Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 4


    శృతి వచ్చిన అవకాశం పోగొట్టుకోలేదు. ఒక్క అంగలో స్టూలువద్ద కెళ్ళి రివాల్వర్ అందుకుంది.

    అతను గదిలోంచి రాగానే రివాల్వర్ తో బెదిరించి ఇక్కడ నుంచి పంపేయాలి అనుకుంది.

    శృతి వస్తుతః పిరికిది కాదు. జీవితంలో కష్టాలను ఎదుర్కోనగలదు. ఇలాంటి ఆపదలు ఎదుర్కొనగలదు. కాని ఇప్పుడున్న పరిస్థితి వేరు. అతనోహంతకుడు. ఆడపిల్ల లేందరినో రెఫ్ చేసిన వాడు. ఇంతకుముందుదాకా చేతిలో ఆయుధం వుంది. బలవంతుడు ఉత్తచేతులతోనే పదిమందిని తన్నేటట్లున్నాడు. ఇప్పుడు రివాల్వర్ శృతి చేతిలో వుంది ఇంకేం?

    రివాల్వర్ సూటిగా గది గుమ్మంవేపు గురిపెట్టి వుంచి స్టడీగా నుంచుంది శృతి.

    గదిలో తీరుబడిగా బట్టలు మార్చుకుంటున్నట్టున్నాడు "గీత్ గాయా పత్తరోంనే" అంటూ సన్నగా ఉషారుగా ఈల పాట పాడుతున్నాడు మురారిదేముడు.

    "లోపల నుంచి బైటికి రా దేముడూ! పాట ఒక్కటే నేమిటి నీ చేత భారత నాట్యం చేయిస్తాను" అనుకుంది శృతి.

    లోపల మురారిదేముడి ఈలపాట ఆగిపోయింది.


                                                              *    *    *


                                                     3


    శృతి అన్నయ్యపేరు సిద్దార్థ. అతను మరీ పొట్టికాదు. కానీ బొద్దుగా వుండటంవల్ల పొట్టిగానే అనుతాడు. మురారి దేముడిలాంటి మాంచి హైటుమనిషి ప్రక్కన నుంచుంటే భుజాలదాకా వచ్చి పొట్టిగా కనపడటం ఖాయం.

    సిద్దార్థ లుంగీని కట్టుకుని సిద్దార్థ షర్ట్ ని ధరించాడు మురారిదేముడు. అవి అతనికి బపూన్ వేషంలా అమిరాయి. లుంగీ గిలకలపైకి వుంది. షర్టు తొడిగి వదిలేశాడు. గుండీలు పెట్టుకోటానికి అడ్డ లంబు చాలాలేదు. షర్టు చేతులు అంతే. మో చెయ్యి దిగి జానెడు కిందికి వున్నాయి, అదయినా బిగుతుగా.

    మురారిదేముడు తన్ను తానే చూచుకుంటూ గది లోంచి బైటికొచ్చాడు.

    శృతి తీవ్రంగా చూస్తూ రివాల్వర్ గురిపెట్టి నుంచుంది.

    "ఈ  దుస్తుల్లో ఎలా వున్నాను శృతి!" అంటూ తల పై కెత్తాడు మురారిదేముడు. ఎదురుగా కనబడ్డ దృశ్యం చూసి నిర్ఘాంతపోయి గుమ్మంవద్ద నిలబడిపోయాడు.

    అతని వేషంచూచి వేళాకోళం చేసే స్థితిలో లేదు శృతి. దెబ్బతిన్న బెబ్బులిలావుంది. "మృత్యుకళ నీ ముఖంలో తాండవమాడుతోంది" వీలయివంత కఠినంగా అంది.

     అతను భుజాలెగరేశాడు. చేతులు కట్టుకుని  గుమ్మాని కానుకుని ఠీవిగా నుంచున్నాడు. చూపులు నిర్లక్ష్యంగా వున్నాయి. "నీకు జాతకాలు చెప్పడంకూడా వచ్చేమిటి?" తమాషాగా అడిగాడు.

    "పిచ్చి పిచ్చిగా  వాగకు" అంది శృతి.

    "ఎస్ మేడమ్!" అని తలవంచి వినయంగానే మళ్ళీ తల పై కెత్తాడు.

    "మాటలతో, నక్క వినయాలతో నన్ను మోసం చెయ్యలేవు. నా చేతిలో వున్నదేమితో తెలుసా?"

    "అదేమిటో నాకు తెలియండి."

