Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 13

    ఈ పరిస్థితులలో దీక్ష విచిత్రమైన రాతలు గల పాంప్లెట్ పంచుతుంటే ఆలోచించక భయపడక ప్రమాదం శంకించకుండాను ఎలా వుంటారు!

    పైగా ఆ రాతలేమన్నా మృదువుగా వున్నాయా!

    ఓసారి వాడి చూస్తే వదలరు.

    ఇది స్త్రీల కోసం ప్రత్యేకంగా తయారుచేసింది.

    మీ కోసమే మా స్వీట్ శారీహౌస్ వెలిసింది.

    ఇలాంటి తేలికభాషలో రాత అయితే నిక్షేపంగా ఇదో పబ్లిసిటీ అని తెలిసిపోయేది. ఇది అలాకాదే.

    "రక్షించండి! రక్షించండి! ఈ ప్రమాదం మీకే అయితే..! మీ జీవితంలో దురదృష్ట ఘడియలు ప్రవేశిస్తే!" ఇలాంటి రాతలు ఎవరికైనా భీతి గొలుపుతాయి. భయ భ్రాంతులని కలుగజేస్తాయి.

    దీక్ష ప్రమాదకరమైన రాతలు గల పాంప్లెట్లు పంచి పెడుతుంటే ఈ విషయం పోలీసులదాకా వెళ్ళకుండా వుంటుందా! వెళ్ళే వుంటుంది. మరి వాళ్ళకి చీమ కుట్టినట్లు కూడా లేదంటే అర్ధం ఏమిటి!

    పెద్ద పెద్ద విషయాలలో విదేశ హస్తం వున్నట్లు, ఈ విషయంలో కూడా పోలీసు హస్తం వుండే వుంటుంది. కంచే చేను మేసే ఈ రోజుల్లో ఎవరిని నమ్మేటట్లు?

    ఒంటరిగా ఒక అమ్మాయి అంత ధైర్యంగా ఆటంబాంబులాంటి కాగితాలు పంచిపెడుతూ ఇల్లిల్లూ తిరుగుతున్నదంటే ఆ పిల్ల వెనుక విదేశ హస్తమో స్వదేశ హస్తమో ఈ రెండూ కానిది పోలీసు హస్తమో, అదీ కాకపోతే రాజకీయ హస్తమో ఇదేదీ కాకపోతే గుండాల హస్తమో ఏదోవక హస్తం వుండే వుంటుంది. అంత శక్తిగల హస్తాన్ని ఎదుర్కోవాలంటే ఒక్కరివల్ల అయ్యే పని కాదు. ఒకేమాట మీద మహిళా లోకం వుండాలి.

    అన్ని విషయాలలో ఏమోగాని దీక్ష చేసిన పనికి ఇదేమిటో అమీతుమీ తేల్చుకోవాలని మహిళామండలి మొత్తం కదిలివచ్చింది. కూచిపూడి వారి యింట్లో సమావేశం అయింది.

    ఎప్పుడు పెళ్ళిళ్ళు పేరంటాలు పూజలు పురుళ్ళు వీటితో బోరెత్తి పోయిన చాలామంది అమ్మలక్కలకు దీక్ష విషయంలో కొత్త మేటర్ దొరికినట్లయింది. కూచిపూడి వారి యింటికి ఏకాభిప్రాయంతో తరలి వచ్చేరు.

    ఇంతమంది ఏకాభిప్రాయానికి రావటానికి కీలక వ్యక్తి దీక్ష.

    ముక్కు పచ్చలారని ఓ అమ్మాయి విషయంలో అతివలందరు కలసి కట్టుగా వుండటం వాళ్ళ చరిత్రలో యిదే మొదటిసారి. కాపోతే ఈ విషయం వాళ్ళు గ్రహించలేరు.

    "అంతా వచ్చేసినట్లేనా?" భారతమ్మ అడిగింది.

    "ఆ..." ఎవరో పలికారు.

    "అయితే యింక ఆలస్యం దేనికి వదినగారూ! మొదలు పెడదాం." అంది శారదాంబ.

    బలవర్ధనమ్మ లేచి నిలబడి గొంతు సవరించుకుంది.

   
                - 7 -

    "సోదర సోదరీ మణులారా!"

    "ఇక్కడ సోదరులెవరూ లేరు పిన్నిగారూ!" ఆడవాళ్ళ మధ్యనుంచి కుసుమ అరిచింది.

    బలవర్ధనమ్మ మాటకి ముందు సిగ్గుపడే రకం కాదు. అయినా ఇప్పడు రవంత సిగ్గుపడింది. తనకి బొత్తిగా ఇంగ్లీష్ రాదు. తెలుగు సినిమాలు తెగచూసి వుండటంవల్లే స్టేజీ ఎక్కిం తరువాత ముందు మాటలు ఏమనాలో తెలుసు. సభకి నమస్కారం అనవచ్చు గాని యిది సభకాదు. ఒక యింట్లో కొందరు ఆడవాళ్ళు చేరిన సమావేశం సభ ఎలాకాదో స్టేజీ కూడా అలాగే లేదు. లైటింగు, మైకు, రంగు కాగితాలు, పూలదండలు వగైరా చిల్లర సరుకులు కూడా లేవు. అయినా అందరిని ఉద్దేశించి మాట్లాడాలి కాబట్టి బలవర్ధనమ్మ తెలివిగా "సోదర సోదరీ మణులారా!" అంది. ఆది లోనే హంసపాదు.

    బలవర్ధనమ్మకు అవసరం అయితే ప్లేటు ఫిరాయించే తెలివి కూడా వుంది. అప్పటికప్పుడే ప్లేటు ఫిరాయించింది.

    "అమ్మాయి కుసుమ ఇప్పుడే ఒకమాట అంది. ఇక్కడ సోదరులు లేరు అని, ఆ మాట అక్షరాలా నిజం. మనం దాదాపు యాభై మంది దాకా ఇక్కడ చేరాము. కూర్చుని మాట్లాడితే ఒకరి మాట మరొకరికి అర్ధం కాదని నుంచోని మాట్లాడాలని అందరూ అనటంవల్ల నేను పెద్ద వుపన్యాసకురాలిలాగా నుంచోని బల్ల ఎక్కి మాట్లాడుకున్నాను. (స్టేజీ ఎక్కి మాట్లాడుతున్నానని అనటానికి స్టేజీరాక బల్ల అంది.)  

 Previous Page Next Page