"అమ్మ నాన్న ఏమంటారో...."
"ఏమంటారు? వాళ్ళున్న స్థితిలో రెండు వందలు వస్తుంటే దాచే -- వాళ్ళమాటేలా వున్నా, నీకు కాలక్షేపం , నీ బతుకు నీవు బతకగలనన్న ధైర్యం వుండాలి గదా, నా మాట విని వప్పుకో అక్కయ్యా-----"
కమల సాలోచనగా తల ఆడించింది. కమలని వప్పించడం లో కమల మీద శ్రద్ధ , జాలి మాత్రమే కాక వసంత స్వర్ధమూ వుంది. ఇంట్లో పరిస్థితి బొత్తిగా బాగులేదు. తన జీతంలో వంద రూపాయలు కూడా తనకి మిగుల్చుకోడం కష్టంగా వుంది. కమల ఏ రెండొందలో సంపాదిస్తే తను కాస్త ఖర్చు పెట్టుకోవచ్చని వసంత ఆశ.
వసంత చెప్పింది విని వెంకట్రావు గారు గాడంగా నిట్టుర్చారు. "హు, బాధ్యత తీసుకోవాల్సిన కొడుకు యింకోరి పంచన బానిస బతుకు బతుకుతున్నాడు. ఆడపిల్లల కష్టం మీద బతకాల్సిన దుస్థితి పట్టింది. కానీండమ్మా వద్దనే శక్తి లేదు. దానికీ ఓ కాలక్షేపం , దాని బతుకు అది బతకగలిగే మన స్థయిర్యం వుండడం మంచిదే. నా తరువాత ఏ అన్నదమ్ముడూ అదుకోడని అర్ధం అయిపొయింది గదా" అయన గొంతు రుద్దమయింది.
కాంతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ "దాని రాత అలా తగలడింది. ఉద్దరిస్తాడనుకున్న కొడుకు అలా అయ్యాడు. యింకా దాని కష్టం కూడా తినే గతి మాకు పట్టింది ' అంది.
"అమ్మా ఏమిటా పిచ్చి మాటలు, ఉద్దరించాల్సింది కొడుకు లేనా - ఏం, ఆడపిల్ల ఎందుకూ పనికి రానిదనా మీ ఉద్దేశం.....ఆడపిల్ల డబ్బు తినకూడదని ఎక్కడన్నా రాసుందా? అవన్నీ పాతకాలం మాటలు. ఈ రోజుల్లో మగపిల్లలతో పాటు ఆడపిల్లా సమానమే. తల్లితండ్రులు ఏనాడయితే ఆడపిల్ల అని నీర్సంగా అనుకోవడం మానుతారో, ఆనాడు మన మధ్యతరగతి సంసారాలు బాగుపడ్తాయి" ఆవేశంగా అంది వసంత. "ఎంతసేపూ కొడుకు కొడుకు అనుకుంటూ వాడిని నెట్టికేక్కించుకొని, వాడు పెట్టకపోయినా వాడినే పట్టుకు వెళ్ళాడుతారు తప్ప కూతురూ తమ పిల్లెనని ఆమె కొడుకు కంటే ఎందులో తక్కువ కాదని ఎందుకర్ధం చేసుకోరో యీ తల్లిదండ్రులు .."
'చాల్లేవే తల్లీ , మాటకి ముందు ఉపన్యాసాలు యిస్తావు" కాంతమ్మ విసుక్కుంది.
* * * *
ఫతిమా తల్లి చేయాల్సిన ఏర్పాటులు అన్ని చేసింది. ఓ పెద్ద కారు షెడ్డు అద్దెకు తీసుకుని, పిల్లలకి కావాల్సిన బొమ్మలు, చాపలు, ఒక స్టవ్ అన్ని అమర్చింది. మొత్తం పాతికమంది పిల్లలని చేర్చుకుంది. కమల కి రెండు వందలు జీతం యిచ్చేందుకు మిగతా లాభనష్టాలు అవిడవే.
కమల ఉదయం తొమ్మిది గంటలకే బయలుదేరి వెళ్ళి సాయంత్రం ఐదు, ఐదున్నర వరకు అక్కడ వుండి తల్లులకో, తండ్రులకో పిల్లలని అప్పచెప్పి యింటికి చేరేసరికి సాయంత్రం అరవుతుంది. మధ్యాహ్నం టీ అక్కడే చేసుకుంటారు. యింట్లోంచి ఏదో టిఫిను తీసికెళ్ళేది చిన్న చిన్న పిల్లలతో, రకరకాల వయస్సు పిల్లలతో క్షణం తీరిక లేకుండా వాళ్ళ ఆలనా, పాలనా చూస్తుంటే రోజులు ఎంత త్వరగానో గడిచిపోసాగాయి కమలకి. ఆ ఉద్యోగం అరంభించాక వసంతకి రోజుకి పదిసార్లు మనసులోనే కృతజ్ఞతలు సమర్పించుకుంది. బయటకు వచ్చి నలుగురిలో తిరిగి రోజూ బస్సులలో వెళ్ళి రావడంతో పూర్వపు బెదురు తగ్గి తనూ ఓ మనిషినన్న ఆత్మవిశ్వాసం అబ్బింది. తన బతుకు పాతికేళ్ళకె ముగిసిందన్న భావన క్రమంగా తగ్గిపోయి బతుకు పట్ల నూతనోత్సాహం కల్గింది . తన ముందు యింత జీవితం వుండగా తనెందుకు దిగులుతో మగ్గిపోయి బతకాలి! ఏమో వసంత అన్నట్టు తన అదృష్టం బాగుంటే ఎప్పుడో, ఎవరో మళ్ళీ తన జీవితంలో ప్రవేశించవచ్చు. యింట్లో పచ్చడి రుబ్బుకుంటూ కూర్చుంటే ఆ అవకాశం ఎలా వస్తుంది? తన అదృష్టం కొద్ది యీ ఉద్యోగం వచ్చింది అని సంతోషపడింది. ఫతిమా తల్లి రజియా స్నేహశీలత, అభిమానం, ఆదరణ మరింతగా ఆమెని ఆకట్టుకొని తను ఆమె దగ్గిర ఉద్యోగం చేస్తున్నానన్న భావనతో కాక ఆమె బాధ్యతలు కూడా సంతోషంగా తన మీద వేసుకొని చెప్పినవి, చెప్పనవీ కూడా చేసేది కమల.
