Previous Page Next Page 
కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత పేజి 91


    8. మేధాశక్తి కొరవడినవాడు ఈ ఇష్టినే నిర్వాపము చేయవలెను. దేవికాశ్చన్దాగ్ంసివై. ఛందస్సులు మేధలేని వానిని చేరకున్నవి. అందువలన ధాతను ప్రథమమున స్థాపించవలెను. అప్పుడు ధాత యజమాని నోటియందు ఛందస్సులను చేర్చును. అవి యజమానిని మేధావంతుని చేయును.

    9. కాంతిని కోరువాడు ఈ ఇష్టినే నిర్వాపము చేయవలెను. ఛందస్సులే యజమానికి కాంతిని కలిగించును. క్షీరములు కాంతి అగుచున్నవి. క్షీరములే అతనికి కాంతిని కలిగించుచున్నవి. యజమాని ధాతను అనుమత్యాది దేవతల మధ్యన స్థాపించవలెను. ధాత యజమానిని కాంతి మధ్యమున స్థాపించినవాడు అగుచున్నాడు.

    10. అనుమతి గాయత్రీ ఛందస్సు. రాకాదేవి త్రిష్టుప్ ఛందస్సు. సినీవాలి జగతీ ఛందస్సు కుహూదేవి అనుష్టుప్ ఛందస్సు. ధాత వషట్కారము అగుచున్నారు.

    11. రాకాదేవి పూర్ణచంద్రుని పున్నమి. అది శుక్లపక్షస్వరూపము. కుహూదేవి చంద్రకళ కనిపించని అమావాస్య. సినీవాలి చంద్రకళ గల అమావాస్య. అనగా కృష్ణ చతుర్దశితో కలసిన అమావాస్య. అనుమతి దేవత శుక్లచతుర్దశితో కలసిన పున్నమి. ధాత చంద్రుడు అగును.

    12. వసువులు ఎనిమిది మంది. గాయత్రి ఎనిమిది అక్షరములది. కావున వసుస్వరూప. రుద్రులు పదకొండు మంది. త్రిష్టుప్ పదకొండు అక్షరములది. కావున రుద్రస్వరూప. ఆదిత్యులు పన్నెండుమంది. జగతీ ఛందస్సు పన్నెండు అక్షరములు కలది. కావున ఆదిత్య స్వరూప. అనుష్టుప్ ప్రజాపతి స్వరూప. వషట్కారము ధాతృదేవతాస్వరూప.

    13. ఏతద్వైవికాః సర్వాణిచ ఛన్దాగ్ంసి సర్వాశ్చ దేవతా వషట్కారః. ఈ దేవికలు సర్వఛందస్సులగుదురు. సర్వదేవతలు వషట్కారమగుదురు.

    14. సర్వదేవికలకు ఒకేసారి నిర్వాపము చేసిన యజమానిని ఆ దేవికలు దహించ సమర్థులగుదురు. కావున మొదటి రెండు చరువులను అనుమతి, రాకా దేవులకు నిర్వాపము చేయవలెను. మూడవ పురోడాశమును ధాతృదేవునకు నిర్వాపము చేయవలెను. తదుపరి సినీవాలి, కుహూదేవులకు ఒక్కొక్క చరును నిర్వాపము చేయవలెను. అట్లు చేసినచో వారు యజమానిని దహింపచేయరు. యజమాని కోరికలను తీర్చెదరు.

                                           పదవ అనువాకము

    1. ఈ గృహము అగ్నికి స్థానము. గార్హపత్యాగ్నీ! నీవు ఈ ఇంటికి రక్షకుడవు. మేము గ్రామాంతరమునకు వెళ్లుచున్నాము. మమ్ము మరువకుము. గుర్తించుకొనుము. మాకు సుఖనివాసము కలిగించుము. మాకు రోగనివారకుడవు అగుము. నిన్ను ఏ కోరికలు కోరి ప్రార్థించుచున్నామో వానిని మాకు కలిగించుము. మాకును, మా పశువులకును సుఖములు కలిగించుము.

    2.గార్హపత్యాగ్నీ! నీ సభలు సర్వార్థసాధకములు. రమణీయము. సర్వజ్ఞము. మమ్ము నీవు ఆ సభలందు చేర్చుకొనుము. మాకు యోగక్షేమములు కలిగించుము. రక్షింపుము. సర్వదా శుభములు కలిగించుము.

