యాభై ఐదు సంవత్సరాల వయస్సు అతనిది. బట్టతల, కళ్లజోడు...స్టయిలుగా పైప్ పీలుస్తూ వీళ్ల దగ్గరకి వచ్చాడు.
'గుడ్ మార్నింగ్ జంటిల్ మేన్...నాకు ప్రభు అంతా చెప్పాడు...ప్లీజ్ కమిన్..." అంటూ లోపలికి దారితీశాడు.
"విచిత్రమైన వ్యక్తిలా వున్నాడు" తన ఫ్రెండ్స్ కు మాత్రమే వినిపించేలా కామెంట్ చేసాడు విల్సన్.
నలుగురూ లోపలికి వెళ్లారు...
ప్రొఫెసర్ పరమహంస గెటప్ కూడా గమ్మత్తుగా వుంది. ప్యాంటు ఒక కలర్, దానిమీద వేసుకున్న కోటు మరో కలర్. ఆ సూటు చాలా పాతదని, చాలా ఏళ్ల క్రితందని అర్ధమవుతూనే వుంది. లోపల పెద్ద టేబుల్. ఆ టేబుల్ కు అటువైపు పాతకాలం నాటి రివాల్వంగ్ చైర్. దానిలో కూచున్నాడు.
టేబుల్ మీద గాజు బీకర్లు వున్నాయి. ఎదురుగా ఉన్న రేక్స్ లో సైన్స్, పిక్షన్, క్రిమినాలజీకి.... సంబంధించిన బోల్డు బుక్స్ వున్నాయి...
* * *
"మీలో మిస్టర్ నచికేత ఎవరు?"
నచికేత తనేనన్నట్టు చెప్పాడు.
"వెల్...నీ ఫ్రెండ్ అంతా చెప్పాడు...యూ...సీ...కలలను చాలామంది చాలా తేలిగ్గా తీసిపారేస్తారు...కానీ, ఈ కలలు వున్నాయే...అందులో కొన్ని మోస్ట్ డేంజరస్...టెలీపతి...ఈవిల్ స్పిరిట్... ఇలాంటి వాటిమీద నమ్మకం లేనివాళ్ళు, ఈ కలలను కూడా చాలా తేలిగ్గా తీసి పారేస్తారు. ఒక్కో కలకు, ఒక్కో అర్ధముంటుంది. చీకటిలో ఎవరో లాంతరు పట్టుకుని వెళ్తున్నట్టు మీకు కలోస్తే ఊహించని ప్రమాదం జరగబోతుందని హెచ్చరిక కూడా. హటాత్తుగా ఓ బిల్డింగ్ మీ కలలోకి వస్తే అది దెయ్యాల నిలయమని కలవస్తే, మీ హేపీ లైఫ్ లో ఏదో బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరగబోతోందని సూచన.
అయితే ఇలాంటి కలలన్నీ ఇలాంటి సూచనలను తెలియచెస్తాయని ఫీలవ్వొద్దు. రాత్రివేళ మీ ఆలోచనలుకూడా కలలుగా రావచ్చు. మీ తీరని కోరికలు...మీకు ఇష్టమైన విషయాలు కూడా మీరు కలగనవచ్చు. కొంతమంది ప్రముఖులకు వచ్చిన కలలను గమనిస్తే మీకు ఆశ్చర్యంగా వుంటుంది.
ప్లేటో, షేక్సిపియర్, నెపోలియన్ వంటి ప్రముఖులు కూడా ఈ కలల విషయంలో మినహాయింపు కాదు. బహుశా...కెనడీ అనుకుంటా...తను హత్య చేయబడతానని అతనికి ముందే తెలుసట...ఇవన్నీ విన్నవీ,
చదివినవీ...అయితే..ఈ గ్రేట్ ప్రొఫెసర్ పరమహంస శోధించి తెలుసుకున్న విషయాలు కూడా వున్నాయి.
"మీ కొచ్చిన కలలో అడవి...గెస్ట్ హౌస్ కనిపించాయి కదా..మీరా అడవిని బాగా గుర్తు తెచ్చుకోండి. ఆ గెస్ట్ హౌస్ ని కూడా...అన్నట్టు...మీరు మంచి పెయింటరట కదా...ఆ గెస్ట్ హౌస్ అడవిని వూహించి బొమ్మవేయగలరా?
వెంటనే ప్రభు చెప్పాడు.
"మా వాడు ఆ అడవి బొమ్మ వేసాడు సార్, గెస్ట్ హౌస్ గుర్తుకురావడంలేదట.." .
