Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 20

 

    ప్రవరుని పలుకులకు వరూధిని ముఖం చిన్న బుచ్చుకుంది. "ఓయి అందగాడా! ఇటువంటి ఎలప్రాయం వైదికకర్మలతో గడిచిపోతే ఇక సుఖాలు అనుభవించేదెప్పుడు? అయినా యజ్ఞాలు, యాగాలు, చేసి సోమయాజులు కావటానికి ఫలం మా కౌగిళ్ళలో మైమరచిపోవటమే కదా! ఇదిగో ఇక్కడ కస్తూరి , జవ్వాది , పచ్చకర్పూరం, పన్నీరు, సమృద్దిగా ఉన్నాయి. రకరకాల పూలు ఉన్నాయి. కల్పవృక్షాలు ఉన్నాయి. మణిభూషణాలు ఉన్నాయి. నాతొగూడి హాయిగా అనుభవించు. గ్రుడ్డివాడు వెన్నెలను నిరసించినట్లు మావంటి గాంధర్వకాంతల భోగాన్ని నీవు కాదంటున్నావు.
    
    ఎన్ని భవంబులం గలుగు నిక్షుశరాసన సాయక వ్యధా
    భిన్నత వాడి వత్తలయి కేల గపోలము నూది చూపులన్    
    విన్నదనంబు దోప గనువెదుఱునం బయిగాలి సోకినన్
    వెన్నవలెన్ గరంగు నలివేణుల గౌగిట జేర్చు భాగ్యముల్.

    సముఖంలో సంప్రాప్తించిన నశారీర స్వర్గసుఖాన్ని నిరాకరించి ఉపవాసాది నియమాలతో కృశించిపోవటం వివేకం కాదు" అన్నది.
    వరూధిని మాటలకు ప్రవరుడు ఇలా సమాధాన మిచ్చాడు- " నీ మాటలు కాముకుడైన వానికి ఇష్టం అవుతాయి కాని నావంటి వానికి కాదు. నావంటి బ్రాహ్మణుడు ఇంద్రియలోలుడైతే బ్రహ్మానందానికి దూరమైపోతాడు."
    ప్రవరుని నోటివెంటవచ్చిన "బ్రహ్మానంద" శబ్దానికి "విషయానంద" పరంగా వ్యాఖ్యానం చెబుతుంది వరూధిని.
    ఎందే డెందము కందళించు రహిచే నేకాగ్రతన్ నిర్వతిన్
    జెందున్ గుంభగత ప్రదీప కాళికాశ్రీ దోప, నేందేందుబో
    కెందే నింద్రియముల్ సుఖంబు గను నాయింపే పరబ్రహ్మ "మా
    నందో బ్రహ్మ" యటన్న ప్రాజదువు నంతర్భుద్ది నూహింపుమా.
    
    వరూధిని తడబాటు మాటలను ప్రవరుడు ఏవగించుకున్నాడు. విరక్తి సూచకంగా ఒక చిరునవ్వు నవ్వి "ఈ పాండిత్యము నీకు దక్క మరియేందే గంటిమే?" అన్నాడు. "వేదోక్త ధర్మాలు పాపమంటున్నావు. సంభోగమే పుణ్యమంటున్నావు. బాగుబాగు! నీవు కామశాస్త్రం ఉపాధ్యాయుని వలె పలుకుతున్నావు. నీతో వాద మెందుకు! విను -
    తరుణీ! రేపును మాపు హవ్యములచేతం దృప్తుడౌ వహ్ని స
    త్కరుణా దృష్టి నొసంగు సౌఖ్యము లెఱుంగన్ శక్యమే నీకు? నా
    కరణుల్ దర్భలు నగ్నులున్ బ్రియములై నట్లన్యముల్ గా వోడల్
    తిరమే? చెప్పకు మిట్టి తుచ్ఛ సుఖముల్ మీసాలపై దేనియల్".
    
    ప్రవరుని మాటలు వరూధిని సహించలేకపోయింది. ఇక ,మాటలతో లాభం లేదనుకున్నది. హటాత్తుగా పోయి ప్రవరుణ్ణి కౌగలించుకున్నది - అధరం ముద్దాడ బోయింది. ధీరచిత్తుడైన ప్రవరుడు మారుమోముతో "హా శ్రీహరీ!" అని ఆమెను దూరంగా త్రోసి వేశాడు.
    శాంతం జయించింది. శృంగారం పరాజయం పొందింది. ధర్మం ముందు కామం తలవంచింది. ధర్మవీరుడైన ప్రవరుడు అతిలోకసుందరి అయిన వరూదినికి లొంగలేదు. ఆమె శృంగార చేష్టలకు అణు మాత్రం చలించలేదు. అతని శ్తైర్యం చెక్కు చెదరలేదు. అతని ధర్మనిష్ట మొక్క పోలేదు.
    త్రోపుపడిన వరూధిని ఏమేమో పలికింది. ఆ కలికి ఉలుకు పలుకులను ప్రవరుడు వినిపించుకోలేదు. ఆమె ఆలింగనం చేసుకొన్నప్పుడు తన దేహానికి అంటుకొన్న జవ్వాజి సుగంధం పోయేలా నీటితో ఓడలు కడుగుకొని తాను నిత్యమూ ఉపాసించే గార్హపత్యాగ్నిని సంస్తుతించి ఇలా ప్రార్ధించాడు-

