Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 4

    "ఏమన్నారూ?"

    "లోపల సరుకు లక్షల ఖరీదుమీద వున్నప్పుడు మాత్రం ముందుచూపు, జాగ్రత్త వాడికే కాదు- మనకీ వుంటుంది"

    "అంటే ఆ పెట్టెలో__"

    "వుంది చాలా పెద్ద సరుకే వుంది"

    "నాకూ ముందు ఆ అనుమానం వచ్చిందిగాని అవునో కాదో అని మిన్న కుండిపోయాను."

    "అనుమానం అక్కరలేదు"

    "ఇంతకీ ఆ సరుకు-"

    "ఇష్" అన్నాడు కోదండరామయ్య హెచ్చరికగా.

    "ఊ....." అంది వెంకుమాంబ గమనించనట్టుగా.

    సి.ఐ.డీ.లు దొంగలముఠా నాయకులు కోడ్ భాష వాడుతుంటారు. కోదండరామయ్య ఇష్ కి వెంకుమాంబ ఊకి అర్ధం చచ్చినా పరాయివాళ్ళకి అర్ధంకాదు.

    అది వాళ్ళ కోడ్ భాష.

    ఏకపాదం లోపలికి వచ్చాడు.

    సర్కార్ ఎక్స్ ప్రెస్ కూత వేసి కదిలింది.

            3

    "మీరు పేపరు చదువుతారుకదా అని ఇచ్చాను. అలా మడత విప్పకుండా వుంచారేమిటి?" కూర్చుంటూ అడిగాడు ఏకపాదం.

    "చదువుదును. ఈ లోపల మా ఆవిడకి పెద్ద అనుమానం వచ్చింది."

    "అనుమానమా?" అనుమానంగా అడిగాడు ఏకపాదం.

    "అవును. చాలా పెద్ద అనుమానం వచ్చింది."

    "దేనిమీద?"

    "సర్కార్ ఎక్స్ ప్రెస్, గంగా కావేరి, కృష్ణా, జి టి, గోదావరి ఇలాంటి పేర్లు ఈ రైళ్ళకి ఎవరు పెడతారు అని.....వివరించకపోతే ఈ రాత్రికి యిక నిద్రపోదని వివరిస్తూ కూర్చున్నాను."

    "అదన్నమాట" తేలికగా వూపిరి పీలుస్తూ అన్నాడు ఏకపాదం.

    అతను తేలికగా వూపిరి పీల్చటం, ముఖంలో సంతృప్తి ఇరువురు గమనించారు.

    కోదండరామయ్య, వెంకుమాంబ చూపులు కల్సుకుని నిశ్శబ్దంగా సంభాషించుకున్నాయి. వాళ్ళకి చూపుల భాష వచ్చు. వేరొకరు అయితే ఈ భాష నేర్చుకోవటం కూడా చాలా కష్టం.

    తర్వాత కోదండరామయ్య ఆ మాటా ఈ మాటా మొదలు పెడుతూ ఏకపాదం వివరాలు కనుక్కోవటం మొదలుపెట్టాడు. ఏకపాదం చెప్పే కబుర్లు చాలావరకు హంబక్ అని గ్రహించాడు. ఈలోపల వెంకుమాంబ పేపరు తిరగేసింది.

    "ఇది విన్నారా? వెంకుమాంబ పేపరు మధ్యలోంచి తల బయటపెట్టి అడిగింది.

    "ఏది?" కోదండరామయ్య అడిగాడు.

    "వాడెవడో దొంగవెధవ, వరసపెట్టి నలుగురిని పొడిచి వాళ్ళ సొమ్మును, సామాను గోతంలోవేసుకుని బస్సు ఎక్కాడట. మనిషి చూడపోతే టిప్ టాప్ గా వున్నాడు. చూడబోతే అతనివెంట పాతగోతం. బస్సు కండక్టరు అనుమానించి మూట విప్పించాడు. దానిలో సరుకులు, సరంజామాతోడు నెత్తురోడుతున్న కత్తికూడా వుంది. దాంతో...."

    వెంకుమాంబ చెప్పటం పూర్తికాకముందే కోదండరామయ్య అందుకొని"....వాడిని పట్టుకున్నారు. నాలుగు వుతికారు అంతేనా!" అన్నాడు.

    "సరీగా అంతే." వెంకుమాంబ అంది.

    "పాడు పేపరు, చెత్తన్యూసు. యివి ఎప్పుడూ వుండే గోలలే. వరకట్నం చావులు, రైలుకింద తల పెట్టటాలు, లాకప్ లో లీలలు, పార్టీ మార్పిళ్ళు__ఆపెయ్__ఆ చెత్త అంతటితో ఆపెయ్" అన్నాడు కోదండరామయ్య.

    వెంకుమాంబకి విషయం అర్ధం అయింది. తను ఏమాత్రం ముందుచూపు లేకుండా పేపర్ వార్త పైకి చదివింది. అలా చదవకుండా వుండాల్సింది." అనుకుంది.

    వీళ్ళిద్దరి తీరు ఇలా వుంటే ఆ వార్త గురించి ఏకపాదం ఏ విధమైన కామెంటూ చేయలేదు. పేపరు కొన్నందుకు పేపరు తిరగేసిన పాపాన పోలేదు పైగా-

 Previous Page Next Page