"శివస్వామిగారి కోసమా? నాడీ జ్యోతిష్యమా! చెప్పేరు కారేం. ఎక్కడి నుండి వచ్చారు? ఇప్పుడు యింత అర్థరాత్రివేళ? మీరు ఈ రాత్రికి ఈ హోటల్లో ఓ రూమ్ తీసుకొని శుభ్రంగా పడుకోండి. తెల్లవారుజామునే లేచి వారి దగ్గరకు వెళ్ళండి. అయినా రెండు మూడు రోజుల ముందు మీ పేరు రిజిష్టర్ చేసుకోవాలి. ఇంత అర్జెంట్ గా వచ్చి చెప్పమంటే కుదరదు.
అమెరికా నుంచి, కెనడా నుంచి, యూరప్ దేశాల నుంచి ఆయనకోసం వచ్చి వారం పదిరోజులు పడిగాపులు పడితేనే తప్ప ఆయన దర్శనం దొరకదు" గడగడా తమిళంలోనూ, తెలుగులోనూ ఆపకుండా చెప్పాడు కౌంటర్ లోని వ్యక్తి.
చిన్నగా నవ్వుకున్నాడా వ్యక్తి లోలోనే.
"శివస్వామిగారి ఇల్లెక్కడ?"
"ఇల్లా? ఇల్లెందుకు? ఆయన్ని కలవడానికి అసలు వీల్లేదు. అది..." అంటూ ఇంకేదో చెప్పబోయాడు కౌంటర్ లోని వ్యక్తి.
"ష్... ఎక్కువ మాట్లాడకు. ఇంతకీ ఆయన ఇల్లెక్కడ?" మళ్ళీ అదే ప్రశ్న వేశాడాయన.
ఆయన ముఖంలోకి సూటిగా చూసి ఏదో అద్వితీయ ప్రకంపనకు లోనయినవాడిలా చేష్టలుడిగి పోయి అలా చూస్తూ- తను చెప్పదలుచుకున్నది చెప్పలేక ఓ విధమైన భయోద్వేగానికి లోనయ్యాడు.
ఆ వ్యక్తి తిరిగి రెట్టించాడు అదే ప్రశ్నను.
"ఈ హోటల్ క్రిందిభాగంలోనే శివస్వామిగారుంటారు. కానీ ఈ సమయంలో...." అంటూ కౌంటర్ లోని వ్యక్తి అతి ప్రయత్నంమీద ఏదో చెప్పబోతుండగనే.... వెనుదిరిగాడాయన.
మెట్లు దిగుతున్న ఆ వ్యక్తివైపు కంగారుగా చూస్తూ ముందు కొచ్చాడు కౌంటర్ లోని వ్యక్తి. శివస్వామిని ఆ అపరాత్రి వేళయినా లేపక తప్పదని.
* * * *
రుద్రాక్షమానుతో చేసిన పాతకాలపు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తలుపు తెరుచుకోవడం, లైటు వెలగడం రెండూ ఒకేసారి జరిగాయి.
తలుపు తెరిచిన శివస్వామి ఎదురుగా నుంచున్న ఆజానుబాహుడైన వ్యక్తివైపు ఆ ధవళ వర్చస్సువైపు, ఆ కళ్ళ వెనుక ప్రస్ఫుటంగా కనిపిస్తున్న కాంతివైపు కన్నార్పకుండా చూశాడు కొద్దిక్షణాలు.
శివస్వామికి దాదాపు ఏభయ్ ఆరేళ్లుంటాయి. గాఢనిద్రలోంచి లేచి బయటకొచ్చిన ఆయనకు అది కలో భ్రాంతో అర్థం కాలేదు.
"నేను శివస్వామిని కలవడానికి హైదరాబాద్ నుండి వచ్చాను" మేఘ గర్జనలాంటి ఆ వ్యక్తి గొంతుకి వులిక్కిపడ్డాడు శివస్వామి.
"నేను శివస్వామిని. రండి లోనికి రండి" అంటూ నడిచాడు శివస్వామి. నిజానికి శివస్వామిలో అసహనం, అహం ఒకదానికొకటి క్షణం పోటీపడుతుంటాయి. నాడీ జ్యోతిష్యం మీద ఆయనకున్న అపారమైన పట్టు మూలంగానే అవి ఆయనలో చోటు చేసుకొని వుండవచ్చు. మరొకరయితే అగ్రహావేశాలతో వచ్చిన వ్యక్తి మీదకు దూకేవాడే. కానెందుకు ఆ సమయంలో ఆ పని చేయలేకపోయాడు.
లోనహాలు, హాలుగోడలు లైటువెలుగులో అట్టహాసంగా మెరుస్తున్నాయి. గోడలకు మూడువైపులా ఋషుల్లాంటి వ్యక్తుల పెయింటింగ్స్, రాష్ట్రపతి, ప్రధానమంత్రి తదితరులతో శివస్వామి ఫోటోలు.
"కూర్చోండి" అక్కడ వేసివున్న కర్ర కుర్చీని చూబెడుతూ అన్నాడు శివస్వామి.
"నేను మీ కోసం చాలా దూరంనుండి వచ్చాను"
"అవును. చెప్పారుగదా హైదరాబాద్...." అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు శివస్వామి.
