Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 15

"అంత మాటనకండి. జస్ట్.....నా డ్యూటీ నేను చేసెను. దట్సాల్" అన్నాడు సత్యమూర్తి.
"మీరు గజ ఈతగాళ్లు కాబట్టి మా శారదకి గండం తప్పింది" అన్నది రెండు జడలమ్మాయి.
సత్యమూర్తి నీళ్లు నములుతూ అన్నాడు.
"నాకు ఈత రాదండి"
"అతని మాటకి శారదతో పాటు  అందరూ షాక్ తిన్నారు. అందుచేత ఎవరూ ఏం మాట్లాడలేక పోయేరు.
తన స్టేట్ మెంట్ అంత నిశ్శబ్దాన్ని స్పషించినందుకు సత్యమూర్తి ఇబ్బంది పడుతూ తన మనసులోని మాట చెప్పేసేడు-
"శారదగారు ప్రమాదంలో వున్నారని తెలీగానే దూకేయాలని పించింది. దూకేసేను."
ఆడపిల్లలు అక్కడ్నించి కదిలేరు. కొంత దూరం నడిచేరు. వాళ్లలో శారద కూడా వుంది. ఆమెకు ఏదో గుర్తుకు రాగా అకస్మాత్తుగా వెనక్కి పరిగెత్తుకొచ్చి సత్యమూర్తిని చేరుకొని ఆరాధనా పూర్వకంగా అన్నాది.
"ఈత  రాకపోయినా నా కోసం మీ ప్రాణాలకు తెగించి నన్ను రక్షించినందుకు థేంక్స్! స్పెషల్ థేంక్స్!"
తాను ఏమి చెప్పదలచుకున్నది దాచకుండా చేప్పేనన్న సంతృప్తితో శారద అక్కడ్నించి వేగంగా నడుచుకుంటో వెళ్లిపోయింది. ఆమెను కన్నార్పకుండా చూస్తూ నిలబడి పోయేడు సత్యమూర్తి!
   
                                        17
ప్లాష్ బేకు నుంచి సత్యమూర్తి బయట పడ్డాడు.
అంచేత కొంచెం భారంగా గాలి పీల్చి వదిలేడు. ఆ తర్వాత చెమర్చిన కళ్లను తుడుచుకున్నాడు. ఆ పైన చీదుకున్నాడు.
"అంతేలే! ఏక్సిడెంటు ప్రేమలన్నీ ఇట్లాగే తగులడతాయ్!"
"అంటే నీ ఉద్దేశ్యమేమిటి?" అడిగేడు ఆనందం.
"ఏముంది? సింపుల్! నిన్నో మొన్నో ఆ పిల్ల ఇతన్ని ఛీ కొట్టి వుంటుంది" అన్నాడు పరమానందం.
"అంతేనా?" అడిగేడు ఆనందం సత్యమూర్తిని.
సత్యమూర్తి సమాధానం చెప్పలేదు. పరమానందం అందుకున్నాడు-
"అతన్నెందుకు అడుగుతావ్. అసలే బాధల్లో వున్నాడు. నన్నడుగు చెబ్తా! ప్రేమించిన పిల్ల ఛీ కొడితే  ఎవడైనా ఏం చేస్తాడు? ఇతనూ అదే చేసేడు. ఆత్మహత్య చేసుకోవాలని కొండెక్కేడు. చూడు సత్యమూర్తి! నీ నిర్ణయం భేషుగ్గా వుంది.  ఒక ఆడపిల్ల  - అందునా నువ్వు ప్రాణ దానం చేసిన ఆడపిల్ల - నిన్ను ఛీ పొమ్మన్న తర్వాత ఎందుకయ్యా బతుకు? చచ్చిపో! హాయిగా చచ్చిపో! నాకు మేలు చేసిన వాడవవుతావు."
"మీరు ఊహించినట్టు - నేను ఆమెను  ప్రేమిస్తున్నట్టు చెప్పనూ లేదు. ఆమె నన్ను ఛీ కొట్టనూ లేదు" అన్నాడు  సత్యమూర్తి గంభీరంగా.
"మరలంటాప్పుడు నీకు బతుకు మీద ఎందుకు విరక్తి కలిగించి" అడిగేడు ఆనందం.
"అది చెప్పాలంటే నా ప్రేమ కథ ఇంకా కొంత చెప్పాలి" అన్నాడు సత్యమూర్తి
"తప్పకుండా చెప్పు!" అన్నాడు ఆనందం.
"నా కాలేజీ చదువు పూర్తయింది. డిగ్రీ చేతికి వచ్చింది. ఆనందించేందుకు అమ్మలేదు. మరోపక్క నా హృదయాన్ని దోచుకున్న శారద కూడా నాకు కనిపించడం లేదు. ఒంటరి నయ్యేను. ఏకాకి! కడుపు నింపుకునేందుకు ఉద్యోగాన్వేషణ ప్రారంభించేను. నా ఊహకు తగ్గ ఉద్యోగం దొరకలేదు. చివరికి బట్టలు షాపులో సేల్స్ మేన్ గా చేరేను. రెండేళ్లు గడిచేయి. శారదకి పెళ్లి కూడా జరిగి వుంటుందని తలిచేను. మెల్లి మెల్లిగా ఆమెను మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నాను. అలాంటిది ఒక రోజు......"
"మళ్లా ప్లాష్ బేకా?" అడిగేడు సింహాచలం.
"అవును" అన్నాడు బెంగగా సత్యమూర్తి.
"ఊఁ కానివ్వు" అన్నాడు ఆనందం.
ప్లాష్ బాక్ ప్రారంభమైంది!   
                                                                               18

