పెళ్ళివారి కారు వెళ్ళిపోయింతరువాత కోమలాదేవిని జలగల్లా పట్టుకున్నారు, స్నేహితురాళ్ళు "మేమంతా నీకు కాని వాళ్ళమయాముటే, ప్రేమించాను అని ఒక్క మాట చెబితే నీ నోటిముత్యాలు రాలుతాయా...!" తలోరకం మాటలు విసిరారు.
"మన కోమల నోట్లో నాలుక లేనట్లు వుంటుంది గాని అదిమనలాగా పిచ్చి మొద్దు కాదు. చూసి చూసి రాజకుమారుడిని ప్రేమించింది దాని తెలివే తెలివి" ఎత్తుపళ్ళు పార్వతి అంది.
"ఇది ప్రేమిస్తే అయిపోయిందేమిటి? ఆ రాజకుమారుడు కూడా తిరిగి ప్రేమించాలి. పెళ్ళి మాట ఎత్తంగానే పది ఆమడల దూరానికి పారిపోక సై అంటూ ముందడుగు వేయాలి. ఏ కాశీరాజ కుమారుడినో, తాళ్ళపాక రాజకుమారుడినో చూసి నువ్వూ, నేనూ ప్రేమిద్దాం పద. ప్రేమిస్తాడో పెదవి విరుస్తాడో చూద్దాం" అంది మరో స్నేహితురాలు.
ప్రేమించటమేమోగాని పెదవి విరవటం ఖాయం. ఈ విషయంలో మన కోమల్ అదృష్టవంతురాలు" అందరూ ఈ మాటతో ఏకీభవించారు.
"అవును. నేను చాలా అదృష్టవంతురాలిని" కోమలాదేవి సంతృప్తిగా అనుకొంది.
4
"అమ్మబాబోయ్...మంట....మంట. చచ్చిపోతున్నాను. ప్రాణంపోతున్నది" అంటూ గావుకేక పెట్టాడు చందు.
సీత ముసి ముసి నవ్వులు నవ్వుకుంది. తన పని తాను కానిస్తూ.
"అమ్మా, తల్లీ, సీతాదేవీ! ఈ దీనున్ని ఈ మంటల బారినుంచి రక్షించమ్మా ఇది నా పాలిట అగ్ని పరీక్ష. కాదు కాదు కళ్ళమంట పరీక్ష" కాళ్ళు తపతప లాడిస్తూ గోల పెట్టాడు చందు.
"ముందు మీరా అరుపులు ఆపుతారా లేదా?" నవ్వు బిగపట్టుకుని సీత గద్దిస్తూ అడిగింది.
"ఎలా ఆపను ఓ పక్క కళ్ళు మండిపోతుంటే!"
"ఇరుగు పొరుగు వింటారన్న సిగ్గుకూడా లేదు. అసలు కుంకుడు పులుసు మీ కళ్ళల్లో పడందే అన్నీ వేషాలు. మీ దొంగెత్తులు నాకు తెలుసులెండి" వేడి నీళ్ళలో చన్నీళ్ళు కలుపుతూ అంది సీత.
"నాది దొంగెత్తులా ఓ పక్క కుంకుడు పులుసు కళ్ళల్లోపడి కళ్ళు మండిపోతుంటే, చూడు కావాలంటే," అంటూ చందూ కళ్ళు తెరిచాడు. ఈ తఫా నిజంగానే ముఖం మీద కారుతున్న కుంకుడు రసం కళ్ళలోకి జారి కళ్ళు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. "బాబోయ్!" అన్నాడు ఒక్కసారిగా.
అది చూసింది సీత, గబుక్కున చెంబుతో నీళ్ళు తీసుకుని చందూ ముఖం మీద పోసింది. "అబద్దం ఆడేరు కదా. అందుకే తిక్క తిన్నగా కుదిరింది."
సీతని గబుక్కున దగ్గరకు లాక్కుని వళ్ళంతా తడిపేశాడు. ఇదేమిటి అదేమిటిఅని అడక్కు. నేనేంచిన్నపిల్లవాడినా! కుంకుడు పులుసుతో తలంటటానికిహాయిగా షాంపూ తెచ్చుకుంటానంటే పాత పద్దతులే మంచివంటూ కిలోనూనె తలకంటి అరకిలో సున్నిపిండి దానినెత్తినపోసి పావుకిలోకుంకుడు కాయల రసంతో తప్పాలా తోమినట్లు నా తలకాయ తోమావు అదిగో పెదవి కదపకు అన్నానా! కదపకు నాతో పాటు జలకాలాడు ఆ...అంతే" సీత నెత్తిన బక్కెటు ఎత్తి నీళ్ళు గుమ్మరిస్తూ అన్నాడు చందు.
"అయ్యో అయ్యో నూనె తలమీద నీళ్ళు పోశారు. ఎలాగండీ? అల్లరికైనా ఓ హద్దూ పద్దూ వుండాలి. ఇంట్లో పిల్లలో పెద్దవాళ్ళో ఉంటే పతిదేముడితో ఈ బాధలుండవు!"