2. ఋత్విజులు యజ్ఞవేత్తలు. మంత్రయుక్తముగ సోమమును సిద్ధము చేసినారు. వాయువా! నిన్ను స్తుతించుచున్నారు.
3. వాయువా ! నీవాక్కు శ్రవణపేయము. నీవాక్కు సోమమును వర్ణించును. నీవాక్కు సోమపానమునకు సాగును.
4. ఇంద్రవాయువులారా ! మీ కొఱకు సోమమును సిద్ధపరచినాము. సోమములు మీ కొఱకు నిరీక్షించుచున్నవి. మాకు ఆహారములు ప్రసాదించుటకు విచ్చేయుడు. సోమమును పరిగ్రహింపుడు.
5. ఇంద్రవాయువులారా ! మా కొఱకు ఆహారములను గొనిరండు. మీ కొఱకు సోమము సిద్ధముగా ఉన్నది. త్వరితగతిని విచ్చేయుడు.
6. ఇంద్రవాయువులారా ! మీ కొఱకు సోమమును సంస్కరించినాము, సిద్ధపరచినాము. మీరు ఉభయులు మానవ రూపములు దాల్చి విచ్చేయుడు. మీ యజ్ఞము సంపూర్ణము అగును.
7. పవిత్రమగు బలము కలవాడు మిత్రుడు. శత్రువును హింసించగలవాడు వరుణుడు. ఉభయులు వర్షము కురిపించగలవారు. మిమ్ము ఆహ్వానించుచున్నాను.
8. మిత్రావరుణులారా ! మీరు జలధరులు, నీటిని ధరించువారు, వర్షమును కురిపించువారు. మీరు ఉభయులు ఈ మహాయజ్ఞమునకు విచ్చేయుడు. క్రతుం బృంహంత మాశాథే.
9. మిత్రావరుణులారా ! మీరు మేధావంతులు. ఉపకార స్వభావము కలవారు. మంచి నివాసములు గలవారు. మీరు మా బలమును, యత్నములను వృద్ధిచేయుడు.
ఆలోచనామృతము :
1. అన్వేషణము అనంతము, నిరంతరము. నవీనములను ఎరుగుటయే అన్వేషణము. అగ్నియే సమస్తము అని అగ్నిని ఉపాసించినాడు. వాయువు, వర్షము సహితము జీవమునకు ఆధారములు అగును. వాయువు, జలము శక్తి ఉత్పత్తికి కారణములు అగును. ఏ ఒక్కటీ సమస్త జీవమునకు ఆధారముకాదు. ఒక్కొక్కదానిని వివరించుచున్నాడు.
2. వాయువులు, మరుత్తులు జీవహేతువులు. మరుత్తులకు మెరిసిపోవు ఆయుధములు-- మెరుపులు; వేగవంతములయిన రథములు- ఉరుములు; విలువయిన ఆభరణము-ఇంద్ర ధనుస్సులు ఉన్నవి. వాయువులు వర్షకారకములు.
3. ఇంద్రుడు : ఇంద్రజ్యేష్ఠో మరుద్గణ: ఇంద్రుడు మరుత్తులకు అన్న అగును.
య ఇందతి పరమైశ్వర్యాన్ భవతి స ఇంద్రః సకల ఐశ్వర్యములు కలవాడు. అతనిని మించిన ఐశ్వర్యవంతుడు లేడు. ఇంద్రుడు జ్ఞానవంతుడు, బలవంతుడు.
ఇంద్రచ్ఛత్రూణాం దారయితావా ద్రావయితావా ఇంద్రుడు శత్రువులను నాశనము చేయువాడు. పారద్రోలువాడు. ఈ శత్రువులు బాహిరములు కావచ్చును. ఆంతరికములు కావచ్చును.
ఇంద్రుడు "శతక్రతు" నూరు క్రతువులు చేసినవాడు. కర్మ ఫలాపేక్షగలది క్రతువు. ఫలాపేక్ష రహితమైనది, నూటికి నూరుపాళ్ళు ఫలాపేక్షలేనిది క్రతువు.
ఇంద్రుడు వర్షాధిదేవత, జ్ఞానాధిదేవత, ఆనందాధిదేవత.