కమల జీవితం ఓ గాడిన పడినందుకు కాంతమ్మ, వెంకట్రావు గారులూ ఆనందించారు. యిద్దరు కూతుర్ల సంపాదనతో యింట్లో ఆర్ధిక చిక్కులు కాస్త తగ్గి, ప్రతిదానికి వెదుక్కునే అవస్థ తగ్గింది. ఇప్పుడు యింక ఆయనని ఎదుర్కొంటున్న సమస్య వసంత, మాలతి యిద్దరూ పెళ్ళి కెదిగి కూర్చున్నారు. యిద్దరి పెళ్ళిళ్ళు ఎంత తక్కువలో చెయ్యాలన్నా చేరి పదిహేను వేలన్నా ఖర్చు పెట్టాలి. ప్రసాద్ అత్తగారు యిస్తానన్న ఏభై వేలు యిస్తారా? యిస్తారని ఆ డబ్బుతో పెళ్ళిళ్ళు పేరంటాలు జరుగుతాయని ఆశ పెట్టుకున్నాడు కాని, చూస్తె వాళ్ళు డబ్బిచ్చే లాగా కనపడడం లేదు. కొడుకు బొత్తిగా యిల్లరికపు ఆల్లుడయిపోయాడు. వాడిని చూస్తె వాడూ సంతోషంగా వున్నట్టూ లేడు. మేడల్లో వున్నా, కారులో తిరుగుతున్నా కొడుకు మొహం కళగా, సంతృప్తితో, ఆనందంతో వుండడం ఆయన కంటబడలేదు. అలాంటి వాళ్ళని డబ్బిమ్మని ఎలా అడగడం? అడగందే అమ్మన్నా పెట్టదు. నెల కింత అని ఎలాగో యివ్వడం లేదు కనీసం పెళ్ళిలో యిస్తానన్న ఆ డబ్బన్నా పుచ్చుకుని యిమ్మనండి. మెడ మీద తలకాయ వున్న మగాడికి కట్నం యిచ్చి కాళ్ళు కడుగుతున్నారు. అలాంటిది అవిటి పిల్లని చేసుకున్నందుకు ఆమాత్రం కట్నం ముట్టచెప్పడం అబ్బురం ఏమిటి, తిన్నగా వియ్యంకుడినే అడగండి" అంది కాంతమ్మ తీవ్రంగా.
తిన్నగా వియ్యంకుడిని అడగకపోయినా కొడుకో సారి యింటికి వచ్చినప్పుడు మనసులో మాట నసుగుతూ బయటపెట్టాడాయన.
ప్రసాద్ మొహం మ్లానమయింది. లత సంగతి తెలిసాక ఏభై వేలు కాదు గదా ఏబై రూపాయలు రాబట్టడం కూడా ఎంత కష్టమో అర్ధం అయి తండ్రికి ఏం జవాబు చెప్పాలో అర్ధం కాక నల్లబడిన మొహాన్ని దించుకొని "అడుగుతా మామగారిని" అని మాత్రం అనగలిగాడు.
"గట్టిగా అడగరా. ముందు యింతిస్తాం అంతిస్తాం అని ఆశ పెట్టి వట్టి చేతులు చూపించారు. నిక్షేపం లాంటి కుర్రాడిని యిల్లరికం పంపుకున్నాం యీ డబ్బుకి ఆశపడి. అడుగు ఆయనంతట ఆయనిస్తానన్నదేగా ' అంది కాంతమ్మ.
ప్రసాద్ తల మరింత వంగిపోయింది. తల మాత్రం వూపాడు.
* * * *
"హల్లో.....మిస్ వసంతా, ఏమిటి బస్ కోసం వెయిట్ చేస్తున్నారా....రండి, కారేక్కండి, దారిలో డ్రాప్ చేస్తాను" బస్సు స్టాపులో నిల్చున్న వసంతని చూసి కారపాడు ఆమె బాస్.
వసంత గాభరాతో తబ్బిబ్బు అవుతూ "అబ్బే ఎందుకు సార్.....బస్సు వచ్చేస్తుంది, మీకెందుకు శ్రమ" తడబడ్తూ అంది.
బాస్ నవ్వుతూ "శ్రమ ఏముంది. కారెక్కకపోయినా నడపాలిగా" అన్నాడు అదోలా చూస్తూ. "కమాన్ , రండి ' ముందు సీటు తలుపు తెరుస్తూ" అన్నాడు.