Previous Page Next Page 
ఋగ్వేద సంహిత - 2 పేజి 13


        ఓం వతామినన్తిమాయివో వధీరావ్రతానాం ప్రథమాధ్రివాణి
        నరోదసీ అద్రుహా వేద్యాభిర్న పర్వతావి నమేస్థివాం పః

               నాలుగవ అధ్యాయము             అరువది మూడవ సూక్తము

   ఋషి - ఆత్రేయ అర్చనానుడు, దేవత - మిత్రావరుణులు, ఛందస్సు - జగతి.

    1. మిత్రావరుణులారా ! మీరు ఉదక రక్షకులు. సత్య ధర్మవంతులు. మీరు మా యజ్ఞమునకు వచ్చుటకుగాను నిరతిశయ ఆకాశమున రథమును ఎక్కుదురు. మీరు ఈ యజ్ఞమును రక్షించు యజమాని కొఱకు ద్యులోకపు మేఘము నుండి సుమధుర జలవర్షము కలుగచేయుదురు.

    2. స్వర్గద్రష్టలగు మిత్రావరుణులారా ! ఈ యజ్ఞమున విరాజిల్లి మీరు భువనములను శాసింతురు. మేము మిమ్ము వృష్టిరూప ధనము, స్వర్గము ప్రార్థింతుము. మీ విశాలరశ్ములు ద్యావాపృథ్వుల మధ్య సంచరించును.

    3. మిత్రావరుణులారా ! మీరు అత్యంత విరాజమానులు. ఉద్యతబలులు. వారి వర్షకులు. ద్యావాపృథ్వికి భర్తలు. సర్వద్రష్టలు. మీరిద్దరు మహానుభావులు. విచిత్ర మేఘసహితులయి స్తుతిశ్రవణమునకుగాను విచ్చేయుడు. తదనంతరము వర్షవిధాయకుడగు పర్జన్యుని ద్వారా ద్యులోకము నుండి వర్షము కురిపించండి.

    4. మిత్రావరుణులారా ! సూర్యుడు మీకు అస్త్రభూతుడు. జ్యోతిర్మయుడు. సూర్యుడు అంతరిక్షమున సంచరించినపుడు మీ సామర్థ్యము స్వర్గమున వెల్లడియగును. మీరు ద్యులోకమున మేఘము, వర్షము ద్వారా సూర్యుని రక్షించుచున్నారు. పర్జన్యుడు మిత్రావరుణులతో ప్రేరితుడవయి ఆకసమునుండి వర్షబిందువును రాల్చుము.

    5. మిత్రావరుణులారా ! వీరుడు యుద్ధమునకుగాను తన రథమును సిద్ధము చేసినట్లు మరుద్గణములు మీ అనుగ్రహమున వర్షమునకుగాను మీ రథమును సిద్ధము చేసెదరు. జలవర్షమునకుగాను మరుద్గణములు వివిధ లోకముల సంచరింతురు. మీరు మరుద్గణ సహితులయి ద్యులోకమునుండి మా మీద వాన కురిపించండి.

    6. మిత్రావరుణులారా ! మీ అనుగ్రహముననే మేఘము అన్నసాధకము, ప్రభావ్యంజకము, విచిత్రమగునది అయినది. మరుద్గణములు తమ ప్రజ్ఞాబలమున మేఘములను రక్షింతురు. వారితో మీరు అరుణవర్ణ, నిష్పాప ఆకసము నుండి వాన కురిపింతురు.

    7. విద్వాంసులగు మిత్రావరుణులారా ! మీరు జగములకు ఉపకారకులు. వృష్టి మున్నగువాని ద్వారా యజ్ఞమును రక్షించెదరు. జలవర్షకుడు వర్జన్యుని ప్రజ్ఞవలన జలమున సమస్త భూతజాతములను దీప్తము చేయును. పూజ్యుడు, వేగవంతుడగు సూర్యుని ద్యులోకమున నిలుపుదురు.

                                        అరువది నాలుగవ సూక్తము

 ఋషి - ఆత్రేయ అర్చనానుడు, దేవత - మిత్రావరుణులు ఛందస్సు - అనుష్టుప్, చివరిది పంక్తి.

