'రా! రా! అన్నయ్యా! అని అంటున్న 'చెల్లెలి తల మీద ఒక మొట్టికాయ వేశాడు. "ఊ! చూడమ్మా! సునంద తల నిమురుకొంటూ ముద్దులు గుడుస్తూ అన్నది. సుందరమ్మ సంతృప్తిగా నవ్వుకుంది.
రామం స్నానం చేసి భోజనానికి కూర్చున్నాడు. తల్లి కొసరి కొసరి తినిపిస్తున్నది.
'పెద్దన్నయ్య బొత్తిగా మారిపోయాడురా!'
రామం తలెత్తి తల్లి ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూశాడు.
'నర్సింగ్ హోం ప్రారంభానికి మీ నాన్ననైనా రమ్మని రాయలేదురా!'
'ఆహ్వానం పంపించానన్నాడే?'
'ఆహ్వానం పంపించడం ఏమిటిరా! ఒక ఉత్తరం ముక్క రాయకూడదూ?'
'తీరిక లేక రాయలేదేమో లేమ్మ!'
'ఏమిట్రా! నువ్వు కూడా వాడికి వత్తాసు పలుకుతున్నావ్? మీ నాన్న వాడ్ని డాక్టర్ చెయ్యడానికి శరీరంలో సగం రక్తం ధారపోశారు గదరా! నర్సింగ్ హోం ప్రారంభానికి రమ్మని రాయడానికి తీరిక లేదా? పైగా మావగారి పేరు మీద ఆహ్వానం వేశాడు. నీక్కూడా ఏమీ అన్పించలేదా?'
రామం మాట్లాడలేకపోయాడు.
'అయ్యో! అదేమిట్రాబాబూ! పెరుగేసుకోకుండా లేచిపోయావేం?'
'పెరుగువద్దమ్మా! జలుబు చేసింది ఈ మధ్య నాకు మజ్జిగ, పాలు పడడం లేదు. ఎలర్జీ అట. డాక్టర్ కొంతకాలం మానెయ్యమన్నాడు.'
'అయ్యో అదేం జబ్బురా నాన్నా!' సుందరమ్మ గొంతులో బాధ ధ్వనించింది.
'అదీ జబ్బేంకాదమ్మా! ఎలర్జీ - అంటే కొన్ని వస్తువులు పడవు.' తల్లి అందించిన తుండుకు తడిచెయ్యి తుడుచుకొని వంటింట్లో నుంచి బయటికి వచ్చాడు.
మధ్యాహ్నం నిద్రపోయి లేచిన రామం కు కాఫీ అందించింది సుందరమ్మ.
'అమ్మా! అలా కూర్చో! కాఫీ అందుకుంటూ అన్నాడు రామం.'
'వుండు వస్తాను. పొయ్యిమీద పాలున్నాయ్' అంటూ వంటింట్లోకి వెళ్ళింది సుందరమ్మ. పిచ్చి సన్నాసి, చిన్నప్పట్నుంచీ వాడికి నాతో కూర్చుని కాసేపు కబుర్లు చెప్పకపోతే తోచదు. వీడిదారే వేరు. వీడి బుద్ధి బంగారం. అనుకుంటూ వచ్చి కొడుకు పక్కన మంచం మీద కూర్చుంది తల్లి.
'చెప్పరా నాన్నా! ఏమిటి? ఎలా వున్నావు?'
'అమ్మా! మరి...'
తల తిప్పి కొడుకు ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ 'ఏరా నాన్నా! ఏం కావాలి? డబ్బేమైనా కావాలా? చెప్పు, సందేహం ఎందుకు? ఎంతకావాలి?'
'డబ్బు అక్కర్లేదమ్మా!'
సుందరమ్మకు గుండెల మీద మంచి బరువు దించినట్టుగా అయింది. కొడుక్కి డబ్బు సర్దాలంటే భర్త ఎంత ఇరుకున పడ్తాడో ఆమెకు తెలుసు
'అమ్మా! నాన్నను ఇంకా డబ్బు కోసం వేధించేంతటి మూర్ఖుణ్ణి కాదమ్మా నేను. ఒక విషయం చెప్పాలి. నీకూ, నాన్నకు బాధ కలుగుతుందేమోనని...'
సుందరమ్మ విస్మయంగా కొడుకు ముఖంలోకి చూసింది. వీడు ఏం చెప్పబోతున్నాడు? చెప్పరా! సందేహం ఎందుకు?
