అతనికి తన పరిస్థితి గుర్తుకు వచ్చింది. ఏ రోగాలూ లేని అందాల భామలు అతనికి అందుబాటులోనే వున్నారు. కాని... కాని... ఓ సమయంలో వంటరిగా వున్న అబలని రేప్ చేశాడు. అలా చేయగలిగి ఆ విషయంలో ఆమె నోరు నొక్కి సక్ సెస్ కాగలిగాడు. జరిగిన దారుణానికి ఆమె కుళ్ళి కుళ్ళి నిస్సహాయంగా ఏడుస్తుంటే పొందిన సుఖాన్ని తలుచుకుంటూ హాయిగా చాలా హాయిగా నవ్వాడు. ఇది జరిగిన వారానికల్లా సుఖానపడ్డ ప్రాణం దుఃఖాన పడ్డట్టు డాక్టర్ దగ్గరకు పరుగెత్తాడు.
"ఆమె ఫామిలీ లేడీ" డాక్టరు ప్రశ్నకు జవాబిస్తూ చెప్పాడు.
"కావచ్చు. ఆమె భర్త తిరుగుబోతు కావచ్చుకదా" పెన్సిలిన్ ఇంజక్షన్ చేస్తూ తేలికగా అన్నాడు డాక్టర్.
అప్పటినుంచే మొదలైంది గనేరియా అతనికి. ఇంజక్షన్ లు వాడింతర్వాత కొద్దిగా వ్యాధి తగ్గుతున్నది. కాని పాస్ కెళితే నరకం చూస్తున్నాడు. చేసిన పాపానికి ముక్కి మూలిగి అరగంట అవస్తపడితేగాని పాస్ రాదు అతనికి. ఆ బాధ పచ్చి పుండుమీద నిమ్మరసం పిండి పండు మిరపకాయల కారం రాచినట్లు వుంటుంది.
కరెంట్ షాక్ కొట్టినట్లు ఆ బాధ గుర్తుకువచ్చి అతను పిడిమీంచి చెయ్యి తీసేశాడు.
"ఏమిటీ ఆలస్యం?" బయట నుంచి అతన్ని అడిగాడు మొదటివాడు.
"వస్తున్నా" బాత్రూం తలుపు బయట బోల్టు బిగించకుండానే ముందు గదిలోకి వెళ్ళాడు. పెద్ద లైటు ఆర్పి ఆ గది కిటికీలు బిగించి బయటికి వెళ్ళాడు.
"అమ్మయ్య" గుండె మీంచి చెయ్యి తీసేసుకుంది నందితాదేవి. బయట తలుపు వెయ్యటం. తాళం వెయ్యటం నెమ్మదిగా వినిపించింది.
బూట్ల చప్పుడు అంతకంతకు దూరం అయింది.
నందితాదేవి బాత్రూం లోంచి పరుగున బయటికి వచ్చింది. ముందు గదిలోకి వెళ్ళింది.
నందితాదేవి పరుగున వెళ్ళి వంట గదిలోంచి పెరటిలోకి దారితీసే తలుపు లాగి చూసింది. అదీ బయట వేసి వుంది. వీధి తలుపు వేసి వుందని తెలిసి లాగి చూసింది. అదీ అంతే.
"జాస్మిన్! జాస్మిన్! ఎందుకిలా జరిగింది? ఎవరు వాళ్ళు? కిటికీలు తెరిచి పెద్దగా అరవనా? ఎవరయినా సహాయం వస్తారేమో?" నందితాదేవి జాస్మిన్ ని పట్టుకు కుదుపుతూ అడిగింది.