Previous Page Next Page 
అనుభవాల అలలలో పేజి 13

    "నా తల ఏరాచ్చిప్పో జాడీయో అన్నట్లు పరపరా తోమావు కదా? బదులుగా ఇప్పుడు నీ తలమీద కిలో కుంకుడు రసంవేసి కస పిస కొబ్బరిపీచుతో రుద్దుతాను."
   
    "ఈ బారెడు కురులు రుద్దుకోవడం కష్టంగానే ఉంది రసం పిండి ఇస్తాను కానీండి" అంటూ గిన్నె అందుకుంది సీత.
   
    "ఊ. అలా దారికిరా" వేడి వేడినీళ్ళు నెత్తిన పోసుకొంటు అన్నాడు చందు.
   
    సీత చటుక్కున గిన్నె కిందపెట్టి బాత్ రూంలోంచి బైటికి దూకి తలుపు బయట బోల్టు బిగించింది. "స్వామీ ఇంక తిక్క వేషాలు చాలించి మరోసారి తలరుద్దుకొని బయటికి రండి" బయటనుంచి కేక పెట్టి చెప్పింది.
   
    "సీతా! ఓ సీతా! నీది అన్యాయం అధర్మం, అక్రమం. మీ ఆడవాళ్ళు భర్తలమీద కసి తీర్చుకునే భాగంలో మొదటిది కుంకుడు పులుసుతో తలంటడం, రెండోది కలిసి జలకా లాడకపోవడం, మూడోది మాయమాటలు చెప్పి తప్పించుకోవటం, నాలుగోది నా తలరాత..." చందు మాటలు ఆగిపొయ్యాయి. బయటనుంచి సమాధానం రాలేదు మరి.
   
    సీత నవ్వుకుంటు అవతలి కెళ్ళి తల తుడుచుకొని తడి చీర విప్పేసి పొడిచీర కట్టుకుంది. "బరువు బాధ్యతగల ఉద్యోగం చేస్తోన్న మనిషేనా ఈయన? ఉత్త అల్లరివేషాలు ఆకతాయి పనులు" అనుకొంది.

    చందు స్నానం కానిచ్చి టర్కీటవల్ తో తల తుడుచుకొంటు వంటగదిలోకి వచ్చాడు సీత ఉల్లిపాయలు తరుగుతూ కళ్ళుతుడుచుకొంటుంది. "సీతా దేవికి ఏమికష్టాలు వచ్చాయో ఏమో! పాపంకంట తడిపెడుతున్నది ప్చ్...పాపం" అంటూ మోడా లాక్కుని కూర్చున్నాడు.
   
    "ఇందాక మీకొచ్చిన కష్టమే ఇప్పుడు నాకు వచ్చింది. కళ్ళు మంటలు" సీత గడుసుగా జవాబు ఇచ్చింది.
   
    "సీతా! నీ కంట కన్నీరు నే చూడలేను. ముందా ఉల్లిపాయలు తరగడం ఆపెయ్యి"
   
    "ఇవి ఆనందభాష్పాలు స్వామీ. కాదు కాదు ఉల్లిభాష్పాలు నాకేం తరగడం ఆపెయ్యమంటే ఆపేస్తాను. మీ కిష్టమైన ఉల్లిపాయ పెరుగుపచ్చడి మానేస్తాను. నాదేం పోయింది. చిక్కని గడ్డ పెరుగు, దానిలో అల్లం ముక్కలు, కొత్తిమీర ఆకులు, కొబ్బరి కోరులా తరిగిన ఉల్లిముక్కలు, ఆవాలు తిరగమోత, చిటికెడు పసుపు, టీ స్పూన్ సాల్టు. ఆపైనా వలపు రంగరించి కలసి ఓహ్. అది ఉల్లి పెరుగు పచ్చడా, అమృతమా, మరోటీ, మరోటా?"
   
    "ఇంకచాలు నా నోటిలో జలరాసులు ఊరుచున్నవి" సీతని తదేకంగా చూస్తున్నాడు చందు.
   
    సీత తల ఎత్తి చందూని చూసింది. ముందు కళ్ళకడ్డంగా నీటిపొర వుండటంతో చందు మసగ మసగగా కనిపించాడు. ఆ తర్వాత నీటిపొర కరిగిపోవటంతో చందురూపం స్పష్టంగా కానవచ్చింది.
   
    సీత తదేకంగా ఆలోచిస్తూ భర్తని చూస్తున్నది... "తనెంత అదృష్టవంతురాలు. ఎగతాళికి కూడా తన కళ్ళల్లో కన్నీరు చూడలేడు. తనని కించిత్ కష్టపెట్టడు. డ్యూటీ మీద వెళితే తప్ప క్షణం వదలడు. ఉత్త అల్లరిగడుగ్గాయి. ఇంతకన్నా పసిపిల్లాడు నయం రూపం చూడబోతే ఆజానుబాహుడు అరవింద దళాక్షుడు. కోటేరులావున్న ఆ ముక్కు చూడంగానే ముక్కుకి తాడేసి లాగాలనిపిస్తుంది." ఆలోచన రాగానే సీత ఫక్కుమని పై కే  నవ్వింది.
   
    తన్ని చూసే ఆలోచిస్తున్నదని చందు గ్రహించాడు. సీత నవ్వటంతో లేచి సీత పక్కకొచ్చి కూర్చుని, "ఏమైంది సీతా?" అమాయకంగా ముఖంపెట్టి అడిగాడు.
   
    సీత నవ్వులోంచి బయటపడింది. సీరియస్ గా ముఖం పెట్టి ముందు మీరిక్కడ నుంచి లేచి వెళ్ళి ఆ మోడామీద కూర్చోండి మీరు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? మీ హోదా ఏమిటి? వంటింట్లో చేరి ఆడాళ్ళ పక్కన కూర్చొని ఛీ....ఛీ..."అంది తిరిగి ఉల్లిపాయలు తరుగుతూ.
   
    "వంటింట్లో చేరి ఆడాళ్ళ పక్కన, అయ్యో! నాకంత అదృష్టం కూడానా? ఈ వంటగదిలో వుంది నువ్వొక్క దానివే కదా!" నెమ్మదిగా వీపుమీద వేళ్ళతో మీటుతూ అన్నాడు చందు.

 Previous Page Next Page