Previous Page Next Page 
ప్రియతమా! ఓ ప్రియతమా పేజి 17

                                 


    వేగంగా పైనుండి క్రిందికి దూకే జలపాతాలను చూడాలని ఉబలాటపడి వాళ్ళు ఎంతోమంది నిశ్శబ్దంగా, నిలకడగా సాగిపోయే నది ఒడ్డున కూర్చుని దాన్ని ఆనందించేవాళ్ళు చాలా అరుదు. మెల్లిగా శబ్దం లేకుండా సాగిపోయే మబ్బు తునక కన్నా, తటిల్లుమని మెరిసే మెరుపు తీగే ఎక్కువ ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణ అంతా వేగంలోనూ, ఆ జడిలోనూ దాగుంది. ప్రపంచం ఎప్పుడూ వేగంగా క్రొత్త వైపు పరుగులు తీస్తూనే ఉంటుంది. రోజు రోజుకీ మారుతున్న ప్రపంచంలోని 'మార్పు' మనందరి 'తీర్పు' కూడానూ!
    "ఇంకా తయారు కాలేదా" సుమిత్ర ఆ ప్రశ్న అడగడం ఎన్నోసారో?
    అరుంధతి సందేహంగా ఆమె వైపు చూస్తూ, "నేనూ రావాలంటావా?" అంది.
    "అయ్యో! అసలు మీకు ఊరు చూపించాలనేగా ఈ పిక్నిక్ ప్రోగ్రామ్" అంది సుమిత్ర హడావుడిగా సామాన్లు సర్దుతూ.
    ఇంతలో అక్కడికి వచ్చిన 'లూ', "మంజూ డాల్! నేను చెప్పిన పని ఏం చేసావ్" అడిగాడు.
    "ఆ... వస్తున్నా వన్ సెకెండ్" అంటూ ఒక్కక్షణం తరువాత చేతిలో ఒక ప్యాకెట్ పట్టుకుని వచ్చింది మంజీర.
    "గ్రానీ కమ్! ఈ రోజు నేను నిన్ను తయారుచేస్తాను" అంది అరుంధతిని పట్టుకుని సుతారంగా లాగుతూ.
    "నువ్వు తయారుచెయ్యడమేమిటీ?" సిగ్గుపడింది అరుంధతి.
    "అదే చూస్తావుగా!" అంటూ బలవంతంగా తీసుకెళ్ళిపోయింది.
    నారాయణమూర్తి కారు బైటికి తీసి, రెడీగా పెట్టి హారన్ కొట్టాడు.
    సుమిత్రా, లూ కారు దగ్గరకొచ్చారు. ఇద్దరి చేతుల్లోనూ తినుబండారాలూ, ఫ్లాస్కూ ఉన్న రెండు బుట్టలున్నాయి.
    "అమ్మేదీ?" అడిగాడు నారాయణ.
    "మీ ముద్దుల కూతురు ఆవిడ్ని 'మేకప్' చేస్తోంది" చెప్పింది కాస్త విసుగ్గా సుమిత్ర.
    ఇంతలో మంజీర బైటికి వచ్చి, "అరుంధతీ దేవి గారు వేం చేస్తున్నారహో" అంది నవ్వుతూ.
    'లూ' కళ్ళు ఆత్రంగా గుమ్మంవైపు చూసాయి.
    అప్పుడే బైటికి అడుగుపెడ్తున్న అరుంధతి కళ్ళు ఒక్కక్షణం వాటితో కలిసి క్రిందికి వాలిపోయాయి సిగ్గుగా.
    నందివర్ధనం పువ్వులాంటి అరుంధతి, పూచిన తంగేడులా, ఆరెంజ్ కలర్ ప్లైన్ సిల్క్ చీరలో, అదే రంగు బ్లౌజ్ లో, మెడ వరకూ ఉన్న అందమైన కేశసంపదతో, అన్నింటికన్నా అందమైన సిగ్గు దొంతరల మధ్య అపురూపంగా కనిపించింది లూకి. చిత్రకారుడు తన చిత్రాన్ని అన్నివైపుల నుంచి పరీక్షగా చూసుకున్నట్లు ఒకసారి క్రిందనుండి పైదాకా తృప్తిగా చూసుకున్నాడు అతను.
    నారాయణమూర్తి ఆశ్చర్యం నుంచి తేరుకుని, "ఎంతో బావుంది అమ్మని ఇలా చూస్తూంటే, వచ్చినప్పటి నుండీ సుమిత్ర చెప్తూనే ఉంది ఇలా తయారవ్వమనీ!" అన్నాడు.
    "మనం చెప్తే ఎలా వింటారండీ! చెప్పవలసిన వాళ్ళు, చెప్పవలసిన రీతిలో చెప్పాలి కానీ" అంది సుమిత్ర. అందులో శ్లేష ఎవరూ పట్టించుకోలేదు.
    మంజీర క్లాప్స్ కొడ్తూ, 'కరెక్ట్ క్రెడిట్ అంతా మా తాతగారిదే!" అంది.
    అదిగో పిల్లా! తాతా, పీతా అంటే నేను ఒప్పుకోను" అన్నాడు 'లూ' బుంగమూతి పెడ్తూ.
    "ఓహ్ సారీ 'మిస్టర్ లూ'" అని మంజీరా అతని చెంపలు నిమిరింది.
    దాంతో అందరూ నవ్వేశారు.
    అరుంధతికి కారు అద్దంలో తన ప్రతిబింబం కనిపించి, ఆమెని ఉద్విగ్న పరుస్తోంది. "ఈ రంగు అంటే నాకెంత ఇష్టం! అది కూడా నువ్వు ఎలా గుర్తుపెట్టుకున్నావు? ప్రతి నిమిషం ఎందుకిలా మూగపోయిన జీవనతంత్రుల్ని మీటి, కొత్త స్వరాల్ని పలికించాలనుకుంటున్నావూ?" అనుకుంటూ అతని చూపులతో తన చూపులు కలవడం కోసం తహతాహలాడింది.
    ఆమె చూపులతో తన చూపులు ముడివడగానే, అతని కళ్ళు స్నేహ సముద్రాలు అవుతున్నాయి.
    అన్నీ తిరిగి చివరిగా గండిపేట చేరారు వాళ్ళు.
    భోజనాలనంతరం, 'కార్డ్స్ ఆడదాం!' అన్నాడు నారాయణమూర్తి.
    సుమిత్రా, మంజీరా ఉషారుగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు.
    "అరూకి కూడా పంచు" చెప్పాడు 'లూ'
    "నాకు అసలు ఆ ఆట ఏమిటో తెలియదు. వద్దు బాబూ!" అంది కంగారుగా అరుంధతి.


