"రా చూద్దాం!" మానసి చెయ్యిపట్టుకొని కదిలాడు.
మానసి చెయ్యి వదిలించుకోవడానికి ప్రయత్నించింది.
"వద్దు!వద్దు! వాడక్కడ_అక్కడే ఉన్నాడు చంపేస్తాడు!" అంటూ ఉదయచంద్రను గట్టిగా పట్టుకొని కదలనీయలేదు మానసి! తన కాళ్ళకు అడ్డుపడుతూన్న మానసిని తోసివేసి ఉదయ్ బయటికొచ్చాడు. బయటికోస్తూన్న మానసిని గదిలోకి నెట్టి తలుపువేసి గొళ్ళెం బిగించాడు. లోపల మానసి వెర్రిగా అరవసాగింది! మెట్లమీద భయంకరంగా చప్పుడు వినవస్తూంది.
నడవాలోనుంచి మెట్ల గదివైపుకు పరుగుతీశాడు. మెట్లమీదనుంచి మనిషి పరుగుతీస్తూన్న ధ్వని! మెట్ల గదిలోకొచ్చి, పదమూడో మెట్టు గుర్తురాగా హఠాత్తుగా ఆగిపోయాడు. ముందుకు వంగి మెట్లమీద తొంగి చూశాడు.
అంతా కటిక చీకటి! జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టే దిగుతూ ఆగిపోయాడు కాలికి మెట్టు తగలడంలేదు. సరిగ్గా అక్కడే పదమూడో మెట్టు! ముందుకు వేసిన కాలు వెనక్కు తీసుకున్నాడు. చెక్కమెట్టు పూర్తిగా విరిగి కిందపడిపోయింది. విరిగిన మెట్టు సందునుంచి కిందకు చూశాడు క్యోతుల్లా రెండు గోళాలు మెరుస్తూ కన్పించాయి!
అవే కళ్ళు! అంతకుముందు మెట్లగదిలో కన్పించినవీ. తనగదిలో కిటికీలోనుంచి కన్పించిన కళ్ళూ! ఏదో వింతజంతువు తనకేసి కళ్ళార్పకుండా చూస్తున్నట్లుగా ఉంది! సడలిపోతూన్న దైర్యాన్ని కూడదీసుకున్నాడు. రైలింగ్ మీదగా కిందకు జారి ఒక్క అంగలో మెట్లకింద కొచ్చాడు. నీలంగా గౌరవర్ణంలో, ఎర్రగా చండ్రనిప్పుల్లా వెలుగుతూన ఆ కళ్ళు నిశ్చలంగా తనవైపే చూస్తూ ఉన్నాయి.
అడుగు ముందుకు వేశాడు. ఆ కళ్ళాతాలూకు జంతువేదో తనమీద దూకటానికి సిద్దంగా ఉన్నట్టనిపించింది. రెండు చేతులూ ముందుకు చాచి ఒక్కసారిగా ముందకు దూకాడు. అది మృగంకాదు. మనిషే? నల్లటి ముసుగూ, ఆ ముసుగులోనుంచి.....
వెనకనుంచి ఉదయచంద్ర తలమీద ఏదో బరువుగా తగిలింది! కిందపడ్డ తన మీదకు వంగి చూస్తున్న ముఖం, ఆ ముఖంమీద అతికించినట్టున్న ఆ కళ్ళూ....స్పష్టంగా ఓ క్షణంపాటు కన్పించాయి స్పృహతప్పి పడిపోతూన్న ఉదయచంద్ర.
15
"నీ వయస్సిప్పుడు ఐదేళ్ళు. చాలా చిన్నవాడివి, పసివాడివి. నీ పేరు చంద్రకిరణ్! నీ పేరేమిటి?"
"చంద్రకిరణ్!"
"వయస్సు?"
"ఐదేళ్ళు!"