సత్యమూర్తి సిటీబస్సులో ప్రయాణం చేస్తున్నాడు! అప్పటికే ఉదయం పదయ్యింది. బట్టలషాపు యజమాని ఏం తిడతాడో నని సత్యమూర్తి బస్సులో కూచుని దిగులు పడుతున్నాడు.
అందుకు తగట్టు ఆ సిటీ బస్సు లోపల ఇనుప  చువ్వని పట్టుకువేలాడుతున్నాడు!
బస్సు ఒక స్టాపులో ఆగింది. సత్యమూర్తి బయటకు తొంగి చూశాడు. ఆ బస్సు స్టాపులో శారద నిలబడి వుంది!
ఆమెను చూడగానే రెండేళ్ల ఎడబాటు గొంతులో చేరి పోయింది. అందువల్ల అకస్మాత్తుగా, అప్రయత్నంగా అతను శారదా అని పోలి కేక పెట్టేడు!
ఆ కేక విని - బస్సులో వున్న పిల్లవాడు భయపడ్డాడు కాబోలు -  ఏడవడం ప్రారంభించేడు. ఆ పిల్లవాడి తల్లి పిల్లవాడిని సముదాయిస్తోంది. అయినా పిల్లవాడు గుక్కలు పెడుతూనే వున్నాడు.
ఆ పిల్లవాడి తల్లి సత్యమూర్తి వేపు కోపంగా చూస్తోంది. ఆలోగా బస్సు కదిలింది.
శారద బస్సు స్టాపు లోనే వుండి పోయింది. ఆమె కోసం బస్సు దిగాలను కున్నాడు. తోటి పాసింజర్లను తోసుకుని డోరు దగ్గరికి రాసాగేడు. ఆ లోగా బస్సు స్సీడందుకుంది!
"బస్సాపండి" అని మళ్లీ పోలి కేక పెట్టేడు!
పసి పిల్లవాడు ఏడుపు మరింత పెంచేడు. ఆ తల్లి సత్యమూర్తి వేపు కళ్లేర్ర చేసి చూసింది.
సత్యమూర్తి ఖంగారుగా కండక్టర్తో అంటున్నాడు.
"కండక్టర్....బస్సాపండి ... ప్లీజ్ కండక్టర్.....నే దిగాలి!"
కండక్టర్ సత్యమూర్తి వేపు ఎగాదిగా చూసి అన్నాడు-
"స్టాపులో ఆగినప్పుడేం చేస్తున్నావ్!"
"అప్పుడే చూసేను కండక్టర్!"
"ఏమిటి చూసేవ్?"
"అయ్యయ్యో వివరాలడక్కండి. బావుండదు. ఏం చూసేనో మీకు చెప్పలేను. మీకు దండం పెడతాను బస్సాపించండి!"
ఎవరో పాసింజరు అన్నాడు....
"ఆ ఖంగారు చూస్తుంటే జేబు దొంగలా వున్నాడు! అందరూ జేబులు చూసుకోండి!"
ఆ ఖంగారు చూస్తుంటే జేబు దొంగలా వున్నాడు! అందరూ జేబులు చూసుకోండి!"
