"వేడిగా ఏమున్నాయ్" అన్నాడు తిరిగి.
"అర్ధరాత్రప్పుడు వేడిగా ఏం వుంటాయ్" ఎదురు ప్రశ్న వేసింది శృతి.
"టీ, కాఫీ....హార్లిక్స్ బ్రూ, బోర్స్వీటా....."
"ఇది కాఫీ హొటలు కాదు. మంచినీళ్ళున్నాయి నాలుగు బిందెలు."
"పోనీ అన్నం వుందా?"
"ఒక్క మెతుకు లేదు."
"ఒక మెతుకు లేకుండా ఊడ్చిపెట్టుకు తినేశారా ఏమిటి మీ అన్నా చెల్లెళ్ళు?"
"ఇవాళ శినివారం ఇద్దరం హొటల్ నుంచి ఇడ్లీ తెప్పించుకు తిన్నాము."
"ఐ సీ నేనడగడమే తడవుగా తడుముకోకుండా జవాబిస్తూన్నావ్? ఐ.ఏ.ఎస్. పరీక్ష కెళితే ఫస్టున పాసవుతావ్?"
శృతి అతని పొగడ్తకి పొంగి పోలేదు.
"కాస్త ఆలోచించి చూడు శృతీ! నాగురించి నీకేం భయం అక్కరలేదు. నేనే పట్టుబడతాననే భయంతో ఇక్కడాగిపోయాను. నిన్న ఉదయం చేసిన భోజనం. ఇప్పటికి తీరుబడి అయింది. అందుకే ఆకలి గుర్తుకు వచ్చింది. నా ఆకలి తీరే మార్గం ఏదో నువ్వే చూద్దూ?" అన్నాడు మురారి దేముడు.
ఇలాంటివాళ్ళు ఆకలి దాహం అన్నారంటే అది మామూలు ఆకలి కాదని శృతి చాలా నవలల్లో చదివింది. అతని ఆకలి ఎలాంటిదో తెలియదు. పైకి మంచిగానే మాట్లాడుతున్నాడుగాని మంచివాడెందుకయింది? ఇతనో దొంగ' ఖూనీకోరు.
"గుడ్ నాకో ఐడియా వచ్చింది. తెల్లారి మజ్జిగ కోసం పాలు తోడేసి వుంటావుకదా? ఈసరికి పాలు తోడుకుని వుంటాయి. ఓ గ్లాసెడు పెరుగో, మజ్జిగో ఇవ్వు. అదీ లేదంటే నేనే లేచి ఇల్లంతా గాలించి తినదగింవి ఏం కనబడ్డా తినికాస్త కడుపు చల్లబర్చుకుంటాను."
"మజ్జిగ వుంది. అని గిర్రున తిరిగి వంటగదిలోకి వెళ్ళింది శృతి. అతనికి నిజంగానే ఆకలేస్తున్నదని గ్రహించింది. ఆడదాని స్వభావంలో జాలి ఓ భాగం. నిజంగా అతనిపై జాలేసింది. వంటింట్లో షెల్ఫు లోంచి మజ్జిగ గిన్నె తీస్తుంటే బిస్కెట్ల పొట్లం కనిపించింది. తినడానికి కొనిపెట్టుకున్నదే ఆ పొట్లం. ప్లేటులో అరడజను బిస్కెట్లు పెట్టి గ్లాసునిండా మజ్జిగ తీసుకుని ముందుగదిలోకి వచ్చింది.
"అన్నమూ కాఫీ అడిగాగాని బిస్కెట్లసంగతి మర్చిపోయాను. బిస్కెట్లు తినే బుల్లి పాపాయిలున్నారా ఏమిటి మీ ఇంట్లో" శృతి చేతిలోంచి ప్లేటు తీసుకుంటూ అడిగాడు.
అతనో బిస్కెట్టు తిన్నదాకా ఆగి "బుల్లిపాపాయిలే బిస్కెట్లు తింటారు. పెద్దలు ఇవి తినటానికి నిషిద్దం అనుకుంటే అలా అనుకునేవారు పరమ మూర్ఖులనుకోవాలి" అంది శృతి.
మురారిదేముడు మౌనంగా భుజాలెగరేసి ఊరుకున్నాడు.
చేతలతో అతన్ని గెలవలేనని మాటలతో వీలయినంతగా రెచ్చగొట్టి కసి తీర్చుకోవాలనుకుంది శృతి. కాని అతనుమాత్రం రెండాకులు ఎక్కువే చదివినట్లు ప్రవర్తించడంతో నీరసం వచ్చేసింది శృతికి.