    3. అగ్నిహోత్రి ఉదయము సాయంత్రము అగ్ని యందు హోమము చేయును. ఆ యజమాని ఆహుతులనే ఇటుకలుగా కూర్చును.

    అగ్నిహోత్రికి రాత్రింబవళ్లే ఇటికలు అగుచున్నవి.

    ఆహితాగ్ని ప్రాతస్సాయంకాలములందు హోమము చేయుచున్నాడు అనుటవలన అతడు రాత్రింబవళ్లను ఇటుకలనుగా చేసి ఉపధానము చేసినట్లగును.

    (అగ్నిహోత్రము చేయునపుడు ఇటుకలను చతురస్రముగా కూర్చి చేయవలసి ఉన్నది. గ్రామాంతరమున అది సమకూరకున్న ఆహుతులు, అహోరాత్రులే ఇటుకలగుచున్నవి. నిత్యాగ్ని హోత్రికి ఇటుకలు అక్కరలేదని చెప్పుటయు కావచ్చును.)

    4. అగ్నిహోత్రి ఒకే ప్రదేశమున పది రోజులు ఉన్నచో విరాట్ ఛందస్సును ఆశ్రయించవలెను. విరాట్టు దశాక్షరకదా! అతడు విరాట్టునే ఇష్టికగా చేసి ఉపధానము చేసినవాడగును. ఆ విరాట్టునందే అతడు అగ్నిష్టోమ ఫలమును పొందును. అతనికి అగ్ని 'చిత్య' అగును.

    (చిత్యగ్నులు మూడు విధములు. ఉదయ సాయంత్రములందు ఇటుకల మధ్య అనుష్ఠించినది ఒకటి. ఉదయ, సాయంత్రములే ఇటుకలైనది రెండవది. విరాట్ రూప ఇష్టికలు కలది మూడవది.)

    5. అగ్నిహోత్రి పదిరోజులనుండి హోమము చేసినట్టి భూమి యజ్ఞభూమి అగుచున్నది. పదిరోజుల తరువాత ఉన్న భూమియు యజ్ఞభూమి అగును.

    గార్హపత్యాగ్ని రుద్రరూపుడు. గార్హ పత్యాగ్నిని హోమము చేయక ప్రయాణము సాగించినచో గార్హ పత్యాగ్ని మండిపడును. అగ్నిహోత్రిని లేవకముందే హతమార్చును.

    కావున యజమాని గార్హపత్యాగ్నిని హోమము చేయవలెను. అందువలన అతడు హోమభాగము వలన గార్హపత్యాగ్నిని శాంతింపచేయును. అట్లాగుటచే అతనికి మరణము కలుగదు.

    6. ప్రయాణము చేయువాడు తనబండికి రెండుఎడ్లను కట్టిన పిదప గార్హపత్యాగ్ని హోమము చేయరాదు. అందువలన అతడు ప్రయాణమైన తరువాత హోమము చేసినట్లగును.

    రెండు ఎడ్లలను కట్టక పూర్వము హోమము చేయరాదు. అందువలన ప్రయాణ ప్రస్తావనమే లేనపుడు హోమము చేసినట్లగును.

    కావున బండికి కుడి ఎద్దును పూన్చి, ఎడమ ఎద్దును పూన్చక ముందు హోమము చేయవలెను. అందువలన ఉభయ దోషములు కలుగవు. గార్హ పత్యాగ్నిని శాంతింపచేసినవాడు అగును.

    7. ఒక దర్వి హోమము చేసిన దర్విహోమము అగును. దేవతా ప్రీతికిగాను 'వాస్తోష్పతే ప్రతిజానీహి' అను రోనువాక్యము ఉచ్చరించి తదుపరి 'వాస్తోష్పతేశన్మియా' ఇత్యాది యాజ్యచేత హోమము చేయును.

    8. హోమము జరుగుచున్నప్పుడు పాత్రాది గృహోపకరణములను బండికి ఎక్కించినచో రుద్ర రూపుడగు గార్హ పత్యాగ్నిని కూడ బండికి ఎక్కించవలెను.

