"అదేలే ఏకపాదం. బండి దిగినవాడు మళ్ళీ ఎక్కలేదు. బండి బైలుదేరి అయిదు నిమిషాలు కావస్తున్నది."
"పక్క గదుల్లో చూశారా?"
"ఆ.....అన్ని తలుపులు తెరిచే వున్నాయి. ఏకపాదం లేడు."
"పక్క పెట్టెలో ఎక్కాడేమో?"
"అలానూ అనుకోవచ్చు. బండి ఆగటం ఆలస్యం బండి దిగేవాడు, బండి బైలుదేరటం ఆలస్యం బండి ఎక్కేవాడు. బండి బయలుదేరేముందు ఎక్కటానికి ప్రయత్నించి వుంటాడు. ఈ పెట్టె బదులు పక్కపెట్టె అందుకుని వుంటాడు. ఎక్కడికీ పోడు. వాడి పెట్టె ఈ పెట్టెలో వుందికదా?"
"ఏమండోయ్__!" ఒక్క గావుకేక పెట్టింది వెంకుమాంబ.
"ఏమిటే. ఏమొచ్చింది? ఏమయింది?" కోదండరామయ్య కంగారు పడుతూ అడిగాడు.
"నా కొకటి గుర్తుకొచ్చింది."
"వస్తేరంకె పెట్టాలా?"
"నేను రంకె పెట్టలేదు, గాండ్రించనూ లేదు."
"సరేలే-విషయం చెప్పు."
"ఏకపాదం మన పెట్టెలోనే ఎక్కాడు."
"ఎక్కడా? ఏడి మరి?"
"లావెట్రీలో వుంటాడు. తలుపు లాగి చూడండి."
వెంకుమాంబ చెప్పింది నిజమే ననిపించింది కోదండరామయ్యకి మారు మాట్లాడకుండా లేచి వెళ్ళి ఆ కంపార్టుమెంట్ కి అటూ యిటూ వున్న రెండు లావెట్రీలకి వెళ్ళి చూసివచ్చాడు.
"ఉన్నాడా?" ఆతృతగా అడిగింది వెంకుమాంబ.
"ఆ....." ముక్తసరిగా అన్నాడు కోదండరామయ్య.
"నే చెప్పలేదూ? అవసర నిమిత్తం దానిలో దూరి వుంటాడు. రామతులశమ్మ కథలా అనుకుంటే అయిందా?"
"రామాతులశమ్మా! అదేం కథ?"
"సుందరమ్మగారి తోడికోడలి మేనత్త మనమరాలి రెండో వియ్యపురాలు రామతులశమ్మ. ఆమెకి తల చెడింది. మాటల సందర్భంలో "పెళ్ళి ఎప్పుడు అయింది. భర్త ఎప్పుడు పోయాడు" అని అడిగాను. తాళి కట్టింది తెలియదు. తాళి తెంపింది తెలియదు అంది."
"మరీ విచిత్రం. ఆమెకి కథలు రాయటంరాక చెప్పటం మొదలు పెడుతున్నదేమో?"
"మరీ విదూరంగా మాట్లాడకండి. ఏడో ఏట పెళ్ళి అయిందిట. పెళ్ళయి వారం తిరక్కముందే భర్త పోయాడుట. ఆ పరిస్థితులలో తాళి కట్టింది తెలియదు, తాళి తెంపింది తెలియదు అంది తప్పా?"
"ఆవిడ తల రాతకి ఎవరినని తప్పుపడతాములే."
"అవునూ, మాటల్లో పడి మార్చేపోయాము. ఏకపాదం దానిలోంచి వచ్చాడా?"
"రాడు" కోదండరామయ్య ముక్తసరిగా చెప్పాడు.
"అదేమి?" వెంకుమాంబ ఆశ్చర్యపోతూ అడిగింది.
"లేడు కాబట్టి."
5
గంట గడిచిపోయింది.
భర్త తనతో పరాచికం, ఎగతాళి చేసేసరికి వెంకుమాంబకు కోపం వచ్చింది. మూతి ముడిచి కూర్చుంది.