Previous Page Next Page 
తల్లి మనసు కధలు పేజి 20


    శ్యామల తను అన్నపూర్ణ అనాధ శరణాలయంలోనే పెరిగి పెద్దదయిందని, మెట్రిక్ ప్యాసయి ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం మద్రాసు వచ్చానని చెప్పాక రంగారవుగారికి ఎంతో అనందం కలిగింది. తనలోని ఆలోచనలకు ఓ రూపు నిర్నయించేలోగా ముందు ఆమెను తనతో కూడా తన యింటికి తీసుకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఇంటికి తీసుకు వెళ్ళి తల్లికి అప్పగించారు.
    ఇంటికి వెళ్ళిన కొద్ది నెలలకే జమీందారు గారు తన మనసులో మాట చెప్పినప్పుడు శ్యామల ఆశ్చర్యపడి, సందేహించింది. భయపడింది. జమీందారు గారి అభీష్టానికి ఎదురు చెప్పలేక, తన అదృష్టానికి ఆశ్చర్యపడుతూ, ఆనందంతో , మనస్పూర్తిగా అంగీకరించింది. ముసలామె మొదట్లో ఒక అనాధ, జమీందారిణి కావడానికి అడ్డు చెప్పినా కొడుకు మనస్తత్వం ఎరగడం మూలాన భార్య చనిపోయిన అతని వైరాగ్యంలో శ్యామల వచ్చాక ఎంత మార్పు వచ్చినదీ కళ్ళ ఎదుట చూడడం మూలాన ఏదో విధంగా కొడుకు సంతోషంగా ఉండడం వంశం నిలబడడం కావాలని చివరికి ఒప్పుకుంది.
    ఆనవాయితీ ప్రకారం సంవత్సరానికి ఒకసారి శరణాలయం వ్యవహారాలూ చూడడానికి వెళుతున్న రంగారావుతో బాటు శ్యామల కూడా వెళ్ళింది. అక్కడే ఓ అనాధగా పెరిగిన తను, ఇప్పుడు అధికార హోదాలో వెళ్ళడం సిగ్గు, సంకోచాలతో పాటు ఏదో గర్వాన్ని కూడా కలిగిస్తుంది.
    అప్పుడే నర్సరీలో ఉన్న ఉష ను చూసి ఏదో ఆలోచన రాగా, ఆమె విషయాలు గుచ్చిగుచ్చి అడగడం జరిగింది. ఏమిటో చెయ్యాలనుకుంది. కాని, ఆ సంగతి ఆయనతో పెళ్ళి అయిన ఇంత కొద్ది కాలంలో చెబితే ఏమనుకుంటారో అన్న సంకోచం రాగా, అడిగే ధైర్యం చాలక ఊరుకుంది.
    
                                            *    *    *    *
    రాత్రి గదిలోకి వచ్చిన రంగారావు తన రాకనే గుర్తించనంత పరధ్యానంలో ఉన్న శ్యామలను చూసి ఎంతో ఆశ్చర్య పడ్డారు. ఎప్పుడూ సంతోషంగా కలకలలాడే శ్యామల, ఈరోజు ఆలోచనలతో సతమతవుతూ , ఏదో చెప్పాలన్న ఆరాటానికి, ఎలా చెప్పాలన్న సంశయానికి మధ్య  నలిగిపోతున్నట్లు కనపడడం చూసి, అయన అనేక విధాల అడిగి, కాసేపటికి అసలు సంగతి రాబట్టగలిగారు. సంగతి విన్నాక తేలిగ్గా నవ్వేశారు.
    "ఏం అప్పుడే పిల్లల మీదికి పోతుందా మనసు? పెంచుకోడమెందుకు ? నీకు పుట్టరనేనా?"
    'అదేం కాదు ఎందుకో ఆ పాప నాకు నచ్చింది? చాలా ముద్దుగా ఉంది. మనకి కాస్త కాలక్షేపం అవుతుందని.....' నసిగింది శ్యామల.
    "బాగానే ఉందనుకో! పెంచుకోడం అంటే మాటలా? ఎందుకు వచ్చిన గొడవ చెప్పు! రేపు మనకి పిల్లలు పుడితే ఈ పిల్ల నేం చేస్తాం / బాగా ఆలోచించు, అనవసరంగా సమస్యలు నెత్తికి తెచ్చుకోడం ఎందుకు ?"
    "ఆలోచించడానికి ఏముంది? మనకి పిల్లలు పుడితే ఆ పిల్లలతో బాటు పెరుకూడదా, ఉష? ఆ ఒక్క పిల్ల మనకి బరువా, ఇంట్లో ఇంతమంది ఉండగా?"
    "సరే, నీ కంత ముచ్చటగా ఉంటే నాకేం అభ్యంతరం లేదు గాని .... అయినా అంతమంది వుండగా ఆ పాప మీదనే నీ కెందుకు కంత మక్కువ?"
    శ్యామల ముఖం ఒక్కసారిగా పాలిపోయినట్లు తెల్లబడింది. గొంతు తడబడి వణికింది.
    'చెప్పానుగా, అందరికంటే ఆ పిల్ల ముద్దు వస్తుందని, ఎందుకో అంత చక్కటి పాప అలా అనాధగా పెరుగుతుంటే నాకేమిటో కష్టంగా వుంది "
    శ్యామల వైపు ఒక్క క్షణం నిశితంగా చూశారు రంగారావు. ఆమె దయార్ద్ర హృదయానికి మెచ్చుకుంటున్నాట్టు ప్రేమగా నవ్వి, "నీ ఇష్టం కాదంటానా?" అలాగే రేపు వెళ్ళి ఉషను తీసుకు వస్తాం" అన్నాడు.
    ఉష వచ్చిన దగ్గిర నుంచి శ్యామలకు బాగా కాలక్షేపం కాసాగింది. ఆమె ఆటపాటలతో , ముద్దు ముచ్చటలతో రకరకాల బట్టలు తొడగడం, ముస్తాబు చేయడం, బొమ్మలతో ఆడుకోడం వగైరాలతో తీరిక చిక్కనంత కాలక్షేపం కాసాగింది. మొదట రెండు మూడు రోజులు క్రొత్త చేసినా, క్రమంగా శ్యామల ప్రేమాభిమానాలతో శ్యామలకు చేరువయి "అమ్మా' అని పిలిచేది ఉష.
    రంగారావు కూడా ఉషను చూసి ఎంతో ముచ్చట పడ్డారు. మామూలుగా కనపడని కళా'కాంతులు ఆ పిల్ల ముఖంలో చూసి ఆశ్చర్యపడ్డారు. చాలా రోజుల తరువాత ఇంట్లో పసిపిల్ల ఆటపాటలు ఆయన్ని ఎంతో సంతోష పరిచాయి. ఉషను చూస్తుంటే అయన కేదో అనుభూతి కలిగి, అయన మనసులో ఏదో అనుబంధం ఏర్పడింది.

