Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 2


    సుశీలమ్మ కొడుకు ముఖంలోకి అయోమయంగా చూస్తూ వుండిపోయింది.


    "నన్ను క్షమించమ్మా!"


    "ఏమిట్రా నువ్వనేది?" సుశీలమ్మ కంఠం తీవ్రంగా వుంది.


    శరత్ ఎదురుగా వున్న పుస్తకం పేజీలు తిప్పుతూ కూర్చున్నాడు.


    "అది పుట్టినప్పటి నుంచీ నీ పెళ్ళాం అనే అనుకున్నాం రా! ఇప్పుడు కాదని మామయ్యకు ఎలా చెప్పనురా!" సుశీలమ్మ కంఠం బొంగురు పోయింది.  


    శరత్ సమాధానం ఇవ్వలేదు.


    "మాట్లాడవేంరా?"


    శరత్ మాట్లాడలేదు.


    "భారతి నీకు తగదా?"


    "అది కాదమ్మా...."


    "ఏమిటో చెప్పు, నాన్చక.... భారతి అంటే ఎందుకు ఇష్టం లేదు?" నిలదీసినట్టు అడిగింది.


    శరత్ టేబుల్ అంచును గోళ్ళతో గీరుతూ కూర్చున్నాడు!


    "చెప్పవేం రా?"


    "నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా నమ్మా! ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని మాట ఇచ్చాను."   


    సుశీలమ్మ చివ్వున తలెత్తి కొడుకు ముఖంలోకి చూసింది. ఎవరో కో వ్యక్తిని చూస్తున్నట్టు చూడసాగింది.


    "నీకు కష్టం కలిగిస్తే క్షమించమ్మా!" తల్లి రెండు చేతులూ పట్టుకుంటూ అన్నాడు శరత్.


    "నీ భార్యను నువ్వే ఎన్నుకున్నావన్నమాట!"


    ఆ కంఠం నిర్లిప్తంగా వుంది.


    "నన్ను క్షమించమ్మా!"


    "ఇందులో క్షమించడానికేముందిరా? ఈ సంగతి ముందే చెబితే బాగుండేది. అనవసరంగా మామయ్యకు ఆశ కలిగించాం." అన్నది సుశీలమ్మ.


    శరత్ కళ్ళు సంతోషంతో మెరిసాయి. అమ్మ నిజంగా దేవత ! బిడ్డల మనసుల్ని అర్థం చేసుకోగలదు!


    "ఎవరమ్మాయి? పేరేమిటి?


    "పేరు రాజేశ్వరి. నాకు జూనియర్. ఇప్పుడు ఎం.ఏ. ఫైనల్ చదువుతూ వుంది."


    "ఎవరమ్మాయి?"


    "వాళ్ళ నాన్న ఆర్.డీ.ఓ గా పనిచేస్తున్నారమ్మా!"     


    "ఏ కులం?"


    శరత్ చెప్పాలా వద్దా అన్నట్టు ఆలోచనలో పడ్డాడు.


    "మన కులం కాదా?"


    "అంతే కాదమ్మా - ఆమె హరిజన్...."


    సుశీలమ్మ తృళ్ళిపడింది. శరత్ ముఖంలోకి వెర్రి చూపులు చూసింది.


    శరత్ ఆమె ముఖం చూసి గతుక్కుమన్నాడు. ఇద్దరూ మౌనంగా ఒకరి ఉనికిని మరొకరు మర్చిపోయినట్టు కూర్చున్నారు.


    సుశీలమ్మ కళ్ళల్లో నీరు తిరిగింది.


    "ఏమ్మా ఎందుకు అంత బాధపడుతున్నావ్? హరిజనులు మన లాంటి మనుషులు కారా? వాళ్ళ రక్తం రంగు ఎర్రగా వుండదా? మనలా గాలి పీల్చరా? మనలా...."


    "బాబూ!"


    "నీకు కులాల మీద నమ్మకం లేదని నాకు తెలుసమ్మా! నువ్వు ఎన్నోసార్లు ఆవేశంగా నాన్నతో ఘర్షణపడటం నేను విన్నాను నా ఫ్రెండ్ రామం విషయంలో. రామాన్ని నువ్వెంత ప్రేమించే దానివో మర్చిపోయావా అమ్మా!"


    సుశీలమ్మ మాట్లాడలేకుండా వుంది. ఆమె కళ్ళవెంట నీరుకారి చెంపల మీదుగా జారి గుండెల మీద పడుతూ వుంది.


    "రాజేశ్వరి చాలా మంచిపిల్లమ్మా! చాలా తెలివైంది. అందమైంది కూడా. నువ్వు చూస్తే యిష్టపడతావని నాకు నమ్మకం వుందమ్మా!"


    సుశీలమ్మ సమాధానం ఇవ్వలేదు.


    "ఎందుకమ్మా ఏడుస్తావ్? నీకు ఇష్టం లేకపోతే చెప్పు. పెళ్ళి మానేస్తాను. రాజేశ్వరి చాలా సంస్కారంగల పిల్ల. ఆమె నన్ను అర్థం చేసుకుని క్షమించగలదు" అన్నాడు శరత్ ఆవేశంగా.   


    సుశీలమ్మ కళ్ళు తుడుచుకొని కొడుకు ముఖంలోకి చూసింది.


    "నిజంగానా బాబూ?" ప్రశ్నించింది.


    "నిజమేనమ్మా! నన్నేం చెయ్యమంటావో చెప్పు!"


    "భారతిని పెళ్ళిచేసుకోమంటే చేసుకుంటావా?"


    "నీ కోర్కె అదే అయితే...."


    "నువ్వు రాజేశ్వరిని మర్చిపోయి భారతితో సుఖంగా జీవించగలవా?" శరత్ కళ్ళల్లోకి లోతుగా చూస్తూ ప్రశ్నించింది సుశీలమ్మ .


    శరత్ విరక్తిగా నవ్వాడు. అతని తెల్లని ముఖంలో నీలినీడలు లీలగా కదిలాయి.


    "అది ఎలా చెప్పగలనమ్మా!" శరత్ కంఠం జీరపోయింది. సుశీలమ్మ కొడుకు ముఖంలోకి చూస్తూ వేదాంతిలా నవ్వింది.


    "పిచ్చి సన్యాసీ! నాకోసం నీ నూరేళ్ళ జీవితం పాడుచేసుకుంటావా? వద్దు! నువ్వు నీకు నచ్చిన పిల్లనే చేసుకో. నువ్వు సుఖంగా ఉండు అంతేకావాలి నాకు." దుఃఖంతో కంఠం పూడిపోతూంటే బలవంతంగా పెగుల్చుకుంటూ అన్నది సుశీలమ్మ.

 Previous Page Next Page