ఒక్కోక్షణం అతని శరీరంలో చిన్నపాటి గగుర్పాటు, రామయ్య వైపు చూడ్డానికే భయమేసింది.
* * *
"నచీ...ముందు ప్రొఫెసర్ దగ్గరికి వెళ్దాం...జరిగింది చెబుదాం...ఇవ్వాళ కాకపోతే రేపైనా నీకా కల గుర్తొస్తుంది. అప్పుడు బొమ్మ వేద్దువుగానీ...పద పద...ప్రొఫెసర్ దగ్గరకు వెళ్లి అట్నుంచి అటే, ఫస్ట్ షో...ఏదైనా సినిమాకి చెక్కేద్దాం...హాట్ ఫీవర్ కెళ్దామా?" విల్సన్ ఉత్సాహంగా అడిగాడు.
నచికేత ఏ మాత్రం ఉత్సాహం ప్రదర్శించలేదు. ఐదుగురూ బయటకు నడిచారు.
'అరె...గాగుల్స్..." విల్సన్ అన్నాడు నాలుగడుగులు నడిచాక.
"నీకీ మతిమరుపు జబ్బేమిట్రా..." సూరజ్ ని విసుక్కుంటూ అని "వెళ్లి తెచ్చుకో పో" అన్నాడు.
"లోపలికి వెళ్లి గాగుల్స్ తెచ్చుకుని మరేదో మరిచిపోతాను. అయినా లోపలికి వెళ్లే ఓపిక లేదు. ఒరే సూర్యా? నువ్వెళ్ళి నా గాగుల్స్ తెచ్చిపెట్రా..."
"నేనా...అబ్బ బోర్...ప్రభుని వెళ్లమను" సూర్యనారాయణ అన్నాడు.
ప్రభు విల్సన్ గాగుల్స్ తీసుకురావడానికి లోపలికి వెళ్లాడు.
లోపల...
నచికేత గదిలోకి అడుగుపెట్టేసరికి...ఆ గదిలో రామయ్య ఉన్నాడు.
ఆ గది కిటికీ దగ్గర ఓ పిల్లి రామయ్యవైపు తీక్షణంగా చూస్తోంది. అంతకన్నా తీక్షణంగా రామయ్య ఆ పిల్లివైపు చూశాడు...
ఆ మరుక్షణమే. ఆ పిల్లి భయంతో బిగుసుకుపోయింది. ఎవరో విసిరి పారేసినట్టుగా కాన్వాసు మీదకి దూకింది.
కాన్వాసు స్టాండు కింద పడింది.
ఆ శబ్దానికి ఉలిక్కి పడ్డాడు ప్రభు.
వెంటనే అదురుతున్న గుండెలను చేత బిగపట్టుకుని బయటకు పరుగెత్తాడు.
* * *
"ఒరే నా గాగుల్స్ ఎక్కడ? ఖాళీగా వచ్చావేంటి?" విల్సన్ అడిగాడు పరిగెడ్తూ వచ్చిన ప్రభుని.
"అక్కడ గాగుల్స్ లేవు" అబద్దం చెప్పాడు ప్రభు.
"నేనే తెచ్చుకుంటానుండు..." అంటూ విల్సన్ నచికేత గదిలోకి వెళ్లి గాగుల్స్ తెచ్చుకున్నాడు.
ఆ సమయంలో రామయ్య నేలమీద కూచొని ఫ్లోరింగ్ తుడుస్తున్నాడు.
* * *
...ఖాలీగా తిరిగొచ్చారా? బ్యాడ్...వెరీ బ్యాడ్..." అన్నాడు విచారంగా మొహం పెట్టి ప్రొఫెసర్ పరమహంస.
ఆ అయిదుగురూ ప్రొఫెసర్ దగ్గరకి వచ్చి జరిగిన విషయాలన్నే చెప్పారు.
వాళ్ళు చెప్పిందంతా విన్నాక...ఓ క్షణం దీర్ఘంగా నిట్టూర్చి...
"మీరు చెప్పేదంతా వింటూంటే...నాకేదో డౌట్ వస్తోంది...మనకు తెలియకుండానే మన శరీరాన్ని కొన్ని శక్తులు నియంత్రిస్తాయి...సైన్స్ కూడా లాజిక్కులను చూపించగలుగుతుంది కొన్నింటికి...
మనం పదే పదే గుర్తు చేసుకోవడంవల్ల అనవసరమైన ఆదుర్దా మొదలై, మనలోని మెమొరీ పవర్ ని తగ్గిస్తుంది. చాలా ప్రశాంతంగా, కాన్ సెంట్రేషన్ తో ఆలోచిస్తే నీకా కల గుర్తుండేది.
