నందితాదేవి పరుగున మంచినీళ్ళ గ్లాసుతో వచ్చింది. కొద్దికొద్దిగా ఆమె నోట్లో పోసింది. జాస్మిన్ కాస్త తెప్పరిల్లింది.
"నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఎంతగా అరిచినా ఏ అర్ధరాత్రి ఎవరూ రారు. గాయాలనుంచి రక్తస్రావం అధికంగా అయింది. బహుశా కొద్దిసేపటిలో నా ప్రాణం పోవచ్చు..."
"అలా అనకు జాస్మిన్. నువు బతుకుతావ్! భోజనం పెట్టి నాకు ఈ రాత్రికి ఆశ్రయమిచ్చావ్! నీలాంటి మంచిదానికి దేవుడు అభయం ఇస్తాడు. రక్షిస్తాడు. నాకు కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. ఏం చేయాలో చెప్పు" నందితాదేవి జాస్మిన్ చేతులు పట్టుకుని అంది.
"నే చెప్పేదానికి అడ్డురాక. జాగ్రత్తగా విను. నేను సి.ఐ.డి.ని..."
"సి.ఐ.డీ?" ఆశ్చర్యంతో నోరు తెరిచి అలా వుండిపోయింది నందితాదేవి.
"ఎస్- సి.ఐ.డీ.నే లోకానికి ఈ విషయం తెలియదు. పైకి లాల్ అండ్ లాల్ ఐరన్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అంతే! పోలీసు ఇన్ స్పెక్టర్లు. డియస్పీలు అలాంటి పెద్దవాళ్ళలోనే గజదొంగలు ఉన్నారని తెలిసి ప్రభుత్వంలో అతి ముఖ్యమైన క్రయిం బ్రాంచ్ వారు నన్ను ఇక్కడ నియమించారు. పెద్ద దొంగల ముఠాలోని ఒకతన్ని ఈ మధ్య మా వాళ్ళకి పట్టించాను. అది గ్రహించి ఆ ముఠాలో ఇద్దరు ఈ రోజు నా మీద దెబ్బతీశారు..." అంటూ ఆయాసంతో ఆగింది జాస్మిన్.
"ఇప్పుడు ఇదంతా దేనికి జాస్మిన్. మీరు రక్షించబడే మార్గం?..." నందితాదేవి అంది. ఆ మాటలకు అడ్డువచ్చి కఠినంగా అంది జాస్మిన్.
"ప్రాణం పోతున్నా మా ధర్మం మేము నిర్వహించాలి. అడ్డురాక చెప్పేది జాగ్రత్తగా విని ఆచరించు. క్రైమ్ బ్రాంచ్ లో బాధ్యత గల అధికారిణిగా ఆజ్ఞాపిస్తున్నాను. ఇక్కడనుంచి ఎలాగో అలా బయటపడి చెప్పింది అక్షరాలా చెయ్యి. ఈ ఇంట్లోంచి బయటపడిం తరువాత పోలీసుస్టేషనుకి వెళ్ళవద్దు. ఇన్ స్పెక్టరే పెద్ద దొంగ అని, విదేశీ స్మగ్లర్లతో చేతులు కలిపాడని ఈ ఉదయమే వార్త అందింది. మా క్రైమ్ బ్రాంచ్ అడ్రస్ ఇస్తాను. అక్కడికి వెళ్ళు. జరిగింది చెప్పు. ఫైలు నెం.వన్ లో మూడో కాలం- ఫైలు నెం.టూ లో నాలుగో కాలం అని చెప్పు- ఈ మాట ముఖ్యంగా చెప్పాలి. తర్వాత వాళ్ళే చూసుకుంటారు" అని చెపుతూ ఎక్కిళ్ళు రావటంతో ఆగింది జాస్మిన్.
రెండు గుక్కలు మంచినీళ్ళు తాగించింది నందితాదేవి.
కొద్దిగా సర్దుకుంది జాస్మిన్.
"నీవు ఈ ఇంట్లోంచి ఎలాగో అలా రహస్యంగానే బయటపడు. అలా కాకపోతే పోలీసులు రావటం. నిన్ను పట్టుకెళ్ళటం జరుగుతుంది. నీ మాటలు నమ్మరు. హత్యా నేరం నీమీద పడుతుంది. మావాళ్ళని కలుసుకో- నే చెప్పింది చెప్పు. నీకు రక్షణ ఇస్తారు. అంతేకాదు మా డిపార్టుమెంటుకి సహాయం చేసినందుకు మంచి బహుమతి కూడా ఇస్తారు. నా మీదకి దాడి చేసిన దుండగులలో ఒకడికి కనుబొమ్మ మీద గాటు వుంది. రెండోవాడి మూతికి గ్రహణం మొరిక పెదవి చీలిక వుంది. ఆ గుర్తులు చెప్పు. నా వేలి ఉంగరం తీసుకు వెళ్ళు. పుస్తకాల షెల్ఫ్ లో "సిగ్నల్" అనే నవల ఉంది. అది అలాగే జాగ్రత్తగా తీసుకెళ్ళి యివ్వు..." జాస్మిన్ ఇంక చెప్పలేకపోయింది. ఆయాసం అధికం అయి ఎక్కిళ్ళు రావటం జరిగింది.
కళ్ళముందు వుండి వుండి చీకట్లు కమ్మటం. చెవిలో హోరు-- మృత్యువు తనకి అతి దగ్గరగా వచ్చినట్లు గ్రహించింది జాస్మిన్!
"నీకు ఆశ్రయమిచ్చి అన్నం పెట్టాను. చెప్పిన పని- చే...స్తా...నని మా...ట ఇవ్వు" చేయి జాపింది జాస్మిన్.
నందితాదేవి పట్టు బలవంతాన ఏడ్పు ఆపుకుని మునిపంటితో దుఃఖం పైకి రాకుండా నొక్కిపట్టి కంపిస్తున్న తన చేతిని ఆమె చేతిలో ఉంచింది. "గాడ్ ప్రామిస్ జాస్మిన్. గాడ్ ప్రామిస్" బొంగురు కంఠంతో అంది.
జాస్మిన్ తృప్తిగా కళ్ళు మూసుకుంది. అంతలోనే ఏదో గుర్తుకురాగా చెళ్ళున కొరడా దెబ్బ తగిలినట్లు కళ్ళు తెరిచింది.