ప్రభు ఆ శవం వంకే చూస్తున్నాడు. స్వతహాగా కూడా ప్రభు ధైర్యవంతుడు కాదు.ఏ విషయాన్నీ అతను తార్కికంగా ఆలోచించడు. ఆలోచించే ప్రయత్నం చేయడు. కొన్ని విషయాలను గుడ్డిగా నమ్ముతాడు.
వాళ్ల తాతయ్య చనిపోయినప్పుడు ఎవరో రాత్రివేళ శవం ఉంచకూడదని చెబితే, రాత్రికి రాత్రే శవాన్ని దహనం చేయించేవరకూ పట్టుబట్టాడు.
అలాంటిది ఇప్పుడు ఓ శవంతో...
"సీ...ప్రభూ...ఈ డెడ్ బాడీ చూడు...కళ్లముందు బ్రతికే ఉన్నదన్న భ్రమ కలగడం లేదూ..." అన్నాడు డెడ్ బాడీ దగ్గరకు వచ్చి...
ప్రభు డెడ్ బాడీ దగ్గరకు రావడానికి భయపడ్డాడు.
"ప్రభూ...మనిషి మరణించడం అంటే భౌతికంగా తన ఉనికి కోల్పోవటమే...శరీరంలో కదలిక ఉండదు. సిరలు, ధమనులు, ఫేషియల్స్...ఏవీ...ఏవీ పనిచేయవు. గుండె సవ్వడి ఆగిపోతుంది. శ్వాస ఆగిపోతుంది. మనిషి క్రమక్రమంగా నిర్జీవమవుతాడు. సైన్స్ ఈ విషయం చెబుతూంటే...
ఆత్మ పరమాత్మలో ఐక్యమవుతుందని, యమధర్మరాజు ప్రాణాలను హరిస్తాడని కొందరి విశ్వాసం. మనిషి ఎలా మరణిస్తాడో తెలుసుకోవాలనే ప్రయత్నాలు కూడా చాలా జరిగాయి.
మరణానికి చేరువలో ఉన్న ఓ వ్యక్తిని ఓ గాజు గది లాంటిదానిలో వుంచితే..ఒక్కసారిగా ఆ గాజు గది పగిలి ముక్కలైందిట...ఆత్మ వెళ్లిపోయిందట. గాలి ఎక్కువైతే ట్యూబు ఎలా పగిలిపోతోందో అలా...
ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కో కారణాన్ని విశ్లేషించి, విఫులీకరించి చెబుతారు. ఇప్పుడు ఈ డెడ్ బాడీనే చూడు...నీకో విషయం తెలుసా...ఈ డెడ్ బాడీ ఇక్కడికి తీసుకువచ్చి ఇరవై నాలుగ్గంటలయింది..." అంటూ పరమహంస ప్రభువైపు చూశాడు.
చిన్న గగుర్పాటు...పెరిగి పెద్దయింది ప్రభుతో...
"రాత్రంతా ఈ శవంతోనే జాగరణ చేశాను. శవం కదులుతుందా? శవం ఎలా వుంటుంది? శవంలో ఏ మార్పులు వస్తాయి? ఇలా ఆలోచిస్తూ శ...వం...వంకే చూస్తు..."ప్రొఫెసర్ చెప్పుకుపోతున్నాడు.
లిప్తకాలంలో...స్ప్లిట్ సెకన్...ప్రభు శరీరమంతా గగుర్పాటుకు గురైంది. ఓ భయానక రసం అతని శరీరాన్ని ఆవహించింది.
రాత్రంతా శవంతోనే ఉన్నాడా? ఆ ఆలోచనకే భయం అన్పించింది.
అప్పుడు గమనించాడు శవం దుర్వాసన వేయడం ప్రారంభమవ్వడం...
"యూ నో మిస్టర్ ప్రభూ...రాత్రంతా నీకు రకరకాల ఆలోచనలు...ఓ అర్దరాత్రి ఉలికిపాటుతో శవం కళ్ళు తెరిచినట్టు...తను నా వంక చూసినట్టు...ఆలోచనలు...శవంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను.
"నువ్వు చచ్చావా" అని అడిగాను. పూర్ శవం...మాట్లాడలేదు కదా...ఎక్కడో చందమామ కథల్లోలా ఆత్మ తిరిగివచ్చి శరీరంలో చేరుతుందేమోనని కూడా చూశాను...ఓ అర్దరాత్రి ఐస్ బెడ్ కరిగి, చేయి కొద్దిగా పక్కకు ఒరిగింది. వెంటనే చేతిని సరిచేశాననుకో...