4. మిత్రుడు : "పూతదక్షం" పవిత్రమైన బలము కలవాడు. మంచి పనులకు మాత్రము ఉపయోగపడునట్టి బలము కలవాడు. మేదయతి, స్నిహయతి, స్నేహయతే నా సమిత్రః ప్రేమించువాడు, స్నేహించువాడు, స్నేహము కనబరచువాడు మిత్రుడు.
5. వరుణుడు : 'వర్ణే' ఎన్నుకొనువాడు. శిష్టైర్ముముక్షుభిర్విప్రియతే వా స వరుణః శిష్టులు తమ యజ్ఞములకు ఆరాధనలకు ఎన్నుకున్నవాడు వరుణుడు. ఎన్నుకున్నవారిని మాత్రమే, శిష్టులను మాత్రమే అనుగ్రహించువాడు వరుణుడు. వరుణుడు సకల సంపదలు కలవాడు. పూజనీయుడు. అతడు వరుణరాజు.
6. సోమము : సోమము సూర్యుడు అగును. చంద్రుడు అగును. ప్రకాశమునకు సూర్యుడు, సౌందర్యమునకు చంద్రుడు అగును. ఇది సకల దాహములకు, బాధలకు వ్యాధులకు నివారకమగు జ్ఞాన విజ్ఞానామృతము. ఈ అమృతమును ఎరిగినవారు ఆనందమయులు.
సోమము ఒక ఓషధి. అది మాదకము, పుష్టివర్ధకము. ఈ ఓషధి ఆకులు చంద్రుని పెరుగుటను బట్టి పెరుగును. తరుగుటను బట్టి తరుగును. ఈ ఓషధిని రాతిమీద నూరి చేయు పానీయము సోమరసము. సోమరసము దేవతలకు ప్రియమయిన పానీయము. యజ్ఞములందు సోమము సిద్ధముచేసి దేవతలకు అర్పింతురు.
అతిథికి ప్రియమయినది ఎరిగి అర్పించుట యజమాని ధర్మము. కర్తవ్యము.
7. మిత్రుడు ఎటువంటివాడు కావలెనో ఉపదేశించినాడు. మిత్రుడు బలము గలవాడు, శత్రువును దూరము చేయగలవాడు, హర్షము కలిగించువాడు కావలెను.
అటువంటి మిత్రులు ఉన్న జీవితము సుఖప్రదము అగును. జీవితమును సుఖప్రదము చేయుటయే వేదము యొక్క ప్రధాన లక్ష్యము.
మూడవ సూక్తము - ఋషి - వైశ్యామిత్ర మధుచ్ఛందుడు,
దేవతలు 1-3 అశ్వినీదేవతలు, 4-6 ఇంద్రుడు, 7-9 విశ్వేదేవతలు,
10-12 సరస్వతి, ఛందస్సు - గాయత్రి.
1. అశ్వినులారా ! మీవి దీర్ఘబాహువులు. హవిస్సులు అందుకొనుటకు మీ చేతులు ఆరాటపడుచున్నవి. మీరు శుభస్పతీ - శుభకర్మములను కాపాడువారు. హవిస్సులు ఆరగించుటకు విచ్చేయుడు.
2. అశ్వినులారా ! మీరు బహు కర్మలు గలవారు. నాయకులు. మేధావులు. ఆదరబుద్ధితో మాస్తుతులను స్వీకరించుడు.
3. అశ్వినులారా! మీరు సత్యవంతులు. వీరవంతులు. మీ కొఱకు స్వచ్చమయిన సోమరసము సిద్ధపరచినాము. రండు. సోమమును స్వీకరించుడు.
4. ఇంద్రా ! నీవు చిత్రభానువు. వింతకాంతులు గలవాడవు. నీకు ఇష్టమగు సోమమును చక్కగా సిద్ధపరచినాము. ఆయా హి రమ్ము.
5. ఇంద్రా ! బుద్ధిమంతులగు ఋత్విజుల ప్రేరణమున మంచి సోమము ఏర్పరచినాము. విప్రులు వేదమంత్రముల నిన్ను ఆహ్వానించుచున్నారు. ఆయా హి రమ్ము.