    అగ్ని హోత్రి అగ్నిని పూర్తిగా చల్లార్చకుండ ప్రయాణము సాగించరాదు. ఆ విధముగా చేయుట యజ్ఞమును భగ్నము చేయుట, ఇల్లు తగులపెట్టుట వంటిది అగును. కావున 'అయంతే యోని' ఇత్యాది మంత్రములచే అరణులందు సమారోపణ చేయవలెను. అరణి అగ్నికి జన్మస్థానము అగుచున్నది. కావున అగ్నిని అతని జన్మస్థానమున స్థాపించినట్లగును.

    9. పక్షాంతరమున ఇట్లు చెప్పుచున్నారు:-

    అరుణులందు ఆరోపించిన అగ్ని కాలిపోవచ్చును. అరుణులు దొంగిలింపబడవచ్చును. అట్లయినచో యజమాని అగ్నిని మరల ఆధానము చేయవలెను. ఆ దోషము లేకుండుటకు యజమాని అగ్నిని తనయందే ఆరోపణ చేసికొనవలెను.

    యజమాని సహితము అగ్నికి జన్మస్థానము అగుచున్నాడు. కావున అగ్నిని తన జన్మస్థానమునందే స్థాపించినట్లగును.

                                      పదకొండవ అనువాకము

    1. అగ్నిదేవా! నీవు విద్వాంసుడవు. గృహపతివి. యువకుడవు. నీకు హవిస్సులు అర్పించువారికి దీర్ఘాయువు ప్రసాదించుచున్నావు.

    2. అగ్నీ! నీవు హవ్యవాహనుడవు. జరారహితుడవు. మాకు తండ్రివి. వ్యాపించువాడవు. భాసించువాడవు. సుదర్శనుడవు. గార్హ పత్యమునకు సమృద్ధ అన్నమును మాకు ప్రసాదించుము. మాకు ఎదురుగా విచ్చేయుము. ఎంతో దూరమునకు వినిపించు కీర్తి ప్రతిష్ఠలను కలిగించుము.

    3. సోమదేవా! నీవు ప్రియస్తోత్రవంతుడవు. అరణ్య రక్షకుడవు. మమ్ము జీవింపచేయదలచినావు. కావున మేము మరణించము.

    4. దేవతలందు బ్రహ్మశ్రేష్ఠుడు. పండితులందు వాగ్విశారదుడు శ్రేష్ఠుడు. విప్రులందు ఋషి శ్రేష్ఠుడు. మృగములందు మహిషము, పక్షులందు డేగ, వనములందు దృఢము, కాంతిగల వృక్షములు శ్రేష్ఠములు. అట్లే సోమము పవిత్రములగు కుశాదికములను మించుచున్నది.

    5. సూర్యుడు సకలదేవతలు తన ఆధీనమునందు ఉన్నవాడు. సజ్జన పాలకుడు. గొప్ప ఆదేశము లిచ్చువాడు. ఆ సూర్యుని మంచిసూక్తులచే ప్రార్థించుచున్నాము.

    6. ఆదిత్యుడు దివ్యకాంతి పుంజములవాడు. ఆవర్తమానుడు. అమృతుడు. అతడు మానవులకు ప్రకాశము కలిగించుచున్నాడు. నరులను చూచుచు బంగారు రథమున అవతరించుచున్నాడు.

    7. రుద్రుడు అవిభాజ్యుడు. అతడు మమ్ము, మా పశువులను, మా ప్రజలను, మా గోవులను, మా సంతానమును రుద్రుని వలె రక్షించుచున్నాడు. ఆ రుద్రునకు హవిస్సులు అర్పించి మేము సేవించుచున్నాము.

    8. రుద్రదేవా! నీవు కోపించకుము. మా బిడ్డలను, బిడ్డలబిడ్డలను హింసించకుము. మా ఆయువులను హింసించకుము. మా గోవులను హింసించకుము. మా అశ్వములను హింసించకుము. మా వీరులను వధించకుము.

    మేము నీకు హవిస్సులు అర్పించుచున్నాము. నమస్కరించుచున్నాము. పూజించుచున్నాము.

    9. మేము బృహస్పతిని కీర్తించుచున్నాము. మేము చేయుచున్న స్తోత్రవాణి అన్నోదకములు కల్పించునట్టినదియు, ఆయువును రక్షించునదియునగు మేఘమువలె ఉన్నది. స్తోత్రధ్వనులు మేఘ గర్జనలవలె ఉన్నవి. కొండలను తాకి నిండుగాపారు నదులవలె సంతోషము కలిగించుచున్నవి. అవి బృహస్పతి మహిమవలె ప్రకాశమానములై ఉన్నవి.

