Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 6

    "అదే అంటే?"

    "అదే."

    వాళ్ళలా మాట్లాడుకోవటం మామూలే. కొద్దిసేపు అలవాటు ప్రకారం మాట్లాడుకొని విషయంలోకి వచ్చారు.

    "స్టేషను వచ్చీ రావటంతోనే అతను దిగుతున్నాడు. ఆ విషయం గమనించావా వెంకూ?"

    "అదీ గమనించేను, ఇంకొకటీ గమనించాను" గొప్పగా చెప్పింది వెంకుమాంబ.

    "ఇంకొకటా? ఏమిటది?"

    స్టేషనులో బండి ఆగగానే దిగుతాడు, బండి బయలుదేరంగానే ఎక్కుతాడు."

    "ఇదేనా నీవు కనిపెట్టింది?"

    "ఇదే. ఏమొచ్చింది?"

    "ఏమీ రాలేదు. బండి దిగినవాడు బండి ఎక్కకుండా ఎలా వుంటాడు? పైగా పెట్టే లోపలేవుంది."

    "నేను యింకొకటి కనిపెట్టాను." వళ్ళుమండి నోటి కొచ్చింది అంది వెంకుమాంబ.

    "ఏమిటది?" కోదండరామయ్య ఆతృతగా అడిగాడు.

    "ఇందాక వ్యంగ్యంగా అన్నారుగా యిదేనా నీవు కనిపెట్టింది అని__ అదేదో మీరే వూహించుకోండి. తెలివి కలవారు కదా!"

    "నా తెలివిని నీవు శంకించక్కరలేదోయ్ భార్యామణీ! అది నాకు అప్పుడే తెలుసు."

    "అదేమిటో చెప్పి మాట్లాడాలి."

    "మళ్ళీ శంక! సరే విను. తను ప్రయాణమయి వస్తుంటే తాతగారు తన స్నేహితుడికి పెట్టె ఇమ్మని అంటగట్టారని ఏకపాదం చెప్పాడు. సరే ఆ మాట నిజమేననుకుందాము. అది తన పెట్టె కాదు. మరి తనకంటూ ఓ బ్యాగ్ వుండాలికదా? ఆఖరికి చంకన తగిలించుకునే గుడ్డ సంచీ కూడా లేదు. ఇదీ నేను కనిపెట్టింది."

    "ఓసోన్! అదీ కనిపెట్టాను నేను. ఇదో పెద్ద మిస్టరీ అయినట్టు నాకు హరికథ వినిపిస్తున్నారు" చేతులు తిప్పుతూ అంది వెంకుమాంబ.
    "ఇహ మనం కనిపెట్టాల్సిందే__ఆ పెట్టెలో ఏమున్నదీ అన్నది" కోదండరామయ్య అన్నాడు.

    "అది ఈ జన్మకి సాధ్యం కాదు."

    "నిజమే." వప్పుకున్నాడు కోదండరామయ్య.

    ఈ తఫా తొందరగానే బందీ బైలుదేరింది.

    సంభాషణ మార్చేశారు దంపతులు.

    "అసలు నన్నడిగితే దేముడులేని ప్రదేశం వుందా అంటాను" అంది వెంకుమాంబ.

    "ఈ మాట పనిగట్టుకుని నిన్ను అడగక్కరలేదు. ఎవరిని కదిలించినా చెపుతారు. ఇందుగల డందు లేదు అన్న సందేహము వలదు అని....."

    "ఆహా! అలాంటప్పుడు పుణ్యక్షేత్రాలకి బయలుదేరింది దేనికట?"

    "పాపం పోవటానికి."

    "ఎవరి పాపం?"

    "చేసుకున్న వారి పాపం."

    "ఓహ్!" అని మిన్నకుండిపోయింది వెంకుమాంబ.

    కోదండరామయ్య మౌనం వహించాడు.

    మూడు నిమిషాల తర్వాత__

    కోదండరామయ్య సీటులోంచి లేస్తుంటే "ఎక్కడికి లేచారు?" అంది వెంకుమాంబ.

    ఆయన అవసర నిమిత్తం లావెట్రీకయినా సరే లేస్తే చాలు, 'ఎక్కడికి?' అని అడుగుతుంది ఆమె. ఫలానా నిమిత్తం అని చెపుతాడు ఆయన. 'నేనూ అదే అనుకున్నాను' అంటుంది ఆమె.

    అలాగే ఇప్పుడు కూడా అడిగింది వెంకుమాంబ.

    ఫలానా నిమిత్తం అని చెప్పలేదు. "ఉండు" అని చెప్పి బైటికి వెళ్ళి కంపార్టుమెంటు మొత్తం చూసి వచ్చాడు. అనుమాన నివృత్తి అయింది. ఆదరాబాదరాగా లోపలికి వచ్చాడు.  

 Previous Page Next Page