                                              *    *    *    *
    ఆరోజు అనుకోకుండా ఊరు నుంచి ముందుగా వచ్చిన రంగారావు గారికి డ్రాయింగ్ రూములోంచి కొంచెం గట్టిగా మాటలు వినిపడ్డాయి. అందులో ఒక గొంతు అపరిచిత పురుష కంఠం. రెండోది శ్యామలది.
    "నిజం జమీందారుగారికి తెలిస్తే మీ ఇద్దరి గతి, పాప భవిష్యత్తు ఏమవుతుందో తెలుసా? మర్యాదగా నే నడిగింది ఇచ్చేస్తే ఈ రహస్యం బయటికి పోక్కడు.'
    'ఇప్పటికి రెండు సార్లు అయింది, ఇలా ఇస్తున్నంత కాలం నువ్వు మళ్ళీ రాకుండా వుంటావని నమ్మక మేమిటి?"
    "ఇంక రాను, మాట ఇస్తున్నాను."
    "నువ్వింత దుర్మార్గుడవని అనుకోలేదు. నన్నెందుకు కిలా పీడిస్తావు? నీకు నేనేం అపకారం చేశాను? పాప మీద నీకెందుకు కంత పగ ?"
    ఆ మాటలు వింటూనే లోపలికి అడుగుపెట్టారు రంగారావు. ఆయన్ని అలా అనుకోకుండా హటాత్తుగా చూసిన ఇద్దరూ నిశ్చేష్టులైపోయారు. శ్యామల వివర్ణమయిన ముఖం చేతుల్లో దాచుకుంది.
    "ఏమిటిది? ఏమిటా రహస్యం?' తుఫాను ముందు ప్రశాంతతిలా నిశ్చలంగా చూస్తూ శాంతంగా అడిగారాయన.
    అతను శ్యామల వంక, అయన వంక చూసి చెప్పటానికి తటపటాయించి పారిపోబోయాడు.
    'అడుగు కదిలావంటే నరికేస్తాను. ఆ రహస్య మేమిటో చెప్పు?' జమీందారు గారు గుమ్మానికి అడ్డంగా నిలబడి గంబీరంగా అడిగారు.
    "ఉష అనాధ కాదు. ఆవిడకి తెలుసు. గట్టిగా అడగండి. ఆమె చెబుతుంది' అంటూనే అయన పక్కనుంచి దూసుకుపోయాడు. అయన ఈ వార్త విని తిరిగి చూసేసరికి హల్లో ఎవరూ లేరు.
    రాబోయే తుఫానును ఊహించి శ్యామల ఆ సాయంకాలం వరకు అయన నించి ముఖం చాటు చేసుకు తిరిగింది. అయన కోపం విజ్రుంభిస్తే తను తట్టుకుని నిలబడడం కష్టం. ముసలావిడ కాలం చేశాక ఇంట్లో ఆయన్ని అడ్డుకోగలవారెవరూ లేరు.
    ఆ రాత్రి బాగా పొద్దు పోయాక అయన పడుకున్నారన్న నమ్మకంతో గదిలో ప్రవేశించింది శ్యామల. గది అంతా చీకటిగా ఉంది. మెల్లిగా నడిచి మంచం చేరెంతలో లైటు వెలిగింది. ఆమె బిత్తరపోయింది.
    "నీ కోసమే చూస్తున్నాను, ఇంత ఆలస్యం చేశావెం?" అయన గొంతు చాలా ప్రశాంతంగా ఉంది. సోఫాలో కూర్చుని ఉన్నారు.
    "ఉషని పడుకో బెడుతున్నాను."
    "రా, ఇలా వచ్చి కూర్చో' సోఫాలో జరిగి చోటు ఇచ్చాడు అయన. ఆమె ఊహించిన కోపావేశాలకు ఈ శాంతం , సౌమ్యత ఆమె నింకా ఎక్కువగా కాలుస్తున్నాయి. బెదురుతూ, అలజడితో ఒక వారగా ఒదిగి కూర్చుంది.

 Previous Page Next Page