అయినా కొన్ని కలలు గుర్తుండవు. ఒక సర్వే ప్రకారం, మనకు వచ్చిన కలల్లో కొన్ని తెల్లారి లేచాక అసలే గుర్తుండవు. మనం తల బ్రద్దలు కొట్టుకున్నా అవి గుర్తుకు రావు.
మరికొన్ని కలలు అస్పష్టంగా లీలా మాత్రంగా గుర్తుంటాయి. సాధారణంగా రాత్రిపూట మనం ఊహించుకునే విషయాలుగానీ, మనం చదివిన పుస్తకాల్లోని సంఘటనలు గానీ, కలలో కనిపిస్తాయి. అయితే ఆ పుస్తకాల్లోని సంఘటనలు గానీ, కలలో కనిపిస్తాయి. అయితే ఆ పుస్తకాల్లోని సంఘటనలు మన జీవితంలో జరిగినట్టే కలలో వస్తాయి.
హాలెండ్లో జోప్రాశ్చర్ అనే వ్యక్తికి, ఎవరో ఓ వ్యక్తి తనను తరచూ తరుముతున్నట్టు కల వచ్చేది. ముందు అతను చాలా తేలిగ్గా తీసుకున్నాడా విషయాన్ని. తర్వాత కలలో ఆ తరిమే వ్యక్తి చెలరేగిపోయాడు. నా మాటలను లక్ష్యపెట్టనందున, నిన్ను చంపడం గ్యారంటీ అని కలలో హెచ్చరించేవాడు.
జోప్రాశ్చర్ కంగారుపడి, ఓ ప్రొఫెసర్ ని కలుసుకున్నాడు. ఆ ప్రొఫెసర్ ఆ కల విని నవ్వి "కలలకు భయపడితే ఎలా?" అంటూ తేలిగ్గా నిట్టూర్చాడు.
కానీ, ఆ రోజు రాత్రి ఆ ప్రొఫెసర్ హత్యకి గురయ్యాడట. అతడ్ని ఎవరు చంపారో తెలియదు., కానీ, ఓ వ్యక్తి తరిమి తరిమి చంపినట్టు పోలీసులు తమ పరిశోధనలో తేల్చారు.
ఆ విషయం తెలిసిన జోఫ్రాశ్చర్ వణికిపోయాడు. చర్చికి వెళ్లి ప్రార్ధనలు చేశాడు.
విచిత్రంగా ఆ రోజు నుంచి అతనికి అలాంటి భయంకరమైన కల రాలేదు.
కానీ ఆ ప్రొఫెసర్ చనిపోయాడు.
జోఫ్రాశ్చర్ ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.
తన చివరి దశలో ఈ కల వచ్చి ప్రొఫెసర్ చనిపోయిన నలభై సంవత్సరాల తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టాడు.
(బ్యాంకాక్ లో రోయల్ బెన్ జా హోటల్ లో డిన్నర్ తీసుకుంటున్నప్పుడు మిసెస్ జెఫర్సన్ పరిచయమైంది. ఆవిడ భర్త జెఫర్సన్ ఓ ప్రొఫెసర్ అని తర్వాత తెలిసింది.
అతను కలల గురించి వాటి లక్షణాల తీవ్రత గురించి రీసెర్చి చేశాడట. అతనికి అరవై ఏళ్ళుంటాయి. చాలా తమాషా మనిషతను. ప్రతీమాటకు ముందు భుజాలెగరేసి విచిత్రంగా మాట్లాడుతాడు.
అతని ఇంగ్లీష్ చాలా ఫాస్ట్ గా వుంటుంది. అక్కడక్కడ జర్మన్ పదాలు మిక్స్ అయినట్టు అనిపిస్తాయి.
జోఫ్రాశ్చర్ విషయం అతనే చెప్పాడు.
దానికి సంబంధించిన డిటెయిల్స్ మరుసటి రోజు అందజేస్తానని చెప్పాడు. అప్పటికే బ్యాంకాక్ జర్నీకి ఎక్కువరోజులు కేటాయించడం, గెస్ట్ హౌస్ ల గురించి ఎంక్వయిరీలు చేయడం వల్ల తిరిగి సింగపూర్ వెంటనే వెళ్లాల్సి వున్నందున జెఫర్సన్ ని కలవడం కుదరలేదు...థాంక్స్...థాంక్స్ టు మిస్టర్ జెఫర్సన్)
"సో...మైడియర్ బోయ్స్..కలలను తక్కువగా అంచనా వేయవద్దు...ఎనివే...మిస్టర్ నచికేత.. ఈవేళ హాయిగా నిద్రపో...దిసీజ్ మై విజిటింగ్ కార్డ్...నీకేమైనా అసిస్టెన్సీ కావాల్సివస్తే ఎనీ టైమ్...నన్ను కాంటాక్ట్ చేయవచ్చు...అన్నట్టు మనం తరచు కలుస్తూ ఉండడం మంచిది" అన్నాడు ప్రొఫెసర్ పరమహంస.
