Previous Page Next Page 
ఇంటింటి కధ పేజి 19


    "నీకెప్పుడు కావలిస్తే అప్పుడు అడిగి తీసుకోవోయి. నన్నడగడం మొహమాటం అయితే అమ్మాయిని అడుగు. అంతేగాని నీకో జీతం యిచ్చి పెట్టుకుంటే ఆఫీసులో నా పరువేం గావాలి."
    లతని అడగడం అంటే ఏమిటో అతనికి తెలుసు. అందుచేత అతను చాలా ఖచ్చితంగా....' లేదండి , మగవాడ్ని .... నా చేతిలో డబ్బు లేకుండా, భార్యని అడిగి తీసుకోడం అంటే ఎలా వుంటుందో మీరు మగవాళ్ళు గనుక తెలుస్తుంది. ఎంత యిల్లరికం అల్లుడయినా నాకూ మాన మర్యాదలుంటాయి కదండీ. నాకూరికే నే యివ్వద్దు. ఆఫీసులో యిదివరకు మేనేజరుకి ఎంతిచ్చే వారో నాకంతే యివ్వండి" అన్నాడు చాలా ఖచ్చితంగా.
    నారాయణమూర్తి చాలా నోచ్చుకున్నట్టు మొహం గంటు పెట్టుకుని "సరే నీ యిష్టం. నలుగురిలో నా పరువు గురించి నీకక్కర లేదనుకుంటే అలాగే జీతం తీసుకో" అన్నాడు.
    ఆ మాటలని లెక్కచేయకుండా ప్రసాద్ గదిలోంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి క్యాషియర్ రెండు వేలు తీసుకొచ్చి యిచ్చాడు.
    ఆ సాయంత్రం యింటికి రాగానే లత అతనితో యుద్దానికి తలపడింది. గదిలోకి రాగానే చురచుర చూస్తూ మా డాడీని అవమానించడానికి మీకేన్ని గుండెలు.... మా ఉప్పు తింటూ ఆయన్నే అవమానిస్తారా.
    ప్రసాద్ అలసిపోయి , చిరాగ్గా వచ్చాడేమో కయ్యానికి కాలు దువ్వుతూ , రాక్షసిలా యింత నోరు చేసి మాట్ల్దాతున్న భార్యను చూసేసరికి చిర్రెత్తింది. మీ ఉప్పు వూరికే తినడం లేదు. చాకిరి చేసి మరి తింటున్నారు. నీలాంటి దాన్ని పెళ్ళాడడానికి మీ నాన్నగారు కట్టిన వేల తింటున్నాను. అన్నాడు తిరస్కారంగా చూస్తూ.
    "యింట్లో పడి తింటున్నది చాలక యింకా మీకు జీతం కావాల్సి వచ్చింది, అడగడానికి అభిమానం అన్నా అనిపించలేదూ. మమ్మల్ని అవమానించడమే మీ ఉద్ద్దేశం అయితే సరే..... యీ రోజునించి జీతం తీసుకుంటున్నారు కనక మనం ఇక్కడున్న ఖర్చు నా మందులు, నా పనివాళ్ళు మన తిండి అన్నింటికి లెక్కకట్టి యిచ్చెయండి మా నాన్నకి.
    ప్రసాద్ తెల్లబోయాడు. ఆమె కుటిలత్వం అర్ధమైంది. తన చేతిలో డబ్బుంటే ఆమెకి లొంగి వుండడని ఆ డబ్బు ఖర్చు పెట్టించడానికిలా అందని అర్ధం కాగానే అతనిలో ఆవేశం, ద్వేషం పొంగింది. లత మందులు, తిండి, తమ ఖర్షు అన్నింటికీ పోగా ఏం మిగిలదని తండ్రి కేమీ యివ్వలేనని అర్ధమయింది..... అతనిలోనూ పంతం హెచ్చింది.
