మనలో మనలాంటి వాళ్ళేగాక చదువుకుంటున్న అమ్మాయిలు కూడా వచ్చారు. వాళ్ళయితే బాగా మాట్లాడుతారు. మనలో కొందరు బాగా మాట్లాడగల వారు లేచి ఆ పిల్లదాని వెర్రి మొర్రి రాతల గురించి మాట్లాడుకుందాము. ఈ రోజే అమీతుమీ తేల్చుకుందాము. ఇక్కడ సోదరులు లేకపోయినా యిందాక ఆ మాట వాడాను. ఓ అర్ధంతో ఆ మాట వాడటం జరిగింది.
ఆడవాళ్ళు ఎప్పుడూ పిరికివాళ్ళు కారు. మొదటి కాన్పుకి భయపడ్డ ఈ ఆడవాళ్ళు పిరికితనంతో బెదరకుండా చావుకి లెక్క చేయకుండా మళ్ళీ మళ్ళీ ధైర్యంగా పిల్లలని కంటున్నారు. భయము పిరికితనము మనకిలేదు కనుక..."
ఓ చదువుకున్న అమ్మాయి చప్పట్లు కొట్టింది. ఎవరైనా ఉపన్యాసం లాంటిది యిస్తుంటే చప్పట్లు కొట్టాలని కొడతారని అప్పుడు చాలామందికి అర్ధమైంది. ఆ మాట గుర్తు రాగానే టపటప చప్పట్లు కొట్టారు.
బలవర్ధనమ్మకి ఏనుగెక్కినంత సంతోషం అయింది. ఈ మాట అనాలో అనక్కరలేదో తెలియకపోయినా "సంతోషం చాలా సంతోషం." అంది. పైట చెంగుతో కళ్ళు వత్తుకుంది. మళ్ళీ విజృంభించింది ఆపై.
"... ... కనుక నేను చెప్పేదేమిటంటే చాలా వుంది. మన ఇందిరమ్మ తల్లి ఒక్కతీ వందమంది మగాళ్ళ పెట్టు. లక్షమంది మగాళ్ళు వున్న సభలో ఒక్క ఇందిరమ్మ తల్లి ధైర్యంగా మాట్లాడి అందరినోళ్ళు మూయించేది. ఇప్పుడు ఆ తల్లి సంగతి ఎందుకు చెపుతున్నానంటే వందలమందీ మగాళ్ళు చేయని సాహసమైన పని ఆడది ఆమె ఒక్కతీ ధైర్యంగా చేసేది. ఇందిరమ్మ తల్లి పుట్టిన ఈ గడ్డమీద మనం పుట్టాము. మగాడిని మించిన ఆమె వెయ్యిమంది మగాళ్ళకి సమానం. ఆమె అంత కాకపోయినా మనం కూడా కాస్తగట్టి వాళ్ళమే. మగాళ్ళు మన గోడు వినిపించుకోటం లేదు. కాబట్టి మనం మగాళ్ళు కాక తప్పదు. ఆ ఉద్దేశ్యంతో నేను సోదర సోదరీమణులన్నాను. అదన్న మాట విషయం...." యధా శక్తి మళ్ళీ అందరూ చప్పట్లు కొట్టారు.
".... మనం యిప్పుడు ఏం చేయాలన్నది మాట్టాడుకుందాము. అందరూ ఎవరికి తోచింది వారు నిర్భయంగా ఈ బల్ల ఎక్కి చెపితే ఏం చేయాలో ఆలోచిద్దాం. మనతోపాటు అమ్మాయిలు కూడా మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు చాలా విషయాలు తెలుస్తాయి కనుక వాళ్ళూ మాట్లాడుతారు. తప్పులుంటే క్షమించండి. జైహింద్." అని బలవర్ధనమ్మ ఓ ఫోజు పెట్టి బల్ల దిగింది.
బలవర్ధనమ్మ తర్వాత ఎవరు మాట్లాడాలో తెలియలేదు. 'మీరు మాట్లాడండి పిన్నిగారూ!" అని వెంకాయమ్మ అంటే "పెద్దది వదినగారు మాట్లాడుతారు." అని మరొకామె అంది.
దూరంగా కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు బలవర్ధనమ్మ గురించి చెవులు కొరుక్కున్నారు. వాళ్ళ మాటలు యిలా సాగాయి.
"ఎన్.టి.ఆర్. తెరమీద తైతక్కలాడుతున్న రోజుల్లో ఈవిడ ఇందిరమ్మ వంటిమీద ఈగని వాలనిచ్చేది కాదు. ఆయనగారు రాజకీయాల్లోకి దూరంగానే ఈవిడగారి చచ్చిన మొగుడు కలలో శ్రీకృష్ణ పరమాత్మగా కనిపించాడుట. దాంతో ఆ కృష్ణుడిని ఈ రాముడిలో చూసుకుని పచ్చచీర చుట్టేసుకుంది."
"ఉ... తర్వాత?"
"బీదవాళ్ళకి యిళ్ళ పట్టాలు ఫించను వగైరాలు యిస్తున్నారని తెలిసి క్యూలో ముందు నుంచుంది. నీ మొగుడు ఏ ఉద్యోగమూ చేయలేదు కాబట్టి నీకు ఫించను లేదు. నీవు కూలీ నాలీ చేసుకునే బీద దానివి కాదు కనుక నీకు ఇళ్ళస్థలం యిచ్చేది లేదని ఆవిడని లిస్టులోనుంచి తొలగించారు. దాంతో ఆమెకి కోపం వచ్చి ఆయన నాకేం అన్న మేమిద్దరం ఓ అమ్మ కడుపున పుట్టమా, చచ్చామా! అనుకుంది. ఏదో యిస్తాడని ఆశపడి ఓటేసి గెలిపించిన అన్న కన్నా ఏమాటా యివ్వని ఆ అమ్మ నయం అని పార్టీ ఫిరాయించేసింది. ఈ మధ్య ఆ అమ్మకి పుట్టిన బిడ్డ అని రాజీవ్ గాంధీకి జై అంటున్నది."