"ఆ అబ్బాయేనా అభినవ్?" అడిగాడు.
మంజీర తల ఊపింది.
"చాలా బావున్నాడు. మంజూ విష్ యూ గుడ్ లక్" అంటూ కన్ను గీటాడు.
మంజీర నవ్వి, 'థాంక్స్' అంది. ఆమెకీ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోంది. కాలేజీలో మొదటిరోజు అభినవ్ చేసిన సవాల్, తనని చెంపదెబ్బ కొట్టడం అన్నీ గుర్తొస్తున్నాయి. ఇన్నాళ్ళ నాటకానికి ఇప్పుడు తెరపడ్తోంది కదా, అన్న ఉద్వేగం ఆమెని నిలువనియ్యడం లేదు.
టపాకాయలు ఎదురుగా పెట్టుకుని, దీపావళి పండుగ రోజు కోసం ఎదురుచూసే చిన్నపిల్లల మనసులా ఉంది ఆమె పరిస్థితి.
నాటకం మొదలు అవుతోందని, వాసు 'ఎనౌన్స్' చేసి తెర తీయించాడు. మంజీరతో సహా అందరూ నిలబడి 'పరబ్రహ్మ... పరమేశ్వర..." అంటూ ఏదో ప్రార్థన అందుకున్నారు.
మంజీర యధాప్రకారం చాక్లెట్ నమలసాగింది.
రాంబాబు గుర్రుగా చూశాడు.
అరుంధతి, లూ పక్కనే కూర్చుని, కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది. "ఇంటికి వెళ్ళగానే మంజూకి దిష్టి తీసెయ్యాలి" అనుకుంది.
"బావున్నారా? అన్న పలకరింపు వినబడి, తలతిప్పి చూసింది. ఎదురుగా జానకి, నిండుగా నవ్వుతూ కనిపించింది.
"ఆ, కూర్చోండి" అంటూ పక్క కుర్చీ చూపించి, "అభినవ్ తల్లి" అంటూ లూకి పరిచయం చేసింది.
అభినవ్ చక్కగా రాగయుక్తంగా పద్యం అందుకున్నాడు.
"అబ్బాయి గొంతు అమోఘం!" అన్నాడు లూ జానకితో.
జానకి తల్లి హృదయం ఆనందంతో పొంగిపోయింది.
ఎవరు పద్యం పాడుతున్నా నోరు కదుపుతున్న మంజీర, తనకి ప్లేబాక్ పెట్టగానే, నోరు మూసుకుని ఉండిపోతోంది. ఇది వాసుకి చాలా చిరాకు తెప్పిస్తోంది.
రాంబాబు ఇదే సందు అని, అభినవ్ నీ, మంజీరనీ, అవసరం లేకపోయినా, 'అమ్మా, నాన్నా' అని పదేపదే పిలుస్తున్నాడు.
మంజీరకి ఒళ్ళు మండిపోతున్నా, సమయం కోసం ఎదురుచూస్తోంది.
మంజీర స్నేహితురాళ్ళు చివరి సీన్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
చిరుగుల చీరలో, జుట్టు విరబోసుకుని శోకమూర్తిలా నడిబజారులో అమ్మకానికి నిలబడ్డ 'చంద్రమతి'ని చూసి, జానకి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం 'లూ' గమనించాడు.
"ఈ రోజుల్లో కూడా ఇంత అమాయకులున్నారా?" అనిపించింది. చిన్నతనంలో వాళ్ళ బామ్మ తననీ, అరుంధతినీ సినిమాకి తీసుకెళ్ళి, వరదలు చూపించగానే, "లేవండి! లేవండి" అని ఈడ్చుకుంటూ ఇంటిదాకా తీసుకొచ్చేసి, ఇరుగు పోరుగులతో "వరదలు టూరింగ్ టాకీస్ దాకా వచ్చేశాయి" అని చెప్పి హడావుడి పెట్టేసిన విషయం గుర్తొచ్చి నవ్వుకున్నాడు.
ఆఖరి ఘట్టం రానే వచ్చింది!
లోహితాస్యుడు మరణించగానే, మంజీర అతన్ని ఈడ్చుకుంటూ, కాటికాపరి వేషంలో ఉన్న అభినవ్ దగ్గరకి తీసుకెళ్ళింది.
