డైలాగ్స్ రాసే మార్తాండ్ తల పట్టుకు కూర్చున్నాడు.
ఒక గంట ఒకరితో ఒకరు సంబంధం లేకుండా అరుచుకున్నాక, మంజీర తన 'కండీషన్స్' చెప్పి ఫ్రెండ్స్ తో జారుకుంది.
మొదటిరోజు రిహార్సల్స్ అయ్యేటప్పటికీ, వాసుకి రెండు తలనెప్పి బిళ్ళను వేసుకోవాల్సి వచ్చింది.
* * * *
"మంజూ ఏది?" అడిగాడు నారాయణమూర్తి భార్యని.
"మీ ముద్దుల కూతురేమో కాలేజీలో నాటకాలు ఆడ్తుందిట లేటుగా వస్తానని చెప్పమంది. ఇంక ఇంట్లో మిగతా వాళ్ళ నాటకాల గురించి... ఎందుకు లెండి! ఎంతైనా మీరూ, మీరు ఒకటే, నేను పరాయిదాన్ని" అంది సుమిత్ర నిష్టూరంగా.
ఆమె ఎవరి గురించి ఏమంటోందో తెలియనంతటి అమాయకుడు కాదు నారాయణమూర్తి.
"వయసులో ఉన్న పిల్ల ముందరే ఈ ముసలి జంట శృంగారం! హవ్వ, సిగ్గుపోతోంది" అంది మళ్ళీ.
"సుమిత్రా!" కోపంగా అరిచాడు అతను.
"ఏం తప్పా! నేను మీ ముందర అంటున్నాను, ఆ ఇరుగింటి వాళ్ళూ, పొరుగింటి వాళ్ళూ అందరూ మనని చూసి చెవులు కొరుక్కుంటున్నారు తెలుసా?"
"వచ్చిన కొత్తల్లో, ఆమెని మారే కాలంతో బాటు మారమనీ, చాదస్తాలు వదిలించుకోమనీ, రోజూ సాధించేదానివి. ఒక్కసారి గుర్తుతెచ్చుకో!"
"అంటే ఇలా బరితెగించమనా? మీ మేనత్త ఇలాంటిది అని నలుగురికీ తెలిస్తే, మంజూకి పెళ్ళవుతుందా?" అడిగింది సుమిత్ర.
నారాయణమూర్తి అదిరిపడి చూసాడు. మంజీర 'ఫారెన్'లో గిటార్ వాయిం చుకునే వాడితో తిరిగినప్పుడూ, కనిపించిన ప్రతి యువకుడ్నీ అల్లరి పెట్టినప్పుడూ, కాలేజీలో మొదటిరోజే ఎవర్నో కొట్టి, ఇంటికి వచ్చినప్పుడూ, సుమిత్రకి రాని అనుమానం, ఇప్పుడు వచ్చింది.
"అరుంధతీ, లూ చనువుగా తిరగడం వల్ల తన పిల్లకి పెళ్ళవుతుందా? అని" అతను జాలిగా నవ్వాడు. ఆమెతో మాట్లాడలేదు. వారిమధ్య స్థాయీ బేధం ఉంది!
* * * *
"అరూ... అటు చూడు" అన్నాడు లూ.
అరుంధతీ, అతనూ ఓ పెద్ద హోటల్లో ఫ్యామిలీ 'రూం'లో కూర్చుని ఉన్నారు. ఆ గదిలో వాళ్ళు కాక, మరో పడుచు జంట కూడా ఉన్నారు.
అతనూ, ఆ అమ్మాయీ కలిసి ఒకే కూల్ డ్రింక్, రెండు 'స్ట్రా'లు వేసుకుని తాగుతున్నారు.
"మనమూ అలాగే చేద్దామా?" అడిగాడు లూ.
అరుంధతి చిరుకోపంగా చూసింది.
లూ, సర్వర్ ని పిలిచి "ఒక కూల్ డ్రింక్, రెండు స్ట్రాలూ" తెప్పించాడు.
"ఊ... కానీ" అన్నాడు అరుంధతికి ఒక 'స్ట్రా' ఇస్తూ.
అరుంధతి సిగ్గు పడ్తుంటే, "బావుంటుందేమో చూద్దాం! లేకపోతే వాళ్ళెందుకు అలా చేస్తారూ?" అన్నాడు.
అరుంధతీ, లూ ఒకరి కళ్ళలోకి, ఒకరు చూసుకుంటూ డ్రింక్ తాగడం పూర్తిచేసారు. పూర్తయ్యాక, ఇద్దరికీ ఆపుకోలేనంత నవ్వొచ్చేసింది. ఫకాల్న నవ్వేశారు. వీళ్ళ నవ్వుతోబాటు మరో నవ్వు వినిపించి వెనక్కి తిరిగి చూసారు.
ఆ జంట కూడా వీళ్ళనే గమనిస్తున్నట్లున్నారు, నవ్వుతున్నారు.
