Previous Page Next Page 
జీవితం చేజారనీయకు పేజి 2

    "హు.... నా హాయిని ఆదర్శంగా పెట్టుకోకు తల్లీ" అనుకుంది తను. నిట్టూర్చి ఆ మాట ఎందుకో పైకి అనలేకపోయింది.
    "నా ఎమ్మే అయితే గాని చేసుకోను ఆంటీ. ఆ మాట అంటే అమ్మ వినదు.
    ఇలా నచ్చలేదని చెప్పేస్తూ ఉంటే ఎలాగో ఉండదు" అంది నవ్వుతూ.
    విద్య ఎమ్మే ఫైనల్ ఇయర్ లో వుండగా ఓ సంబంధం అందరికీ అన్ని విధాలా నచ్చింది వచ్చింది. అబ్బాయి ఇంజనీరు. ఓ కంపెనీలో పెద్ద జీతంతో పనిచేస్తున్నాడు. తండ్రికి బోలెడు ఆస్థి రెండు మూడు ఇళ్ళు ఉన్నాయి. ఇద్దరు కొడుకులలో ఇతడు రెండోవాడు. ఒక్క కూతురుకి పెళ్ళి అయిపోయింది. బాదరబందీలు లేవు.      
    పరీక్షలయితేగాని చేసుకోను అని విద్య గోలపెడ్తున్నా 'చూసి వెళ్ళనీ నచ్చిందంటే పరీక్షలయ్యే వరకూ ఆగమనవచ్చు. పెళ్ళయితే మాత్రం చదవకూడదా! ఇంక ఆరునెలలేగా ఉంది. మంచి సంబంధం' అంటూ నచ్చజెప్పి పెళ్ళి చూపులు అరేంజ్ చేశారు. పెళ్ళి చూపులనాడు విద్య బలవంతం పెడితే తనూ వెళ్ళింది.    
    అబ్బాయి పెద్ద అందగాడు కాకపోయినా చామనఛాయ రంగులో కనుముక్కు తీరు బాగానే ఉంది. పెద్ద పొడుగరి కాకపోయినా విద్య హైట్ కి సరిపోతాడు. అతన్ని చూస్తే అంత మాటకారి కాదనిపించింది. అడిగిన వాటికి ముక్తసరిగా సమాధానాలు చెప్పాడు తప్ప ఈ కాలం వాళ్లలా మాటలు కలపలేదు. తండ్రి మాత్రం వంటొచ్చా, పాటొచ్చా అంటూ పాతకాలం వాడిలా ప్రశ్నలు వేశాడు.
    తల్లి చాదస్తంగా పాట పాడు, ఏదో ఒకటి పాడు అంటూ పదిసార్లు అడిగింది. నాకు పాట రాదు అని తెగేసి విద్య చెప్పాక ఊరుకుందావిడ. అన్నీ బాగానే ఉన్నాయి కాని అతని ముఖంలో దరహాసం అసలు కనపడలేదు. మూడీ ఫెలో కాదు కదా అనిపించింది తనకి. విద్యని అతను ఏం పలకరించలేదు. ఈ కాలం వాళ్ళలా మాటలు కలిపి ఏదో అడగాలన్న తాపత్రయం కనపడలేదు. విద్యకి అది నచ్చినట్టులేదు. కాస్త డిసపాయింట్ అయిందేమోననిపించింది. ఉత్తరం రాస్తామంటూ వెళ్ళారు వాళ్ళు.    
    "ఏం విద్యా..... అబ్బాయి నచ్చకపోవడానికి ఏముంది. మూడు వేలు జీతం, బోలెడు ఆస్తి, ఇళ్ళు, నగలు, ఈ అబ్బాయికి తండ్రి హైదరాబాదులో ఓ ఫ్లాట్ కొనిచ్చాడుట" తల్లి మురిసిపోతూ అంది.    
    "మొహంముంగిలా పెట్టుకు కూర్చున్నాడేమిటి? నవ్వితే నవరత్నాలు రాలతాయేమోనన్నట్టు నోరు బిగించుకుని కూర్చున్నాడు." విద్య అంది. నచ్చిందీ నచ్చందీ ఏం చెప్పలేదు.  
    "అంత జాలీఫెలోలా లేడు. ముభావంగా మాట్లాడాడు." విద్య పెద్దన్నయ్య అన్నాడు.
    "అతని తీరే అంత అనుకుంటాను. అంతా మన విద్యలా వాగుతారా?" తండ్రి నవ్వుతూ అన్నాడు.
    మొత్తంగా పెద్దగా అడ్డు చెప్పడానికి ఎవరికీ ఏవంకా కనపడలేదు. ఉత్తరం కోసం ఆరాటంగా చూశారు అందరూ. వారం రోజులు తరువాత 'పిల్ల నచ్చింది. మాకేబోలెడు వుంది. కట్నం అక్కరలేదు. మా హోదాకి తగ్గట్టు పెళ్ళి బాగా చెయ్యాలి' అంటూ రాశారు. అంత మంచి సంబంధం కట్నం కూడా వద్దని చేసుకుంటున్నారని అంతా సంబరపడ్డారు.   