సూర్యనారాయణ, సూరజ్, విల్సన్ లు అసహనంగా గడియారం వంక చూస్తున్నారు. ఫస్ట్ షో సినిమాకు వెళ్లాలనే ఫ్లానింగ్ మీద వున్నారు వాళ్ళు.
మోచేత్తో నచికేత నడుం మీద పొడిచాడు విల్సన్...నచికేత లేచి చేతులు జోడించి...
"మేం వెళ్తాం ప్రొఫెసర్..." అన్నాడు.
"ఓ..కె..ఆల్ ది బెస్ట్..." అన్నాడు ప్రొఫెసర్.
మిగతా ముగ్గురూ లేచారు.
"ప్రభు...నువ్వు రావటంలేదా?" అన్నాడు సూరజ్ ప్రభు అలానే ఉండిపోవడం చూసి.
తల అడ్డంగా ఊపాడు ప్రభు 'తను రానన్నట్టు'
"ఏయ్...అదేం కుదర్దు. అందరమూ వెళ్లాల్సిందే..." సూర్యనారాయణ అన్నాడు.
"అంతే" సూరజ్ బలపరిచాడు.
"లేకపోతే మనీషా కోయిరాలా బాధపడదూ..." విల్సన్ అన్నాడు.
"మనీషా కోయిరాలా బాధపడడమెందుకు?" సూరజ్ అనుమానంగా విల్సన్ మొహంలోకి చూస్తూ అన్నాడు.
"ఎందుకంటే ఏమని చెప్పను నానా పటేకర్ తో చెడినందుకు కావచ్చు. బోయ్ ఫ్రెండ్ హుసేన్ హ్యాండిచ్చినందుకు కావచ్చు." కోపంగా అన్నాడు సూర్యనారాయణ.
"నీకేమైందిరా?" విల్సన్ సూర్యనారాయణను అడిగాడు.
"అయ్యింది నాక్కాదు నీకు. నీ మతిమరుపుతో చస్తున్నాం. అయినా ఎక్కడికైనా బయల్దేరేముందు సినిమా పుస్తకాలు చదివితే చంపేస్తాం...నీకసలే మతిమరుపు, దానికి తోడు అంతక్రితం చదివిన పుస్తకంలోని విషయాలు గుర్తుంటాయి.
అయిన ఆ ప్రొఫెసర్ గారి టేబుల్ మీద ఉన్న స్టార్ డస్ట్ ఎవరు చదవమన్నారు. మనం సినిమాకి వెళ్లాలన్న విషయం మరిచిపోయి. మనిషా కోయిరాలా అంటున్నావు. పద పద టైముంది" అన్నాడు కోపంగా సూర్యనారాయణ.
ఆ నలుగురూ సినిమాకు బయల్దేరారు.
* * *
"ప్రభు...మీ ఫ్రెండ్సంతా వెళ్లినట్టేనా?" అడిగాడు ప్రొఫెసర్ పరమహంస,
"వెళ్లిపోయార్సార్..." అన్నాడు ప్రభు.
"సరే...డోర్స్ అన్నీ క్లోజ్ చేయి. చెక్కగేటుకు తాళం వేసేయ్..." చెప్పాడు ప్రొఫెసర్.
ప్రొఫెసర్ చెప్పినట్టు చేశాడు ప్రభు.
"వెరీగుడ్...చెప్పినపని, చెప్పినట్టు చేస్తావు. ఇప్పుడు మెయిన్ డోర్ కు కూడా బోల్ట్ వేసి నా ల్యాబ్ లోకి పద"
"ల్యాబ్ లో డెడ్ బాడీ వుంది. మార్చురీ నుంచి తెప్పించాను. ఆ డెడ్ బాడీతో ఈ రాత్రంతా గడిపి. మన అనుభవం రికార్డు చేయాలి" అంటూ ల్యాబ్ డోర్ తెరిచాడు.
వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ప్రభుకు
లోపల...
ల్యాబ్ లో పెద్ద బల్లమీద ఐస్ క్యూబ్స్ మీద డె..డ్...బా...డీ
3
ప్రభు భయంతో వణికిపోతున్నాడు.
ప్రొఫెసర్ పరమహంస చాలా సీరియస్ గా డెడ్ బాడీ వంక చూస్తున్నాడు. ఐస్ కరిగిపోతోంది.