    1. మిత్రావరుణులారా ! మేము ఈ మంత్రమున మీ ఉభయులను ఆహ్వానించుచున్నాము. బాహుబలమున ఆవులమందను అదుపు చేసినరీతి మీరు శత్రువులను దూరము చేయండి. స్వర్గమార్గమును కనబరచండి.

    2. మీరిద్దరు ప్రజ్ఞాసంపన్నులు. మీరు మా స్తుతి కర్తలకు అభిమత సుఖములు ప్రసాదించండి. మేము శోభన హస్తముల స్తుతింతుము. మీరు ప్రసాదించిన సుఖములు సర్వత్ర వ్యాపించవలెను.

    3. మాకు ఇప్పుడే గమనము ప్రాప్తించవలెను. మిత్రుడు చూపిన బాటన సాగవలెను. అహింసక మిత్రుని సుఖము మా ఇంట సమకూరవలెను.

    4. మిత్రావరుణులారా ! మేము మిమ్ము స్తుతింతుము. ధనమును పొందుదుము. ఆ ధనమును చూచి ధనికులు స్తుతికర్తలు ఈర్ష్య పడుదురు.

    5. మిత్రావరుణులారా ! మీరు సుందర దీప్తియుక్తులయి మా యజ్ఞమునకు విచ్చేయండి. ఐశ్వర్యశాలి యజమానుల గృహములందును, మా ఇంటను సమృద్ధిని వర్థిల్ల చేయండి.

    6. మిత్రావరుణులారా ! మా స్తుతుల కొరకును మా కొరకును మీరు విశేష అన్నమును ధరించండి. మీరు మాకు అన్నము, ధనము, బలములు శుభములు కలిగించండి.

    7. అధినాయక మిత్రావరుణులారా ! ఉషఃకాలమున సుందర కిరణయుక్త ప్రాతస్సవనమున దేవబల విశిష్ట గృహమునందు మీరిద్దరు పూజనీయులు అగుదురు. ఆ ఇంట మేము అభిషవించిన సోమమును మీరు అవలోకించండి. మీరు 'అర్జనాను' ని విషయమున ప్రసన్నులుకండు. గుఱ్ఱములపై ఇప్పుడే విచ్చేయండి.

                                      అరువది అయిదవ సూక్తము

    ఋషి - ఆత్రేయ రాతహవ్యుడు, దేవత - మిత్రావరుణులు ఛందస్సు - అనుష్టుప్, చివరిది పంక్తి.

    1. మిత్రావరుణులారా ! దేవతలందు మీ ఇద్దరికి స్తుతి తెలిసినవాడే అనుష్ఠానవంతుడగును. అట్టివాడు మాకు ఉపదేశము చేయవలెను. ఆ స్తుతిని అందగాళ్లయిన మిత్రావరుణులు స్వీకరించవలెను.

    2. మిత్రావరుణులు ప్రశస్త తేజోవంతులు. ఈశ్వరభూతులు. వారు దూరదేశమునుండి ఆహూతులయినను వినగలరు. యజమానుల స్వాములు, యజ్ఞవర్ధకులు మిత్రావరుణులు విశేషస్తోతకు శుభములు సమకూర్చుటకు చరింతురు.

    3. మీరు పురాతనులు. మేము మీవద్ద నిలిచి మా రక్షణ కొఱకు నుతింతుము. వేగవంతములగు అశ్వములకు అధిపతులమై అన్నప్రదానము చేయవలసినదిగా మిమ్ము స్తుతింతుము. మీరిద్దరు శోభన జ్ఞానవంతులు.

    4. మిత్రదేవుడు పాపి అగు స్తోతకుగూడ విశాల గృహమున నివసించు ఉపాయము చేయును. హింసక పరిచారకునికి సహితము సమృద్ధిని ప్రసాదించును.

    5. యజమానులమగు మేము దుఃఖ నివారకుడగు మిత్రదేవుని రక్షలు కలవారమగుదుము. మేమందరము నీ రక్షణల వలన పాపరహితులమయి వరుణుని పుత్రస్వరూపులము కావలెను.