'లూ' లేచి నిలబడి ఆ యువకుడ్ని చూస్తూ, "థాంక్స్! కూల్ డ్రింక్ ఎలా తాగాలో లేట్ గానైనా మాకు నేర్పినందుకు" అన్నాడు.
అరుంధతి సిగ్గుగా తల వంచుకుని బైటికి నడిచింది.
లూ కూడా నవ్వుకుంటూ ఆమెని అనుసరించాడు.
* * * *
మంజీర మంచి మూడ్ లో ఉందనడానికి గుర్తుగా, ఇల్లంతా పాప్ మ్యూజిక్ తో అదిరిపోతుంది. దానికి అనుగుణంగా ఆమె స్టెప్స్ వేస్తోంది.
"హాయ్ డాల్!" అన్నాడు లూ, మంజీర గది ముందు నుండి వెళ్తూ.
"హాయ్! వైడోంట్ యూ జాయిన్ విత్ మీ" అంది మంజీర డాన్స్ ఆపకుండానే.
"ష్యూర్!" అంటూ అతను కూడా లోపలికి నడిచి, ఆమెను అనుసరించి స్టెప్స్ వెయ్యసాగాడు.
మంజీర అతనికి సరిగ్గా నేర్పిస్తూ ఉండగా, అరుంధతి అక్కడికి వచ్చింది. ఆమెకి అతని అవస్థ చూస్తుంటే చాలా నవ్వొచ్చింది.
"చిన్నప్పుడు తప్పెట గుళ్ళూ, చక్కె భజనల వాళ్ళొస్తే ఇలాగే ఎగిరేవాడివి" అంది.
అతను ఆపకుండానే, "నవ్వడం కాదు! కావాలంటే చేసి చూడు! ఎంత కష్టమో తెలుస్తుంది" అన్నాడు.
"గ్రానీ తలుచుకుంటే అబ్బని విద్యేలేదు అన్నావుగా!" అంది గారాలు పోతూ మంజీర.
"ఈ విషయంలో మాత్రం చెప్పలేను. నాకే చాలా కష్టంగా వుంది" అన్నాడు లూ ఆమెని రెచ్చగొడ్తూ.
"నీకు కష్టంగా ఎందుకు ఉండదూ?" ఆ బొజ్జ అడ్డు మరి!" అంది అరుంధతి నవ్వుతూ.
"అహా... అయితే నువ్వు చెయ్యి, ఆ బొజ్జ అడ్డు లేదుగా..." చిన్నపిల్లాడిలా ఉడుకున్నాడు అతను.
"నేను చెయ్యలేననా?" అడిగింది అరుంధతి.
"నూటికి నూరుపాళ్ళూ అదే నా అభిప్రాయం!" అన్నాడు.
అరుంధతి కొంగు నడుము చుట్టూ తిప్పి, దోపి, "ఏదీ చూపించవే!" అంది.
మంజీర ఉత్సాహంగా, "వన్... టూ..." అని స్టెప్స్ నేర్పించసాగింది.
మొదట్లో కాస్త సిగ్గుగా అనిపించినా, తరువాత అలవాటయి, ఆమెతోబాటే జోరుగా చెయ్యసాగింది అరుంధతి.
"వెరీగుడ్! దట్స్ ది స్పిరిట్!" అంటూ మంజీర ఉత్సాహపరచసాగింది.
"మంజూ!" అన్న కేకకి, ముగ్గురూ ఉలిక్కిపడి చూసారు.
సుమిత్ర నిప్పులు చెరుగుతూ చూస్తూ కనిపించింది.
మంజీర "మమ్మీ..." అంటూ ఏదో చెప్పబోతే,
"చాలు! ఇంక నాటకాలూ, తందనాలూ కట్టిపెట్టి చదువుకో! పరీక్షలొస్తున్నాయి" అంటూ మ్యూజిక్ ఆఫ్ చేసేసి విసవిసా వెళ్ళిపోయింది సుమిత్ర.
అరుంధతి చిన్నబోయిన ముఖంతో లూ కేసి చూసింది.
అతను ఎప్పటిలాగే చిరునవ్వు నవ్వుతున్నాడు.
* * * *
"అబ్బ! ఎంత ముద్దొస్తున్నావే" అన్నారు మంజీర స్నేహితురాళ్ళు.
మంజీర మెరిసిపోతోంది, మహారాణీ అలంకరణలో.
"ఏయ్ నీ రాజ్ ని చూడు!" అంది నీతా.
మంజీరా విసుగ్గా అటు చూసింది.
మీసాలూ, కిరీటాలూ పెట్టుకొని అభినవ్ చాలా 'ఫన్నీ'గా కనిపించాడు. తను చెయ్యబోయే పని గుర్తొచ్చి, ఆమె పెదవులు చిరునవ్వుతో విడివడ్డాయి.
లూ, అరుంధతిని తీసుకుని నాటకానికి వచ్చాడు.
"ఇప్పుడే వస్తా" అంటూ అరుంధతితో చెప్పి, 'గ్రీన్ రూం'లోకి వచ్చాడు. కాసేపు మంజీరతో కబుర్లు చెప్పి.