    "తప్పకుండా నా పెళ్ళాన్ని నేను పోషించుకుంటాను.....యిక్కడుండగా ఖర్చు యివ్వాల్సిన అవసరం లేదు. వేరే యిల్లు చూస్తాను. పద అందరి భార్యల్లా నేను పెట్టింది తింటూ కాపురం చెయ్యి.....' ప్రసాద్ కసిగా అన్నాడు.
    లత హేళనగా నవ్వింది. 'ఆహా.....పెళ్ళాన్ని పోషించే పెద్ద మగాడు బయలుదేరాడు. తవరికీ రెండు వేల రూపాయల జీతం మా ధర్మాన వచ్చిందని మర్చిపోయినట్లున్నారు. లేకపోతే మీరు చేసే ముష్టి ఉద్యోగానికి మూడు వేలు ఎవరు యీయరు...'
    "మూడు వేలు కాదు....మూడు వందలు వచ్చినా బ్రతికే భార్యా భర్తలున్నారు. డబ్బులోనే సుఖం ఉందనుకుని గోతిలో పడ్డాను. ఇన్ని మాటలు అనవసరం. నా ఖర్చుకి నేను జీతం తీసుకుంటున్నాను. నీకిష్టం అయితే వేరే వెడదాం. అప్పుడు అందరి భార్యా భర్తల్లాగా వుండు. లేదంటే మరి మాట్లాడకు. యీ రెండు వేలు ఏం చేసేది నీ కనవసరం. నేనే కాదు నాకూ తల్లి తండ్రులున్నారు. వాళ్ళ కష్ట సుఖాలు చూడాల్సిన బాధ్యాత నాకుంది పెద్ద కొడుకుగా.....' ప్రసాద్ ఖచ్చితంగా చెప్పేడు.
    "ఓహో వాళ్ళకివ్వడానికా యీ డబ్బు. సిగ్గు లేదూ అత్తగారి సొమ్ము తీసికెళ్ళి యింట్లో యివ్వడానికి. మీకు లేకపోయినా వాళ్ళకెలా లేకపోయింది. యింకొకరి సొమ్ము తినడానికి అబిమానం.....చూస్తా. మీరెలా యిస్తారో , వాళ్ళెలా తీసుకుంటారో చూస్తా డాడికి చెప్పానంటే నయా పైసా యివ్వరు మీ అటకట్టించడం నా చేతిలోని పని....." విశాపునవ్వు నవ్వింది లత.
    "రాక్షసీ , నీకు నేనేం చేశానని నా మీద యిలా పగబట్టినట్లు సాధిస్తున్నావు. నీ శరీరమే కాదు, నీ మనసు కూడా యింత వంకర అని తెల్సు కోలేక మీరు చూపిన డబ్బుకి ఆశపడి గోతిలో పడ్డాను. ఛీ - నీవు ఆడదానివి కావు. అడదాని కుండాల్సిన దయ, మమత, అనురాగం అవి ఏకోశానా లేవు. ఛీ....నీవింత నీచురాలివని ఎన్నడూ అనుకోలేదు. నీవు, నీ డబ్బు కట్టకట్టుకుని గంగలో దుమకండి. అన్నింటి కంటే డబ్బే ఎక్కువనుకునే నీకు అందుకే దేముడు అనుభవించే యోగం లేకుండా చేశాడు. యిదిగో నీ డబ్బు" ప్రసాద్ పట్టజాలని కోపంతో చేతిలోని రెండు వేల రూపాయలు ఆమె మొహాన విసిరికొట్టి విసవిస వెళ్ళిపోయాడు.
    లత విజయగర్వంతో నవ్వుకుంది. అతన్ని అవమానించి, బాధ పెట్టగలిగినందుకు కసిగా నవ్వుకుంది.

                                               *    *    *    *
    'అక్కయ్యా నేనో మాట చెపుతాను - ఏమనుకోకుండా వింటావా" పెరట్లో కూచుని పచ్చడి రుబ్బుతున్న కమల దగ్గిర కూర్చుని అంది వసంత. ఆఫీసు నించి వచ్చి, టిఫిను, కాఫీ తాగి మొహం కడుక్కుని, పెరట్లో మంచం మీద కూర్చుని అక్కగారితో మాటలకి డిగింది వసంత.