"గుడ్! నువ్వు ఇప్పుడు నేను చెప్పినట్టు వింటావు. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తావు. నీ చిన్నప్పటి సంగతులన్నీ గుర్తుతెచ్చుకుంటున్నావు. చాలా చాలా ఏళ్ళక్రింద జరిగిన సంఘటనలన్నీ నీ కిప్పుడు గుర్తొస్తున్నాయి....." దృఢంగా. స్పష్టంగా, గంభీరంగా విన్పిస్తుందా కంఠం, మసక చీకటి గదిలో పడుకొని ఉన్న అతనికి.
మీనాన్నగారు చంద్రదేవ్ కి నువ్వంటే చాలా ఇష్టం! ఒక్క క్షణంకూడా నిన్ను వదిలిపెట్టి వుండేవారు కాదు. మీ అమ్మగారు చనిపోయాక నువ్వెప్పుడూ మీ నాన్న దగ్గిరే ఉండేవాడివి...."
"మా అమ్మ చనిపోలేదు!"
అతడు ఆశ్చర్యంగా శివరామయ్య ముఖంలోకి చూశాడు. శివరామయ్య అర్థయుక్తంగా తల ఎగరేశాడు.
"ఏమైందో అడుగు సూరీ!" శివరామయ్య సూరి చెవిలో నోరు పెట్టి గొణిగాడు.
"మీ అమ్మ బ్రతికే ఉందా? సూరి ముందుకు వంగి అతడి ముఖంలోకి చూస్తూ అడిగాడు.
"లేదు."
అసహనంగా కదిలాడు సూరి.
"ఇప్పుడే అన్నావుగా చనిపోలేదని?"
"అవును! చనిపోలేదు. చంపేశారు!"
శివరామయ్య కంగారుపడ్డాడు. సూరి గొంతు సవరించుకొని అడిగాడు.
"చంద్రకిరణ్! వింటూన్నావా?"
"ఆఁ! వింటున్నా?"
"మీ అమ్మను చంపేశారని ఎవరు చెప్పారు?"
"మా నాన్నగారు చెప్పారు."
"ఎవరు చంపారని?"
చంద్రకిరణ్ వెంటనే సమాధానం ఇవ్వదు.
శివరామయ్య ముఖ కండరాలు బిగిసిపోయినై!
"తెలియదు. నాన్నగారు చెప్పలేదు!" చంద్రకిరణ్ మెల్లగా అన్నాడు.
శివరామయ్య నిట్టూర్చాడు.
"మీ అమ్మగారిని ఎవరూ చంపలేదు! ఆమె యాక్సిండెంట్ లో...."
"నో! అది యాక్సిడెంట్ గాదు!"
"మరేమిటి?"
"అది యాక్సిడెంట్ అని నమ్మించడానికి ప్రయత్నించారు!"
"అసలేం జరిగింది? గుర్తు చేసుకొని చెప్పు. ఏం జరిగింది?" సూరి కంఠం విలక్షణంగా ఉంది.
"ఆ రోజు నా పుట్టినారోజు. అమ్మ తలంటి స్నానం చేయించింది. కొత్తబట్టలు తొడిగింది. నాన్న ఎన్నో బొమ్మలు కొనితెచ్చి ఇచ్చాడు. కేండిల్స్ ఊదేసి కేక్ కట్ చేశాను. చాలామంది పిల్లలూ పెద్దవాళ్ళూ వచ్చారు. హేపీ బర్త్ డే పాట పాడారు! కేకులూ స్వీట్లూ తిన్నారు అందరూ వెళ్ళిపోయాక నేను మేడమీదకెళ్ళి, కొత్త బొమ్మలతో ఆడుకొంటున్నాను చాలాసేపు 'పొద్దుపోయిందిరా బాబూ! రేపు ఆడుకొందువు గానిలే! రా పడుకో!' అంటూ అమ్మవచ్చి నన్ను ఎత్తుకొన్నది. కిందకు తీసుకుపోతూ మెట్ల మీదకి....." చంద్రకిరణ్ ఆగాడు.