చూద్దాం. ఈ రెండో రాత్రి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో...అన్నట్టు...నువ్వో రెండుగంటలు రెస్టు తీసుకో ఈ రెండు గంటలూ నేను అబ్జర్వ్ చేస్తాను.
ఆ తర్వాత రెండు గంటలు నువ్వు మెలకువగా ఉండి డెడ్ బాడీ వంకే చూస్తూ వుండు...నీ ప్రతి ఫీలింగ్స్ ని నోట్ చేయి..."
ప్రభుకు అక్కడనుంచి పారిపోవాలనే ఆలోచనకూడా వచ్చింది.
ఒక్కోసారి ప్రొఫెసర్ తెలివితేటలమీద విపరీతమైన సందేహం కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో అయినా ఇలాంటి పిచ్చేమిటి...అనుకుంటూ భయంతో బిగుసుకుపోయాడు.
శవాన్ని పక్కన పెట్టుకుని నిద్రపోవడమా?
అంతకన్నా భయంకరమైన ఆలోచన అతని వెన్ను జలదరింపజేసింది. మరోరెండు గంటల తర్వాత...అంటే అర్దరాత్రి...తను మెలకువగా ఉండి శవాన్ని గమనించాలా?
"కమాన్ ప్రభూ...పడుకో..." అన్నాడు ప్రొఫెసర్.
ప్రభు బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రపోయే ప్రయత్నం చేస్తున్నాడు.
ప్రొఫెసర్ పరమహంస డెడ్ బాడీ వంకే చూస్తుండిపోయేడు. (యూరప్ లో సామ్యేల్ అనే వ్యక్తికి మనిషి చనిపోయిన తర్వాత డెడ్ బాడీలో రియాక్షన్ ఎలా వుంటుందో చూడాలని అనిపించి ఆ రోజే పాతిపెట్టబడిన శవాన్ని బరియల్ గ్రౌండ్ నుంచి తీసుకువచ్చి ఒకరోజు రాత్రంతా ఆ శవంతో ఉన్నాడు. ఐదు నిముషాలకోసారి...ఆ శవాన్ని పరీక్షగా చూస్తూ కూచున్నాడు. ఆ రాత్రి కురిసిన కుంభవృష్టివల్ల నగరమంతా చీకటిమయమైంది.
సామ్యేల్ లాంతరు వెలిగించి ఆ శవాన్ని పరిశీలిస్తుండగా ఆ శవం కళ్ళు తెరిచిందట...అంతే సామ్యేల్ వెనక్కి విరుచుకుపడిపోయాడు.
ఆ క్షణమే అతను చచ్చిపోయాడు.
షాక్ తోనే అతను చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఈ సంఘటన నలభయ్యేళ క్రిందట జరిగినట్టు ఆ మధ్య ఓ మేగజైన్ లో చదివిన గుర్తు- రచయిత్రి)
* * *
ఒక్కసారిగా పెద్ద ఉరుము...
ఆపైన ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం...
ఆపైన అనుసరిస్తూనే కుంభవృష్టి...
దానికితోడు కరెంటు పోయింది...
"ప్రభూ కరంటు పోయినట్టుంది. క్యాండిల్ తీసుకురా..." ప్రొఫెసర్ పరమహంస చెప్పాడు.
ప్రభు భయంగా అలాగే నిలుండిపోయాడు.
"సర్లే...పక్కగదిలో ఉన్నట్టుంది. నేను తెస్తానుండు" అంటూ ప్రొఫెసర్ పక్కగదిలోకి వెళ్లాడు. చీకట్లో తడుముకుంటూ తలుపు తెరుచుకొని ప్రభుకు తేవాలని అనిపించడంలేదు...
ఒకటి...రెండు...మూడు...ఇంకా ప్రొఫెసర్ రావడంలేదు.
"సార్.." పిలిచాడు భయంతో ప్రభు.
గాలికి కిటికీ రెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి. కళ్ళు చిట్లించి చూసినా ఏమీ కనిపించని చీకటి... కిటికీ తలుపులు శబ్దం విని భరించలేకపోతున్నాడు.
"కిటికీ తలుపులు మూస్తే బావుండు" అనుకున్నాడు మనసులో ప్రభు.
ప్రొఫెసర్ త్వరగా వచ్చినా బావుండు...అని కూడ అనుకున్నాడు,.
సరిగ్గా అప్పుడే అడుగుల శబ్దం.
"సార్...క్యాండిల్ దొరకలేదా...పోనీయండి. కిటికీ తలపులైనా వేయండ్సార్..." ప్రభు భయంగా అరచి చెప్పాడు.