ఆమె వెంట రాంబాబు, చేతులతో పాకుతూ వెళ్తుంటే, ఆడియన్స్ ఈలలు వేసి టమాటాలు విసుర్తున్నారు.
అభినవ్ వెంటనే రాగయుక్తంగా పద్యం అందుకుని, అందర్నీ శాంతపరిచాడు.
"అమ్మాయీ, సుంకం చెల్లించకున్న నీ పుత్రుడ్ని ఇచ్చట ఖననం చేయుటకు అవకాశం లేదు" అనగానే, మంజీర నవ్వింది.
"ఏడవాలి! ఏడవాలి! గ్లిజరిన్ తీసుకో!" అంటూ 'ప్రామిటర్' అరుస్తున్నాడు. అతని మాటలు మైకులోంచి వినిపించేస్తున్నాయి.
మంజీర తన నవ్వు పెంచి, అభినవ్ దగ్గరగా నడుస్తూ, అతనికి మాత్రమే వినిపించేటట్లుగా అంది. "వెల్ మిస్టర్ అభినవ్! ఈ మోడ్రన్ చంద్రమతి ఇప్పుడు నిన్ను ఇంతమంది చూస్తుండగా, చెంపదెబ్బ కొట్టబోతోంది. కాచుకో" అంటూ చెయ్యి ఎత్తింది.
అభినవ్ ఒక్కక్షణం తెల్లబోయాడు. జరుగుతున్నది ఏమిటో అతను అర్థం చేసుకునేలోపే, జరగవలసినది అనూహ్యంగా జరిగిపోయింది.
అడుగు ముందుకి వేస్తున్న మంజీరని, మధ్యలో పడుకున్న రాంబాబు, తన కాలితో మెలిక వేసి పడవేసాడు.
ఊహించని ఈ పరిణామానికి తెల్లబోతూ, దబ్బున నేలమీద పడిపోయింది మంజీర.
వెంటనే 'క్విక్'గా 'రియాక్ట్' అయి, అభినవ్, "దేవీ నిన్ను చంద్రమతిగా ఎరింగితిని. క్షమించితిని. నా పాదాలు వీడి లెమ్ము!" అంటూ లేవదీసే నెపంతో ఆమె భుజాల మీద చేతులేసి, ఒత్తిపెట్టి, లేవకుండా చేసి పెద్ద పద్యం అందుకున్నాడు.
ఆ పద్యం పూర్తయ్యేలోగా మంజీర ఎంత గింజుకున్నా ఒదిలి పెట్టలేదు.
ఈలోగా పరిస్థితులు ఆకళింపు చేసుకున్న అతని స్నేహితులు తెరదించేసారు.
కరతాళ ధ్వనులతో హాల్ అదిరిపోయింది.
జానకి కళ్ళు వత్తుకుంటూ లేచి నిలబడింది.
అరుంధతి ఆనందంగా 'లూ'కేసి తిరిగి, "మంజుని పలకరించి, బాగా చేసావని చెప్దాం పదా!" అంది.
"ఇంకా నయమే! చేతిలో ఏదుంటే అది పెట్టి కొట్టగలదు, పద పద" అంటూ అయోమయంగా చూస్తున్న అరుంధతిని తీసుకుని బయటకి నడిచాడు 'లూ'.
"అదేమిటే? అతన్ని ఫూల్ ని చేస్తానని చెప్పి, నువ్వే వరుసగా ఫూల్ అయి, చివరికి ఇంతమంది మధ్యలో కాళ్ళమీద పడ్డావూ?" అంటూ ఆమె స్నేహ బృందం మంజీరని ఊపిరి సలపనియ్యడం లేదు.
"ప్లీజ్! లీవ్ మీ ఎలోన్" అంటూ గట్టిగా విసుక్కుంది మంజీర.
గాయపడిన హృదయం భోరున ఏడవమంటోంది. రెండు చేతులతో మొహం దాచుకుని తనకి తెలియకుండానే ఆమె ఏడుస్తోంది.
ఒక చల్లని స్పర్శ, మలయమారుతంలా ఆమెని తాకింది.
మంజీర తలెత్తి చూసింది.