"ఆఁ! మెట్లమీద?" సూరి ఆత్రుతగా అడిగాడు. పెద్దగా చప్పుడైంది? చెక్కలు విరిగి పడిన చప్పుడైంది! అమ్మ అమాంతం కిందకు పడిపోయింది. నాకు దెబ్బ తగలకుండా నన్ను పైకెత్తి పట్టుకొన్నది. నెల మీద అమ్మా, రక్తం మడుగులో అమ్మ. తలలోనుంచి ముఖం మ్మీడుగా రక్తం కారుతున్న అమ్మనుచూస్తూ పెద్దగా అరిచాను" చంద్రకిరణ్ గొంతు పూడిపోయింది. బాధతో ముఖం మెలితిరిగిపోయింది.
కొద్దిక్షణాలాగి సూరి" ఆ తర్వాత ఏమైంది?" అన్నాడు.
"తెలియదు!"
సూరి ఇంకేదో అడగబోతుండగా శివరామయ్య అవును అతడికేం తెలియదులే అన్నట్టుగా సౌంజ్ఞ చేశాడు.
"సారీ! చంద్ర సో ఆన్ ఫార్ట్యునేట్" సానుభూతిగా అన్నాడు సూరి.
"బాబూ! చంద్రకిరణ్ మీ అమ్మగారు చనిపోయాక మీ నాన్నగారు నిన్ను ఊటీ తీసుకెళ్ళి అక్కడ లవ్ డేల్ స్కూల్లో చేర్పించారు గదూ?" మళ్ళీ ప్రారంభించాడు సూరి.
"అవును!"
"వెళ్ళే రోజుకు మూడోరోజు రాత్రి ఏమి జరిగిందో గుర్తుచేసుకో! ఆ రోజు రాత్రి బాగా గుర్తుచేసుకో! ఊ! గుర్తొచ్చింది నీకు. ఆ రాత్రి మీ న్నానగారు" సూరి ఆగి చంద్రకిరణ్ ముఖంలోకి ఆశగా చూశాడు.
"ఆ రాత్రి మా న్నానగారు నన్ను తీసుకొని తోటలోని వహ్చారు."
"తోటలో ఎక్కడ? వచ్చి ఏం చేశారు?"
"తోటలో బావి దగ్గర కొచ్చారు!"
"తోటలో ఏ బావి దగ్గిరకు. తోటలో ఏడు బావులున్నాయి. ఏ బావి దగ్గర కొచ్చారు?"
చంద్రకిరణ్ మాట్లాడలేదు.
"గుర్తుచేసుకో! నీకు గుర్తొస్తుంది. చెప్పు ఏ బావి దగ్గరకూ?"
"పనసతోట దగ్గరున్న బావి దగ్గరకు!"
"గుడ్! బాగా జ్ఞాపకం వుంది నీకు! వచ్చి ఏం చేశారు అక్కడ మీ నాన్న?"
"గుంట తవ్వారు. గుంటలో ఒక పెట్టి పూడ్చిపెట్టారు!"
"గుంట బావికి ఎంత దూరంలో ఉంది?"
"బావి దగ్గరలో లేదు. తోటలో ఒక పనస చెట్టుకింద తవ్వారు. అక్కడే పెట్టి పూడ్చిపెట్టారు!"
సూరి శివరామయ్య కేసి చూశాడు. శివరామయ్య ముఖం వెలిగిపోతూంది. సంతోషం పట్టలేక సూరి చేతులు పట్టుకొన్నాడు.
అంతకుముందే సిద్దంచసిన సిరంజి అందుకుని సూరి చంద్రకిరణ్ శరీరంలోకి గుచ్చి మెల్లగా మార్ఫిన్ ఎక్కించాడు. మూడు నిముషాల్లో చంద్రకిరణ్ గాఢనిద్రలోకి వెళ్ళిపోయాడు.
16
కిటికీలోనుంచి సూర్యకిరణాలు ప్రసరించి ముఖాన్ని తాకుతున్నాయి. బలవంతంగా కళ్ళు తెరిచాడు. సూర్యకాంతికి కళ్లు జిగేలుమన్నాయి. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. పక్కకు తిరగడానికి ప్రయత్నించాడు. ఒళ్ళంతా బరువుగా ఉంది. మెదడంతా మబ్బుమబ్బుగా ఉంది. లావాలనే ప్రయత్నం. లేవలేని స్థితి! అలా ఎంతసేపు గడిచిందో కూడా గుర్తించలేని స్థితి!
