Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 17


    బీరువాలోంచి తనకిష్టమైన స్కై బ్లూకలర్ సూట్ తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో వేసుకున్నాడు. నీలిరంగు వజ్రపుటుంగరం వేలికి అలంకరించుకునేటప్పుడు ఒక వెల్లువలా అతనికి జ్ఞాపకాల పుటలు రెపరెపలాడాయి.

 

    తన జీవితపు తీయని బంధం...

 

    చెరిగిపోని స్మృతి.... వైదేహి....

 

    సముద్రం మధ్యన రాలిపడిన ఒకే ఒక్క ఒంటరి చినుకులా తనని వదిలిపోయిన ప్రాణసఖి-

 

    వైదేహి ప్రేమగా బహూకరించిన ఉంగరాన్ని ఆప్యాయంగా పెదవులతో స్పృశించాడు విశ్వాత్మ.

 

    హృదయంలోంచి తొలికిన కన్నీటి చుక్క ఉంగరంపై రాలి ఆమె జ్ఞాపకాల్ని అభిషిక్తం చేసింది.

 

    ఎవరికీ అర్థంకాని విశ్వాత్మను అతడి అర్థబలం, రాజఠీవి బయటి ప్రపంచానికి అతడిని దూరం చేశాయి.

 

    విశ్వాత్మ స్వభావసిద్ధంగా పట్టుదలగల అహంభావి.

 

    వ్యాపార రంగాన్ని తమ నిర్ణయంతో శాసించగలిగే స్థాయికి చేరుకున్న మోస్ట్ డైనమిక్ అండ్ పవర్ ఫుల్ బిజినెస్ పర్సనాలిటీస్ లో విశ్వాత్మ అగ్రభాగాన నిలిచాడు.

 

    అసాధారణమైన తెలివితేటలతో ఎప్పటికప్పుడు పోటీ వ్యాపార ప్రపంచపు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, పారిశ్రామిక నియంతగా పిలువబడే విశ్వాత్మ షిప్ యార్డ్, విమానాల తయారీచేసే వ్యాపారవేత్తగానే కాకుండా, ఎలక్ట్రానిక్ ఇంజనీరుగా మేధావులకు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితుడు.

 

    దేశ ఆర్థిక రంగాన్ని, రాజకీయ పరిస్థితులను నిర్దేశించే సామర్థ్యం వున్న అరుదయిన ధనవంతుడు. విశ్వాత్మకు లేనిదల్లా జీవిత భాగస్వామి సాన్నిహిత్యం.

 

    వైదేహి జ్ఞాపకంగా ఇవ్వని వారసత్వం!

 

    అన్నీ వున్నా ఒంటరి విశ్వాత్మ.... ఒక విశ్వాత్మగానే మిగిలిపోయాడు.

 

    ఆత్మీయత, మమతానురాగాలకు దూరంగా, ఏకాకిగా ఏడు పదులు గడిపినవాడు.

 

    తనెందుకు బతికాడు? ఎందుకు బతుకుతున్నాడు?

 

    ఏం సాధించడం కోసం? తను సంపాదించిన ఆస్తి తన మేధస్సుకు మాత్రమే చిహ్నం తప్ప....

 

    తన వారసత్వానికి కాదు- అనురాగానికి కాదు.

 

    తనొక ఒంటరి అంకె. తనను చూసి తనే భయపడే, బాధపడే ఒంటరి అంకె.

 

    అంతరంగంలోని కల కళ్ళ ముందు కదలాడగానే అంతటి కోటీశ్వరుడి కనుకొలకుల్లో కన్నీటి బిందువులు నిలిచాయి. అద్దంలో తన ప్రతిబింబాన్ని మరోసారి తీక్షణంగా చూసుకున్న విశ్వాత్మ సంతృప్తిగా టై సవరించుకున్నాడు.

 

    మేడమెట్లు దిగుతూ కుంటుతున్న కుడికాలు వైపు బాధగా చూసుకొని తనని తాను ఓదార్చుకున్నాడు.

 

    విశ్వాత్మ పుట్టినరోజు అతి త్వరలో రాబోతోందని తెలుసుకున్న నౌకర్లు ప్యాలెస్ లో పండుగ వాతావరణాన్ని సృష్టించటం ప్రారంభించారు.

 

    అందంగా అలంకరించిన డైనింగ్ టేబుల్ పై యజమానిపై వాత్సల్యంతో చేసిన రకరకాల వంటకాలను వడ్డించారు. కొన్ని నెలల తర్వాత ఆ పూటే విశ్వాత్మ సంతృప్తిగా భోజనం చేశాడు.

 

    విశ్వాత్మ తన జీవితంలో మిగిలిన మూడు రోజుల్నీ అత్యంత ప్రత్యేకత సంతరించుకున్న రోజుల్లా, క్షణ క్షణం ఉత్సాహంగా గడపాలనే ఆలోచనలో హుషారుగా డ్రాయింగ్ రూమ్ లోకి అడుగుపెట్టాడు.

