"మాష్టారూ! నాకు సిగరెట్ తాగే అలవాటు వుంది. గుమ్మంలో నుంచుని పోగావడలి వస్తాను" అని చెప్పి సమాధానం ఆశించకుండా సీటులోంచి బయటికి వెళ్ళాడు.
మళ్ళీ కోదండరామయ్య, వెంకుమాంబ కళ్ళూకళ్ళూ మాట్లాడుకున్నాయి.
సాధారణంగా ఇరువురు వ్యక్తులు ఏ విషయం చర్చించుకుంటున్నా మూడోవ్యక్తి నోరు మూసుకుని వుండడు. మధ్యలో కల్పించుకుని వకమాట అన్నా వదులుతాడు. లేకపోతే అదేపనిగా చర్చ సల్పుతాడు. అలాంటిది తనంతట తానుగా మాట్లాడిన మనిషి దొంగాడి కధ వచ్చేసరికి తేలుకుట్టిన దొంగలా పెదవులు బిగించుకొని వుండిపోయిందేగాక సంభాషణలో ఎక్కడా కలుగజేసుకోవాల్సి వస్తుందోనని సిగరెట్ తాగే మిషతో అవతలికి వెళ్ళాడు ఏకపాదం.
దీనినిబట్టి ఏమనుకోవాలి?
ఏదో వుందనే అనుకోవాలి కదా?
ఏదో అంటే?
రహస్యం.
రహస్యమంటే రహస్యమే.
ఏకపాదం రహస్యం.
ఎర్రరంగు పెద్దపెట్టె
పెద్ద రహస్యం.
ఎర్రపెట్టె గురించి, ఏకపాదం గురించి మాట్లాడుకుందామా అంటే అతగాడు యిక్కడే వున్నాడు. పోనీ మనకెందుకొచ్చిన వెధవగోల అనుకుందామా అంటే పాడుమనసు వూరుకోవటం లేదు. పింజాం పింజాం అంటున్నది. ఎలా?
చూసి చూసి మనసు ఆగక "పెట్టె బాగుంది నాయనా!" అంది వెంకుమాంబ.
'పెట్టె సంగతి ఎత్తకూడదు. దీనికేమీ తెలియదు నా మీద గొణగడం తప్పించి' అనుకొన్నాడు కోదండరామయ్య.
"ఈ దిక్కుమాలిన పెట్టె గురించి ఎత్తకండి తలుచుకుంటే చాలు వళ్ళు మండిపోతుంది." ముఖం చిటపటలాడిస్తూ చెప్పాడు ఏకపాదం.
"అదేమీ...." దీర్ఘం తీస్తూ అడిగింది వెంకుమాంబ.
"నేను వూరు ప్రయాణం కావటం చూసి మా తాత గారు, వాళ్ళ స్నేహితుడికి ఈ పెట్టె ఇమ్మని నాకు తగిలించారు. సరదాగా నే వెళుతుంటే సైతాన్ లా ఈ పెట్టె ఒకటి ప్రాణానికి" విసురుగా జవాబిచ్చాడు ఏకపాదం.
"తాడూర సందులేదు మెడకో డోలుట" వెంకుమాంబ సామెత వదిలింది.
"మా ఆవిడకి సామెతలు బాగావచ్చు" ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడాడు కోదండరామయ్య.
మళ్ళీ స్టేషన్ రావటంతో బండి ఆగింది. బండి ఆగింది కాబట్టి ఏకపాదం బండి దిగాడు. బైట గాలిమేసి రావటానికీ.
బండి ఆగింది ఏ స్టేషనో చూడక ముఖముఖాలు చూసుకున్నారు కోదండరామయ్య, వెంకుమాంబలు.