"డాక్టర్ గారూ! డాక్టర్ గారూ!"
ఎవరో పిలుస్తున్నారు! చల్లటి మృదువైన చేతివేళ్ళు నుదుటిమీద కదులుతున్నాయి. ఆ గొంతు ఎక్కడో విన్నదే! ఆ స్పర్శ ఎవరిదీ? బరువుగా వున్న కనురెప్పలు తెరవడానికి చేసిన ప్రయత్నం ఫలించింది. తనమీదకు వంగి చూస్తున్న దెవరూ? మసక మసకగా కన్పిస్తూన్న ఆ ముఖం ఎవరూ?
"డాక్టర్ గారూ! డాక్టర్ గారూ?" భుజం పట్టుకుని కుదుపు పిలుపు పలకరింపు.
"ఎవరూ?"
"నేనే! డాక్టర్ గారూ?"
"మానసీ! నువ్వా?" ఉదయ్ చంద్ర లేవడానికి ప్రయత్నిస్తూ ఆశ్చర్యంగా చూశాడు.
ఉదయచంద్ర చెయ్యి ఆసరా ఇచ్చి కూర్చోపెట్టింది మానసి.
"ఎలా వుంది?" జాలిగా అడిగింది.
"ఒ.కే! ఐయాయ్ ఒకే!"
ఇంతకీ తనకేమయింది? ఏం జరిగింది? చుట్టూ కలయజూశాడు. అది లోనగదే! అది తను పడుకొన్న మంచమే. టేబుల్ మీద డైరీ అలాగే వుంది.
ఉదయ్ మంచంమీదనుంచి దిగుతూ తూలాడు. పట్టుకోబోతున్న మానసిని వారించి నిలదొక్కున్నాడు. మానసిని ఓసారి పరిశీలనగా చూసి ఉదయ్ బాత్ రూంలోకి నడిచాడు.
రెండు చేతుల్తో చల్లటినీళ్ళు తీసుకుని ముఖంమీద చల్లుకున్నాడు. బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ తల విదివించుకున్నాడు.
ఏమైంది? ఏమవటానికికేముంది? ఏమైందని? ఎందుకు అనుకొంటున్నాడు? రాత్రి డైరీ రాసుకొన్నాడు. రాస్తూ రాస్తూ మధ్యలో ఆపేసి ఎందుకు ఆపేశాడు. మధ్యలో ఆపేసినట్టు సూట్ కేస్ మీద తెరచి పెట్టివున్న డైరీ తెలియజేస్తూనే వుంది. డైరీ రాస్తూ మధ్యలో ఎందుకు ఆపేశాడు?
కారుమబ్బులు విడిచిపోతున్నాయ్! ఒక్కొక్కటే స్ఫురణకు వస్తూన్నట్టుగా వుంది. నోట్లో నీళ్ళుపోసుకొని పుక్కిలించాడు.
డైరీ ఎందుకు ఆపేశాడూ? అవును! యస్. యస్. మానసి వచ్చింది. ఆమె రాగానే డైరీ రాయడం ఆపేశాడా? ఆపేసి? ఆ తర్వాత ఏం జరిగింది? మానసి అప్పట్నుంచి తన గదిలోనే వున్నదా? అబ్సర్డ్! అసలు మానసి తన గదిలోకి ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? బ్రష్ చేసుకుంటూనే ఉదయ్ బాత్ రూంలోనుంచి బయటికొచ్చాడు. గబగబా డైరీతీసి చూశాడు డైరీ చదువుకొన్నాడు. మధ్యలో ఆపేసినట్టేమీ లేదు. డైరీ పూర్తిచేసే పడుకొన్నాడు. అయితే అలా తెరిచి ఎవరు పెట్టారూ?