 

    విశాలమైన డ్రాయింగ్ రూమ్.

 

    ఈ రూమ్ నిండా ప్రపంచంలోని నలుమూలల నుండీ తన భార్య వైదేహి కోసం సంపాదించిన కళాఖండాలు అందంగా, అపురూపంగా అమర్చబడి వున్నాయి. ఆ రూమ్ అరుదయిన మ్యూజియంలా కళారూపాల వింత కాంతితో శోభిల్లుతోంది.

 

    కళారాధనలో తన మధుర స్మృతుల అలలను నెమరువేసుకుంటూ గడిపాడు విశ్వాత్మ.

 

    బీరువాలోంచి ఏవో కొన్ని ఆల్బమ్స్ ని తీసి తనివితీరా చూసుకున్నాడు.

 

    తను కొన్నిరోజుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు. అకస్మాత్తుగా తను చనిపోతే వ్యాపార ప్రపంచంలో గగ్గోలు పుడుతుంది. తమ శత్రువు చనిపోయాడని కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ షాంపైన్ లతో కాలం గడుపుతారు.

 

    కానీ....

 

    తను అతి త్వరలోనే తిరిగి జన్మిస్తాననే విషయం వాళ్ళెవ్వరికీ తెలీదు. తను మళ్ళీ అతి త్వరలోనే జన్మించబోతున్నానే విషయం.... ఎవరికయినా చెపితే... నమ్ముతారా? తనని పిచ్చివాడుగా చూస్తారా?

 

    సూర్యాస్తమయ సమయం సమీపించేసరికి చుట్టూ పచ్చదనం కప్పుకున్న చలికొండలు కంటికింపుగా అత్యంత మనోహరంగా కనిపిస్తున్నాయి. బర్త్ డే క్యాండిల్ లా ప్రకాశిస్తున్న సూర్యుడు నిర్మలంగా పడమర ఒడిలోకి జేరుకుంటున్నాడు.

 

                              *    *    *    *

 

    అసహనంగా బాల్కనీలో నిలబడి చూస్తున్నాడు విశ్వాత్మ. చంద్రుడి కోసం ఆకాశం చుక్కల చీరలో ముస్తాబవడానికి చీకటిని ఆహ్వానిస్తోంది.

 

    తను మరణిస్తున్న విషయాన్ని, పునర్జన్మ పొందుతున్న విషయాన్ని ఎవరికయినా చెప్పి, ఆ ప్రతిస్పందనను చూడాలని వుంది విశ్వాత్మకు.

 

    గబగబా లోనికొచ్చి కార్డ్ లెస్ టెలిఫోన్ అందుకొని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పరాంజపేకు ఫోన్ చేశాడు.

 

    మరో అయిదు నిమిషాల తర్వాత పరాంజపే విశ్వాత్మ ఎదురుగా చేతులు కట్టుకుని వున్నాడు.

 

    "నువ్వెప్పుడయినా చావు గురించి ఆలోచిస్తావా?" విశ్వాత్మ అడిగిన ప్రశ్న అర్థం కాలేదు పరాంజపేకు. కాకపోగా బిత్తరపోయాడు.

 

    "లేదు సార్... నో సార్" నెమ్మదిగా చెప్పాడు.

 

    "నీ చావు గురించి కాదయ్యా.... నా చావు గురించి" నవ్వుతూ అన్నాడు విశ్వాత్మ.

 

    "మీ చావు గురించి నేను ఆలోచించడమేమిటి సార్?" ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు పరాంజపే.

 

    గత కొన్నిరోజులుగా చాలా సన్నిహితంగా విశ్వాత్మను చూస్తున్న పరాంజపేకు-

 

    పెద్దాయన చేస్తున్న పనులేమీ అర్థం కావటం లేదు.

 

    వృద్ధాప్యం పైబడితే మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారేమో! అయినా ఇంత పిచ్చిగానా?

 

    వైదీశ్వరన్ కోయిల్ కి ఎందుకెళ్ళాడు?

 

    అరకులోయల్లో కెందుకెళ్ళాడు? హిమాలయాల్లో కెందుకెళ్ళాడు? తను సంపాదించిన ఆస్తిని విలువయిన రత్నాలుగా, వజ్రాలుగా మార్చి కొండల్లోనూ, కోనల్లోనూ రహస్యంగా దాస్తున్నాడేమో?

 

    "పరాంజపా! ఇవాళ తేదీ ఎంత?"

 

    "పదమూడు సార్!"

 

    "పదిహేడో తేదీ.... ఇంకా నాలుగు రోజులుంది కదూ?" అన్నాడు విశ్వాత్మ.

 Previous Page Next Page