వాత స్ధంభంమీద నుంచీ కొద్దిగా కిందికి జారి, అక్కడ నుంచి దూకాడు.
ఆ అదురుకి, అంత పెద్ద షిప్పూ ఒక వైపుకి ఒరిగినట్లు భ్రమ కలిగింది స్వరూపకి.
చేతులకి అంటిన గ్రీజుని ప్యాంటుకి తుడుచుకుంటూ నేవిగేషన్ రూమ్ లోకి నడిచాడు చాంగ్ అక్కడ షిప్పు రేడియో ఉంది. దాన్ని ఎత్తి కిందపడేసి, కాళ్ళతో తొక్కి నుగ్గు నుగ్గు చేసేశాడు.