6. ఇంద్రా ! నీవు అశ్వములు గలవాడవు. త్వరగా రమ్ము. యజ్ఞములందు అభిషవించిన సోమము ఉన్నది. దధిష్వ స్వీకరించుము.
7. విశ్వేదేవతలారా ! మీరు మాకు రక్షకులు, పోషకులు, ఫలప్రదాతలు. హవిస్సులు అర్పించుచున్నాము. రండు. స్వీకరింపుడు.
8. విశ్వేదేవతలారా ! సూర్యరశ్మి వెలుగులు పరచినంత త్వరగా, గోవులు గోష్ఠములకు తరలునంత త్వరగా సోమమును స్వీకరించుటకు రారండు.
9. విశ్వేదేవతలు క్షయరహితులు. సర్వవ్యాపకులు. ద్రోహచింతలేనివారు. సర్వము వహించునారు. వారు మా హవిస్సులను అందుకొనరావలెను.
10. సరస్వతి పవిత్రత కలిగించును. అన్నమయ కర్మల చేయించును. కర్మలను అనుసరించి ధనమును ప్రసాదించును. అట్టి సరస్వతి మేము అందించు హవిస్సులను అందుకొని మా యజ్ఞములను ఫలప్రదము చేయవలెను.
11. ప్రియ వాక్యములు పలుకునట్లు, శుభకర్మములు చేయునట్లు మమ్ము ప్రోత్సహించునట్టి సరస్వతి మా యజ్ఞమును ధరించవలెను. యజ్ఞం దధే సరస్వతీ.
12. సరస్వతి కర్మరూప ప్రవాహమగు మహార్ణవమును జ్ఞానరూపమున ప్రకాశింపజేయును. ధియో విశ్వా విరాజతి సకల ప్రజ్ఞలను వికసింపచేయును.
(ప్రథమ మండలమున మొదటి అనువాకము సమాప్తము.)
ఆలోచనామృతము :
1. భౌతిక జీవితమునకు అవసరములయిన అగ్ని వర్షాదులను స్తుతించి, వైద్యమును విద్యను స్తుతించుచున్నాడు. ఇది క్రమ పరిణామము. సక్రమ ప్రగతి, అభ్యుదయము.
2. అశ్వినులు కవలలు, సూర్యుని పుత్రులు, ఆరోగ్యదేవతలు, వైద్యులు, వీరు జంట దేవతలు. ఒంటరిగా ఉండరు. వైద్యము శారీరకము, మానసికము కలిసి జరుగవలసి ఉన్నది. ఈ సత్యమును వేదము వెల్లడించినది. ఆధునిక వైద్యము ఇంకను ఎరుగవలసి ఉన్నది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములను మన వైద్యము గుర్తించవలసి ఉన్నది. అస్తిపంజరమును కాదు, మనసుగల మనిషిని అధ్యయనము చేయవలసి ఉన్నది.
అశ్వినులు రోగులకు ఆరోగ్యమును, వృద్ధులకు శక్తిని, అవిటివారికి అవయవములను ఇచ్చువారు. శారీరక బలమును, మనోబలమును, ఆత్మ బలమును అందించువారు.
అశ్వినుల రథములు అతివేగవంతములు. మనోజవా అశ్వినా వాతరంహ అని మనోవేగము, అశ్వవేగము, వాయువేగము కలవి. వారు తమ రథమున మానవునకు ఆరోగ్యదములు, ఆయుష్యదములు, ఆనందకరములు తెచ్చెదరు. ఆధునిక అంబులెన్సులు వేగవంతములు అగును.
3. విశ్వేదేవతలు : అశ్వినులది ద్వివచనము. విశ్వేదేవతలది బహువచనము. ప్రకృతి శక్తులు అనంతములు. వాటిని కనుగొనుట, లెక్కించుట అసాధ్యము. అగ్ని, వాయువు, అంతరిక్షము మున్నగునవి కనిపించునవి, ప్రధానములు. కనిపించనివి అనేకములు, వారే విశ్వేదేవతలు. విశ్వమునందు అంతటను ఉన్నదేవతలు అని అర్థము.