"ఐ...సీ...నో ప్రాబ్లెం...ఆ అడవి బొమ్మ వుంది కదా...అది చాలు...అతని స్ట్రోక్ ని బట్టి, ఆ అడవిని బట్టి ఈజీగా ఇతని సమస్యను సాల్వ్ చేయగలను. యూ...నో...నేను చాలా అడవులను పరిశోధించాను. అడవుల్లోని రహస్యాలను చేదించాను...మీరు వెంటనే వెళ్లి కాన్వాసు పట్రండి..." పరమహంస పైప్ ని నోట్లో పెట్టుకుని ఒక్కసారి పొగ బయటకు వదిలి అన్నాడు.
అరగంటలో తీసుకువస్తానని లేచారు.
* * *
నచికేత గబగబా తన గదిలోకి వెళ్లాడు, అతని ఫ్రెండ్స్ కూడా కాన్వాస్ వంక చూసి షాకయ్యాడు నచికేత. అతనికూడా వచ్చిన ఫ్రెండ్స్ కూడా...
సరిగ్గా అప్పుడే రామయ్య ఆ గదిలోకి తొంగి చూసి నవ్వుకున్నాడు.
వి...కృ...తం...గా...
2
ఒక్కక్షణం నచికేత మనస్సు కీడును శంకించింది.
మిగతా నలుగురు ఫ్రెండ్స్ చేష్టలుడిగి నిల్చుండిపోయారు
"రామయ్యా..." గట్టిగా కేకవేసి పిలిచాడు నచికేత.
"ఏంటి బాబూ..." అంటూ రామయ్య నచికేత గదిలోకి వచ్చాడు.
"ఈ కాన్వాసు మీద రంగులేంటి ఇలా చెదిరిపోయాయి?" కోపంగా అడిగాడు రామయ్యను నచికేత.
రామయ్య అటకవైపు చూపించాడు.
అటకమీదనుంచి నీళ్ళు ధారగా కాన్వాసు మీద పడుతున్నాయి చుక్కలు చుక్కలుగా.
సరిగ్గా అటక కింద కాన్వాసు వుంది.
నేలమీద వాటర్ జగ్ పగిలిపోయి వుంది.
"మాయదారి పిల్లి అటక ఎక్కి అటకమీదవున్న వాటర్ జగ్ ని తోసేసింది. ఆ వాటర్ జగ్ లోని నీళ్ళు కాన్వాసు మీద పడ్డాయి."
"పడితే..."
"బొమ్మ పాడయిపోతుందని కాన్వాసు మీద పడ్డ నీళ్లని తువ్వాలతో తుడిచా..." రామయ్య తాపీగా చెప్పాడు.
"నీ కసలు బుద్ది వుందా? తువ్వాలతో తుడిస్తే రంగులు చెదిరిపోవా? అయినా అటకమీద వాటర్ జగ్ ఎవరు పెట్టారు?" అనుమానంగా అడిగాడు నచికేత.
"అది నాకేటి తెలుస్తాది? అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఆ గదిలోనుంచి వెళ్లిపోయాడు రామయ్య.
"భలే పని మనిషి దొరికాడు నీకు...అయినా అదేంటి, అడిగిన దానికి సమాధానం సరిగ్గా చెప్పకుండా
వెళ్లిపోతాడు. అతడి వాలకం చూస్తుంటే, ఏదో అనుమానంగావుంది" సూర్యనారాయణ అన్నాడు.
"అతని పద్దతే అంత" చెప్పాడు నచికేత.
"అద్సరే...ఇప్పుడు ప్రొఫెసర్ గారికి ఏం చూపించాలి? ఎలా చూపించాలి?" ప్రభు అనుమానం వ్యక్తం చేశాడు.
కాన్వాసు మీద బొమ్మ షేపే సరిగ్గా కనిపించడం లేదు.
"టేకిటీజీ ఫ్రెండ్...మళ్ళీ వూహించి ఆ బొమ్మ గీసేయ్..." సూరజ్ చెప్పాడు.
"గుడ్ ఐడియా...వెంటనే గీసేయ్..." సూర్యనారాయణ అన్నాడు.
"ఇంకేంటి ఆలస్యం...మాకు ముందు వేడి వేడి టీ తాగించి, బొమ్మ మొదలెట్టేయ్...అరగంటలో నువ్వు బొమ్మ గీయగలవు..." నచికేతను ఉత్సాహపరుస్తూ అన్నాడు విల్సన్.
