Previous Page Next Page 
పెట్టితిసిచూడు పేజి 3

    "మాష్టారూ! మీరు ఏం ఉద్యోగం చేసారు?" ఏకపాదం అడిగాడు.

    "నీవు మాష్టారూ అని పిలిచావు చూడు. అదే ఉద్యోగం. కాకపోతే కాస్త మార్పు అనుకో.  రైల్వేలో గూడ్సు మాష్టరు చేసి రిటైరు అయ్యాను."

    "గూడ్సు మాష్టరు అంటే ఎగుమతి, దిగుమతి!"

    "ఆ అదేలే వెధవ జాబ్"- ఎగుమతి, దిగుమతి అంటే లాభ నష్టాల గురించి మాట్లాడతాడేమో ముఖం చిట్లించి విసుగ్గా సమాధానం చెప్పాడు కోదండరామయ్య.

    ఏకపాదం ఇంక ఆ విషయం వదిలేశాడు.

    తర్వాత సంభాషణ వేరే విషయాలమీద దొర్లింది.

    ఏకపాదం మంచి మాటకారి. వసపిట్టలాగా వాగుతూనే వున్నాడు.

    స్టేషను రావడంతో ట్రైను ఆగింది.

    ఏకపాదం టీ తాగి వస్తానని చెప్పి రైలు దిగాడు.

                                                          2

    ఏకపాదం రైలు దిగగానే

    "నీకేమనిపించింది వెంకూ!" అని అడిగాడు కోదండరామయ్య.

    "నాకు సరే- మీకు ఏమనిపించింది?" ఎదురు ప్రశ్నించింది వెంకుమాంబ.

    "విచిత్రంగా వింతగా విడ్డూరంగా"

    "నాకూ అలాగే అనిపించింది సుమా! ఈ కాలం కుర్రాళ్ళు ప్రయాణాల్లో చిన్న బ్రీఫ్ కేసుకాని, హ్యాండ్ బేగ్ కాని, దర్జాగా వి.ఐ.పి. సూట్ కేసుకాని వెంట తీసుకుపోతారు...."

    "ఈమధ్య మద్దెల ఆకారంతో వుండే మద్దెల బ్యాగ్ వాడుతున్నారు. ప్రతివారికీ అదో ఫ్యాషన్ అయింది. అలాంటిది...." కోదండరామయ్య అర్దోక్తిలో ఆగాడు.

    ఆ తర్వాత మాటలు ఆమె పూర్తిచేస్తుంది. అది వాళ్ళకి అలవాటు. చాలా విచిత్రంగా ఇరువురి ఆలోచనలు వకటే.

    వెంటనే అందుకుంది వెంకుమాంబ.

    "మరే అలాంటిది ఈ కుర్రాడు గొట్టాం ప్యాంటు వేసుకున్నాడు, పూలపూల షర్టు తగిలించుకున్నాడు. హిప్పీయో జిప్పీయో అలాంటి క్రాపు వుంది. మూతిపక్కనుంచి కిందకి జారిన మీసాలు పిల్లిగడ్డం నల్లద్దాల కళ్ళజోడు. ఇంతగా అలంకరించు కున్నవాడు చిన్న తోలుపెట్టెగాని, చంకను తగిలించుకునే తోలు సంచీగానీ ప్రయాణంలో తెచ్చుకోక నా అంత లావు నా అంత పొడుగుగల ఇనపెట్టెని తీసుకురావడం ఏమిటి? పేరు చూద్దామా ఏకపాదం! కథ చూద్దామా కల్పితం! పిచ్చిముండావాడు మనం నమ్మామనుకుంటున్నాడు వాడు చెప్పింది"

    "ఇంతకీ ఆ పెట్టెలో ఏముందంటావ్ వూహించగలవా వెంకమాంబలూ!" కోదండరామయ్య తమాషాగా చిలిపిగా అడిగాడు.

    వెంకుమాంబ మూతి ముచ్చటగా తిప్పి "బాగానే వుంది సంబడం అక్కడికేదో మీకు తెలియంది నాకు మహా తెలిసినట్లు ఏమిటా ప్రశ్న? అతగాడినే అడగండి. ఆ పెట్టెలో వజ్ర వైడూర్యాలే దాచాడో చెపుతాడు" అంది.

    కోదండరామయ్య ఉలిక్కిపడ్డాడు.

    "ఏది మళ్ళీ చెప్పు?"

    "ఎందుకు?"

    "ముందు చెప్పు చెపుతాను"

    వెంకుమాంబ మళ్ళీ చెప్పింది.

    "అర్ధమైంది"

    "ఏమర్ధమైంది?"

    "ఆ పెట్టెతో_"

    "మాష్టారు!" అన్న పిలుపుతో కోదండరామయ్య ఉలిక్కిపడి "ఆ పెట్టెలో...." అంటూ గుసగుసలాడుతూ విషయం చెప్పబోతున్న వాడల్లా మాట మింగేసి కిటికీవేపు చూశాడు.

    "మాష్టారూ! పేపరు కొన్నాను. ఈ లోపల చూస్తూ వుండండి. బండిలో ఏవో ఇనపసామానులు వేస్తున్నారు, అయిదు నిమిశాలపైనే ఆగుతుంది. అలా రెండడుగులు వేసి వస్తాను" కిటికీ చువ్వల మధ్యనుంచి పేపరు అందించి వెళ్ళిపోయాడు ఏకపాదం.

    ఏకపాదం నాలుగడుగులు అటు వెయ్యగానే "చూశావా! నా అనుమానం అక్షరాలా నిజం, వాడు మధ్యమధ్య ఓ కన్ను యిటువేసి వుంచుతున్నాడు అంటే పెట్టేమీద అని అర్ధం" మళ్ళీ గుసగుసలాడాడు కోదండరామయ్య.

    "భాషాణమంత బరువున్న ఆ పెట్టెని ఎవరు ఎత్తుకెళతారు గనక! అయినా కూసే గాడిదలు ఎక్కువ, మోసే గాడిదలు తక్కువ"
    "లోపల సరుకు లక్షలమీద వున్నప్పుడు అంతేమరి!"

 Previous Page Next Page