    "స్టాపిట్. తెలివి అన్నిచోట్లా పనిచెయ్యదు. బూకరించకు. ఏ రివాల్వర్ తో అయితే నన్ను జడిపించి లోంగదీసుకోవాలనుకున్నావో ఆ.....నీ.....రివాల్వర్ ఇప్పుడు నా చేతిలో వుంది. నీ ప్రాణం తియ్యటానికి ఆర సెకండ్ చాలు. మారు మాటాడకుండా మర్యాదగా వెళ్ళిపో. లేకపోతే ఈరోజు ముందు నీప్రాణం తీసి తర్వాత నా ప్రాణం తీసుకుంటాను......."

    "ఓ.కే. చిన్న అనుమానం తీర్చాలి."

    "ఏమిటి మళ్ళీ గోల?"

    "నా ప్రాణం తీయటం ధర్మం. మరి నీ ప్రాణం తీసుకోటం ఏం ధర్మం ? నే చచ్చింతర్వాత నా వెనుకనే వద్దామనా?"

    పోలీసులు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి శృతికి రకరకాల గొంతుకలతో తమాషాలు చేసి పీకలు కోసే రకరకాల గొంతుకలతో తమాషాలు చేసి పీకలు కోసే రకమని.....ఎంత నిర్లక్ష్యంగా నుంచున్నాడు? అలా ధీమాగా నుంచో వాలటే ఓ హంతకుడికే తగింది. ధైర్యంగా మాటలొకటి.

    "ఏమిటా ఎకసక్కెం మాటలు. ప్రాణంమీద తీపిలేదా?" అంది శృతి.

    "ఎవరి ప్రాణం వారికి తీపి. ఈ చిన్న విషయం తెలియదా శృతి!" హేళనగా అన్నాడు.

    "ఆయ్!" అని కళ్ళెర్రజేసింది శృతి.

    మురారి దేముడు ఫక్కున నవ్వాడు.

    "నవ్వకు. నీ ప్రాణం తీయనని పోరపడుతున్నావేమో! మా అమ్మకి, అన్నయ్యకి లేని దేర్యం నాకుంది. మా ఇంట్లో ఎలుకలని, మా పెరట్లో పందికొక్కులని దెబ్బకొకటి చొప్పున పాతిక చంపాను. ఒక్క గుండు చాలు నీ ప్రాణం తియ్యటానికి చివరిసారిగా దేముణ్ణి తల్చుకో." అంది శృతి.

    "నేనే దేముణ్ణి నన్ను తల్చుకోవాలి. ఇహ గుళ్ళులేని రివాల్వర్, పైగా అది టాయ్ రివాల్వర్. అది పేల్చినా ప్రాణం తీస్తావా? నీకంత కోరిగ్గా వుంటే కానియ్!" అంటూ  గదంతా దద్దరిల్లేటట్లు  నవ్వాడు మురారిదేముడు.

    శృతి తెల్లబోయింది. పిచ్చిగా చేతిలో రివాల్వర్ వేపు అతని వేపు మార్చి మార్చి చూచింది.

    "ఢాం" అంటూ పెద్ద శబ్దంతో బయటెక్కడో పిడుగు పడింది.

    తలమీదెవరో సుత్తితో కొట్టినట్లు శృతికి తెలివొచ్చింది.

    "బొమ్మ రివాల్వర్ అని చెప్పి నన్ను మోసం చేద్దామనుకుంటున్నావా దేముడూ! నేనేం తెలివి తక్కువదాన్ని కాదు నీ మాయ మాటల కి మోసపోయే అవివేకినీ కాదు. నువ్విక్కడనుంచి పోతావా, ప్రాణం తియ్యనా?" అంది శృతి రివాల్వర్ ని తమాషాగా ఆడిస్తూ.

    బైట వర్షం పెద్దదయింది. బడబడా వినిపిస్తున్నది వర్షపు నీటి శబ్దం.

    "వర్షం పెద్దదయింది మళ్ళీ తడిసిపోతే రొంప పడుతుంది" అని "హూచ్చ్" అంటూ గట్టిగాతుమ్మి "చూశావా అప్పుడే జలుబుచేసింది, జ్వరమొస్తుందో ఏం పాడో" అన్నాడు మురారిదేముడు.

    మాయమాటలతో కాలం వ్యర్థంచేసి తప్పించుకోవాలని చూస్తున్నాడని గ్రహించింది. "మూడు లెక్క పెట్టె లోపల వెళ్ళావా సరే, లేకపోతే దీనిలో గుండు సరాసరి నీ గుండెలో దూరుతుంది" అంది శృతి.

    "అది టాయ్ రివాల్వర్ అంటే నమ్మకం కలగలేదు కదూ!"

    "ఒకటి....."

    "నామాట నిజంకావాలంటే ఆ కిటికీలోంచి బైటికి కాల్చి చూడు"

    "రెండు....." అన్న శృతి ఉలిక్కిపడి టక్కున రివాల్వర్ కిటికీవేపు తిప్పి  పేల్చింది.