ప్రభు మౌనంగా ఉండిపోయాడు.
నచికేత మళ్ళీ రామయ్యను కేకేసి అందరికీ టీ పట్రమని చెప్పి...కాన్వాసు దగ్గరికి వెళ్లాడు.
* * *
ఒక్క క్షణం గట్టిగా కళ్ళు మూసుకున్నాడు నచికేత.
రాత్రి తనకు కలలో కనిపించిన అడవిని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించసాగాడు.
ఎంత గుర్తుకు చేసుకుందామని ప్రయత్నించినా గుర్తుకు రావడంలేదు.
షిట్...బుల్ షిట్...తల విదిల్చాడు నచికేత.
"ఏమైందీ నచీ...గుర్తుకు రావడంలేదా?" ప్రభు నచికేత పక్కనే కూచోని అడిగాడు.
"అవును ప్రభూ...ఎంత గుర్తు చేసుకుందామని ప్రయత్నించినా, గుర్తుకు రావడంలేదు..."
"బలవంతంగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించొద్దు. ముందు నువ్వు రిలాక్స్ అవ్వు..." ప్రభు చెప్పాడు.
"ఈలోగా రామయ్య టీ, ఓ ట్రేలో బిస్కెట్స్ తెచ్చి టీపాయిమీద పెట్టాడు.
వాతావరణం చల్లగావుంది.
బిస్కెట్స్ తిని, టీ సిప్ చేస్తున్నారు ఐదుగురూ...
నచికేత మనసంతా రాత్రి తనకు వచ్చిన కలమీదే వుంది. లీలగా కూడా గుర్తుకు రావడంలేదు.
"నచీ...ఎక్కువగా వర్రీ అవ్వకురా..." సూరజ్ అన్నాడు.
నచికేత మాత్రం రాత్రి తనకొచ్చిన కలను గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తూనే వున్నాడు.
ఒకటి...రెండు...మూడు...
సరిగ్గా నాలుగో నిముషం...
నచికేత మొహంలో వెలుగు కొట్టొచ్చినట్టు కనిపించింది.
లీలగా గుర్తొస్తోంది.
కాన్వాస్ దగ్గరికి వెళ్లాడు.
బ్రష్ చేతిలోకి తీసుకున్నాడు.
అతని చేయి కాన్వాస్ మీద కదలబోతుండగా, రామయ్య కళ్ళు బ్రష్ స్టాండు మీద పడ్డాయి.
స్ప్లిట్ సెకండ్...
ఎవరో తోసినట్టు బ్రష్ స్టాండ్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది.
ఆ బ్రష్ స్టాండులో ఉన్న రంగులు నేలమీద పడిపోయాయి.
బ్రష్ స్టాండ్ కింద పడ్డ శబ్దానికి ఏకాగ్రతతో రాత్రి తనకు కలలో కనిపించిన అడవిని గీయాలనుకున్న నచికేత డిస్టర్ బ్ అయ్యాడు.
నేలమీద పడిపోయిన బ్రష్ స్టాండువైపు చూశాడు.
"స్టాండు సరిగ్గా లేదా?" సూరజ్ అడిగాడు.
"ఏమో..." అన్నాడు అనాలోచితంగా నచికేత.
"ఇంక రంగుల్లేవా?"
"లేవు...నిన్ననే తీసుకువద్దామనుకున్నా..."
"అయ్యోయ్యో...ఇప్పుడెలా?"
ఒక్కక్షణం అంతా చికాగ్గా అనిపించింది. బ్రష్ ను ఓ మూలకి గిరాటేసి, మంచంమీద కూర్చుని తల పట్టుకున్నాడు నచికేత.
"వాట్ యార్...ఇంతలో ఏమైంది?" అంటూ విల్సన్, సూరజ్, సూర్యనారాయణలు నచికేత కు ధైర్యం చెప్పారు.
ప్రభు మాత్రం మౌనంగా ఉన్నాడు.
సరిగ్గా ఐదు నినిశాల క్రితం...
టీ తాగి, అద్దంలో తన మొహం చూసుకుంటూ ఉండగా రామయ్య తీక్షణంగా బ్రష్ స్టాండ్ చూడ్డం గమనించాడు. కొన్నిక్షణాల్లోనే బ్రష్ స్టాండ్ ఎవరో నెట్టినట్టు కిందపడ్డం ప్రభు నోటీసులోకి వచ్చింది.