బిస్కెట్లు తిని మజ్జిగ తాగి "థాంక్స్" అన్నాడు మురారిదేముడు.
శృతి మాట్లాడలేదు. ప్లేటు, గ్లాసు అక్కడినుంచి తీసేసింది.
"కడుపులో కాస్త తిండి పడగానే కళ్ళమీద నిద్రా మాత తాండవమాడుతున్నది. నే ఇక్కడ పడుకోనా, ఆ గదిలో పడుకోనా?" ఆవులిస్తూ అడిగాడు.
"పొద్దుటే మా అన్నయ్య వచ్చి చూశాడంటే చాలా గోలవుతుంది. వంటరిగా వున్న ఆడపిల్లని నన్ను బాధపెట్టడం భావ్యం కాదు. వర్షం తగ్గుముఖం పట్టేటట్టే వుంది. కాకపోతే ఓ గంట విశ్రాంతి తీసుకుని తెల్లవారుఝూమున వెళ్ళిపో. అప్పటికింకా చీకటిగా వుంటుంది ఎవరూ నిన్ను చూడరు" శృతి ప్రాధేయపడుతున్నట్టే అడిగింది.
"తెల్ల వారుఝామున వెళ్ళే ఉద్దేశం వుంటే ఇప్పుడే వెళ్ళేవాడిని. రెండురోజులపాటు ఈ యిల్లుదాటి వీథి ముఖం చూసేది లేదు."
"మా అన్నయ్య సంగతి నీకు తెలియదు."
"మీ అన్నయ్య కంట నే పడితేగా?"
"మా ఇంట్లో వుండి మా అన్నయ్య కంటపడకుండా ఎలావుంటావ్? మాయలూ, మత్రాలు కూడా వచ్చేమిటీ?"
"మంత్రాలు రావు. అదే దురదృష్టం మీ అన్నయ్య మగవాడు. పగలంతా గబ్బిలంలా ఇల్లుపట్టుకు కూర్చోడు. రాత్రిళ్ళు వరసగా వారంరోజులు డ్యూటీ వుందని మీ అన్నయ్య ఉద్యోగం గురించిచెపుతూ ఇందాక నోరుజారావు. రాత్రిళ్ళు కింద పడుకుంటాను పగలు పై కెక్కు తాను. ఇందాకే చూశాను. ఆ గదిలో అతకుంది. ఆటకమీద నా నివాసం. ఎలావుంది అయిడియా?"
"ఏడ్చినట్టే వుంది. రేపోమాపో మా అమ్మ ఊరినుంచి వస్తుంది. మా అమ్మ సంగతి నీకు తెలియదు. ఆవులిస్తే పేగులు లెక్కబెడుతుంది."
"ఆవులించకుండా జాగ్రత్త పడతాను."
"మరీ మూర్ఖంగా జోకులెయ్యకు. సన్నిరకాటంలో పెడుతున్నందుకు నే నూరుకొను. నువ్వత కెక్కినప్పుడు నే వెళ్ళి పోలీసులని పిల్చుకోస్తాను."
మురారిదేముడు మంచంమీంచి ఛర్రున లేచాడు శృతి జబ్బని గట్టిగా పట్టుకున్నాడు. అతని ఉడుంపట్టుకి బాధతో గిలగిలలాడింది శృతి.
"నేను మీ అన్నయ్య స్నేహితుడిని కాదు. అవసరమయితే ప్రాణం ఇవ్వడానికి. ప్రాణం తీసి శవాన్ని నీ చేతుల్లో పెడతాను. నీవు నా భార్యవికాదు. పెళ్ళాం మాటవిని పడుండటానికి. పరాయిపిల్లవి. తాజారోజాలా వున్నావ్. నా మంచితనాన్నే చూడుగాని, నా చెడ్డతనాన్ని చూడటానికి ప్రయత్నించకు. నీకు కాపాడుకునేదాన్ని రాక్షసుడిలా మారి కబళిస్తాను నీ తల్లిని మర్చిపోకు. ఆమె రెండు కళ్ళు మీ అన్నాచెల్లెలు. ఓ కన్ను పీకినా రెండు కళ్ళు పీకినా ఆ తల్లి హృదయం భరించలేదు. పోలీసులని పిలుస్తావా? పిలువు, వాళ్ళు నన్ను పట్టుకెళతారు అంతేగా! తప్పించుకురావడం అయిదు నిమిషాల పని. ఆ తర్వాత నీ పని జీవితాంతం కుమిలికుమిలి చావడమే. చెప్పు నన్నుండమంటావా? పొమ్మంటావా?" శృతిని దగ్గరగా లాక్కుని కళ్ళలోకి తీవ్రంగా చూస్తూ అడిగాడు మురారిదేముడు.
