అమృత వెళ్ళి తలుపు తీస్తే, ఎదురుగా హర్ష ఫ్రెండ్ శ్రీకాంత్ నిలబడి వున్నాడు.
"గుడ్ మార్నింగ్" విష్ చేశాడు.
అమృత కూడా విష్ చేసి "రండి...కూర్చోండి" అంది.
"అన్నాడా మావాడు? పెళ్ళయ్యాక బొత్తిగా కనిపించటం మానేశాడు. ఆదివారం పొద్దుటే అయితే తప్పకుండా దొరుకుతాడని వచ్చాను" అన్నాడు సోఫాలో కూర్చుంటూ.
"ఆ వున్నారు! వంట చేస్తున్నారు" అంది అమృత.
అతని ఎదురుగా సోఫాలో తీరిగ్గా వెనక్కి వాలి కూర్చుంటూ.
అతను జోక్ చేస్తోందని నవ్వేశాడు. కానీ హర్ష నిజంగానే ఏప్రాన్ కట్టుకొని, గరిటె పట్టుకుని వచ్చి స్నేహితుడిని పలకరించేసరికి ఖంగుతిన్నాడు.
అమృత పేపరు చదువుతూ, మధ్య మధ్యలో శ్రీకాంత్ తో పాలిటిక్స్ గురించీ, స్పోర్ట్స్ గురించీ మాట్లాడుతోంది.
ఇంతలో పాలవాడు వచ్చాడు.
హర్ష వచ్చి పాలు పొయించుకుని, వాడితో పాలల్లో నీళ్ళు కలుపుతున్నావని కాస్సేపు పోట్లాడాడు.
అమృత సీరియస్ గా టీ.వీ.లో వస్తున్న కార్టూన్ పిక్చర్ చూస్తోంది.
తరువాత చాకలి వచ్చాడు.
"హర్ష! చాకలి వచ్చాడు" కేకేసింది అమృత.
హర్ష గబగబా వచ్చి బట్టలపద్దు చూసుకుని, మళ్ళీ బట్టలు తెచ్చి అమృత బట్టలతో సహా లేక్కరాసి పడేశాడు.
కూరలమ్మాయివస్తే హర్ష బేరమాడి, తన కరిష్మా ఉపయోగించి వంకాయలు కొన్నాడు. అమృత దగ్గరికి వచ్చి "చూడు అర్ధరూపాయి తగ్గించి ఇచ్చింది" అన్నాడు గర్వంగా.
ఆమె 'గుడ్' అంది తల స్టయిల్ గా వూపుతూ.
శ్రీకాంత్ కి అలవాటులేని వాతావరణం, తెగ ఇబ్బందిగా వుంది. ఇంతకుముందు వచ్చినప్పుడు అమృత బాగానే వుంది. సరదాగా మాట్లాడ్తూ, బోలెడు పని చేస్తూ కనిపించింది. హర్ష కాలు కిందపెడ్తే కందిపోతాడేమో అన్నట్టు చూసింది "ఇంతలోనే ఇంత మార్పేంటీ?" అనుకున్నాడు.
"వంటయిపోయింది, భోజనానికి రండి" అన్నీ టేబిల్ మీద సర్దుతూ పిలిచాడు హర్ష.
శ్రీకాంత్ తో "రండి" అని అమృత అప్పుడు లేచింది. భోంచేస్తూ "కూరలో ఇంత నూనె వెయ్యకూడదు, అన్నం ఇంత మెత్తగా అవకూడదు" అని అమృత చెప్తుంటే హర్ష బుద్దిగా తల వూపాడు.
అమృత మధ్య మధ్యలో శ్రీకాంత్ వైపు చూస్తూ, అతని అయోమయం పరిస్థితి చూసి నవ్వాపుకుంటోంది.
భోజనాలు అయ్యాక "నేను కాస్సేపు రెస్టు తీసుకుంటాను. మీరు కబుర్లు చెప్పుకోండి" అంటూ అమృత బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే అప్పటివరకూ బిగపట్టుకున్న వాడు ఇక ఆగలేక "ఏమిట్రా ఇదీ?" అన్నాడు శ్రీకాంత్.
హర్ష పెద్దగా నవ్వుతూ "ఈ మధ్య స్త్రీవాద సాహిత్యం అని ఏదో చదివిందోయ్. అందుకని ఈ ఒక్క రోజూ" అంటూ ఈ ఆదివారం ప్రోగ్రాం గురించి చెప్పాడు.
అంతా విన్నాక శ్రీకాంత్ కి కూడా నవ్వొచ్చింది.
"నిజమే ఇలాంటి చిన్న చిన్న థ్రిల్స్ లేకపోతే జీవితం రొటీన్ అయిపోతుంది. ఎంతైనా మీ ఆవిడ తెలివే తెలివి" అన్నాడు.
శ్రీకాంత్ వెళ్ళిపోతుంటే అమృత బయటకి వచ్చి "మిమ్మల్ని డ్రాప్ చెయ్యనా?" చిలిపిగా అడిగింది.
శ్రీకాంత్ తన వెహికల్ కీస్ ఎగరేసి పట్టుకుని "అక్కర్లేదు కానీ, సాయంత్రం హర్షని సినిమాకు తీసుకెళ్ళండి, దార్లో మల్లెపూలు కొనిపెట్టటం మరచిపోకండెం" అన్నాడు నవ్వుతూ.
* * *
"కదలకు....గుచ్చుకుంటుంది."
"కొంచెం ముందుకు వంగవా?" అడిగాడు హర్ష.
"అక్కర్లేదు, నువ్వు నాకంటే ఏమంత పొడుగు కాదులే" సూది బైటికి తీసి, తన తలను ముందుకు వంచి, పంటికొసతో దారం కొరుకుతూ "పెళ్ళికి ముందు ఈ పనులన్నీ స్వయంగా చేసుకునేవాడిని కదా" అని అడిగింది.
"ఆ...పెళ్ళి అవకముందు ఇంకా చాలా చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు నువ్వున్నావుగా!" చిలిపిగా అన్నాడు.
"నోర్ముయ్, సిగ్గులేదా?"
"లేదు, మూస్తాను" ముందుకి వంగుతూ చెప్పాడు.
అతన్ని విడిపించుకుంటూ "నేను ఎప్పుడైనా దూరంగా వుండాల్సి వస్తే ఎలా హర్షా? ఇలా అన్నింటికీ నామీద ఆధారపడి పోతుంటావు" అంది కాస్త సీరియస్ గా.
హర్ష వెంటనే "ఆ మాట అనకు, నువ్వు నాకు దూరం అనే భావన కూడా నేను భరించలేను" అన్నాడు.
"ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే..."
"అమృత లేకపోతే హర్షే లేడు. కాబట్టి అలాంటి పరిస్థితి కలలో కూడా వూహించవద్దు" చెప్పాడు సడెన్ గా సీరియస్ అయిపోతూ.