    దానజపాగ్ని హోత్రపరతంత్రుడనేని, భవత్పదంబుజ]
    ధ్యాన'రాతుండనేని, బరదార ధనాదుల గోరనేని, స
    న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మీనుందు పశ్చిమాం
    భోనిదిలోన గ్రుంకకయ మున్న రయంబున హవ్యవాహనా!
    
    అగ్నిదేవుడు ప్రవరుని శరీరంలో ప్రవేశించాడు. ఉదయించే సూర్యబింబం వలె అతని దేహం బంగారు కాంతులు చిమ్మింది. ప్రవరుడు అగ్నిభట్టారకుని అనుగ్రహం వల్ల సుఖంగా ఇంటికి చేరుకున్నాడు.
    ఈ సన్నివేశం ధర్మనిష్ఠ గలవారికి దైవం తప్పకుండా సహాయపడుతుందన్న సత్యాన్ని వెల్లడిస్తుంది. "దానజపాగ్ని హోత్ర పరతంత్రుడనేని" "పరదార ధనాదుల గోరనేని" "భవత్పదంబుజధ్యాసరతుండనేని" అన్న ప్రమాణ వాక్యాలు ప్రవరుని పవిత్రజీవితానికీ సదాచార సంపన్నతకూ, ఆత్మవిశ్వాసానికీ ప్రతీకలుగా విజయపతాకాలుగా భాసిస్తాయి.   సౌందర్యవతులైన సతుల మాయలు ధీరుల చిత్తాలను చలింపజేయలేవనీ, తుచ్ఛసుఖములు మీసాలపై తేనియలనీ , ఇంద్రియసుఖాలకు లోబడినవాడు బ్రహ్మానంద పదవీ భ్రష్టు డౌతాడనీ వరూధినీ ప్రవరుల సమావేశంలో ఉజ్జ్వలమైన ఉపదేశం పాఠకులకు ప్రాప్తిస్తుంది.
    మాయా ప్రవరుని రూపంతో వరూధినిని వంచించిన గంధర్వుని నోటివెంట రాదగినది మాత్రం కాదు గాని ఈ క్రింది పద్యం స్వేచ్చాకాముకత్వాన్ని నిషేధిస్తూ సముజ్జ్వలమైన సందేశాన్ని అందిస్తుంది. చిత్తగించండి . -
    
    ఎవ్వడు మీదెఱుంగక యదేచ్చెసుఖైకరతిం జరింపగా
    నవ్వల వంశహాని వ్రతహాని యశోధనహాని పుట్టు; దా
    నవ్వేద గమ్మనుష్యపశు పయ్యవివేకి చెదున్ జగంబునన్
    నవ్వగ బాలు రైరవమునం బడ బాలును నిందపాలునై.
    
    పారలౌకిక దృష్టి లేకుండా కేవలం బహికదృష్టితో విషయలోలుడై ఎవడైతే ఎదేచ్చగా సంచరిస్తాడో వాని వంశగౌరవం నశిస్తుంది. వాని దీక్ష సడలిపోతుంది. వాని యశస్సు అంతరిస్తుంది. అ వెర్రివాడు - ఆ అవివేకి - అ మనుష్య పశువు - సర్వ విధాలా భ్రష్టుడౌతాడు. పదిమందిలో నిందలపాలై చివరకు నరకం పాలౌతాడు.
    ఆచార్యున్ని అవమానించినవారు అధః పతితుడవుతాడనే పరమ సత్యాన్ని ఇందీవరాక్షుని వృత్తాంతంలో పెద్దన గారు మనకు వ్యక్తం చేస్తారు. ఇందీవరాక్షుడనే గంధర్వరాజు తనకు విద్య నేర్పటానికి నిరాకరించిన బ్రహ్మమిత్రుడనే ఆచార్యుని మోసగించి అదృశ్యరూపుడై శిష్యుల నడుమ కూర్చుండి అతని నుండి ఆయుర్వేద విద్య నేర్చుకుంటాడు. నేర్చుకున్నవాడు తన దారిన తాను పోకుండా గురువును దిక్కరించి -
    
    "తండ్రీ! నాకు ననుగ్రహింపగదే వైద్యం" బంచు బ్రార్థించినన్
    గండ్రల్ గానటులాడి దిక్క్రుతుల బోకాల్మంటి వోహో! మదిం
    దీండ్రల్ గల్గినవారి కేకరణినేనిన్ విద్య రాకుండునే?
    గుండ్రా డాచిన బెండ్లియేమిటికి జిక్కుం? గష్టముష్టింపచా!

 Previous Page Next Page