'ఈ నెల ఇరవైన నా పెళ్ళి. మా సీనియర్ గారి అమ్మాయి ఒకే కూతురు. ఆస్తిపాస్తులు బాగానే వున్నాయి. నేను జీవితంలో లాయరుగా స్థిరపడాలంటే మంచి అవకాశం.' పాఠం వల్లించినట్లు గబగబ చెప్పేశాడు తల్లిముఖంలోకి చూడకుండానే. సుందరమ్మకు 'ఈనెల ఇరవైన నా పెళ్ళి' అన్నమాట మాత్రమే విన్పించింది. ఆ తర్వాత ఏం చెబుతున్నాడో ఆమె అర్ధం చేసుకొనే స్థితిలో లేదు.
'ఏమిట్రా అన్నావ్! ఈ నెల ఇరవైన నీ పెళ్లా? ఇంకా పదిరోజులుందా నీ పెళ్ళి!' ఆ మాటలు ఆమె పెదవులు దాటి బయటపడలేదు.
'ఏమిటమ్మా అలా చూస్తావ్?'
'నువ్వేమన్నావో నాకు సరిగా అర్ధం కాలేదురా!'
'నీ పెళ్ళి ఇరవైన అన్నట్టుగా విన్పించింది. అది పొరపాటుగా విన్పించింది కదూ? నువ్వామాట అనలేదు. అనలేదు.'
'అవునమ్మా! నా పెళ్ళి ఇరవైన నిశ్చయించారు!' 'ఎవర్రా నిశ్చయించింది? అంటే నీ పెళ్ళి నువ్వే చేసుకుంటున్నావన్నమాట? నిశ్చయించుకొనే ముందు తల్లి దండ్రులకు చెప్పాలని కూడా అన్పించలేదు కదూ!'
'అదేంటమ్మా అలా అంటావు? మీకు చెప్పాలనేగా వచ్చాను?'
'ఏమని! చెప్పాలని వచ్చావురా! నా పెళ్ళి ఇంకా పది రోజులుంది అని చెప్పాలని వచ్చావా?'
'బాధపడ్తున్నావా అమ్మా!'
'అబ్బే! బాధ ఎందుకురా! ఆనందంగా వుంది. ప్రయోజకులైన కొడుకుని చూసుకుంటే కడుపు నిండిపోతుందిరా! నిజంగా... చాలా... చాలా...
ఆపైన ఆమె గొంతులో నుంచి మాటలు పెగల్లేదు. రామం అపరాదిలా తల వంచుకొని కూర్చున్నాడు.
'అమ్మా! బయటికి వెళ్లివస్తాను' అంటూ లేచి చిన్నగా జారుకున్నాడు.
సుందరమ్మ అలా వెళ్ళిపోతున్న కొడుకుని కళ్ళప్పగించి చూస్తూ వుండిపోయింది.
రామం బాగా చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడు. తండ్రి వసారాలో ఈజీ చైర్లో కూర్చుని వున్నాడు. తండ్రి ముందు నిలబడే సాహసం లేక చిన్నగా ఇంట్లోకి జారుకున్నాడు.
'రామం! ఇలా కూర్చో!'
రామం ఆగి తండ్రి ముఖంలోకి చూశాడు. ఆయన ముఖంలోని ప్రశాంతత చూశాక మనసు కుదుటపడింది. పక్కనే వున్న స్టూలు మీద కూర్చున్నాడు.
'ఎవరమ్మాయి?' తండ్రి అడిగాడు. ఆ కంఠంలో ఎలాంటి భావం లేదు.
'మా సీనియర్ గారి అమ్మాయి.'
'ఓహో లాయర్ శంకర్రావు కూతురా? ఆస్తిపాస్తులు బాగానే సంపాదించాడని విన్నాను.'
'అవును నాన్నగారూ! పైగా ఒకే కూతురు.'
కామేశ్వరరావు తల తిప్పి కొడుకు కళ్ళల్లోకి చూశాడు. రామం చూపులు కిందకు వాలాయి.
'ఆ అమ్మాయిని ప్రేమించావా?'
'లేదు. శంకర్రావుగారే ప్రొపోజ్ చేశారు.'
'ఆ అమ్మాయి చాలా అందంగా వుంటుందా!'
'మామూలుగా వుంటుంది. కొంచెం నలుపు కూడా.'
'అంటే ఆ అమ్మాయిని డబ్బుకోసం చేసుకుంటున్నావన్నమాట?'
రామం తడబాటు చెందాడు. కాదు నాన్నగారూ! నా కెరియర్ కు...
'ఉపయోగపడుతుందంటావు.'
'కాదు... ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం. నన్ను ప్రేమిస్తుంది.'
'అదా సంగతి! ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నది. ఆ అమ్మాయి ఐశ్వర్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. బాగుంది గో ఎహెడ్!'
'మీరు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు.'
'ఏది దారుణం? కనిపెంచిన తల్లి దండ్రులకు తెలియకుండా నీ పెళ్ళి నువ్వు చేసుకోవడం దారుణం కాదా?' అప్పుడే వచ్చిన సుందరమ్మ అన్నది.