"ఉండు" బొంగురు గొంతుకతో భయంతో బిగుసుకుపోయి ఎలానో అంది శృతి.
"ఊ. అలా దారికి రా. మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చేయను. నీ జీవితం ఎలా మల్చుకోదలచుకున్నావో నీ చేతుల్లో వుంది. నీ చేతల్లో వుంది. నేనా గదిలో పడుకుంటాను. నీవీ గదిలో ఈ మంచంమీదే పడుకో, ఉదయాన్నే తలుపు తీసేముండు నన్ను లేపడం మర్చిపోకు." అని "సరిగా నిద్రపోయి నాలుగు రోజులయింది." గొణుక్కుంటూ రివాల్వర్ అందుకుని శృతి జబ్బ విడిచిపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ పక్కగదిలోకి వెళ్ళిపోయాడు మురారి దేముడు.
టైఫాయిడ్ రోగిలా పదిరోజులు లంకణాలు చేసినట్లు నిస్సత్తువగా మంచంమీద కూర్చుండిపోయింది శృతి.
"లైటార్పలేదేం?" గదిలోంచి మురారిదేముడు గట్టిగా అడిగాడు.
మౌనంగా లేచి వెళ్ళి లైటార్పి బెడ్ లైట్ స్విచ్ వేసింది శృతి.
"గుడ్ నైట్" గదిలోంచి మళ్ళీ అరిచాడు.
"నా శార్థం. నా పిండాకూడు" గొణిగింది శృతి.
"మాట్లాడవేమిటి? నే నన్నది వినిపించలేదా? మళ్ళీ ఏదయినా ప్లాను ఆలోచిస్తున్నావా?"
"అదేం లేదు. గుడ్ నైట్" గట్టిగా అంది శృతి.
"హాయిగా స్వీటు డ్రీమ్స్ కంటూ నిద్రపో" వళ్ళు మండి మరింత గట్టిగా అంది శృతి.
"నాకా అదృష్టం లేదు శృతీ! నా కళ్ళల్లో నాకళ్ళ ముందు ఎర్రటోపీలు, సంకెళ్ళు , కటకటాల జైలుగోడలు వస్తుంటాయి. నా కావంటే భయంలేదులే. అలవాటే......అహ్హహ్హ......"గదంతా దద్దరిల్లేటట్లు నవ్వాడు మురారి దేముడు.
శృతి మాట్లాదలేదు.
ఆ తర్వాత మురారిదేముడు మాట్లాడలేదు.
వర్షం కురుస్తూనే వుంది. పిడుగులు పడుతూనే వున్నాయి.
* * *
4
ఆ రాత్రి శృతికి నిద్రపట్టలేదు. తను నిద్రపోంగానే వచ్చి మీదపడితే అప్పుడు తాన్ గతి? ఇలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలు సాగి చివరికెప్పుడో కలత నిదురపోయింది.
ఇలా జరుగుతుందనుకోలేదు శృతి. పాముకి పాలు పోస్తే కాటేయ్యక ముద్దు పెట్టుకుంటుందా! మురారి దేముడు కొదమసింహంలా వచ్చి శృతిమీద పడ్డాడు. శృతి గుండె ఆగి పోయినంత పని అయింది. అతన్ని తోసేస్తున్నకొద్దీ శృతి శరీరాన్ని కొండచిలువలా చుట్టేస్తున్నాడు. అరవటానికి వీలు లేకుండా ఓచేత్తో నోరుమూశాడు. అరవటానికి వీలు లేకుండా ఓచేత్తో నోరుమూశాడు. మరోచేత్తో చీర కుచ్చిళ్ళు లాగిపారేశాడు. కసిక్కిన అతని చెయ్యి కొరికి కెవ్వున అరపటం మొదలుపెట్టింది.
శృతి అరవటానికి వీలు లేకుండా మురారిదేముడు శృతి నోరుమూసి "శృతీ! శృతీ!" అని మృదువుగా తట్టి లేపాడు.
శృతి కళ్ళు తెరిచింది. మరోసారి కెవ్వుమనబోయింది గాని సాధ్యంకాలేదు.
"ఎందుకలా అరుస్తావ్! నీ కేకలు విని నలుగురూ పరుగెత్తుకు వస్తారు. స్వీట్ డ్రీమ్స్ కంటూ హాయిగా నిద్ర పొమ్మంటే ఏదో భయంకరమైన పీడకల కన్నాట్లున్నావు. కలలో జరిగింది ఇలలో జరగదంటారు. లే,లే" అంటూ మురారిదేముడు శృతి నోటిమీదనుంచి చెయ్యి తీశాడు.