    "ఆంటీ..... మీరేమంటారు? అతన్ని చూసారుగా, ఫ్రాంక్ గా మీ అభిప్రాయం చెప్పండి" అంటూ వచ్చింది ఓ సాయంకాలం. తను తడబడింది ఏం చెప్పాలో తెలియక. నిజం చెప్పాలంటే అతని మొహం చూడగానే ఎందకో డిసపాయింట్ అయింది తను. ఫలానా కారణం అని చెప్పలేదు కాని, చూడగానే ఎందుకో ఇంప్రెస్ కాలేదు. అందం గురించి కాదు. అతనిలో ఫ్రెండ్ లీనెస్, సౌమ్యత, అందరితో సరదాగా కలిసిపోయేమనస్తత్వం లేదనిపించింది. కేవలం తన ఊహ అపోహేమో! పెళ్ళికొడుకు కాస్త బిగించుకుని కూర్చున్నాడేమో! పెళ్ళయితే విద్య కంపెనీలో ఇలా ఉండకపోవచ్చు." బాగుంది..... చేసుకునే దానివి నీవా నేనా? నాకు నచ్చడం ఏమిటి" అంది నవ్వేసి తను. "అదికాదు ఆంటీ! అతన్ని చూస్తే ఎందుకో సీరియస్ టైప్ అన్పించింది. బాబోయ్! అందం లేకపోతేలేదు, డబ్బు లేకపోతే లేదుగాని, లైఫ్ సీరియస్ అయితే మాత్రం నేను భరించలేను. బతికిన నాలుగురోజులూ నవ్వుతూ బతకాలి."
    "మీ వాళ్ళతో చెప్పావా నీ సందేహం?"
    "నీ మొహం, పెళ్ళిచూపుల్లో చూసిన అరగంటలో ఏం తెల్సిపోయింది? బొత్తిగా పరిచయంలేని వాళ్ళతో, అందులో పెళ్ళిచూపుల్లో మొదటిసారే ఏం మాట్లాడేస్తారు, పిచ్చి అనుమానాలు నీవూ - అంటూ అంతా కేకలేశారు అంటీ" అంది విద్య.
    ఏం చెప్పాలో, చెబితే విద్య డిసపాయింట్ అవుతుందేమో, తనేదన్నా అంటే తన మీద నమ్మకంతో ఈ సంబంధం వద్దంటుందేమో, చిన్న విషయాన్ని తామిద్దరూ కొండంత చేస్తున్నారేమో, అనుమానంతో తనిలా అందని తెలిస్తే వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారో! అని సందిగ్ధంలో ఏమీ చెప్పలేకపోయాను.  
    "నేనేం చెప్పను విద్య నాకూ అతను సీరియస్ టైపు అన్పించాడు. కాని మీ వాళ్ళు అన్నట్లు కొందరు అంత తొందరగా కొత్త వాళ్ళతో కలవరు. రేపు నీ కంపెనీలో మామూలుగా వుంటాడేమో! మంచి సంబంధం, ఈ మాత్రం దానికోసం వదులుకోవడం అవివేకమేమో" అన్నాను ఎటూ తేల్చకుండా.
    "ఆంటీ..... చక్కగా ఫారిన్ లోలాగ మనదేశంలోనూ కోర్టింగ్ పీరియడ్ ఉంటే ఇలాంటి విషయాలు ముందే తెల్సుకోవచ్చు - అలాంటి సదుపాయాలు మనకి లేవు. అంతా దైవాధీనంసరీస్. 'లక్' మీద డిపెండ్ అవుతాయి మన పెళ్ళిళ్ళు. నాకేం చెప్పాలో తెలియడం లేదు. మీరేదన్నా సలహా ఇస్తారేమోనని ఇలా వచ్చాను...." అంది.   
    ఆమెలో సంఘర్షణ అర్థం అయింది తనకి. కాని తనుమాత్రం ఏం చెప్పగలదు?
    మొత్తానికి అందరూ కలిసి విద్యను వప్పించారు. చదువు, పరీక్షలు అని గోల పెట్టింది విద్య. 'ఆ అబ్బాయి పెళ్ళి అయ్యాక నెలరోజులలో ఏదో ట్రైనింగ్ కి జర్మనీ వెళతాడట ఆరునెలలు. అతను తిరిగి వచ్చేవేళకి నీ పరీక్షలు ఎలాగో అవుతాయి. అతనున్న ఒక నెల రెండు నెలలు ఎలాగో మేనేజ్ చెయ్యవచ్చు. తరువాత మంచి ముహూర్తాలు లేవు. పెళ్ళి చేసి పంపాలని వాళ్ళ ఉద్దేశం' అంటూ బలవంతంగానే వప్పించారు విద్యని.

 Previous Page Next Page