Previous Page Next Page 
మరో కర్ణుడి కథ పేజి 3


    "అమ్మా సంతోషంతో శరత్ తల్లి రెండు భుజాలు పట్టుకొని బలంగా ఊపేశాడు.


    "ఒరేయ్! ఒరేయ్! వదల్రా బాబూ!" అంది సుశీలమ్మ దిగులుగా.


    "అంత దిగులుగా వుంటే నేను ఈ పెళ్ళి చేసుకోను. సంతోషంగా వుండాలి." అలిగినట్టుగా అన్నాడు శరత్.


    ఉన్నట్టుండి ఒక్కసారిగా శరత్ ను పట్టుకుని బోరుమంది సుశీలమ్మ.


    శరత్ మతిపోయినవాడిలా నిలబడిపోయాడు.


    "బాబూ! నిన్ను దూరం చేసుకోలేనురా!"


    శరత్ అర్థం కానట్టు తల్లి ముఖంలోకి చూశాడు.


    "మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకోరురా బాబూ!" శరత్ తేలిగ్గా నిట్టూర్చాడు.


    "అమ్మా నీ అండ వుంటే నాకు చాలమ్మా! నాన్నే కాదు, యావత్ ప్రపంచాన్నే ఎదిరించగలను. నిన్ను మాత్రం ఎదిరించ లేనమ్మా!" అన్నాడు శరత్ ఉద్రేకంగా.


    "అదికాదురా బాబూ! నువ్వీ పెళ్ళిచేసుకుంటే నాన్న నన్ను నీకు దూరం చేస్తారురా!" వెక్కిళ్ళమధ్య అన్నది సుశీలమ్మ.


    "నా నుంచి నిన్నెవరూ వేరు చెయ్యలేరమ్మా!"


    "నీకు ఎలా చెప్పాలో అర్థం కావటంలేదురా కన్నా! నాన్న నిన్ను ఈ ఇంటిగడప తొక్కనివ్వరు" భోరుమంది సుశీలమ్మ.   


    "ఊరుకో అమ్మా! మొదట అందరూ అలాగే అంటారు. నాన్న మాత్రం నన్ను చూడకుండా వుండగలరా ఏం? కోపం తగ్గాక ఆయనే నన్ను వెతుక్కుంటూ వస్తారు. పైకి అలా వుంటారు గాని నాన్నకు నేనంటే చాలా ఇష్టం అమ్మా!" అన్నాడు శరత్.


    శరత్ నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు రా!" జాలిగా కొడుకు ముఖంలోకి చూసింది.    


    శరత్ కళ్ళల్లో దిగులు కన్పించింది. తల్లి హృదయం వరదనీటి వెల్లువ అయింది.


    "దిగులుపడకు బాబూ! నేను మీ నాన్నతో మాట్లాడతాను. పడుకో, నిశ్చింతగా నిద్రపో!"


    కొడుకు తలనిమిరి బయటికి వెళ్ళిపోయింది సుశీలమ్మ.    


    ఆమె వెళ్ళినవైపే ఓ క్షణం చూసి "పిచ్చి! అమ్మ!" అనుకుంటూ వెళ్ళి మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు శరత్.


                                        2


    అప్పుడే నిద్రపడుతున్న శరత్ ను ఎవరో వీపుమీద చరిచినట్టు తృళ్ళిపడి లేచాడు.


    పక్క గదిలో నుంచి గట్టిగా తండ్రి కంఠం వినిపిస్తూ వుంది. సన్నగా తల్లి ఏడుపు విన్పిస్తూ వుంది. శరత్ అర్థం చేసుకున్నాడు. తమ గురించే ఘర్షణ పడుతున్నారని తెలుసుకున్నాడు. జాగ్రత్తగా వినసాగాడు.


    "మీకు పుణ్యం వుంటుంది. గట్టిగా మాట్లాడకండి పిల్లలు వింటారు" ఏడుస్తూ తగ్గు స్వరంతో సుశీలమ్మ అంటూ వుంది.    


    గట్టిగానే మాట్లాడతాను. ఇంతకాలం నోరుమూసుకొని వున్నాను వాణ్ణి నా బిడ్డలాగే చూసాను. ఎందుకు? నీ కోసం! నువ్వేడుస్తావని!"


    శరత్ చివ్వున లేచి మంచం మీద కూర్చున్నాడు.


    "ఏమండీ! చిన్నగానే మాట్లాడండి" పెద్దగా ఏడుస్తూ అర్థించింది.


    "అంటాను.... అనేకసార్లు అంటాను. వాడి ముఖంమీదే అంటాను. అందరి ముందూ చెప్తాను. వీడే నా కొడుకైతే ఇంత దిగజారడు. బుద్ధులు ఎక్కడికి పోతాయ్? అందుకే అంటారు పుట్టుకతో వచ్చిన బుద్ధులు...."   


    "ఏమండీ? మీ కాళ్ళు పట్టుకుంటాను. అంతపనిచెయ్యకండి. కన్నావుగదూ?" రామనాధం కంఠంలో వ్యంగ్యం కోపం నేను ముందంటే నేను ముందంటూ పోటీ పడ్డాయి.


    "వాణ్ణి నేను కనలేదు. కానీ పెంచాను. పెంచిన ప్రేమ అంటే ఏమిటో మీకేం తెలుస్తుంది? మొదటిసారిగా నా ఒళ్ళోకి వచ్చిన బిడ్డ.... భరత్ కంటే నాకు వాడంటేనే ఎక్కువ మమకారం. మొదటి బిడ్డమీద.... లేకలేక కలిగిన బిడ్డమీద తల్లికి ఏర్పడే మమకారం. అది ఎలా వుంటుందో మీకేం తెలుస్తుంది?"  


    "పెంచావ్, ఏం లాభం? ఎవడికి పుట్టాడో.... ఏ రక్తం వాడిలో వుందో? అదే నా బిడ్డ అయితే మాలపిల్లను చేసుకుంటానంటాడా? ఏమైనా సరే, వాడు ఈ ఇంట్లో వుండటానికి వీల్లేదు."


    శరత్ నరనరం విచ్చిపోతూవుంది. తలలో దూరంగా మహా వృక్షాలు కూకటి వేళ్ళతో పెగిలి పడిపోతున్న ధ్వనులు. అంతవరకూ తనలో వున్నట్టే తెలియని మహాసముద్రం ఏదో ఘోష పెడుతూ వుంది. అయినా ఇంకా మాటలు విన్పిస్తూనే వున్నాయి. శక్తినంతా కూడదీసుకుంటూ ఆ మాటల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని అర్థం కావడం లేదు.


    శరత్ కిందకు మంచంతో సహా ఎక్కడికో లోతులు తెలియని అగాధంలోకి పడిపోతున్నాడు. అధారం కోసం చేతులు చాపాడు. కళ్ళు తిరుగుతున్నాయి. వెనక్కు పడ్డాడు. తలలో వింతధ్వనులు ఇంకా విన్పిస్తూనే వున్నాయి. ఆ స్థితిలో ఎంతసేపు వున్నాడో అతనికే తెలియదు.

 Previous Page Next Page