    10. పాషాణ ద్వారముల వంటి పాపములను బృహస్పతి తొలగించినాడు. మా హవిస్సులు అందుకున్నాడు. ఆనందమున కేకలు వేసినాడు. ఇంకను అతడు మా సేవలను గుర్తించినాడు. వినసొంపుగా పాటలు పాడినాడు. యతుల, ఋత్విజుల స్తుతులు విని అన్ని అడ్డంకులను తొలగించినాడు.

    11. ఇంద్రా! మాకు ధనములను, రక్షణలను తెచ్చిఇమ్ము. ఆ ధనము దానములకు చాలునది, పుత్రాదులతో కూడినది, విరోధులను సహించగలది, సదా వర్థిల్లునది అగునుగాక.

    12. పురుహూత ఇంద్రా! నీవు శత్రువును ధిక్కరించు వాడవు. ప్రశస్త బలశాలివి. ఈ కర్మయందు ఫలమును కలిగించుము. కుడిచేత ధనములను తెమ్ము. మాకిమ్ము. సముద్రమంతటి ప్రజకు నీవే స్వామివి.

    13. సుక్రతువవగు ఇంద్రా! నీవు సోమమును సేవించుటకు గాను పుట్టినంతనే పెరిగినావు. నీవు దేవతలందు గొప్పవాడవని ఇది నిరూపించినది.

    14. ఇంద్రా! నీవు స్తుతిరూప వాక్కులచే వర్థిల్లువాడవు. సకల సవనములందు యజ్ఞయోగ్యుడవు. శత్రువును నశింపచేయువాడవు. సకల మానవులకు ప్రభువువు. సకల యాగములందు ప్రార్థనీయుడవు. ప్రశస్తుడవు.

    15. మిత్రదేవుడు మానవపాలకుడు. అతని కీర్తి గొప్పది. వినదగినది. అతడు ఫలప్రదాత. యశోవంతుడు. సత్యవాదియగు మిత్ర దేవుని యజామహే.

    16. మిత్రదేవత సకల జనులను ఎరిగినవాడు. వారిని వారి వారి పనులందు నియమించువాడు. ద్యావాపృథ్వులను భరించువాడు. అతడు కర్మలు ఆచరించు మానవులను, రెప్పవాల్చని దేవతలను చూచుచున్నాడు. మిత్రదేవునకు ఘృతవంతమగు హవిస్సును అర్పించుచున్నాము.

    17. మిత్రదేవా! నీకు సంబంధించిన కర్మను అనుష్ఠించువాడు కర్మఫలయుక్తుడు అగునుగాక. నీ రక్షణలందు ఉన్నవానికి వ్యాధులు కలుగ కుండునుగాత. శత్రువుచే ఓడించబడకుండునుగాత. పాపము అతని దరికి చేరకుండునుగాక. అది దూరము నుండియే మరలిపోవునుగాత.

    18. వరుణదేవా! నీకు సంబంధించిన ఏ కొద్ది కర్మనైనను నిత్యము ఆచరించుచున్నాము.

    19. వరుణదేవా! మేము మానవ మాత్రులము. అజ్ఞానము వలన దేవతల విషయమున తప్పులు చేసి ఉండ వచ్చును. నీకు చేయవలసిన కర్మను చేసి ఉండకపోవచ్చును. ఆ రెండెంటి వలన కలిగిన పాపములకు గాను మమ్ము హింసించకుము.

    20. వరుణదేవా! ఋత్విజులు ధూర్తులయి ఉండవచ్చును. కర్మాంగమును వదలి ఉండవచ్చును. సద్వ్యవహారము చేయకుండవచ్చును. మేము తెలిసి కొన్ని, తెలియక కొన్ని పాపములు చేసి ఉండవచ్చును. మమ్ము వాని నుండి విడిపించుము. నాశము చేయుము. అప్పుడు 'తేస్యామ వరుణః ప్రియాసః' - వరుణదేవా! నీకు మేము ప్రీతిపాత్రులము అగుదుము.

            శ్రీమదాంధ్ర వచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
            మూడవ కాండము నందలి నాలుగవ ప్రపాఠకము సమాప్తము.

 Previous Page Next Page