Previous Page Next Page 
అనుభవాల అలలలో పేజి 14

    "చెయ్యి ఊరుకోదా?"
    
    "ఉహూ."
    
    "పనీ పాటా లేకపోతేసరి."
    
    "నాకు పనిలేకపోవటమేమిటోయ్ నీ పక్కన...." బయట తలుపు తట్టిన శబ్దం కావటంతో చందు చటుక్కున సీత వీపు మీద నుంచి చేతిని తీసేసి లేచి నిలబడ్డాడు.
    
    "చందుభాయ్! చందుభాయ్!" బయటనుంచి తలుపు మీద దరువుతో పాటు పిలుపు కూడా వినవచ్చింది.
    
    "గుల్జార్ వచ్చాడు" అని లేచి వెళ్ళాడు చందు.
    
    "మళ్ళీ ఏం వార్త మోసుకు వచ్చాడో మహానుభావుడు. ఊరికేమటుకు రాడు...."కత్తిపీట మీంచి లేస్తూ అనుకుంది సీత.
    
    తలుపు తీసి లోపలికి ఆహ్వానించాడు గుల్జార్ ని.
    
    "చాలా అర్జంట్ పని భాయ్!" లోపలి కొస్తూనే గుల్జార్ అన్నాడు.
    
    "నీ రాకే యమర్జంట్. చెప్పు భాయ్!" నవ్వుతూ అన్నాడు చందు.
    
    గుల్జార్ చెపుతూ వుంటే వంటింట్లోంచి వాళ్ళ మాటలు వింటున్న సీత భారంగా నిట్టూర్పు విడిచింది. "ఎప్పుడూ ఉన్న భాగోతమే" అనుకుంది.
    
                                                5
    అజయ్ చందర్ కి కోమలాదేవికి పెళ్ళి గొప్పగా జరిగింది. మగపెళ్ళివారు పెట్టిన నగలేమిటి? పట్టుచీర లేమిటి! రాళ్ళగాజులు, ముత్యాలసెట్టు అంతా వేలమీద వుంది. అది చూసిన వాళ్ళు తలోరకంగా అనుకున్నారు.
    
    "కోమల అదృష్టవంతురాలు. పైసా కట్నం పుచ్చుకోలేదు. పిల్లవాడా చూడచక్కనివాడు. పిల్లజమీందారు లంటారే! అలాంటి వంశం మీద నడుస్తారు. వేల...లక్షల మీద నడుస్తారు"
    
    "అతగాడిలో ఏం లోపం లేదుగదా! రమాకాంతం గారి వద్ద ఏముందని వాళ్ళమ్మాయిని కోరి వివాహం చేసుకున్నట్లు?"
    
    "కోమలాదేవి అందమైంది."
    
    "ఓ యబ్బో అందం! ఇంతకుమించిన అందగత్తెలు దొరకరనా? నిజమే కోమల అందంగానే వుంటుంది. అంతకన్నా అందమయినవాళ్ళు కోకొల్లలు."
    
    "పిల్లా_పిల్లాడు ప్రేమించుకున్నారు."
    
    "అధ్గదీ సంగతి."
    
    ఆ పెళ్ళీకొచ్చిన వారు తలోరకంగా చెవులు కొరుక్కుని నోటి దురద తీర్చుకుని తమకి తామే నచ్చజెప్పుకుని తృప్తిపడ్డారు.
    అసలు రమాకాంతంగారికే ఈ పెళ్ళి జరిగిందాకా నమ్మకం లేకపోయింది కోమలాదేవి మెడలో మూడు ముళ్ళూ పడి వివాహతతంగం పూర్తి అయింతరువాత "ఇది కలకాదు!" అప్పుడు అనుకున్నారు తృప్తిగా.
    
    పెళ్ళికి వచ్చిన బంధుజనం వెళ్ళిపోయారు.
    
    "ఆ ముచ్చట ఏదో నా కళ్ళముందు మనింట్లోనే జరగాలి. మీరు ఊ...అంటే__" శారదాంబ వినయంగా అడిగింది.
    
    "మీ కోరిక సవ్యమయినదైనప్పుడు కాదంటానా వదినగారూ! ఊ..." అంది లలితాదేవి నవ్వుతూ.
    
    శారదాంబ ఏనుగెక్కినట్లు సంబరపడింది.
    
    ఆ ఉదయం ఏర్పాట్లు జరుగుతుంటే కోమలాదేవి "ఈ కాలం ఈ దిక్కుమాలిన ఆచారాలేమిటి?" అనుకుంది. చిన్న కాగితం ముక్క తీసుకుని నాలుగు ముక్కలు ఎవరూ చూడకుండా గిరికింది.
    
    "అజయ్! ఏంటమ్మా చూస్తూ ఊరుకున్నావ్! పెళ్ళిముందు మనం ఏమి అనుకున్నాం? మర్చిపోయావా? నాకు సిగ్గు వేస్తున్నది."

 

 Previous Page Next Page