ఆ మాటకి ప్రయాణీకులు నవ్వేస్తున్నారు. ఆ నవ్వులు విని పసి పిల్లవాడు ఏడుపు తాలూకు శృతి పెంచేడు. ఆ తల్లి 'దరిద్రపు గొట్టు మంద' అని విసుక్కుంటోంది.
"అసలు నువ్వెక్కడ దిగాలి?" అడిగేడు కండక్టరు.
"అక్కడే దిగాలి. ఆపండి?" అన్నాడు సత్యమూర్తి.
"ఎక్కడికి తీసుకున్నావ్ టిక్కెట్టు?"
సత్యమూర్తి చెప్పేడు.
"అయితే అక్కడే దిగు! ఇంకా నాలుగు స్టేజీలు దాటితే గానీ స్టేజీ రాదు."
"అంతేనా?"
"అంతే!"
"అయితే దూకుతా!"
"అంత ముచ్చటగా వుంటే.....దైర్యమే వుంటే దూకు."
అంతే!
పాసింజర్లు మధ్య నుంచి దూసుకెళ్లి డోరు చేరుకున్నాడు. ఆ తర్వాత దూకేసేడు!
బస్సులో పాసింజర్లుందరూ కెవ్వుమన్నారు. పసిపిల్లవాడు ఏడుపు శృతిని నాలుగింతలు పెంచేసేడు.
"పాడు బస్సు! బుద్ది లేక ఎక్కేను." అని తల్లి గట్టిగానే అనేసింది.
నేల మీద పడ్డ సత్యమూర్తి లేచి నుంచునే ప్రయత్నం చేసేడు. కానీ  లేవలేకపోయేడు. అతని ముక్కు పచ్చడయింది. మోచేతుల నుంచి నెత్తురు వరదలుగా కారుతోంది.
అతి కష్టమ్మీద లేచి నిలబడ్డాడు. ఓపిక తెచ్చుకొని....దాటిపోయిన స్టేజి వైపు కుంటుకుంటూ పరిగెత్తుతున్నాడు. నెత్తురు వరదలవుతోంది....రోడ్డు మీద జనం అతన్ని జాలిగా చూస్తున్నారు. అతన్నెవరో చితక బాదిపారిపోయి వుంటారనీ వాళ్లని అతను వెంబడిస్తున్నాడని తలిచేరు.
ఎట్టకేలకు అతను దాటి పోయిన స్టేజీని చేరుకున్నాడు. కానీ - ఆ స్టేజీలో ఎవరో ఆడపిల్లలున్నారు గానీ.... శారద మాత్రం లేదు.
'శారదా' అని బాధగా గొణుకున్నాడు సత్యమూర్తి.

                                      19
కొండ దగ్గిర .....
సత్యమూర్తి చెబుతున్న కథ వింటున్న సింహాచలం వెక్కి వెక్కి  ఏడుస్తున్నాడు. ఏడుస్తున్న సింహాచలం వేపు ఆనందం విసుగ్గా చూసేడు.
అయినా సింహాచలం ఏడుపు ఆపలేదు. ఆనందం కోపంగా అడిగేడు.
"ఎందుకేడుస్తావ్? బస్సు నుండి దూకింది అతను ముక్కు పచ్చడి చేసుకున్నది అతను నువ్వెందుకేడుస్తావ్?"

 Previous Page Next Page