    "ఏమిటే అంత అనుకునేది?" కమల నవ్వుతూ అంది.
    "ఏం లేదు, ఫతిమా అని మా ఫ్రెండు అని చెపుతుంటాను , ఒకసారి మనింటికి కూడా వచ్చింది గుర్తుందా"
    కమల కుతూహలంగా చూసింది ఎందుకో ఉపోద్ఘాతం అన్నట్లు ------
    "ఫతిమా వాళ్ళ అమ్మగారు ఒక క్రెష్ నడుపుదాం అనుకుంటున్నారు. క్రెష్ అంటే అదే బాలవిహార్ లాంటిది. ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్ళు తమ చిన్నపిల్లలని అక్కడ వదిలి వెడతారు రోజంతా. పిల్లలని చూసుకోడానికి డబ్బు తీసుకుంటారు. అలాంటిది ఒకటి నడపాలన్న ప్లానులో వున్నారు ఆవిడ. ఆవిడకి సాయంగా యింకోరిని తీసుకోవాలను కుంటున్నారు. ఫతిమా ఆ మాట చెప్పగానే చటుక్కున నీవున్నావు అని గుర్తు వచ్చింది. ఆవిడకి సాయంగా సాయం అంటే ఏం లేదు, ఓ పది హీను ఇరవై మంది చిన్న పిల్లలని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే.....ఆ డబ్బు ఇద్దరూ చెరిసగం తీసుకోవచ్చు. ఆ పని మేం చేస్తాం అని లక్షమంది ముందుకు వస్తారు కాని ఫతిమా అమ్మగారితో నీ సంగతి చెప్పాను. నీలాంటి వాళ్ళకి అవకాశం యివ్వాలని ఆవిడ అనుకుని వెంటనే నిన్ను పంపమన్నారు. అక్కయ్యా.....రోజంతా యింట్లో కూచునేది అక్కడ కూర్చుంటావు. నీకూ పిల్లలతో హాయిగా కాలక్షేపం అవుతుంది. నెలకి ఏ వందో రెండేందలో సంపాదించుకోవచ్చు. ఇది మంచి అవకాశం అక్కయ్యా! నీవూ ఊ అంటే రేపే వెడదాం" వసంత ఆగి అక్కగారి వంక చూసింది.
    "నేనా....నేనేం చెయ్యగలను ....నాకేం తెలుసు " కమల తడబడింది.
    'తెలియడానికి ఎముందక్కయ్యా.....నీకు పిల్లలు పుడితే వాళ్ళని చూసుకునేదానివి కాదా, వాళ్ళకి పాలు పట్టడం, ఏడిస్తే ఆడించడం అంతేగా..."
    "కాని....నీవు....టైపు నేర్చుకో....ఉద్యోగం అన్నావు....' కమల అర్ధోక్తిలో ఆగిపోయింది.
    "ఇదీ ఉద్యోగమే కదా అక్కయ్యా. ఆ టైపు నేర్చుకుని పరీక్షలు పాసయ్యాక ఉద్యోగం వెంటనే దొరుకుతుందని ఏముంది? టైపు పరీక్షలు  పాసవడం ఓ ఏడాది, ఉద్యోగం దొరకడం మరో ఏడాది యిదంతా ఏం లేకుండా నెలకో రెండువందలు సంపాదించుకునే అవకాశం వస్తుంటే వదులుకోడం  తెలివితక్కువ అక్కయా....అందులో నాన్న యిప్పుడు నీమీద ఓ ఏబై అరవై ఖర్చు పెట్టె స్థితిలో కూడా లేడు. నీ టైపుకి , బస్సు చార్జీ లు యివన్నీ ఏబై అరవై అవుతాయి. నీ అదృష్టం కొద్ది నీకీ అవకాశం వచ్చింది వదులుకున్నావంటే విచారిస్తావు ఆలోచించుకో."

 Previous Page Next Page