"హైద్రాబాద్ నా దేహానికి ఒక తాత్కాలికమైన చిరునామా మాత్రమే" అన్నాడా వ్యక్తి గంభీరంగా.
శివస్వామికి ఆ మాటల్లో ఏదో మర్మం దాగివున్నట్లనిపించింది. మరయితే ఎక్కడి నుండి వచ్చినట్లు?
"నిజానికి నేనొచ్చింది జననం నుంచి. నేను బిందువుగా మారిన ప్రాణి అస్తిత్వ స్వరూపం నుండి నడిచొచ్చాను. సుదీర్ఘమైన ప్రయాణం కదూ?" చిన్నగా నవ్వాడాయన తెల్లటి గెడ్డాన్ని నిమురుకుంటూ.
ఆయన చెబుతున్నది ఏమిటో శివస్వామికి అసలు అర్థంకాలేదు. అందుకే కొద్దిక్షణాలు శివస్వామి మౌనంగా వుండిపోయాడు.
"ఆశ్చర్యం నుంచి, అనుమానాల నుంచి, అర్థంకాని యోమయపు ప్రపంచం నుంచి మీరు త్వరగా తేరుకోండి. కాలం చాలా విలువైనది. నాకిప్పుడు మీరు నాడీజ్యోతిష్యం చెప్పాల్సి వుంటుంది" అన్నాడాయన మృదు గంభీరంగా.
"నాక్కొంచెం రూల్స్ వున్నాయి రాత్రిపూట నేను ఎవర్నీ చూడను. నా కార్యక్రమం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొదలవుతుంది. అయినా రేపు, ఎల్లుండి నేను చూడాల్సినవాళ్ళు చాలామంది వున్నారు. ఐమీన్ ఎడ్వాన్స్ గా పేర్లను రిజిష్టర్ చేయించుకున్నవాళ్ళు..." చెప్పాడు శివస్వామి తనలో రేగుతున్న అసహనాన్ని అణుచుకుంటూ.
శివస్వామి వైపు ఎగాదిగా చూశాడు ఆ వ్యక్తి.
"శివస్వామిగారూ! కాలం బహు విలువైనది. పగలయినా, రాత్రయినా పరమాత్మకు ఒక్కటే అనుకొంటాను. మీలాంటి జ్యోతిష్య శాస్త్రవేత్తలు రాత్రి విశిష్టతను గమనించక పోవటం విచిత్రమే" అంటూ శివస్వామి కళ్ళవైపు సూటిగా చూస్తూ, "మీ ఫీజెంత?" అడిగాడా వ్యక్తి.
"ఫీజు... ఫీజంటే అది మా దైనందిన జీవితంలో...." ఏదో చెప్పబోయాడు శివస్వామి.
కానప్పటికే శివస్వామి తన ఎదురుగా వున్న వ్యక్తి మెస్మరిక్ స్పెల్ తో పడిపోయి తనమీద తనే నియంత్రణని కోల్పోయాడు.
"ఒక వ్యక్తికి సంబంధించిన భూత, వర్తమానాలను నాడీశాస్త్రం ఆధారంగా చెప్పడానికి మీరేం తీసుకుంటారు?" అని అడిగాడా వ్యక్తి.
చెప్పాడు వెంటనే శివస్వామి.
ఆ ఆజానుబాహుడి కుడిచేయి లాల్చీ జేబులో కెళ్ళింది. ఆ వెంటనే జేబులోంచి పైకొచ్చిన ఆచేతివైపు, ఆ చేతిలో మెరుస్తున్న రెండు సరికొత్త కరెన్సీ బండిల్స్ వైపు దిగ్భ్రాంతిగా చూశాడు శివస్వామి.
ఆ వ్యక్తి చేతిలో ఐదొందల రూపాయల నోట్ల బండిల్స్ రెండున్నాయి. అంటే లక్షరూపాయలు.
నిజమేనా....!
లేక తను చూస్తున్నది కలా?!
శివస్వామి ఆ దిగ్ర్భాంతి నుంచి తేరుకొనేలోపే- ఆ వ్యక్తి శివస్వామిని చదివేసినట్లు మాట్లాడసాగాడు.
"లక్షరూపాయలు... డబ్బుతో మిమ్మల్ని వశం చేసుకోవడానికి లక్ష రూపాయలు మీకివ్వడం లేదు. నా టైమ్ కి మీరు విలువనిస్తారనే యిస్తున్నాను"
శివస్వామికి గొంతు తడారిపోయింది.
"డబ్బు కోసం కాదు- మీ టైంకి విలువనివ్వడం యిష్టంలేక కాదు- ఇంత చలిరాత్రి... మీరు కోరుకున్నది నేను చెప్పే ముందు కోనేట్లో స్నానం, పూజ.... వగైరాలు..." అంటూ ఆగాడు.
"స్నానం.... పూజలే నిష్టకు యోగత్వానికి నిదర్శనమా మహాశయా?" మంద్రంగా ప్రశ్నించాడు.
"మీరు నాస్తికులా?" ప్రశ్నించాడు శివస్వామి.
"భగవంతుడు నాస్తికుడా?" చిన్నగా నవ్వుతూ బదులిచ్చాడు ఆ వ్యక్తి.
ప్రశ్నకు, ప్రశ్నరూపంలోనే సంక్లిష్టమైన సమాధానం. ఆ వ్యక్తి సామాన్యమైనవాడు కాదనిపించింది.