    6. మిత్రావరుణులారా ! మేము మిమ్ము స్తుతింతుము. మీరు మావద్దకు విచ్చేయుడు. మేము కోరిన సమస్త వస్తువులను ప్రసాదించండి. మేము అన్నసంపన్నులము. మమ్ము పరిత్యజించకండి. సుతసోమయజ్ఞమున మమ్ము రక్షించండి.

                                          అరువది ఆరవ సూక్తము

   ఋషి - ఆత్రేయ రాతహవ్యుడు, దేవత - మిత్రావరుణులు, ఛందస్సు - అనుష్టుప్.

    1. స్తుతివిజ్ఞాతలగు మానవులారా ! శుభకర్మవంతులు, శత్రుహింసకులగు దేవద్వయమును ఆహ్వానించండి. ఉదక స్వరూపుడు, హవిర్లక్షణుడు, అన్నవంతుడు, పూజనీయుడగు వరుణునకు హవ్యప్రదానము చేయండి.

    2. మీరిద్దరు మహాబలవంతులు. సూర్యుడు అంతరిక్షమున దృశ్యమానుడయినట్లు మానవులమధ్య మీ ఉభయుల దర్శనీయ బలము యజ్ఞమున స్థాపితమగును.

    3. మిత్రావరుణులారా ! మీరు 'రాతహవ్యు' ని ప్రకృష్ట స్తుతివలన శత్రువును పరాభవించు బలము పొందుడు. మేము పయనించు మా రథము ముందు మార్గరక్షణార్థము సాగుదురు. మేము మిమ్ము స్తుతించుచున్నాము.

    4. స్తుతియోగ్యులు, శుద్ధబలవంతులగు దేవద్వయమా ! మా ప్రవర్ధమాన స్తుతులకు మీరు ఆశ్చర్యచకితులగుదురు. మీరు అనుకూల మనమున యజమాని స్తోత్రములను తెలియుదురు.

    5. భూదేవీ ! మా ఋషుల ప్రయోజన సిద్ధికొఱకే నీమీద నీరు నిలిచి ఉన్నది. గమనశీల దేవద్వయమా ! మీ గతి విధివలన ఎక్కువ పరిమాణమున మరింత వర్షము కురిపించును.

    6. దూరదర్శులగు మిత్రావరుణులారా ! మేము స్తోతలము మిమ్ము ఆహ్వానించుచున్నాము. మేము మీయొక్క సువిస్తీర్ణము బహుజన రక్షితమగు రాజ్యమునకు ఎదగవలెను.

                                       అరువది ఏడవ సూక్తము

    ఋషి - ఆత్రేయ యజితుడు, దేవత - మిత్రావరుణులు ఛందస్సు - అనుష్టుప్.

    1. ద్యుతిమంతులగు అదితి పుత్రులు మిత్రా, వరుణ, ఆర్యములారా ! మీరు ప్రస్తుత ప్రకారమున యజనీయము. బృహంతము, అత్యంత ప్రవృద్ధబలము ధరింతురు.

    2. మిత్రావరుణులారా ! మానవ రక్షకులారా ! శత్రుసంహారకులారా ! మీరు ఆనందజనక యజ్ఞభూమికి విచ్చేసినపుడు మమ్ము సుఖవంతులను చేయుదురు.

    3. సర్వవిదులగు మిత్ర, వరుణ, ఆర్యమలు తమతమ స్థానములనుండి మా యజ్ఞమును చేరుదురు. హింసకులనుంచి మానవులను పరిరక్షింతురు.

    4. వారు సత్యదర్శనులు. జలవర్షకులు. యజ్ఞ రక్షకులు. వారు యజమానికి మంచి మార్గము చూపుదురు. భూరిదానము చేయుదురు. మహానుభావులగు వరుణాదులు స్తోత పాపి అయినను అతనికి మరింత ధనము ఇచ్చెదరు.

    మిత్రావరుణులారా ! మీరిద్దరు అందరి స్తుతియోగ్యులు, మేము అల్పబుద్ధులము. అత్రిగోత్రజులు మిమ్ము స్తుతింతురు.