4. సరస్వతి వాగ్దేవి. చదువుల తల్లి. సరస్వతి అని ఒకనది కూడ ఉండెను. వేదకాలమున యజ్ఞయాగాదులు సరస్వతీ తీరముననే ఎక్కువగా జరిగినవి. గంగా యమునా సరస్వతీ సంగమముగల ప్రయాగ పవిత్ర క్షేత్రము. నేడు గంగ, యమునలు కనిపించుచున్నవి. సరస్వతి అంతర్థానమైనది. నేడు సరస్వతిని అంతర్వాహినిగా పేర్కొనుచున్నారు.
నదులు పుట్టుట, అంతరించుట సహజ పరిణామము. సరస్వతీనది పూర్వము ప్రవహించిన జాడలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
5. విద్య నదివలె ఉండవలెనని వేదము వచించుచున్నది. అది ఎంతటి సత్యము.
విద్య ఒకచోట ఉండరాదు. ప్రవాహించవలెను. విద్య నదివలె సమస్త జనులకు ఉపయోగపడవలెను. నది సాగరమున కలియునను జ్ఞానము ప్రసాదించునది విద్యయగును. విశ్వాః ధియా విరాజతి లోకమునందలి సమస్త ప్రజ్ఞలను ప్రకాశింప జేయునది విద్య. సరస్వతి.
రెండవ అనువాకము-నాలుగవ సూక్తము-ఋషి-వైశ్వామిత్ర మధుచ్ఛందుడు,
దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి.
1. పాలు ఇచ్చునట్టి మంచి గోవును పాలుపితుకువాడు పిలుచును. గోవు వెంటనే అతనివద్దకు చేరును. ఇంద్రుడు మంచి రూపము గలవాడు. సత్కర్మలను ఆచరించువాడు. ఇంద్రుని మేము ప్రతి నిత్యము ఆహ్వానించుచున్నాము. మమ్ము రక్షించుమని ప్రార్థించుచున్నాము.
2. ఇంద్రా ! నీవు సోమరస ప్రియుడవు. నీవు మా యజ్ఞములకు రమ్ము. సోమపానము చేయుము. నీవు ఆనందించిన మాకు గోసంపద కలుగును.
3. ఇంద్రా ! నీవు సోమపానము చేయుము. అప్పుడు మేము నీవద్ద మంచి బుద్ధులు నేర్చుకొందుము. నీవు మాకు దూరము కాకుము. ఆగహి రారమ్ము.
4. ఇంద్రుడు విద్వాంసుడు. మేధావి. హింసారహితుడు. నీవు ఇంద్రుని వద్దకు వెళ్లుము. మా హోత నిన్ను సక్రమముగా స్తుతించినాడా? లేదా? అని ఇంద్రుని అడుగుము.
(యజ్ఞము చేయించు హోత కార్యము యజమాని ఎరుగడు. అందువలన తన పనిని గురించి అడుగవలసినదని హోత యజమానిని ఇంద్రుని వద్దకు పంపుచున్నాడు.)
5. ఇంద్రుని విషయమున భక్తి శ్రద్ధలు కలవారు ఇంద్రుని స్తుతించుచున్నారు. ఇంద్రుని నిందించువారు ఇంద్రుని నిందించువారు ఇట నిలువరాదు. అన్యస్థలములకు చేరవలెను.
6. ఇంద్రా ! నీవు శత్రువులను పరిహరించువాడవు. నీ దయవలన మా శత్రువులు సహితము మమ్ము సంపన్నులముగా స్తుతింతురు. మేము ఇంద్రుడు ప్రసాదించిన సుఖసంపదలు కలిగి ఉందుము.
7. సోమము సవనత్రయమున వ్యాపించినది. యజ్ఞసంపద్రూపమయినది. హర్షము కలిగించునది. కర్మలు చేయించునది. యజమానీ! ఇట్టి సోమమును ఇంద్రునకు ఇమ్ము.
8. ఇంద్రా ! ఈ సోమమును పానము చేయుము. వృత్రులను, శత్రువులను వధింపుము. యుద్ధముందున్న మమ్ము రక్షింపుము.