Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 14

"అయితే వెంటనే చచ్చిపో! వదిలేస్తాం!" అన్నాడు పరమానందం ఎంతో ఆశగా.
"చావాలనే వుంది. కానీ చావలేక పోతున్నాను!" అన్నాడు యువకుడు నీళ్లు నముల్తూ.
"అయితే బతికిపో! వదిలేస్తాం!" అన్నాడు ఆనందం, ఎంతో సంతోషంగా.
"బతకాలనే వుంది. కానీ బతకలేక పోతున్నాను" అన్నాడు యువకుడు గద్గద స్వరంతో.
ఆ యువకుడి గొడవేమిటో అర్థం గాక ఆనందం పరమానందంలు మొహమొహాలు చూసుకుంటున్నారు.
గుమాస్తాలిద్దరూ యువకుడి పాదాల మీద పడ్డారు.
"నువ్వు ఛస్తావో తెలీదు!" అన్నాడు సింహాచలం.
"పోనీ - బతికే గ్యారంటీ లేదు." అన్నాడు భద్రాచలం.
"నీ ప్రోగ్రాంని బట్టి మా బతుకులు ఆధారపడి వున్నాయి."
"ఛస్తే చావు!"
"బతికితే బతుకు!"
ఆనందానికి విసుగు పుట్టింది కాబోలు 'ఆపండి' అన్నాడు గుమాస్తాలు మాటడటం మానేసేరు.
ఆనందం తాపీగా యువకుడ్ని ప్రశ్నించేడు.
"నీ పేరు?"
"సత్యమూర్తి!"
"ఏ ఊరు?" అడిగేడు పరమానందం.
"ప్రస్తుతానికి ఇదే ఊరు?"
"ఎందుకు చావాలనుకుంటున్నావ్?" అడిగేడు ఆనందం.
"అదో పెద్ద కథ!"
"ప్లాష్ బేకా?" అడిగేడు పరమానందం.
"అయితే తీరుబడిగా కూచుని చెప్పు!" అని గుమాస్తాలకు సైగ చేసేడు. గుమస్తాలు అక్కడ దొరికే ఆకులు రెమ్మలూ తీసుకొచ్చి చాపమాదిరి పరిచేరు. ఆ చాప మీద అందరూ కూచున్నారు.
"ఊఁ.... మొదలెట్టు" అన్నాడు పరమానందం.
సత్యమూర్తి ప్రారంభించేడు -
"నా దొక విషాద గాథ. నా తల్లి తండ్రులకు నేనొక్కడ్నే సంతానం!"
"నువ్వు పుట్టగానే  నీ తల్లితండ్రులు ఆపరేషన్ చేయించుకున్నారా?" అని అడిగేడు భద్రాచలం.
"నువ్వు నోర్ముయ్. నువ్వు కథ చెప్పు" అన్నాడు పరమానందం.
"నా తల్లితండ్రులు నన్ను  ఎంతో  ప్రేమగా, ఎంతో గారాబంగా పెంచుకున్నారు!" అన్నాడు సత్యమూర్తి.
"ఏ  తల్లి తండ్రులైనా అట్లాగే పెంచుకుంటారు. అంతేగాని చెత్తకుండీలో పారేసుకోరు" అన్నాడు సింహాచలం.
సత్యమూర్తి బాధపడుతూ అన్నాడు -
"సార్! నేను చెప్పాల్సింది చాలా పెద్ద విషాదగాధ. మీరిలా మాట మాటకి అడ్డంపడితే కథ సాఫీగా సాగదేమో?"
"విషాద గాథ నాన్చుతూ చెప్పకూడదు. స్పీడు స్పీడు ముఖ్యం. ఇప్పుడు చెప్పు!" అన్నాడు ఆనందం.
సత్యమూర్తి సర్దుక్కూచుని చెబుతున్నాడు -
"నా చిన్నతనం సుఖంగా గడిచింది. దాంతో దేవుడికి కన్ను కుట్టింది. నాన్నని తీసుకుపోయేడు. నాన్నతోపాటే సిరి సంపదలన్నీ తుడ్చు పెట్టుకుపోయేయి. అమ్మ అనేక అవస్థలు పడి నన్ను చదివించింది. కాలేజీలో చేరెను. మొదటి రోజునే మనసు పారేసుకున్నాను. అమ్మాయి పేరు శారద నా క్లాసుమేటు. టెన్నిస్ ప్లేయిరు".
   