                                      అరువది ఎనిమిదవ సూక్తము

   ఋషి - ఆత్రేయ యజితుడు, దేవత - మిత్రావరుణులు ఛందస్సు - గాయత్రి.

    1. ఋత్విక్కులారా ! మీరు ఉచ్చైస్వరమున మిత్రావరుణులను స్తుతించండి. విశేష బలవంతులగు మిత్రావరుణులారా ! ఈ మహా యజ్ఞమునకు దయచేయండి.

    2. మిత్రావరుణులు ఇద్దరును అందరికి స్వాములు. జలముల ఉత్పాదకులు, ద్యుతిమంతులు. దేవతలలో అత్యంత స్తుత్యులు, ఋత్విక్కులారా ! మీరు వారిద్దరిని స్తుతించండి.

    3. ఆ ఇద్దరు దేవతలు మాకు పార్థివధనము - దివ్యధనము ప్రసాదించు సమర్థులు. మిత్రావరుణులారా ! పూజనీయమగు మీ బలము దేవతలలో ప్రసిద్ధము. మేము ఆ బలమును స్తుతింతుము.

    4. ఉదకముద్వారా యజ్ఞమును స్పృశించిన ఇద్దరు దేవతలు హవ్యమును వ్యాప్తము చేయుదురు. ద్రోహరహిత మిత్రావరుణులారా ! మీరు వర్థిల్లుదురు.

    5. ఏ ఇద్దరు అంతరిక్షమున వర్షకారకులో - ఏ ఇద్దరు అభిమత ఫలప్రావకులో - ఏ ఇద్దరు వృష్టిప్రదులగుటవలన అన్న అధిపతులో ఏ ఇద్దరు దాత విషయమున అనుకూలురో ఆ ఇద్దరు మహానుభావులు. యజ్ఞమునకు విచ్చేయుటకు మహారథమున అధిష్టితులగుదురు.

                                      అరువది తొమ్మిదవ సూక్తము

        ఋషి - ఆత్రేయ ఉరుచక్రి, దేవత - మిత్రావరుణులు ఛందస్సు - త్రిష్టుప్.

    1. మిత్రావరుణులారా ! మీరు రోచమానములగు మూడు ద్యులోకములవారు. మూడు అంతరిక్షలోకములవారు. మూడు భూలోకములవారు. మీరు ఇంద్రుని రూపమును, కర్మను నిరంతరము రక్షింతురు.

    2. మిత్రావరుణులారా ! మీ ఆజ్ఞవలననే ఆవులు పాలిచ్చుచున్నవి. స్పందనశీల మేఘము మఱియు నదుల సుమధుర జలములను ప్రదానము చేయుచున్నవి. మీ ఉభయుల అనుగ్రహముననే జలవర్షకము, జలధారకము, ద్యుతిమంతమగు అగ్ని, వాయువు, ఆదిత్యుడు, భూమి, అంతరిక్షము ద్యులోకమున నిలిచి ఉన్నారు.

    3. ప్రాతఃకాల - మధ్యాహ్న సవనములందు ఋషులమగు మేము దేవతల ద్యుతిమతి జనని అదితిని ఆహ్వానింతుము. మిత్రావరుణులారా ! మేము ధనము, పుత్రులు, పౌత్రులు, అరిష్టశాంతి, సుఖముల కొఱకు మిమ్ము యజ్ఞమున స్తుతింతుము.

    4. ద్యులోకమున పుట్టిన అదితి పుత్రద్వయమా ! మీరు ద్యులోక భూలోకములను ధరింతురు. మేము మిమ్ము స్తుతింతుము.

    మిత్రావరుణులారా ! మీ కార్యములు స్థిరములు వాటిని ఇంద్రాది అమరదేవతలు సహితము హింసించజాలరు.

                                         డెబ్బదివ సూక్తము

   ఋషి - ఆత్రేయ ఉరుచక్ర, దేవత - మిత్రావరుణులు, ఛందస్సు - గాయత్రి.

    1. మిత్రావరుణులారా ! మీ రక్షణ కార్యము నిశ్చయముగా అత్యంత దీర్ఘతరము. మేము మీ అనుగ్రహ బుద్ధిని భజింతుము.

 Previous Page Next Page