"జాగ్రత్త సార్...వేలు చిట్లి పోగలదు..." హెచ్చరించాడు ప్రభు.
ఈదురుగాలి ఆగిపోయింది.
వర్షం విసురుగా లోపలికి వచ్చి పడ్డంలేదు. అంటే కిటికి తలుపులు ప్రొఫెసర్ మూసేశాడన్నమాట.
థాంక్ గాడ్...నిట్టూర్చాడు.
"సార్...ఎంత భయపడిపోయానో... మనం వేరే రూమ్ లోకి వెళ్లిపోదామా?"
ప్రభు భుజం మీద చేయి పడింది.
"భయం కాదు సార్...ఏదో ఫీలింగ్...ప్లీజ్ సార్..." అన్నాడు ప్రొఫెసర్ తనను మరోలా అర్ధం చేసుకుంటాడని భయపడి.
తన భుజం మీద నుంచి చేయి తొలిగిపోయింది. చేయ్యేమిటి చల్లగావుంది అనుకుంటూ ఉండగానే
క్యాండిల్ వెలుతురు...తలుపు దగ్గర ప్రత్యక్షమైంది.
క్యాండిల్ వెలిగించి తీసుకువస్తున్నాడు ప్రొఫెసర్
"ఏమిటోయ్ అప్పట్నుంచి నీలో నువ్వే గొణుక్కుంటున్నావ్. మ్యాచ్ బాక్స్ దొరికేసరికి ఆలస్యమైంది" చెబుతున్నాడు ప్రొఫెసర్.
కానీ ప్రభు అదేమీ వినే స్థితిలోలేడు. క్యాండిల్ వెలుతురు మెల్లి మెల్లిగా గదంతా పరుచుకుంటోంది.
అయితే ఇంతక్రితం...కిటికీ తలుపులు మూసిందెవరు? తన భుజం మీద పడిన చేయి ఎవరిది?
అంత చలిలోనూ అని మొహంలో చెమట.
ఐస్ మీద పడుకోబెట్టిన శవం వంక చూశాడు భయంగా.
డెడ్ బాడీ ప్రశాంతంగా నిద్రపోతున్నట్టుంది.
"వాట్ ప్రభు..ఎనీ థింగ్ రాంగ్..డెడ్ బాడీలో ఏమైనా చేంజ్ కనిపించిందా?" ఆత్రంగా అడిగాడు ప్రొఫెసర్.
"అలాంటిదేమీ లేదుసర్..." అన్నాడు తడబాటుగా ప్రభు.
"నువ్వు కాస్త భయపడినట్టున్నావు. పద...నిన్ను బెడ్రూంలో వదిలేసి వస్తాను" అన్నాడు ప్రొఫెసర్.
"మీరు వచ్చేయండి సార్...నిన్నంతా అబ్జర్వ్ చేశారుగా..." అన్నాడు ప్రభు.
కాసేపు ఆలోచించి "ఆల్ రైట్...పద" అన్నాడు.
పరమహంస ముందుకు నడిచాడు. ఒక్కక్షణం వెనక్కి తిరిగి శవం వంక చూసిన ప్రభు మరుక్షణం వణికిపోయాడు.
శవం చూపుడు వేలు దగ్గర రక్తం కారి గడ్డకట్టి వుంది. ఇందాక కిటికీ రెక్క చప్పుడు విని తనే అన్నాడు 'దెబ్బ తగులుతుంది జాగ్రత్త అని...
అప్పుడే దెబ్బ తగిలినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
మైగాడ్. ఇది...ఇదెలా సాధ్యం?
ప్రొఫెసర్ తో చెబితే
అర్దరాత్రి పరిశోధన అంటూ మొదలెడతాడు.
ఎటు వెళ్లి ఎటు దారితీస్తుందో? అయినా ఇదంతా తన భ్రమేమో?
కానీ, అది భ్రమకాదని, కళ్లముందే కనిపించే వాస్తవమని తన మనసు చెబుతోంది.
"ప్రభు...ఏంటి...అలానే నిలబడిపోయావు?" అడిగాడు ప్రొఫెసర్.
"నథింగ్...ఏమీ లేదు సార్..." అంటూ బయటకు నడిచాడు.
"ప్రభు...ఆ గది తలుపులు దాటి, తలుపులు మూస్తోన్న సమయంలో ఆ డెడ్ బాడీ కన్రెప్పలు తెరుచుకుని కళ్ళు విచిత్రంగా విప్పుకొని ప్రభువైపు చూడ్డం...ప్రభు గమనించలేదు.
గమనించి ఉంటే కథ మరోలా మారి వుండేది...
* * *