                            


    "నాకు వెయ్యకు, నేను అరూకి ఆట నేర్పిస్తాను" చెప్పాడు లూ గొప్ప ఉత్సాహంగా.
    "మీరు నేర్పించడం, ఆవిడ ఆడడం, ఎప్పటికి అయ్యేను?" నవ్విందో వ్యంగ్యంగా సుమిత్ర.
    "నీకు మా అరుంధతి సంగతి తెలియదమ్మా! ఏ ఆటలోనైనా తనే గెలుస్తుంది. అంత పట్టుదలగా ఆడుతుంది. చూస్తుండు" అన్నాడు అరుంధతికి ముక్కలు పట్టుకోవడం నేర్పిస్తూ.
    అతనికి తన మీద ఉన్న నమ్మకానికి ఆమె కళ్ళు ఆనందంగా చెమర్చాయి. చనువుగా ఆమె చెయ్యి పట్టుకుని అతను నేర్పిస్తుంటే, ఆమెకి ఏమీ అసహజంగా అనిపించలేదు. అతని మాట నిలబెట్టాలి అన్నట్లు పట్టుదలగా మనసు దానిమీద లగ్నం చేసి ఆడడం మొదలెట్టింది.
    మొదటి ఆటలో నారాయణమూర్తి 'షో' చేసాడు.
    రెండవసారి మంజీర గెల్చింది.
    సుమిత్ర ఉడుక్కుంటూ ఆడ్తోంది.
    అరుంధతి పక్కనించి లేచి దూరంగా వెళ్ళాడు 'లూ' అతనికి స్మోక్ చేసే అలవాటుంది.
    మరో నిమిషంలో నారాయణమూర్తి ఆట అయిపోతుందనగా, కార్డు మూసేసింది అరుంధతి!
    అందరూ ఆశ్చర్యంగా చూసారు ఆమె వైపు.
    "తప్పు 'షో' చూపించకూడదు" అంది సుమిత్ర.
    అరుంధతి చూపించింది 'కరెక్ట్'గా.
    తరువాత ఆటలో కూడా మళ్ళీ 'షో' చేసింది. ఆ తరువాత కూడా వరుసగా మూడుసార్లు.
    మంజీర ఉద్వేగంగా అరిచింది. "గ్రాండ్ పా! మీ శిష్యురాలు దున్నేస్తోంది."
    సుమిత్రా, నారాయణమూర్తీ ఆశ్చర్యంగా చూడసాగారు.
    లూ నవ్వుతూ వచ్చి, "నేను చెప్పలేదూ" అన్నట్లు చూసాడు సుమిత్ర వైపు.
    అరుంధతికి పట్టుదల ఎక్కువ! చిన్నప్పటి నుంచి అలవరచుకున్న క్రమశిక్షణ వల్లనో లేక వంటరిగా బ్రతుకు పోరాటం సాగించిన తెగింపు వల్లనో వచ్చిందో మరి! ఆమెకి లోకం తెలియదు అనడం కంటే, లోకానికే ఆమె ఏమిటో తెలియదు అనడం సబబు!

 Previous Page Next Page