Previous Page Next Page 
ఆమని కోయిల పేజి 15

    "బాగా చెప్పావు."

    "ఎవరు స్టేజీ ఎక్కాలనేది యింకా తేలలేదు లాగుంది. ప్రస్తుతం మర్యాద తోనే వున్నారు. మరో అరగంట యిలాగే గడిచింది అంటే జుట్టూ జుట్టూ పట్టుకునేటట్లు వున్నారు."

    "ఓ పని చేస్తాను. నేను వెళ్ళి సర్దుతాను."

    "నువ్వా!"

    "అలా తీసెయ్యకే సుందరీ! చూస్తు వుండు నీవెళ్ళి ఏం చేస్తానో" అంటూ కూర్చున్న చోటునుంచి లేచింది.

    ఆ పిల్ల పేరు జయంతి.


                 - 8 -

    జయంతి స్టేజీ అనబడే బల్ల అరుగు ఎక్కి నుంచుంది.

    ఎవరికి వారే అరుగెక్కి మాట్లాడాలని వుంది. ఇలాంటి సదవకాశం వాళ్ళ జన్మలో రాలేదు. అదీగాక పోచినోలు కబుర్లు చెప్పే బలవర్ధనమ్మ లాంటిదే అరుగెక్కి అంత బాగా మాట్లాడగాలేంది ఆ మాత్రం మేము మాట్లాడలేమా అనుకుంటున్నారు ఎవరికి వారే. కాకపోతే మర్యాద కోసమని మీరు మాట్లాడండి ముందంటే, మీరు మాట్లాడండి అనుకుంటున్నారు.

    గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్లు ఈ పిల్ల స్టేజీ ఎక్కింది. అక్కడితో వూరుకోక "సైలన్స్" అంది లేక అరిచింది అన్నా ఫరవాలేదు.

    అంతకు క్రితం జయంతి అన్న ఆ పిల్లతో ఎవరికీ విరోధం లేదు. ఇప్పుడు యిందరుండంగా అరుగెక్కిందే చాలక సైలెన్స్ అన్న అరుపొకటి.
    అందరు నోరు మూసుకున్నారు. కాని వాతావరణం వేడిగా తయారయింది.

    "పెద్దలందరికీ నమస్కారం. నేను మాట్లాడటానికి స్టేజీ ఎక్కలేదు. ఇందరు పెద్దలు అంటే అత్తయ్యగార్లు పిన్నిగార్లు ఇక్కడ వుండగా తగుదునమ్మా అని నేను స్టేజీ ఎక్కటం మంచి లక్షణం కాదు. కాని ఒక విషయం చెప్పటానికి ఎక్కాను. మీరు చెప్పమంటే చెప్పి స్టేజీ దిగిపోతాను." అంది జయంతి.

    "ఎలాగూ ఎక్కవుగా చెప్పమ్మా!" మూలిగినట్లు ఎవరో మాట్లాడారు. "ఏమిటో అది?" ఒకామె దీర్ఘం తీసింది.

    "నాకు అనుమతి యిచ్చిన అందరికీ మరోసారి నమస్కారం. మనం యిలా చర్చించుకుంటూ కూర్చుంటే ఎవరూ సరిగా మాట్లాడటం కుదరదు. సమయం అయిపోతుంది. మీరంతా పెద్దలు, మర్యాదస్తులు కాబట్టి మీరు ముందు మాట్లాడండి. కాదు మీరే మాట్లాడండి అనుకుంటున్నారు. దీనికన్నా ఎవరికీ బాధ లేకుండా వరసక్రమంలో అందరూ మాట్లాడితే చిక్కు వుండదు ఏమంటారు మీరు?" జయంతి ఆగింది.

    "వరసక్రమం ఏమిటి?" సుబ్బాయమ్మ అడిగింది.

    "ఎవరెవరు మాట్లాడుతారో చేతులు ఎత్తండి."

    అక్కడ వున్న యాభై మందికి పది మంది చేతులు ఎత్తారు.

    "మరి చిన్న వాళ్ళో!"

    ఆరు చేతులు పైకి లేచాయి.

    "మొత్తం పదహారుమంది మాట్లాడుతారు. ఇప్పుడు పలకమీద ఈ పదహారుమంది పేర్లు రాయాలి. అక్షర క్రమంలో ఒకరు స్టేజీ మీదకి పిలుస్తుంటే వాళ్ళొచ్చి మూడేసి నిమిషాలు మాట్లాడి వారి అభిప్రాయం చెప్పి దిగిపోవాలి."

    "అక్షర క్రమము అంటే?"

    "ముందు అ అనే అక్షరం పేరుతో వచ్చేవాళ్ళు ఆ తర్వాత ఆ.. ఆ తర్వాత క, గ, ప, మ... అలా అనుకోండి." జయంతి చెప్పింది.

    "ఇదేదో బాగుందర్రా" అనుకున్నారు అంతా. "నీవు కాలేజీలో చదువుకున్న అమ్మాయివి. ఇలాంటివి నీకు బాగా తెలుస్తాయి. మంచి సలహాలు చెప్పటానికి చిన్నేమిటి పెద్దేమిటి అదేదో నీవే చూడు జయంతమ్మా!" అన్నారు నలుగురు కలిసి.

    ఒక మనిషి నాయకుడు కావాలంటే ఏమీ అక్కరలేదు. కాస్త చొరవ నాలుగు మాటలు రెండు సలహాలు అన్నారు పెద్దలు. జయంతి స్టేజీ అనబడే అరుగు ఎక్కగానే మూతి ముక్కు విరిచిన పెద్దలే ఓ విధంగా సమస్య పరిష్కారం అయే మార్గం కనపడగానే జయంతిని అందలం ఎక్కించినంత పని చేశారు.

    'వీళ్ళ తిక్క కుదురుద్దామని స్టేజీ ఎక్కితే అందరూ కలసి నాకే పట్టం కట్టారే హత్తెరిక' అనుకుంది జయంతి.

    'వసేయ్ వసేయ్, ఏకుమేకూ!' అనుకుంది ఆశ్చర్యంతో సుందరి.

 Previous Page Next Page