                                                             *        *         *    
ప్లాష్ బాక్ గనక కథ కాలేజీకి వెళ్ళి పోయింది.
శారద చిన్న నిక్కరు - చేతుల బనీనుతో టెన్నిస్ ఆడుతోంది. దృష్టికి అనువుగా వుండే ఒకచోట వెతుక్కుని - అక్కడ్నించి శారద ఆడేటెన్నిస్ ఆతని తృప్తిగా చూస్తున్నాడు సత్యమూర్తి.
శారద ఎగిరెగిరి బంతిని కొడుతుంటే - ఆమె శరీరాన్ని అణువణువు అతి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు సత్యమూర్తి. అందుచేత అతని గుండెల్లో కితకితలు మొదలయ్యాయి. వాటి సుతి మెత్తని తాకిడికి సత్యమూర్తి నిలువెల్లా పులకించి పోతున్నాడు.
శారద కొట్టిన షాట్ కి - బంతి వందడుగుల దూరంలో పడింది.సత్యమూర్తి పరుగెత్తుకుంటో వెళ్లి బంతిని తెచ్చి శారదకి ప్రేమగాయిచ్చేడు.
శారద థేంక్స్ చెప్పింది. సత్యమూర్తి మెలికలు తిరిగిపోతున్నాడు.
ఇప్పుడు ప్లాష్ బాకులోంచి ఆ బిట్టు కట్టయింది.
                                                  *        *        *
కొండదగ్గిర కథ చెబుతున్న సత్యమూర్తి నిట్టూర్చేడు. ఆ తర్వాత అన్నాడు -
"అల్లాంటి మనోహరమైన బిట్లు చాలా చెప్ప గలను. కథ సాగాలి గనక అవన్నీ వదిలేసెను."
"మంచిపనే చేసేవు!" అన్నాడు సింహాచలం.
సింహాచలం చేసిన కామెంటు పట్టించుకోకుండా సత్యమూర్తి చెప్పుకుపోతున్నాడు-
"ఏతావాతా నా హృదయంలో చెరగని ముద్ర వేసింది శారద. ఆ ముద్ర పేరు ప్రేమ. శారద నవ్వితే నా కెంతో ఆనందంగా వుండేది. ఏ కారణం చేతనైనా ఆమె క్లాసుకి రాకపోతే ఆ రోజు నాకు  పిచ్చి పిచ్చిగా వుండేది. పాఠాలు తలకెక్కేవి కావు. ఈ నేపథ్యంలో ఒక రోజు-"
మళ్లీ ప్లాష్ బాక్ ప్రారంభమైంది.
                                             *        *        *
అది క్లాసురూం.
బోటనీ పాఠం - బోరుగా వుంది. శారద ముందు వరస బెంచీలో కూచుని వుంది. ఆమె వెనగ్గా సత్యమూర్తి కూర్చుని వున్నాడు. పాఠమ్మీదికి అతని మనసు పోవడం లేదు. శారద తాలూకు జడ మీద - ఆ జడ ఆడుతున్న మెడమీద - మెడక్కోంచెం దిగువుగా అతని చూపులు తాండవం చేస్తున్నాయి. అంతలో ప్యూను నోటీసు కాగితం తీసుకోచ్చేడు. లెక్చరరు దాన్ని చదువుకుని - స్టూడెంట్సుకి తాత్పర్యం చెప్పేడు.
'బొటానికల్ టూర్! వారం రోజులు. వైజాగ్ వెళ్లాలి. ఇష్టమైన వాళ్లు పెర్లివ్వాలి. అదీ విషయం!'
శారద  పక్కన అటూ ఇటూ కూర్చున్న అమ్మాయిలు శారడకి షేక్ హేండ్స్ యిస్తున్నారు. అంటే -
వాళ్ల ముగ్గురూ విశాఖపట్నం వెళ్లేది ఖాయం అని సత్యమూర్తి అంతరాత్మ గొణిగింది.
విశాఖపట్నం.
సముద్ర తీరం ఎంతో అందంగా వుంది. శారద, ఆమె స్నేహితురాళ్ల చేతుల్లో  రకరకాల మొక్కలున్నాయి.
వాళ్లక్కోంచెం దూరంగా పిచ్చి మొక్కల్తో నిలబడ్డాడు సత్యమూర్తి తన  చూపు మొత్తం వాళ్ల మీదే వుంచేడు.
శారదతో ఒక స్నేహితురాలు అన్నది -
"శారూ! సముద్ర స్నామంటే నాకు చాలా యిష్టమే! చేద్దామా?"
శారద జవాబు చెప్పేలోగా ఇంకో అమ్మాయి అన్నది -
"నాకు భయం బాబూ! నాకు జలగండం వుందిట!"
అప్పుడు శారద కలగజేసుకుంది.
"నీ మొహం! ఆడవాళ్లకి మొగుడి గండం తప్ప జలగండాలుండవు. తెలుసా? కమాన్ - దూకండి!"
సత్యమూర్తి చూస్తుండగానే ముగ్గురమ్మాయిలు సముద్రంలోకి దూకేరు. అతను చూస్తుండగానే శారద చేపపిల్లలాగా కెరటాల్తో ఆడుకుంటోంది. అతను అట్లా చూస్తుండగానే ఒక కెరటం శారదను లాక్కు  పోతోంది. దాంతో మిగతా ఆడపిల్లలు ఖంగారు పడుతూ 'హెల్ప్....హెల్ప్' అని అరుస్తున్నారు.
శారదని కెరటం ఇంకా దూరంగా లాక్కుపోతోంది.
ఆమెను రక్షించేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయడం లేదు. అప్పుడు సత్యమూర్తి సముద్రంలోకి దూకేడు.  కెరటాలు ఛేదించుకుంటూ వెళ్లి శారదను తన చేతుల్లోకి తీసుకున్నాడు.
ఆమెను తన శరీరమ్మీది ఒక విలువైన ఆభరణంగా ఎంచుకుని ఎంతో భద్రంగా ఆమెను ఒడ్డుకి తెచ్చేడు.
అతని సాహసానికి స్టూడెంట్సు ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని అభినందించేరు -
"కంగ్రాట్స్! హీరో వనిపించుకున్నావ్!"
"మీరు లేకపోతే శారద మాకు దక్కేది కాదు."
శారద సత్యమూర్తి వేపు ఆరాధనా పూర్వకంగా చూస్తోంది.
"థేంక్స్ చెప్పవే మొద్దూ!" అన్నది ఒక స్నేహితురాలు.
శారద తన మాటల్లో ముత్యాలు ఒలక పోస్తూ అన్నది.
"మీ పేరు సత్యమూర్తి కదూ!"
"అవును పేరు గుర్తు పెట్టుకున్నందుకు ఆనందంగా వుంది."
"థేంక్స్ ఫర్  ది హెల్ప్. నా జీవితమంతా మీరు చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుంటాను" అంది శారద ఎంతో వినయంగా.

 Previous Page Next Page