    సై లేన్సర్ అమర్చిన రివాల్వర్ అది. శృతి రివాల్వర్ పేల్చాగానే, సర్ అనే శబ్దంతో రివాల్వర్ లోంచి గుండు దూసుకువెళ్ళి కిటికీ పక్కనే గోడకి తగిలి కింద పడింది.

    కన్ను మూసి తెలిచే టైమ్ లో మురారిదేముడు స్ర్పింగ్ లా ఎగిరి శృతిమీదపడ్డాడు. రివాల్వర్ కింద ఠంగున  శబ్దంతో పడటం. ఓ చేత్తో శృతిని పట్టుకునే వుండి వంగి మరో చేత్తో రివాల్వర్ అందుకుని రివాల్వర్ ని ముద్దు పెట్టుకోవటం జరిగింది "ఇది టాయ్ రివాల్వర్ కాదు శృతీ!" అంటూ శృతి చెయ్యి వదిలేసి మంచంమీద కూర్చున్నాడు.

    జరిగిందేమిటో అర్ధం కావటానికి కొద్ది క్షణాలు పట్టింది శృతికి.  జరిగింది అర్ధమయిం తర్వాత అరికాళ్ళలోంచి చలి బెలుదేరి శిరస్సుకి పాకి నిలువెల్లా గజగజ వణికించింది. వణుకుతూ బొమ్మలా నిలబడిపోయింది.

    "నీ ధైర్యానికి అభినందిస్తున్నాను" అన్నాడు మురారి దేముడు.

    శృతి మాట్లాడలేదు.

    "ఎలుకలు, పందికొక్కులు, పులులు, సింహాలకన్నా మహా క్రూరజంతువులు. కొక్కుల్ని, ఎలకమ్మలని పాతిక కదూ చంపానన్నావ్, నాకు పలుకుబడి లేదు ఉంటే నీ శౌర్యపరాక్రమాలకి, ధైర్య సాహసానికి ఉత్త అభినందనేం ఖర్మ, లక్షరూపాయల బహుమతి ఇచ్చి ఓ బిరుదు ప్రదానం చేసేవాణ్ణి."

    అప్పటికి శృతిలో చలనం కలిగింది. కాస్త నిలదొక్కుకుంది. లాభంలేదు తను అతన్ని  చంపబోయి విఫలమయింది.  రివాల్వర్ ఎత్తినందుకు పగ తీర్చుకుంటాడు. తను ఎదురు తిరగలేదు. అరిస్తే ఎవరూ రారు. ఈ కాలనీలో ఒకేటైపుగా కట్టిన  ఇళ్ళు, ప్రతి ఇంటికిమధ్య రోడ్డువెడల్పు ఖాళి స్థలం వదిలేశారు. చాలా ఇళ్ళచుట్టూ గుబురుగాను ఎత్తయినవి  చెట్లున్నాయి. ఈ సమయంలో తన అరుపులు అరణ్యరోదన ఆపుతాయి. అసలీ దేముడు తన్ని నోరు తెరవనిస్తాడా? పులిలాగ మీదకి దూకి నోరుమూస్తాడు. ఇందాక వెయ్యిటన్నుల బరువులా అమాంతం తనమీదపడితే క్షణమాత్రం తన గుండె ఆగి మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టింది.

    "ఏంటి బుల్లెమ్మా! ఆలోచిస్తున్నావ్? మళ్ళీ ఎలా చంపాలా అనా!" శృతి బొమ్మలా నుంచుని దీర్ఘంగా ఆలోచించడం చూచి అడిగాడు మురారిదేముడు,

    "అబ్బెబ్బె-అదేంలేదు" కంగారుపడింది శృతి.

    "అమ్మయ్య. మళ్ళీ నా ప్రాణం కావాలంటావేమో అని భయపడ్డాను" అని చాతిమీద చెయ్యేసుకున్నాడు మురారిదేముడు.

    అప్పుడు చూచింది శృతి అతన్ని తేరిపార. పొట్టి లుంగీ ఇరికించి తొడుక్కున్న షర్టు. వర్షాకాలంలో  వీపుగా గడ్డి పెరిగితే ఎలా వుంటుందో అలా దుబ్బులా రోమాలు పరుచుకున్న  ఛాతీ. తోడుక్కునది తెల్లషర్టు కావడంతో విశాలంగా వున్న చాతీ నల్ల రంగేసినట్లు కనిపిస్తున్నది. నున్నగా  వున్న గడ్డం, సన్నని మీసకట్టు....

    ఏమిటీ అంత పరీక్షగా నన్ను చూస్తున్నావ్ మురారిదేముడు అనటంతో టక్కున శృతి చూపులు పక్కకు తిప్పుకుంది మాట్లాడకుండా.

 Previous Page Next Page